ఎంత పేదరికం ఉంటే పేదలైనట్లు?


భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్టి లేని వారు పేదవారని. కాని మార్కెట్ ఎకానమీ మిత్రుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారత దేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేక మంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా లాంటి నయంచేయగల జబ్బులతో కూడ చనిపోతున్నవారు అనేకమంది ఉన్నారు. ఉండటానికి చోటులేక ప్లాట్‌ఫాంల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్ల పక్కన తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేసుకున్నవారు ప్రతి పట్నంలోనూ కనిపిస్తారు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పని దొరకని వారు కోట్లమంది ఉన్నారు. ప్రణాళిక సంఘం లెక్క ప్రకారం భారత దేశంలోని 122 కోట్ల జనంలొ కేవలం 37 శాతం మందే పేదలు!

కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ పిటిషన్‌ను విచారిస్తూ ధాన్యం నిలవ చేయడానికి గోదాములు లేక కుళ్ళి పోతుంటే ఆకలితో ప్రజలు చనిపోతున్న పరిస్ధితి ఎందుకుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. “మీది (ఇండియా) శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ. అయినా దేశంలో అనేక చోట్ల ఆకలితో చనిపోతున్నారు. ఇంత వైరుధ్యం ఎందుకుంది? ఓవైపు శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ, మరోవైపు ఆకలి చస్తున్న జనం. రెండు ఇండియాలు ఉండడం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించింది. దారిద్రయ రేఖకు దిగువన ఉన్నారని పరిగణించడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించగా, ప్రణాళికా సంఘం తన ప్రాతిపదికను వెల్లడించింది. దాని ప్రకారం, (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే) పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి నెలకు 578 రూ.లు (13 డాలర్లు) కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలినట్లయితే అతను దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. అంటే రోజుకు 20 రు.లు (50 సెంట్ల కంటే తక్కువ) కంటే తక్కువ. ఇది గ్రామీణ పేదలకైతే ఇంకా తక్కువ రోజుకు 15 రూ.లు కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే అతను పేదవాడు కానట్లే. కూడు, గుడ్డ, నీడ ఇవన్నీ సంపాదించడానికి పట్నంలో రోజుకు 20/- గ్రామంలో రోజుకు రు 15/- ఖర్చు పెడితే చాలని ప్రణాళిక సంఘం అంచనా. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వ సహాయానికి అనర్హుడు. (కింది టేబుల్ ప్రణాళిక సంఘం పత్రం లోనిది)

దీన్ని బట్టి ప్రజల బతుకులంటే భారత ప్రభుత్వానికి ఎంత గౌరవం, లెక్క ఉందో గమనించవచ్చు.  ఈ లెక్కన గ్రామాల్లో 41.8 శాతం మంది, పట్నాల్లో 25.7 మంది పేదలుగా ఉన్నారని ప్రణాళికా సంఘం లెక్కవేసింది. ఈ లెక్కన సగం ఇండియా ఆకలితో చచ్చినా వారు పేదరికంతో చనిపోయినట్లు కాదు. ఇదే ప్రాతిపదిక అయితే అడుక్కునే వాళ్ళలో చాలామంది దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. దేశంలొ జీవించడానికి అవుతున్న ఖర్చు పట్ల మన ప్రణాళికావేత్తలకు అవగాహన లేదనైనా చెప్పుకోవాలి, లేదా వారి చిత్తశుద్ధినైనా శంకించాలి. గ్రామీణులకు పౌష్టికాహారం రోజుకు 2400 కేలరీలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రు. 15 లు తో ఆ ఆహారం ఎలా లభిస్తుందో ప్రణాళికా వేత్తలు చెబితే తప్ప అర్ధం కాదు.

