చైనా, రష్యాల్లో సోషలిజం – నెహ్రూ సోషలిజం – నిజా నిజాలు


రష్యాలో 1917 లో బోల్షివిక్ పార్టీ అధ్వర్యంలో ప్రజలు సోషలిస్టు విప్లవం తెచ్చుకున్ననాటినుండి 1954 లో స్టాలిన్ చనిపోయేంత వరకూ సోషలిస్టు సమాజ నిర్మాణం జరిగింది. ఆయన చనిపోయాక కృశ్చేవ్ నుండి గోర్బచెవ్ వరకూ జరిగింది సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు. వారు సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం వదిలేసి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి ప్రయాణం కట్టారు. అమెరికాతో ప్రపంచ ఆధిపత్యంకోసం పోటీపడి తూర్పు యూరప్, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాల్ని అమెరికా లాగానే మార్కెట్ల కోసం తమ ప్రభావంలో ఉంచుకున్నారు. ప్రపంచ వ్యాపితంగా మిలట్రీ స్ధావరాలు ఏర్పాటు చేసుకున్నారు. (ఇండియాకూడా అప్పట్లో రష్యా ప్రభావంలో ఉన్న ప్రాంతం) అగ్రరాజ్యంగా కొనసాగాలంటే మిలట్రీ అర్ధిక వ్యవస్ధను పోషించగలగాలి. రష్యా అందులో అమెరికాతో పోటీపడలేక పోయింది. దాని ఆర్ధిక వ్యవస్ధ మిలట్రి భారం మోయలేక చతికలపడింది. దాంతో 1985 1990 ల మధ్య కాలంలో తన మిలట్రీ స్ధావరాల్ని రద్ధు చేసుకుంది. ప్రపంచ ఆధిపత్యానికి అమెరికాతో పోటీ పడలేక ఆ ప్రయత్నాల్ని విరమించుకుంది.

ఈ పరిణామాలన్నీ రష్యా కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో జరగడం వలన కమ్యూనిజం ఓడిపోయినట్లు పై పై పరిశీలనలో కనపడింది. వాస్తవానికి కృశ్చెవ్ నుండి గోర్బచెవ్ వరకూ కమ్యూనిస్టు పార్టీ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కోసం కాకుండా పెట్టుబడీదారీ వ్యవస్ధ పునర్నిర్మాణానికే కృషి చేసింది. పేరుకు కమ్యూనిస్టు పార్టీ అయినా అది వాస్తవంగా కమ్యూనిజాన్ని వదిలేసింది. 1990లో కమ్యూనిస్టు ముసుగుని వెంటనే తీసేద్దాం అని యెల్ట్సిన్ అంటే గోర్బచెవ్ తొందరొద్దు మెల్లగా తీసేద్దాం అన్నాడు. రష్యా పార్లమెంటులో యెల్ట్సిన్ వాదన నెగ్గింది. యెల్ట్సిన్ మద్దతుదారులు అధికంగా ఉండటంతో గోర్బచెవ్ తెరవెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వ్యాసాలు రాసుకుంటున్నాడు. అయితే అప్పటినుండీ రష్యా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది. ప్రజల సమస్యలు అనేక రెట్లు పెరిగాయి. నిరుద్యోగం, దరిద్రం,  పేదరికం తాండవిస్తున్నాయి.

