కటకటాల కాన్


Arrested Strauss Kan

న్యూయార్క్ పోలీసుల మధ్య వెనక్కి మడిచిన చేతులకు బేడీలతో స్ట్రాస్ కాన్

డొమినిక్ స్ట్రాస్ కాన్. మొన్నటివరకూ సంక్షోభాల్లో ఉన్న అర్ధిక వ్యవస్ధలకు బిలియన్ల డాలర్ల అప్పుల సాయం ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతుడు. ప్రపంచ ఆర్ధిక సంక్షొభం పరిష్కారానికి జి-20 దేశాల కూటమితో కలిసి నిరంతరం కృషి చేసి సంక్షోభంలో ఉన్న మహా మహా దేశాలను ఓ ఒడ్డుకి చేర్చడానికి దోహద పడిన మేధావి. చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాల వాదనలకు దన్నుగా నిలబడిన ధ్వజ స్తంభం. అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీసు, ఐర్లండు లకు పదుల బిలియన్ల యూరోలు అప్పుగా సమకూర్చి, తాజాగా పోర్చుగల్ దేశానికి ఎనభై బిలియన్ల యూరోల సహాయ అప్పుకు సివారసు చేసి ఇ.యుని ఒప్పించిన అర్త్రత్రాణపరాయణుడు. నాలుగు సంవత్సరాలుగా, అత్యంత కఠినమైన, కీలకమైన సంక్షోభాల కాలంలో ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ధైర్యంగా నిలబడి, ధైర్యం చెప్పి, అమెరికా నుండి ఆంధ్ర వరకూ అత్మ విశ్వాసాన్ని ప్రోది చేసి నిలిపిన మార్గదర్శి. ప్రపంచంలో ఆయుధ వ్యాపారంలో అమెరికాతో పోటీపడుతున్న ఫ్రాన్సు దేశానికి 2012 లో అధ్యక్షుడుగా ఎన్నికవడం ఖాయమని ఫ్రాన్సులో ఊరూరా మన్ననలందుకున్న పాలనా దక్షుడు.

ఇప్పుడు…, పెడరెక్కల్ని వెనక్కి విరిచి ముంజేతులకు బేడీలు ధరించి యావత్ప్రపంచ దేశాలనుండి వచ్చిన విలేఖరులు, పొటోగ్రాఫర్ల ముందు అలసిపోయి, డస్సిపోయి అనైతిక నేరానిక పాల్పడిన దోషిగా బింకంగా నిలబడిన నేరస్ధుడు. ఎక్కడి అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఎక్కడి కటకటాల కాన్! వొంటి మీదకు 62 సంవత్సరాలు తెచ్చుకుని మనవలను ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో లగ్జరీ హోటల్లో సేవ నిమ్మిత్తం వచ్చిన ముప్ఫై ఏళ్ళ ఒంటరి మెయిడ్ ని ఆమె రూం నుండి ఈడ్చుకెళ్ళి, తన సూట్‌లోని విశాలమైన బెడ్‌పై ఎత్తి కుదేసి, తిరగబడినందుకు ఆనక చెరబట్టి అత్యాచారానికి ప్రయత్నించిన ఓ సామాన్య, హీన, నీఛ, నికృష్ట రేపిస్టు నేటి స్ట్రాస్ కాన్. ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవిని దుర్వినియోగ పరుస్తూ తన కింద పనిచేసే ఓ లేడీ ఎకనమిస్టుతో అక్రమ సంబంధం నెరిపి, ఐ.ఎం.ఎఫ్ బోర్డ్ మెంబర్ల చేట ఛీ అనిపించుకున్నా, బుద్ది తెచ్చుకోని భోగలాలసుడు ఈ స్ట్రాస్ కాన్. కనకపు సింహాసనంపైన కూర్చోబెట్టినా కుక్క కుక్కే అని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించిన అనైతిక బుద్ధి విహీనుడు ఈ డొమినిక్ స్ట్రాస్ కాన్.

