తన హత్యకు ముందు అమెరికా శరణు వేడిన బేనజీర్ భుట్టో -వికీలీక్స్


Bhutto assasinationడిసెంబరు 2007లో పాకిస్ధాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణంగా హత్యకు గురయ్యింది. అమెరికా, బ్రిటన్‌ల మధ్యవర్తిత్వంతో ప్రవాస జీవితం విడిచి పాకిస్ధాన్‌లో అడుగు పెట్టగలిగిన బేనజీర్ కొద్ది రోజులకే తనను చంపడానికి ముషార్రఫ్ ప్రభుత్వంలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలియడంతో నేరుగా అమెరికాని రక్షణ కోరిన విషయం వికీలీక్స్ బైటపెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది. బేనజీర్ భుట్టో విన్నపాన్ని అమెరికా నిర్ద్వంద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా, “ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో అమెరికా సెక్యూరిటీ గార్డులు ద్వారా రక్షణ పొందడం ఆమె రాజకీయ ప్రయోజనాలకు విఘతంగా పరిణమించగలదని సలహా ఇచ్చినట్లుగా కేబుల్ ద్వారా బహిర్గతమైంది. అంతే కాక ముషర్రాఫ్ పాలకవర్గాన్ని (రెజిమ్) అనుమానించడం ఆమెకు ఉపయోగపడదని (not productive) కూడా అమెరికా సలహా ఇచ్చినట్లుగా వెల్లడయ్యింది. అమెరికా సలహా వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలియదుగానీ రెండు సార్లు పాకిస్ధాన్ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్న బేనజీర్ మరోసారి అధికారం చేపట్టడానికి ప్రచారంలో ఉండగానే హత్యకు గురైంది.

ముషార్రఫ్ ఆద్వర్యంలోని సైనిక ప్రభుత్వం నిషేధంతో పాకిస్ధాన్ ప్రధానులుగా పనిచేసిన బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ లు ప్రవాసంలోకి వెళ్ళిన సంగతి విదితమే. అక్టోబరు 18 2007 తేదీన పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య బేనజీర్ ప్రవాసాన్ని వీడి పాక్‌లో అడుగు పెట్టింది. అయితే కార్యకర్తల కేరింతలతో పాటు నేనజీర్ ను ఓ మానవబాంబు విద్వంసం కూడా స్వాగతం పలికింది. ఆ విధ్వంసంలో 140 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ముషర్రాఫ్‌ను అమెరికా, బ్రిటన్‌లు జరిపిన చర్చల ఫలితంగానే బేనజీర్ భుట్టో పాకిస్ధాన్‌కి రాగలిగింది. స్వదేశంలో అడుగుపెట్టడానికి పరాయి దేశాల రాయబారం అవసరం కావడం ఒక దౌర్భాగ్యం ఐతే, తనపై హత్యా ప్రయత్నాలనుండి రక్షణ కావాలని పరాయిదేశాన్నే కోరవలసిరావడం మరో దౌర్భాగ్యం. నిజానికి ఆఫ్ఘనిస్ధాన్‌లో చావు దెబ్బలు తింటున్న అమెరికా, బ్రిటన్‌లు ముషార్రఫ్, బేనజీర్‌ల పాలనపై ఆశలు పెట్టుకున్నాయి. అయితే దేశంలొకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ముషర్రాఫ్‌ ప్రభుత్వం లోని ఓ వర్గం తనను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఉప్పందడంతో ఆమెకు తనకు రక్షణ ఎవరో బోధపడలేదు. తనను కాపాడాల్సిన సైన్యమే తన హత్యకు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో బేనజీర్ అమెరికా శరణు జొచ్చింది.