 కనుక 1990 లో కూలింది కమ్యూనిజం ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధే తప్ప సోషలిజమో, కమ్యూనిజమో కాదు. ప్రపంచ మార్కెట్ల ఆధిపత్యం కోసం కావాల్సిన మిలట్రీ అర్ధిక భారాన్ని రష్యా లోని కమ్యూనిజం ముసుగులో ఉన్న పెట్టుబడీదారీ వ్యవస్ధ మోయలేక సంక్షోభంలో కూరుకుపోయిన ఫలితమే 1990లో జరిగిన మార్పులు. భారత దేశ కమ్యూనిస్టు పార్టీలు గోర్బచెవ్ దాకా అక్కడ కమ్యూనిజమే ఉందని నమ్మి ప్రచారం చేయడం వలన రష్యాలో 1990 లో కూలింది సోషలిస్టు వ్యవస్ధే అని ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఏర్పడింది. దాంతో పాటు అమెరికా, పశ్చిమ దేశాల ప్రచార మాధ్యమాలు కూడా అలాగే ప్రచారం చేయడం వలన ఆ ప్రచారం బాగా నాటుకుపోయింది. సి.పి.ఐ, సి.పి.ఎం లు కాకుండా మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలుగా ఉన్నవాళ్ళు రష్యాలో అమలుజరుగుతున్నది కమ్యూనిజం కాదని చెప్పినా వారి బలం, ప్రభావం నామమాత్రం కావడాన పెద్దగా ఎవరికీ అందలేదు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో 30 సంవత్సరాల పాటు జపాన్ ఆక్రమణ పైనా, స్ధానిక యుద్ధ ప్రభువులపైనా కోట్లమంది ప్రజలు పోరాడి 1949లో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించుకున్నారు. అప్పటినుండి 1978లో  మావో చనిపోయేంతవరకూ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరిగింది. ఆయన చనిపోయాక డెంగ్ ఆధ్వర్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలోనే సంస్కరణల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్ధవైపు ప్రయాణం కట్టారు. ఆ ప్రయాణమే అంచెలంచెలుగా సాగి, ఇప్పుడు నిఖార్సయిన పెట్టుబడిదారీ వ్యవస్ధగా మారిపోయింది. కాకుంటే చైనాలో చాలావరకు ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం (ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్ధాపించడం) ఆధిపత్యంలో ఉంది. ప్రభుత్వరంగ పెట్టుబడిదారీ విధానాన్ని సోషలిజంగా చెప్పడం వాస్తవం కాదు. ప్రజలవైపు నుండి చూసినపుడు ప్రభుత్వ, ప్రవేటు పెట్టుబడిదారీ విధానాలు రెండూ ఒకటే. ప్రభుత్వ రంగ పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే లాభాలు వివిధ రకాల లోన్ల పేరుతో ప్రవేటు రంగ పెట్టుబడిదారులకు ఫైనాన్స్ గా ఉపయోగపెడతారు.

చైనాలో ప్రభుత్వరంగ పరిశ్రమలపై ఆధారపడిన ప్రవేటు పెట్టుబడిదారులే ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధల్ని శాసిస్తున్నందున అక్కడ ఇంకా ప్రవేటు పెట్టుబడిదారీ విధానం ఊపందుకోలేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే షేర్ల విధానం ప్రవేశపెట్టి వాటిని ప్రవేటు పెట్టుబడి ఉన్న పరిశ్రమలుగా పశ్చిమ రాజ్యాలను నమ్మించగలుగుతున్నారు. పశ్చిమ దేశాలు చైనా ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా ప్రవేటు రంగానికి వదిలెయ్యాలని ఇప్పటికీ ఒత్తిడి చేస్తున్నారు. చైనాలో విదేశీ పెట్టుబడుల్ని అనుమతించినా అవి పూర్తిగా చైనా ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అలాగని విదేశీ పెట్టుబడులను చైనా ప్రభుత్వం కష్టాలు పెట్టదు. పెట్టుబడికి కావలసింది లాభాలు. చైనాలో దొరికే చౌక శ్రమ (అతి తక్కువ జీతాలు), పర్యావరణ చట్టాలు లేకపోవడం లేదా బలహీనంగా ఉండడం, పశ్చిమ దేశాల్లోలాగా అధిక జీతాలు చెల్లించాల్సిన అవసరం లేక పోవడం, స్పెషల్ ఎకనమిక్ జోన్ల పేరిట కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేయడం… ఇవన్నీ విదేశీ పెట్టుబడులకు విపరీతమైన లాభాలు కురిపిస్తున్నాయి. అందువలన చైనా నిబంధనలు కఠినంగా ఉన్నా విదేశీ పెట్టుబడులు అక్కడికి వరదెత్తుతున్నాయి.