ఈయనగారి నిర్వాకానికి ఇప్పుడు గ్రీసుకి అందాల్సిన సహాయం వాయిదా, మరికొంతకాలం వాయిదా పడిపోయింది. పోర్చుగల్‌కి అందాల్సిన మొట్టమొదటి అప్పు వాయిదా కూడా వాయిదా పడింది. ఐ.ఎం.ఎఫ్ విధులు యధావిధిగానే కొనసాగుతాయని బింకాలు పోతున్న ఇతర సిబ్బంది లోలోపల ఎంతగా నేలకు కుదించుకుపోయారో మరి! నిన్నటిదాకా తమకు ఆదేశాలిచ్చిన గొప్ప ఆర్ధిక వేత్త మడతనలగని సూటు వెనక ఇంత దిగజారుడు వక్ర, దుష్ట, కీచక గుణాలను దాచి ఉంచుకున్నాడని తెలుసుకుని ఎంతగా నిర్ఘాంతపోయారో మరి! మూడేళ్ళ క్రితమే పాల్పడిన వెధవతనానికి సిగ్గు నటిస్తూ అర్ధాంగికి “మళ్ళీ చేయను” అని ఒట్టు పెట్టి కూడా, బట్టలు విప్పి మరీ పరాయి స్త్రీ ముందు తన నీఛ బుద్ధిని ఆరబోసుకున్న ఈ పెద్దమనిషికి ఏ శిక్ష సరిపోతుంది?

Police at Hotel Sofitel

కాన్ బసచేసిన సోఫిటెల్ హోటల్ వద్ద పోలీసులు

అసలిదేలా సాధ్యం? శిఖరాగ్రాన ఆసీనుడైన ఓ ప్రపంచ స్ధాయి ఆర్ధిక శాస్త్రవేత్త ఒక్క సారిగా నేలబారు బుద్ధిని ఎలా ప్రదర్శించగలడు? ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. శిఖరాగ్రం అని మనం భావిస్తున్న ఐ.ఎం.ఎఫ్ సంస్ధ స్వయంగా ఒక అనైతిక సంస్ధ. పేద దేశాలను అప్పుల వలయంతో చెరపట్టి అమెరికా తదితర పశ్చిమ దేశాల ముందు మోకరిల్లింప జేసే ఓ ప్రపంచ స్ధాయి బ్రోకరే ఐ.ఎం.ఎఫ్. సహాయం అంటూ నాలుగు పైసలు విదిల్చి, దాని మాటున విషమ షరతులు: ప్రవేటీకరణ పెంచు; ప్రజల సంస్ధలను అయినకాడికి అమ్మెయ్; పన్నులు పెంచి గోళ్ళూడగొట్టు; రైతులకు సబ్సిడీలు కోసెయ్; వేతనాలు వీలైతే రద్దు చెయ్, కాకుంటే కోసెయ్; పెన్షన్ రద్దు చెయ్; ప్రజల ఆరోగ్యం నీకెందుకు? నీళ్ళూ అమ్మెయ్; భూమీ లాక్కో; రైతులు పండించకూడదు, అమెరికా నుండి దిగుమతి చేసుకో; రైతు విత్తనం నిలవ చేసుకోకూడదు, అమెరికా విత్తనాలే తీసుకో; పురుగుమందులెందుకు, అమెరికా విత్తనమే పురుగుమందు కొనెయ్; అమెరికా, యూరప్ సరుకులు మిగిలిపోతున్నాయ్, నువ్వు కొనెయ్; మీ సరుకులా! బంగాళాఖాతమో, అరేబియానో, ఫసిఫిక్కో ఏది దగ్గరుంటే దాన్లో పారెయ్; ప్రజలపై ఖర్చు పెట్టొద్దు, కార్పొరేట్లకే మొత్తం ఆప్పులివ్వు; ఎగ్గొడుతున్నారా, ఎగ్గొట్టడానికే కార్పొరేట్ల అప్పులు; రైతు ఎగ్గొట్టాడా? వాడి ఎద్దు, ఇల్లు, తెపాళ, గిన్నె లాక్కో ఊర్కోవద్దు… … ఇలా అనేకం.