పాక్‌లోని అమెరికా రాయబారి అన్నే పాటర్సన్‌తో బేనజీర్ భుట్టో, అక్టోబరు 23న సమావేశమైంది. తన కాన్వాయ్‌పై మానవబాంబు దాడి ఘటనపై ముషర్రాఫ్ ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తు పట్ల ఆమె తన అసంతృప్తిని అన్నె వద్ద వ్యక్తం చేసింది. ఈ విషయం అన్నే అక్టోబర్ 29 తేదీన అమెరికా స్టేట్ డిపార్టుమెంటుకి రాసిన కేబుల్‌లో అన్నే పాటర్సన్ తెలియజేసింది. “దాడికి ప్రభుత్వంలోని అధికారులే బాధ్యులని భుట్టో నొక్కి చెప్పింది. అందువలన ప్రభుత్వ అధ్వర్యంలో జరిగే స్వతంత్వ దర్యాప్తుని నమ్మలేనని చెప్పింది” అని అన్నే కేబుల్‌లో రాసింది. అమెరికా ఏజెన్సీలు పరిశోధనలో సహకరిస్తున్నాయనీ, ఒక మిలిటెంట్ గ్రూపుకి దాడితొ సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు చెబుతున్నాయనీ, ఆ గ్రూపు బహుశా ఆల్-ఖైదాతో సంబంధాలు ఉండవచ్చనీ అన్నే భుట్టో కి తెలిపింది. “ముషార్రఫ్ ప్రభుత్వంపై నిందమోపడం అంత ఉపయోగపడే విషయం కాదు” అని బేనజీర్‌కి చెప్పినట్లుగా అన్నే తన కేబుల్‌లో రాసింది. ముషార్రఫ్ సైనికాధ్యక్షుడుగా, బేనజీర్ ప్రధానిగా పాక్‌ని పాలిస్తుంటే తాలిబాన్‌పై తాము తలపెట్టిన దాడులను నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చని అమెరికా, బ్రిటన్లు ఆశలు పెట్టుకున్నాయి. కాని వారిమధ్యనే అనుమానాలు తలెత్తడం అన్నే పాటర్సన్ కు రుచించలేదని కేబుల్ ద్వారా స్పష్టమవుతోంది.

అయితే బెనజీర్ అంతటితో ఊరుకోలేదు. “తాలిబాన్, ఆల్-ఖైదా లను అనేకమంది ప్రభుత్వాధికారులు సమర్ధిస్తున్నార”ని ఎత్తి చూపింది. “ప్రభుత్వంతొ కలిసి పనిచేయడం నాకు అభ్యంతరాలేవీ లేవు. కాని ప్రభుత్వాధికారులే హత్యా ప్రయత్నం వెనుక ఉన్నప్పుడు అదెలా సాధ్యమో అర్ధం కావడం లేదు” అని భుట్టో అన్నే ముందు తన గోడు వెళ్ళబోసుకుంది. అందుకే ఆమె అమెరికా తనకు రక్షణను సమకూర్చాలని కోరింది. “రాయబారి (అన్నే పాటర్సన్) తనకు రెండు కేసులు అటువంటివి తెలుసని చెప్పింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్ లు అమెరికా వ్యక్తిగత రక్షణకు అమెరికా ప్రభుత్వ సాయం పొందుతున్నారు. అయితే వారిద్దరు ప్రభుత్వాధిపతులు. రాజకీయ ప్రచారోద్యమంలో ఉన్నవారికి అమెరికా భద్రత సమకూర్చడం సాధ్యం కాదని రాయబారి భుట్టోకి స్పష్టం చేసింది.” అని అన్నే తన కేబుల్‌లో అమెరికా ప్రభుత్వానికి తెలిపింది. దానికి బదులు భుట్టో తన వాదనను అమెరికా రాయబార కార్యాలయం అత్యున్నత భద్రతాధికారితో చర్చించాలని కోరింది. అంతేకాక వ్యక్తిగత భద్రతలో పాక్‌కు అమెరికా దీర్ఘకాలిక ట్రైనింగ్ ఇవ్వగలదని తెలిపింది.