అయినా ఆ విదేశీ పెట్టుబడుల తరపున చైనా తన నిబంధనలు పూర్తిగా సడలించుకోవాలనీ, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనీ చైనాని డిమాండ్ చేస్తున్నాయి. చైనాకీ పశ్చిమ రాజ్యాలకీ ఉన్న ఈ నామ మాత్ర వైరుధ్యమే వాటి మధ్య ఘర్షణలాగా కనిపిస్తుంది. చైనాలో విదేశీ పెట్టుబడిని అనుమతించినా ఆ ఉత్పత్తి మాత్రం తిరిగి అమెరికాకే ఎగుమతి అవుతాయి. ఆ విధంగా చైనాకి వాణిజ్య మిగులు పేరుకుపోతోంది. అది అమెరికాకి వాణిజ్య లోటుగా పేరుకుంటోంది. తన లోటు తగ్గించుకోవడానికి చైనా వినియోగ మార్కెట్ ని కూడా అమెరికా కంపెనీలకి అప్పజెప్పాలని అమెరికా డిమాండ్. అసలు డిమాండ్ ఇదయితే పైకి చైనా సోషలిస్టు వ్యవస్ధలో స్వేఛ్ఛ లేదనీ, అణచి వేస్తున్నారని రాజకీయ ప్రచారం చేస్తుంది. వాస్తవానికి చైనాలో ఒక పార్టీ వ్యవస్ధ ఉండటం వలనే ఆ ప్రభుత్వం సమ్మెల్నీ, ఆందోళనల్నీ అణచివేస్తూ విదేశీ పెట్టుబడులకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడగలుగుతోంది. చైనా ఫ్యాక్టరీల్లో కార్మికులకి కనీసం ఇండియాలో ఉండే హక్కులు కూడా ఉండవు. ఆ విధంగా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తన ఆటోక్రటిక్ పాలన ద్వారా అందించగలుగుతోంది కనకనే పశ్చిమ దేశాల పెట్టుబడులు స్వేఛ్ఛగా వెళ్తూన్నాయి.

అమెరికా, యూరప్ లకు కావలసింది అవి గోల చేస్తున్నట్లు మానవహక్కులు, ప్రజాస్వామ్యం, స్వేఛ్ఛ కాదు. చైనా మార్కెట్లను పూర్తిగా తెరవాలి. చైనాతో అమెరికాకి, యూరప్ కీ ఉన్న వాణిజ్య లోటును తగ్గే విధంగా చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాలి. వీటితో పాటు రాజకీయ సంస్కరణలకి కూడా డిమాండ్ చేస్తాయి కానీ దానికి చివరి ప్రాధామ్యం ఇస్తాయి. రాజాకీయ సంస్కరలంటే ఏమిటి? ఏక పార్టీ బదులు బహుళ పార్టీ విధానం రావాలన్నది దీన్లో ముఖ్యమైనది. చిత్రమేమిటంటే ఈజిప్టు, ట్యునీషియా, సౌదీ అరేబియా, యెమెన్, బహ్రెయిన్ తదితర అరబ్ దేశాల్తో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లో చాలా దేశాల్లో ఏకపార్టీల పాలననీ, నియంతృత్వాలనీ అమెరికా యూరప్ లు సమర్ధించి కాపాడుకుంటూ వచ్చాయి. ఎందుకని? అవి అమెరికా ప్రయోజనాలను నెరవేర్చడానికి (తమ దేశాల మార్కేట్లను స్వేఛ్ఛగా అప్పజెప్పడం) ఒప్పుకున్నాయి గనక. (ఇప్పుడు కూడా లిబియాలో ప్రజాస్వామ్యం లేదు కనక గడ్డాఫీ పోవాలంటున్నాయి గానీ యెమెన్, బహ్రెయిన్ లలో ఆందోళనకారుల్ని ఊచకోత కోస్తున్నా అమెరికా యూరప్ లు పట్టించుకోవడం లేదు. ఎందుకంటె యెమెన్, బహ్రెయిన్ లు ఆల్‌రెడీ అమెరికా కింద ఉన్నాయి కనుక.) చైనాకి వచ్చేసరికి ఏకపార్టీ పాలనను తీసెయ్యాలంటున్నాయి పశ్చిమ రాజ్యాలు. కారణం వారి గొంతెమ్మ కోరికలన్నింటిని చైనా ఒప్పుకోవడం లేదు గనక. బహుళపార్టీ పద్దతి ఉంటే ఏదో ఒక పార్టీని మేపి తనకు అనుకూలంగా మార్చుకుని తన ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చని ఆశ. తమ వాస్తవ కోరికలను బైటపెడితే మద్దతు దొరకదు కనక మానవహక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అంటూ అందమైన నినాదాలతో ఒత్తిడి తెస్తున్నాయి. అది చూసి అమెరికా, యూరప్ లు మానవహక్కులు, స్వేచ్ఛ లకు ఛాంపియన్లని పొరబడుతున్నాం. వాస్తవంలో వాటికి పశ్చిమ రాజ్యాలు బద్ధ వ్యతిరేకులు.

