అమెరికాతో చెడిన నేపధ్యంలో చైనా కార్డుని ముందుకి తెస్తున్న పాకిస్ధాన్


Wen with Gilani

చైనా పర్యటనలో పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని, పక్కన చైనా ప్రధాని వెన్ జియాబావో

ఒసామా బిన్ లాడెన్ ని హత్య చేయకముందు వరకూ ఏడు సంవత్సరాలనుండి అబ్బోత్తాబాద్ లోనే ఉంటున్నామని ఆయన భార్య చెప్పిన నేపధ్యంలో లాడెన్‌ని దాచిపెట్టడంలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇంతకాలం లాడెన్ పాక్‌లో దాగి ఉండటం పాక్‌లోని కనీసం కొందరి అధికారులకైనా తెలియకుండా సాద్యం కాదని అమెరికా ప్రతినిధుల సభ అనుమానాలు వ్యక్తం చేసింది. పాక్‌కి అందిస్తున్న బిలియన్ డాలర్ల సహాయాన్ని రద్దు చేయాలని కొందరు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు కూడా. అదీ కాక రేమండ్ డేవిస్ ఘటన తర్వాత అమెరికాకి చెందిన సి.ఐ.ఏ గూఢచారులు పలువురు పాక్‌లో ఉన్నారనీ, వారిలో కొందరు పాక్ స్త్రీలను సైతం పెళ్ళి చేసుకుని ఉంటున్నారనీ వెల్లడైంది. దాంతో పాక్ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని వెళ్ళగొట్టాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహీంచారు. ఫలితంగా పాక్ మిలట్రీ సి.ఐ.ఏ గూడచారులను వెనక్కి పిలవాలని అమెరికా అర్మీని డిమాండ్ చేసింది. దీనివలన కూడా అమెరికా, పాక్ సంబంధాలు క్షీణించాయి.

ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని చైనా సందర్శనకు బయలు దేరడాన్ని రాజకీయ పరిశీలకులు ప్రత్యేక విశేషంగా అంచనా వేస్తున్నారు. అమెరికా స్నేహానికి ప్రత్యామ్నాయంగా చైనా స్నేహాన్ని పాక్ చూపదలుచుకున్నదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్ధాన్ అణ్వస్త్ర పరిజ్ఞానం పట్ల కూడా అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. పాక్ వద్ద వున్న యురేనియం నిల్వలను సి.ఐ.ఏ గూఢచారుల ద్వారా దొంగిలించడానికి అమెరికా ప్రయత్నించిందని పాక్ భావిస్తున్నది. ఈ అనుమానాలిలా ఉండగానే అమెరికాతో సంబంధం లేకుండా పాకిస్ధాన్ చైనా సహాయంతో విద్యుత్తు కోసం అణు రియాక్టరును స్ధాపించుకుంది. ఈ అంశాన్ని కూడా విశ్లేషకులు, వార్తా సంస్ధలు అమెరికాతో ముడిపెట్టి చూస్తున్నాయి. ఇండియాతో పాటుగా పాక్ కి అణు పరిజ్ఞానం అందించడానికి అమెరికా నిరాకరిస్తోంది. ఫలితంగా చైనాతో మంతనాలు జరిపి పాక్ అణు రియాక్టరు ఫెసిలిటీని సంపాదించుకుంది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూపు ద్వారా అమెరికా దీనికి అభ్యంతర పెట్టినా “నువ్వు ఇండియాకి ఇచ్చినపుడు నేను పాక్ ఇవ్వడంలో తప్పు లేదని చైనా తిప్పికొట్టింది.

అమెరికా, పాక్ ల మధ్య ఉద్రిక్తలు తీవ్ర దశలో ఉన్న నేపధ్యంలో పాక్ మంత్రి చైనా పర్యటిస్తున్న సందర్భంగా వారు చేసిన ఉమ్మడి ప్రకటనలు అమెరికాను మరింతగా రెచ్చగొట్టేలా సాగడం విశేషం. సెంట్రల్ బీజింగ్ లో ఉన్న గ్రేట్ హాల్ ఆఫ్ ప్యూపిల్ భవనంలో మాట్లాడుతూ పాక్ ప్రధానికి చైనా ప్రధాని హామీ ఇచ్చాడు. “అంతర్జాతీయ దృశ్యంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ చైనా, పాకిస్ధాన్ లు ఎల్లప్పటికీ మంచి పొరుగువారుగా, మంచి మితృలుగా, మంచి భాగస్వాములుగా, మంచి సోదరులుగా కొనసాగుతాయని ఈ సందర్భంగా నొక్కి చెప్పదలుచుకున్నాను” అని చైనా ప్రధాని వెన్ జియాబావో అన్నాడు. చైనా పాక్ ల స్నేహానికి 60 ఏళ్ళు నిండడాన్ని ఇరు దేశాలు ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పాకిస్ధాన్ టెర్రరిజం వ్యతిరేక పోరులో అనేక త్యాగాలు చేసిందని వెన్ పొగడ్తలు కురిపించడం అమెరికాని మరింతగా రెచ్చగొట్టే అంశం.