ప్రపంచ కాబూలీవాలా ఈ ఐ.ఎం.ఎఫ్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ తదితర రౌడీ రాజ్యాల మార్కెట్లుగా ప్రపంచం అంతా మారిపోవాలి, దేశ అభివృద్ధిని పక్కన బెట్టి అమెరికా కార్పొరేట్ల అభివృద్ధే అందరి లక్ష్యం కావాలి. ఈ లక్ష్యంతో పనిచేసే అంతర్జాతీయ ద్రవ్య సంస్ధకు అధిపతిగా పని చేసిన స్ట్రాస్ కాన్ కి ఇంతకంటే ఉన్నత బుద్ధిని ఊహించగలమా? అస్సలు వీలుకాదు.

9 thoughts on “కటకటాల కాన్

 1. ఆ సంఘటన నిజంగా మన దేశంలో జరిగి ఉంటే ఆ స్త్రీని “జరిగిందేమో జరిగింది. ఆయన చాలా పెద్ద మనిషి! నీకే నష్టం. ఊరుకో” అని అసలు బయటికి రాకుండా చేసే వారేమో! ఆ హోటల్ సిబ్బంది చక్కగా ప్రవర్తించి వాడి మీద కంప్లెయింట్ చేశారు. సంతోషించదగ్గ విషయం!అతడిని అలా కట కటాల వెనక్కు నెట్టడం మంచి పరిణామమే! తన హోదాను దుర్వినియోగ పరిచినందుకు, ఒక స్త్రీ పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించినదుకు శిక్ష పడాల్సిందే!

  అదంతా పక్కనపెడితే,ఒక మృగ ప్రవృత్తి ఉన్న వాడు ఆ ప్రవృత్తిని అది విజృంభించినపుడు బయట పెట్టుకుంటాడు. అందులోనూ తాను డబ్బు బలిసిన వాడై,తనకు ఎదురు చెప్పలేని స్థితిలో ఉన్న స్త్రీ కనపడినపుడు మరీ! వాడు అమెరికా ప్రెసిడెంటైనా, IMF అధిపతి అయినా మినహాయింపు లేదు! అది వాడి సహజ మానవ ప్రవృత్తి!

  కామ ప్రవృత్తి ప్రకోపించిన ఒక వ్యక్తి ప్రవర్తనకూ, అతడు పని చేసే సంస్థ గుణ గణాలకూ ఏ విధంగా ముడిపెడతారు? అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతుల గురించి,దోపిడీ గురించి మీరు చెప్పినవి నిజమే కావొచ్చు! కానీ దానికీ కాన్ వ్యక్తిగత ప్రవర్తనకూ సంబంధం ఎలా ఉంటుంది?

  ఇదే ఒక ఐటీ కంపెనీ అధిపతో, మరో వినియోగ సేవల సంస్థ ప్రతినిధో చేస్తే మీరు దాన్నెలా ఇంటర్ ప్రెట్ చేస్తారు?

  ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల మీద జరిగే అత్యాచారాలకూ, అత్యాచార యత్నాలకూ దేంతో ముడిపెడతాం? మృగ ప్రవృత్తికా, లేక వాళ్ళు పని చేస్తున్న సంస్థల తీరు తెన్నులకా?

  ఈ రెంటికీ మీరు పెట్టిన లింకు ని అంగీకరించలేకపోతున్నాను.

