లైంగిక ఆరోపణల్ని ఎదుర్కోంటున్న ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ కి స్వదేశంలో గట్టి మద్దతు లభిస్తోంది. ఫ్రాన్సు ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్ సర్కోజి 2012 ఎన్నికల్లో పోటి చేయాలని భావిస్తున్నాడు. ఆయన అప్రూవల్ రేటింగా బాగా పడిపోయి ఉంది. అతని పై సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా కాన్ పోటీచేస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా ఘటన జరిగింది. అధ్యక్ష అభ్యర్ధిగా కాన్ అప్రూవల్ రేటింగ్ అందరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆయన ఇంకా తన అభ్యర్దిత్వాన్ని ఈ వారం ప్రకటిస్తాడన్న దశలో హోటల్ ఘటన జరగడంతో ఇది ఖచ్చితంగా కుట్రేనని ఫ్రాన్సులో అత్యధికులు భావిస్తున్నట్లుగా ఓ సర్వే తెలిపింది. ఆర్.ఎం.సి రేడియో, బి.డి.ఎం టీవి, 20మినిట్స్ వెబ్సైట్ జరిపిన సర్వేలో 57 శాతం మంది ఫ్రాన్సు దేశీయులు అభిప్రాయపడుతున్నట్లు తేలింది. సోషలిస్టు పార్టీ అభిమానుల్లో 70 శాతం మంది కాన్ పై మోపబడిన రేప్ నేరం ఆయన రాజకీయ జీవితాన్ని ముగించడం కోసం జరిగిన కుట్ర అని భావించారు.
అయితే ఆరోపణలు చేసిన మహిళకు స్ట్రాస్ కాన్ ఫలానా అని తెలియదని ఆమె లాయర్ జెఫ్రీ షపీరో చెబుతున్నాడు. ఆ మహిళ నిజాయితీ పరురాలని తాను మాత్రమే కాకుండా న్యూయార్కు రాష్ట్ర పోలీసు డిపార్టుమెంటు కూడా అభిప్రాయపడుతోందని ఆయన వాదిస్తున్నాడు. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రం గినియా దేశం నుండి ఆమె 7 సంవత్సరాల క్రితం తన కూతురితో సహా వలస వచ్చిందనీ తన కూతురికి ఇప్పుడు 15 సంవత్సరాల వయసనీ, మూడు సంవత్సరాలనుండీ హోటల్ లో పనిచేస్తోందనీ ఆయన తెలిపాడు. “ఈ ఘటన పరస్పర అంగీకారంతో జరిగిందని చెప్పడానికి ఏ విధంగా చూసినా వీల్లేదు” అని ఆయన తెలీపాడు. అయితే కాన్ లాయర్ ఈ వాదనను తిరస్కరిస్తున్నాడు. ఘటన జరిగిన మే 14 నాడే ఫోరెన్సిక్ నిపుణులు సాక్షాలను సేకరించారు. కాన్ తన డి.ఎన్.ఎ శాంపిల్‌ను స్వచ్చందంగా అందించాడు. ఫోరెన్సిక్ పరీక్షలో కాన్ నిర్ధోషిగా బైటికి వస్తాడని ఆయన లాయర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా లైంగిక దాడికి గురైందిగా భావిస్తున్న మహిళ బాగా భయపడుతూ బైటికి రావడానికి కూడా జంకుతున్నదని ఆమె లాయర్ తెలిపాడు. న్యూయార్కు పోలీసుల ప్రకారం మహిళ (ఛాంబర్ మెయిడ్) క్లీనింగ్ నిమిత్తం కాన్ సూట్ లోకి ప్రవేశించినపుడు ఆయన బాత్రూం నుండి నగ్నంగా బైటికి వచ్చాడని ఆమెను బలవంతపెట్టడంతో పారిపోగా వెంబడించి ఛాంబర్ రూం నుండి