ఇండియాలో స్వతంత్రం వచ్చిందని చెప్పిన కాలంలో ఇక్కడి పెట్టుబడిదారులు అభివృద్ధి చెందలేదు. అంటే పరిశ్రమలు స్ధాపించి, నడపగల పెట్టుబడి వారిదగ్గర లేదు. వారికి ఫైనాన్స్ కోసమే ప్రభుత్వ రంగాన్ని నెహ్రూ స్ధాపించి మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పెరుతో ప్రవేటు పెట్టుబడిదారులకు నిధులు సమకూర్చే ఎత్తుగడ పన్నాడు. 1980-90ల నాటికి ఇండియా ప్రవేటు పెట్టుబడిదారులు (టాటా, బిర్లా, అంబానీ, కిర్లోస్కర్, సింఘానియా మొ.వారు) ఇక్కడి ప్రభుత్వరంగం లాభాల్ని లోన్లుగా మెక్కి పెట్టుబడులు పెట్టగల స్ధాయికి చేరుకున్నారు. అందువలన వారికిక ప్రభుత్వ రంగ అవసరం లేకపోయింది. 1992 లో పి.వి, మన్మోహన్ ల ఆధ్వర్యంలో ప్రవేటు పెట్టుబడుల రంగానికి గేట్లు తెరిచే నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెడితే భారత ప్రభుత్వరంగంపై అధారపడిన ప్రవేటు పెట్టుబడిదారులనుండి పెద్దగా వ్యతిరేకత రాలేదు. (కార్మిక రంగం నుండి వచ్చిన వ్యతిరేకత వారికి లెక్క కాదు) అప్పటినుండీ భారత ప్రవేటు పెట్టుబడుదారులు విదేశీ బహుళజాతి సంస్ధలు పెనవేసుకుపోయి దేశంలో సహజవనరులన్నింటినీ అంతిమంగా విదేశీ కంపెనీలకు ఆహారంగా పెట్టి విదేశాల ఉత్పత్తుల్ని దేశం నిండా నింపుతున్నారు. దాని వలన భారత దేశంలోని కొన్ని లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దివాలా తీసి మూసేసుకున్నాయి. ఈ పరిస్ధితుల్లో కూడా ఇండియాలో భారత ప్రభుత్వరంగ పరిశ్రమలపై ఆధారపడిన ప్రవేటు పెట్టుబడిదారుల్లో కొంతమంది పూర్తి ప్రవేటీకరణకి మోకాలడ్డుతున్నారు. వారితో పాటు ఇండియాలోని బ్యూరోక్రసీ చాలా బలమైన వర్గం. వీరికి ప్రభుత్వ రంగం కామధేనువులాంటిది. వీరివలన కూడా ఇండియాలో ప్రవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణలు కొంత మెల్లగా నడుస్తున్నాయి. కార్మికులు, రైతులతో పాటు వివిధరంగాల ప్రజలనుండి ఎదురవుతున్న వ్యతిరేకత కూడా నూతన ఆర్ధిక విధానాలు మెల్లగా నడవడానికి కారణంగా పని చేస్తోంది.