పట్నాల్లో అద్దెకి దిగాలంటే ఓ మాదిరి ఇంటికే వెయ్యికిపైగా అడుగుతున్నారు. కాదు అందులో సగం వేసుకున్నా అది మొత్తం ప్రణాళికవేతల లెక్క ప్రకారం సంపాదనతో దాదాపు సమానంగా ఉంది. ఇక తిండి తినేదెలా? జబ్బు చేస్తే అది తగ్గే దాకా వేచి చూడడం తప్పు వైద్యం చేసుకోనవసరం లేదని మన పాలకులు భావిస్తున్నట్లుంది. కుటుంబానికి కావలసిన ప్రాధమిక సౌకర్యాలు ప్రణాళిక సంఘం దృష్టిలో ఏవి ఉన్నాయో ఊహించడానికి వీలు కావడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో కుటుంబానికి సగటున 5.78 మంది సభ్యులు ఉన్నట్లుగా తేల్చారు. వీరికి 2006 లో సంవత్సరానికి 30,000 ఆదాయం పేదలుగా బతకడానికి సరిపోతుందని లెక్కగట్టారు.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం (ప్రపంచ బ్యాంకు లెక్క) రోజుకు 1.25 డాలర్లకంటె తక్కువ సంపాదిస్తే వారు కటిక పేదలు 2 డాలర్ల లోపైతే సాధారణ పేదలు గా పరిగణించాలి. ఈ లెక్క ప్రకారం కూడా ప్రణాళికా సంఘం లెక్కించింది. 45 శాతం కటిక పేదలుగానూ 80 శాతం మంది సాధారణ పేదలుగానూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన లెక్క తేలినట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది. అంటే భారత దేశంలో నూటికి 80 మంది 2 డాలర్ల సంపాదనతో బతుకులు వెళ్ల దీస్తున్నారు. భారత దేశంలో జరిగిన వివిధ అధ్యయనాలు కనీస్ జీవనానికి రు.40,000 లు నుండి రు.60,000 లు వరకూ అవసరమని నిర్ధారించాయని ప్రణాళిక సంఘం పత్రం ద్వారా తెలుస్తోంది. నిజానికి పెరుగుతున్న ధరలు, వాతావరణ కాలుష్యం వలన ఎదురౌతున్న జబ్బులనుండి రక్షణ, చదువుల ఖరీదు ఇవన్నీ కలిపితే వారి అంచనాలు కూడా సరిపోవు. ఈ పరిస్ధితుల్లో భారత దేశంలో దరిద్రుల నిర్మూలన జరుగుతుంది తప్ప దారిద్ర్య నిర్మూలన మాత్రం జరగదు.

2 thoughts on “ఎంత పేదరికం ఉంటే పేదలైనట్లు?

  1. కళ్ళు చెదిరే వాస్తవాలను ఈ టపాలో చర్చించారు మీరు.
    రోజుకు 15/ 20 రూపాయిలు సంపాదిస్తే చాలు… పేదరికం నుంచి విముక్తి చెందినట్టేనన్నమాట… నిరుపేదలను లెక్కల్లోంచి తొలగించి ప్రగతిని ఘనంగా చాటుకోడానికి ఇది చాలా గొప్ప ‘ప్రణాళికే’!

  2. వేణు గారూ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అమెరికా, పశ్చిమ దేశాల ఫేవరేట్. ఆర్ధిక మంత్రిగా ఈయన్ని చేయకుండా ప్రణబ్‌ని ఎందుకు చేసినట్లు అని హిల్లరీ గొడవ చేసిందని వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. జిడిపి వృద్ధి రేటు రెండంకెలని దాటించడం ఈయన, మన్మోహన్, చిదంబరం లు కంటున్న ఫేవరెట్ కల. ఇండియాలో తూర్పు, దక్షిణ భాగాలు మాత్రమే ఇండియా దేశంగా ఉంటే ఇండియాతో ఎవరూ సరితూగరని అమెరికా వద్ద చిదంబరం గొప్పలు పోయారని వికీలీక్స్ ద్వారానే తెలిసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s