నాటో దాడులకు ఫలితం, గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్న గడ్డాఫీ?


Muammar Gaddafiలిబియాపై పశ్చిమ దేశాల దురాక్రమణ దాడులకు ఫలితం వస్తున్నట్టే కనిపిస్తోంది. లిబియాను 42 సంవత్సరాలనుంది ఏలుతున్న కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ ఎలాగూ తాను గద్దె దిగక తప్పదన్న అవగాహనతో గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్నాడని గడ్డాఫీ పాలనా బృందంలోని వారిని ఉటంకిస్తూ ‘ది గార్దియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. తాను నలభై సంవత్సరాలపాటు పాలించీన లిబియాలో ఒక గాడ్ ఫాదర్ లాంటి ఇమేజ్ తో పదవినుండి నిష్క్రమించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితుల్లో కనీసం నలుగురిని ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. అయితే తన కోరికను పశ్చీమ దేశాలకు తెలిపి వాటి సహకారం కోరుతున్నదీ లేనిదీ తెలియ రాలేదు. తన నిష్క్రమణ అనంతరం కూడా ఏదో విధంగా అధికారంపై పట్టు ఉండాలని భావిస్తున్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది.

తన నిర్ణయం నాటో దాడులు ఆగిపోవడానికి దోహదపడుతుందని గడ్డాఫీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి రోజూ రాత్రి సమయంలొ నాటో చేస్తున్న దాడుల్లో నెమ్మదిగానైనా తిరుగుబాటు బలగాలు లిబియాను వశం చేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్న నేపధ్యంలో ఈ వార్తను కొట్టిపారేయలేం. నలుగురు గడ్డాఫీ సన్నిహితులతో ఇంటర్వూ జరిపినట్లు గార్డియన్ తెలిపింది. “తాను పదవి నుండి తప్పుకోవాల్సిందే నని గడ్డాఫీ అంగీకరిస్తున్నాడు. కాని ఆయన ఏ వెనిజులాకో పారిపోవడం మాత్రం జరగదు. ఆయన తెర వెనక్కి వెళ్ళి గౌరవప్రదమైన జీవితం గడపాలని భావిస్తున్నాడు. జపాన్ రాజు లాగానో, కాస్ట్రో లాగానో జీవితం గడపాలని ఆయన కోరిక.” అని ఒక అధికారి చెప్పాడని గార్డియన్ తెలిపింది. “అతని వ్యక్తి అరాధనా భావాల్ని లిబియాపైనా, ప్రపంచంపైనా రుద్దడం ద్వారా లిబియాకు భవిష్యత్తు ఉండదని ఆయనకూ, మాకూ బాగానే తెలుసు.  దేశానికి సంస్కరణల అవసరం ఉందనడంలో అనుమానం లేదు. చాలా సంస్కరణలు కావాలి” అని రెండొ అధికారిని ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది.

“గడ్డాఫీ దేశంలోని వివిధ గిరిజన నాయకులకు జాతీయ అంశాలమీద చర్చించే అధికారాన్ని కల్పించాడు. లిబియాలో అంతగా ప్రాచుర్యం లేని ప్రధానమంత్రికి అంతర్జాతీయ గౌరవం కల్పించాడు” అని గార్డియన్ పేర్కొంది. క్రమంగా అధికారాన్ని అప్పగిస్తూ తాను తప్పుకోవాలని భావిస్తున్నాడనీ గార్డియన్ చెబుతోంది. పశ్చీమ దేశాలు తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాయని గడ్డాఫీ రూఢి పరుచుకున్నాడు. అందుకే టీవీలో కనపడ్డానికి కూడా జంకుతున్నాడనీ, వీడియో ద్వారా తాను ఎక్కడుందీ తెలుస్తుందన్న అనుమానమే దానిక్కారణమనీ తెలుస్తోంది. శుక్రవారం నాటోవిమానాలు బ్రెగాపై జరిపిన దాడిలొ తిరుగుబాటుదారులతో చర్చలు జరపడానికి వచ్చిన పదకొండు ఇమామ్ లు చనిపోయారు. వారున్నది అతిధి గృహమని లిబియా ప్రభుత్వం చెబుతోంది. ఆ గృహం దగ్గరే ఓ బంకర్ ఉందనీ అక్కడ గడ్డాఫీ ఉన్నాడన్న అంచనాతోనే బాంబుదాడి జరిగిందనీ బంకర్ నిర్మించిన ఓ ఇంజనీరు చెప్పినట్లు గార్డియన్ తెలిపింది.

అక్కడ ఉన్నది అతిధి గృహమయినా, బంకర్ అయినా బాంబుదాడులు చేసే ఆధిపత్యాన్ని నాటో చెలాయించడమే అసలు ప్రశ్న.

వ్యాఖ్యానించండి