లాక్కెళ్ళి బలవంతపెట్టాడనీ, ఆమె అయన్నుండి విడిపించుకుని వెళ్ళి హోటల్ అధికారులకు తెలిపిందనీ చెబుతున్నారు. కాన్ మిత్రుడు, ఫిలాసఫర్ అయిన బెర్నార్డ్ హెన్రీ లెవీ తన మిత్రుడిని వెనకేసుకోచ్చాడు. ప్రపంచం మొత్తం చూస్తుండే అంత పెద్ద వ్యక్తి సూట్ లోకి క్లీనింగ్ నిమిత్తం ఇద్దరు మహిళలను పంపుతారనీ, అలాంటిది ఒక్కరే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. “ఈ మనిషిని ఆ విధంగా కుక్కలకు విసిరివేయబడిన పద్దతిని ఈ ప్రపంచంలో ఏదీ ఆమోదించబోదు” అని తన బ్లాగ్ లో వాపోయాడు. “నాకు అర్ధం కావడం లేదు… న్యూయార్క్ లోని చాలా పెద్ద హోటళ్లలో కనీసం ఇద్దరు మహిళలతో కూడిన క్లీనింగ్ బ్రిగేడ్ ను పంపడం ఆనవాయితీ. అలాంటిది, ఈ ప్రపంచంలో అత్యధికులు చూస్తుండే వారిలో ఒకరైన ఆయన సూట్ లోకి ఒక చాంబర్ మెయిడ్ తనంత తానుగా ఒంటరిగా ఎలా వెళ్ళగలుగుతుంది?” అని బెర్నార్డ్ బ్లాగ్ లో రాసుకున్నాడు.
కాన్ మిత్రుడు ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే ఘటన జరిగిందని సూచించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన వాదన ప్రకారం చూసినా అప్పటికే ఐ.ఎం.ఎఫ్ బోర్డు తో కాన్ చీవాట్లు తిన్నాడు. తన సిబ్బందిలోని ఒక ఆర్ధికవేత్తతో అక్రమ సంబంధం పెట్టుకున కాన్ ని బోర్డు మందలించింది. మరోసారి జరగకూడడని హెచ్చరించింది. అప్పుడాయని బోర్డుకి క్షమాపణ చెప్పుకున్నాడు. తన భార్య సింక్లైర్ కి “మరోసారి జరగదని” హామీ సైతం ఇచ్చాడు. అదీ కాక కొన్ని సంవత్సరాల క్రితం తనపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళా జర్నలిస్టు ఇప్పుడు ఆరోపిస్తోంది. ఫ్రాన్సులో రాజకీయ నాయకులకు ఇలాంటి అలవాట్లు సర్వసాధారణమనీ కొన్ని వార్తా సంస్ధలు రాస్తున్నాయి. ఇవన్నీ కాన్ దోషి అనడానికే సమర్ధనగా ఉన్నాయి. అదీ కాక మహిళలపై అత్యాచారానికి పాల్పడికూడా పాప భారాన్ని మహిళపైనే మోపగల అవకాశాలు ప్రస్తుత పితృస్వామ్య వ్యవస్ధలో పుష్కలంగా ఉన్నాయి. కాన్ లాంటి అత్యున్నత మనుషులకు ఇంకా దగ్గరగా అందుబాటులో ఉంటాయి.
కాన్ ప్రస్తుతం రైకర్స్ ఐలాండ్ జైలులో ఉన్నాడు. రోజుకు ఓ గంట పాటు సెల్ ఫోన్ లో మాట్లాడ్డానికి అవకాశం ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని కాపలా కాస్తున్నారు. ఇక కాన్ ఐ.ఎం.ఎఫ్ కి నాయకత్వం వహించే పరిస్ధితిలో లేడని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ప్రకటించాడు. ఆయన స్ధానంలో వేరొకరిని నియమించాల్సి ఉందని తెలిపాడు. కాన్ డిప్యుటీ జాన్ లిప్స్కీ ఇప్పుడు యాక్టింగ్ ఎం.డిగా వ్యవహరిస్తున్నాడు.