 ఇవి రష్యా, చైనా, ఇండియాల్లోని ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధల్లో జరిగిన పరిణామాలు స్ధూలంగా. ఇక్కడ మరో విషయం కూడా చర్చించాలి.

 రష్యా, చైనాల్లో స్టాలిన్, మావో లు మరణించగానే వ్యవస్ధలు వెనక్కి ఎందుకు ప్రయాణం కట్టాయి? రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీల్లో నాయకత్వ స్ధానాల్లో ఉన్నవారంతా నిజాయితీ కమ్యూనిస్టులు కారు. వారిలో కొంతమంది పెట్టుబడిదారీ వ్యవస్ధ సమర్ధకులు విప్లవకాలంలోనూ, విప్లవం తర్వాత కొనసాగుతూ వచ్చారు. వారు సమాజం మార్పు కోసం కృషిచేసే వారితో ప్రయాణంలో కొనసాగుతూ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. “సోషలిస్టు వ్యవస్ధ సరైంది కాదు, మనం మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైపుకి వెళ్దాం” అని బహిరంగంగా కమిటీల్లో వారు అనరు. కానీ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని అడ్దుకునే వాదనలను సోషలిజం పేరుతోనే చేస్తూ, సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని ఆటంక పరచడానికి, సాధ్యం కాకపోతే నెమ్మదిగా జరగడానికీ ప్రయత్నిస్తూ వచ్చారు. మావో, స్టాలిన్ లు అక్కడ నాయకులుగా ఉన్న కేంద్ర కమిటిల్లో వారికి ఎల్లపుడు పూర్తి మద్దతు లేదు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని ఆటంక పరిచే విధానాలు కూడా చాలా సార్లు పైచేయి సాధిస్తూ వచ్చాయి. సోషలిజం అనుకూల శక్తులు వారితో వివిధ రూపాల్లొ ఘర్షణ పడుతూ సోషలిస్టు నిర్మాణాన్ని కొనసాగుతూ వచ్చాయి. మావో మరణం తర్వాత సోషలిజం వ్యతిరేక శక్తులు డెంగ్ నాయకత్వంలో అనుకూల శక్తులకు ప్రతినిధులైన వారిని నలుగుర్ని (గ్యాంగ్ ఆఫ్ ఫోర్ గా ప్రచారం చేశారు) చంపేసి కేంద్ర కమిటీలో ఆధిపత్యం సాధించాయి. ఆవిధంగా చైనా కమ్యూనిస్టు పార్టీలో సొషలిజం అనుకూల శక్తులపై వ్యతిరేక శక్తులు విజయం సాధించి కమ్యూనిస్టు పార్టీని తమ నియంత్రణలో పెట్టుకుని పెట్టుబడిదారీ వ్యవస్ధను తిరిగి స్ధాపించగలిగాయి. గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ని చంపడంతో హత్యలు ఆగలేదు. వెనక్కి ప్రయాణం కట్టాక అడ్డుపడిన ప్రజానుకూల శక్తులన్నింటినీ చంపుతూ అడ్డు తొలగించుకున్నారు.

 రష్యాలో దాదాపు ఇదే జరిగింది. స్టాలిన్ కాలానికి అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ దేశాలు నలువైపులనుండీ రష్యాను ముట్టడించాయి. సైనికంగా కాదు. గూఢచర్యం, రష్యా కమ్యూనిస్టు పార్టీలోని నాయకుల్లో కొంతమందిని వివిధ పద్ధతుల్లో తమవైపు మరల్చుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర కమిటీలో కూడా ఎవర్నీ నమ్మలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. నలువైపుల ఉన్న ముట్టడి పరిస్ధితుల్లో స్టాలిన్ కొన్ని కఠినమైన పద్ధతుల్ని అవలంబించాడు. అనేక ప్రతికూల పరిస్ధితుల నేపధ్యంలో, ఎవర్నీ నమ్మలేని పరిస్ధితుల్లో స్టాలిన్ వైపునుండి తప్పులు దొర్లాయి. అవి ఉద్దేశ్యపూర్వకంగా దొర్లిన తప్పులు కావు. సోషలిస్టు వ్యవస్ధ కాపాడుకోవాలన్న ఆత్రంలో జరిగిన తప్పులు. అవి సవరించుకునే లోపు ఆయన మరణించడం, ఎప్పుడేప్పుడా అని కాచుకు కూర్చున్న పెట్టుబడిదారీ శక్తులు విజృంభించి కమ్యూనిస్టు పార్టీని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. వారి స్వాధినంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ ఇక ఎంతమాత్రం కమ్యూనిస్టు అనుకూల పార్టీ కాదు. ఎర్ర ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ పార్టీ. ఆ పెట్టుబడీదారీ వ్యవస్ధ సంక్షోభంలో పడిన ఫలితమే 1990 పరిణామాలు.