ఈ సమావేశం పైనే ఆదేరోజు (అక్టోబరు 23, 2007) రాసిన కేబుల్‌లో అన్నే మరికొన్ని వివరాలు రాసింది. “అప్పటికి ఉనికిలో ఉన్న భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి గరిష్ట రక్షణకు వీలుగా మరిన్ని ఏర్పాట్లను చేయమని” ప్రభుత్వాన్ని అమెఇరికా రాతపూర్వకంగా కోరాలని భుట్టో అన్నే కోరింది. అలా చేస్తే సామర్ధ్య ప్రధర్శనలో తేడాలొస్తాయనీ, అవి అమెరికా భద్రత, పరికరాల ప్రమాణాలతో అది సరితూగక పోవచ్చని కనుక భుట్టొ భద్రతా ఏర్పాట్లపై నిర్ధారణా సమీక్ష (అస్సెస్‌మెంట్) చేయడం సాధ్యం కాదని చెప్పాలని తన కేబుల్‌లో అన్నే అమెరికా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. “పెద్ద పెద్ద ప్రజా సమూహాలతో కూడీన ర్యాలీల్లో పాల్గొనరాదన్న రక్షణ నిపుణుల సిఫారసులను పి.పి.పి (పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ) అనుసరించే అవకాశాలు లేవు” అని అన్నే కేబుల్‌లో తెలిపింది. భుట్టో వ్యక్తిగత భద్రతకు అమెరికా పూర్తి భాధ్యత తీసుకోవాలా లేదా అన్నదానిపై రాస్తూ “భద్రతా బాధ్యత పాక్ ప్రభుత్వానిది. భుట్టో వ్యక్తిగత భద్రత విషయంలో ప్రభుత్వం, పి.పి.పి లు పరస్పరం ఉమ్మడిగా కృషిచేయాలనే మనం నొక్కిచెప్పాల్సి ఉంటుంది” అని అన్నే రాసింది.

బేనజీర్‌కి అందిస్తున్న ఉన్నతస్ధాయి రక్షణపై సింధ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఐ.ఎస్.ఐ ఫిర్యాదు చేసిందని భుట్టో అన్నేకి తెలిపింది. చట్టాన్ని సడలించి తన సొంత బాడీగార్దులను అనుమతించాలని కూడా భుట్టో కోరింది. బేనజీర్ భద్రత అంశాన్ని అమెరికా రాయబార కార్యాలయం పాక్ జాతీయ భద్రతా సలహాదారు తారిక్ అజీజ్ దృష్టికి తెచ్చినపుడు భుట్టోకి అన్నివిధాలా రక్షన సదుపాయలు కల్పిస్తామని అన్నేకి హామీ ఇచ్చినట్లుగా మరో కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికా సెనేట్ లో భుట్టోకి ఉన్న మిత్రులద్వారా పాక్ లోని అమెరికా కార్యాలయం ప్రాంతీయ భద్రతాధికారికి (ఆర్.ఎస్.ఓ) భుట్టో భద్రతకు అమెరికా సాయపడాలని సిఫారసు అందింది. అయితే దానికి ఆర్.ఎస్.ఓ తిరస్కరించాడు. పాకిస్ధాన్ సంస్కృతి, ఆచారాలు తెలియనందున అమెరికన్ భద్రతాధికారులపై పాక్ ప్రజలు ఆగ్రహం చెందే అవకాసాలున్నాయని చెబుతూ అమెరికా భద్రత కల్పించే అంశాన్ని కొట్టిపారేశాడు. దానికి బదులు పాక్ సంస్కృతి, వివిధ ప్రాంతాల గుట్టుమట్లు తెలిసి ఉన్న పాక్ దేశీయ భద్రతా కాంట్రాక్టు సంస్ధల సాయం తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు. ఈ సలహాను పి.పి.పి తిరస్కరించింది. అసలు పాక్ ప్రభుత్వ పోలీసులను భుట్టో సమీపానికి రావడానికి కూడా ఆ పార్టీ అంగీకరించలేదు. కారణం తదుపరి దాడి యూనిఫారంలో ఉన్నవారినుండే ఎదురవుతుందని భుట్టో గట్టిగా నమ్మడమే.

3 thoughts on “తన హత్యకు ముందు అమెరికా శరణు వేడిన బేనజీర్ భుట్టో -వికీలీక్స్

  1. మీ పోస్టు మొత్తం చదివాకా నాకు ఒక విషయం అర్ధం కాలేదు , అసలు బెనజీర్ భుట్టోని అమెరికా ఎందుకు కాపాడాలి ? భుట్టోకి అమెరికా తనకు వ్యతిరేకం గా ఉంది తెలిసినప్పుడు వారినే ఎందుకు రక్షణ అడిగారు ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s