లాడెన్‌ని పట్టుకోవడానికి పాక్ ప్రయత్నించలేదని అమెరికా అంటుంటే చైనా విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. “టెర్రరిజంపై అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్ధాన్ అతి పెద్ద త్యాగాలు చేసింది” అని ప్రభుత్వ టీవి ప్రకటించింది. వెన్ జియాబావో ని ఉటంకిస్తూ “పాకిస్ధాన్ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, దేశ సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని టీవి తెలిపింది. లాడెన్ ను చంపే నిమిత్తం అమెరికా హెలికాప్టర్లు పాక్ కి చెప్పకుండా చొచ్చుకు రావడాన్ని ఈ ప్రకటన నేరుగా ఉద్దేశిస్తోంది. “దేశీయ సుస్ధిరతను కాపాడుకోవడానికి, అర్ధిక అభివృద్ధిని సాధించడానికీ పాకిస్ధాన్ చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ కమ్యూనిటీ అర్ధం చేసుకుని మద్దతివ్వాలి” అని వెన్ పేర్కొన్నట్లు టివి తెలిపింది.

వెన్, గిలానిలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. సైండక్ బంగారం, రాగి గనుల్లో చైనా పాత్రను 2017 వరకు కొనసాగించడానికి అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకాలు చేశారు. బ్యాంకుల నియంత్రణలో సహకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దక్షిణాసియాలో అమెరికా ప్రభావం పెరగడం చైనాకి ఇస్టం లేదు. కానీ అమెరికా సహాయాన్ని పాక్ వదులుకోలేదు. ఇద్దరికీ ఉమ్మడి పొరుగు దేశమైన ఇండియాతో చైనా, పాక్ లు రెండూ సరిహద్దు వివాదాలను కలిగి ఉన్నాయి. అయితే పాక్ కి వ్యతిరేకంగా ఇండియాను పూర్తిగా శతృవుగా మార్చుకునే ఉద్దేశ్యం కూడా లేదు. ఇండియా, చైనాల మధ్య ఇటీవల కాలంలో వాణిజ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. ద్వైపాక్క్షిక వాణిజ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఒప్పందం చేసుకుని అందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

పాకిస్ధాన్ లో ఆఫ్ఘన్ జాతీయ పోరాటానికి సంబంధించిన ఘర్షణలు కొనసాగుతుండడంతో ఆ ఘర్షణల ప్రభావం చైనా పశ్చిమ ప్రాంతంలోని ముస్లిం ప్రాంతమైన గ్జిన్ జియాంగ్ పై పడుతుందన్న భయాలు చైనాకి ఉన్నాయి. దానికోసం పాకిస్ధాన్‌తో సంబంధాల్లొ చైనా అప్రమత్తంగా ఉంటోంది. పాక్ కోసం ఇండియాతో గల వాణిజ్య సంబంధాలను చైనా కూడా వదులుకోవడానికి ఇస్టపడదు. అదీ కాక ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా చైనా అమెరికా ఎగుమతులపై ఆధారపడడం తగ్గించి ఆసియా దేశాలతోనూ, పొరుగుదేశాలతోనూ వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దాని కోసం చైనా, ఇండియాల మధ్య అధికారుల స్ధాయిలోనూ, మంత్రుల స్ధాయిలోనూ భేటీలు జరిగాయి. అవింకా కొనసాగుతాయి కూడా. చైనా, ఇండియా ప్రభుత్వాలు ఈ విధంగా సరిహద్దు వివాదాల నేపధ్యంలో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న నేపధ్యంలో భారత దేశప్రజలు చైనాను శతృదేశంగా పరిగణించడం అమాయకత్వం కాగలదు. సరిహద్దు తగాదాలను చర్చల ద్వారాపరిష్కరించుకుని స్నేహ సంబంధాలను పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడమే ఆచరణీయ పరిష్కారం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s