 ఇప్పుడు ఇండియా, రష్యా, చైనాలు “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలు” అంటున్నారు. వాటిలో చైనా ఉండటం గమనించాలి. అంటే పశ్చిమ దేశాలే ఎమర్జింగ్ ‘మార్కెట్ ఎకానమీ” గా చైనాని గుర్తించినా ఇండియాలో ఇంకా చాలామంది అదో కమ్యూనిస్టు దేశం అని పొరబడుతున్నారు. దానిక్కారణం ఇక్కడి కమ్యూనిస్టు పార్టీలే. అవి కూడ ఎప్పుడో 1970 ల్లోనే కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని గాలికొదిలేశాయి. ఇప్పుడవి చెప్పుకున్నా పాత చరిత్రలు చెప్పుకోవాలి తప్ప తాజాగా వారు చెప్పుకునే పోరాటాలేవీ లేవు. ఓట్లకోసం పాట్లు పడేవిగానే మిగిలిపోయాయి. వారేమి చెప్పుకున్నా వారిని కమ్యూనిస్టు పార్టీలని నమ్మడం అమాయకత్వమే అవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అనగానే అదేదో బిరుదుగా చాలా మంది భావిస్తున్నారు. కాని అది వాస్తవానికి ఆ దేశాల్లో ఉన్న ఆర్ధిక వ్యవస్ధల లక్షణాన్ని తెలిపే పదం. ఆ పదబంధాన్ని “ఎమర్జింగ్ ‘మార్కెట్ ఎకానమీ'” గా అర్ధం చేసుకోవాలి. అంటే అభివృద్ధి చెందుతున్న ‘మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు” అని దానర్ధం. మొన్నటివరకూ ప్రభుత్వరంగ ఆర్ధిక వ్యవస్ధలుగా ఉన్న ఈ దేశాలు నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ ‘మార్కెట్ ఎకానమీ’లుగా మార్పు చెందుతున్నాయి అని ఆ పదబంధం వివరిస్తుంది.

మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల్లో అర్ధిక వ్యవస్ధలపై ప్రభుత్వ ఆధిపత్యం ఉండదు. అన్నీ మార్కెట్టే నిర్ణయిస్తుంది. సరుకుల ధరలన్నీ మార్కెట్ కోరిక ప్రకారం మారుతుంటాయి. ఉదాహరణకి పెట్రోల్ ధరల్ని డీరెగ్యులేట్ చేయడమంటే మార్కెట్ చెప్పుచేతలకు వదిలెయ్యడమే. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడా ధరలు పెరుగుతుంటాయి. అరబ్ దేశాల్లో ఆందోళనలు జరగడం వలన పెట్రోలు ఉత్పత్తి తగ్గుతుందేమో అని దాని ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి పెట్రోలు ఉత్పత్తి తగ్గకపోవచ్చు. కేవలం తగ్గుతుందేమో అన్న ఊహలతోనే (స్పెక్యులేషన్) ధరలు పెరుగుతాయి. ఈ స్పెక్యులేషన్ కి వాస్తవాలే ఆధారంగా ఉండాల్సిన పనిలేదు. మార్కెట్ కార్యకలాపాల్లో ఉన్నవారు ఏవో కొన్ని పుకార్లు వ్యాపింప జేసి కొన్ని షేర్ల ధరలు అమాంతం తగ్గడానికో, పెరగడానికో ప్రయత్నిస్తారు. తద్వారా షేర్ మార్కేట్లలో కృత్రిమ లాభాలు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఈ స్పెక్యులేషనే, కేవలం ఈ స్పెక్యులేషనే యూరప్ లోని గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాల్ని సంక్షోభం లోకి నెట్టివేశాయి. యూరప్ అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు దీన్ని.

 మార్కెట్ శక్తులకి ఆర్ధిక వ్యవస్ధ పగ్గాలు అప్పగిస్తే జరిగే పరిణామాల్ని ఇది అతి చిన్న శాంపిల్ మాత్రమే. 2008 లో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కూడా ఈ మార్కెట్ శక్తుల అత్యాశ, ఆర్ధిక నేరాలు, కుట్రలవల్లె వచ్చింది. వారిని శిక్షించే బదులు బిలియన్ల కొద్దీ డాలర్లు బెయిలౌట్ ల కింది ఇచ్చేసి దేశాల అప్పుల్ని విపరీతంగా పెంచాయి. ఆ అప్పుల్ని తగ్గించుకునే పేరుతో (ఫిస్కల్ డిసిప్లెయిన్ అని దీనికి ముద్దు పేరు) ప్రజలపైనే పన్నులు పెంచి, ధరలు పెరిగి, సదుపాయాలు రద్దయ్యి మరింత దరిద్రంలోకి నెడుతున్నారు. ఈ మార్కెట్ ఎకానమీని అమాయకంగా నమ్మూతూ చాలామంది ప్రభుత్వ రంగాన్ని తిట్టడం, సోషలిస్టు విధానాల్ని విమర్శించడం అంటే సమాజం మంచి కోరడంగా భ్రమపడుతున్నారు. కొన్ని విధానాల్ని గానీ, సిద్ధాంతాల్ని గానీ వ్యతిరేకించేటప్పుడు అవేమి చెబుతున్నాయో తెలుసుకోవడం కనీస భాధ్యత. అది తెలుసుకోకుండానే పిచ్చాపాటిగా మాట్లాడుకునే వాదనల్ని నమ్మి అకారణంగా ద్వేషించడం, దూషించడం చేస్తే అది ఎవరికి ఉపయోగం? సమాజానికైతే ఉపయోగం కాదు. మొత్తం వ్యవస్ధ మంచి చెడ్డలగురించి మాట్లాడుకునేటప్పుడు వాటి గురించిన కనీస పరిజ్ఞానం తెలుసుకుని ఉండడాన్ని భాధ్యతగా గుర్తిస్తే అనేక చర్చోపచర్చలు అర్ధవంతమైన చర్చలుగా ఇరుపక్షాలనీ ఉపయోగపడతాయి. ఆ చర్చలు కొన్ని సార్లు ఒక ముగింపుకు దారితీయకపోవచ్చు. కానీ చర్చలు జరిగే క్రమంలోనే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఎల్లపుడూ ఉంటుంది.

 కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ లో ఓ ఫ్లాష్ సర్వే జరిగింది. అంటే ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం చెప్పాలన్నమాట. అడిగిన ప్రశ్న “మీ దృష్టిలో మానవజాతి చరిత్రలో గొప్ప ధింకర్ ఎవరు?” అని. ప్రశ్న అడగ్గానే తడుముకోకుండా సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్న అడిగారు. 90 శాతం మందికి పైగా చెప్పిన సమాధానం “కారల్ మార్క్స్”. ఆయన చనిపోయి వంద సంవత్సరాలు దాటింది. రష్యా, చైనాల్లో ఆయన చెప్పిన సోషలిస్టు వ్యవస్ధలు పనిచేయడం ఎప్పుడో మానివేశాయి. వారి దేశంలో ఉన్నది పక్కా పెట్టుబడీ దారి వ్యవస్ధ. అయినా నూటికి తొంభైమంది కారల్ మార్స్క్ పేరే చెప్పారంటే అటువంటి సిద్ధాంతాన్ని చదివి కనీస అవగాహన సంపాదించకుండా విమర్శించడం, దూషించడం సరైందా అని ఎవరికి వారు ఆలోచించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s