 2. కామ ప్రవృత్తికీ, ఐ.ఎం.ఎఫ్ అధిపతి పదవికీ కాదు నేను లింక్ పెట్టింది. రెండింటిలో ఉన్న అనైతికత రెండింటినీ సాధ్యం చేయగలిగిందని సూచించాలని నా ప్రయత్నం. అనైతికత అనేది, ఆ మాటకొస్తే ఏ లక్షణమైనా, గాల్లోంచి ఉద్భవించవనీ, అవి తానున్న వ్యవస్ధ లక్షణాలనుండే పుడుతుందన్నది నే చెప్పదలుచుకున్నాను. పెట్టుబడిదారీ వ్యవస్ధలో శ్రామికుల శ్రమ విలువను దొంగిలించడం నేరం కాదు. అది విద్య. ఐ.ఐ.ఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్ధలన్నీ అంతిమంగా నేర్పేది ఈ విద్యనే. ఆ విద్యను నేర్చుకున్నవారు డ్రగ్స్ కి అలవాటు పడటాన్నీ, స్త్రీలని అటువంటి సాధనాలుగా పరిగణించడాన్నీ సామాజిక నేరాలుగా చూడలేరు. వారి దృష్టిలో అన్నీ డబ్బుకి దొరికే సరుకులు.

  ఐ.ఎం.ఎఫ్ షరతుల ఫలితం అది నిర్దేశిస్తున్నవారికి తెలుసు. పేదలు మరింత పేదలవుతారనీ, ధనికులు మరింత ధనికులవుతారనీ తెలిసీ ఎలా అమలు చేయగలుగుతున్నారు? దాన్ని ఆమోదించగలగితేనే, అది న్యాయంగా భావించగలిగితేనే అమలు చేయగలుగుతారు. వారికి న్యాయంగా కనపడింది కోట్లాది ప్రజలకు పూర్తిగా అన్యాయం గా పరిణమిస్తుంది. ఆ విషయమూ వారికి తెలుసు. వారి రిపోర్టులే పేదరికాన్ని అంగీకరిస్తాయి. కాని దానికి కారణం తాము రుద్దుతున్న విధానాలేనన్న విషయాన్ని వాళ్ళ పరిధిలో చాలా సామాన్యంగా చూస్తారు. మానవ సమాజం భావించే నైతిక విలువలు వారికి ఓ జోక్.

  కోట్లాదిమందిని పేదరికంలోకి నెట్టగలిగినవాడు, ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవంగా చూడలేడు. వారి వ్యక్తిత్వ పునాదులే అనైతికతో ముడిపడి ఉంటాయి. ఏ అనైతిక పునాదులైతే వారిని విషమ షరతులు విధింప జేసి దోపిడికి పురిగోల్పుతాయో, అవే పునాదులు సామాజిక నైతిక విలువలను తేలిగ్గా, డబ్బుకు లొంగేవిగా భావించేలా చేస్తాయి.

  అర్ధిక సంబంధాల పునాదిపైనే సామాజిక విలువలు, సంస్కృతి, నైతికత, ఆధారపడి ఉంటాయి. దోపిడీ అర్ధిక సంబంధాలు ఉన్న సమాజంలో విలువలు కూడా వెర్రితలలు వేస్తాయి. స్త్రీలపై జరిగే అణచివేతలన్నింటికీ పితృ స్వామ్య వ్యవస్ధను, దాన్ని సమర్ధించే భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్ధలను బాధ్యురాలిగా చేస్తాము. అది పంచాయితీ ఆఫీసులో ఐనా, ఐ.ఎం.ఆఫీసులో ఐనా విలువలు అవే. అందుకే అంత పెద్ద ఆఫీసరైనా వారి పతనవిలువలే దేశాలను కబళించేలా చేస్తాయి. స్త్రీలను అగౌరవపరిచేలా చేస్తాయి.

  నేను సరిగా చెప్పానో లేదో తెలియదు. ఈ సబ్జెక్టును మరింత వివరణతో మళ్ళీ రాస్తాను. వీలయితే వేరే పోస్టుగా రాస్తాను.

 3. సమాజవ్యవస్థ ఏ పునాదులమీద ఆధారపడి నడుస్తున్నదో దానిని బట్టే అందులోని మనుషుల ప్రవర్తన,జీవన విధానాలు ప్రభావితమవుతాయన్న మీ వాదన నిజం. కోట్ల ఆస్తులను అక్రమంగా ఆర్జించినా, ప్రజల సొమ్మును నొక్కేసి బోర్డులు తిప్పేసినా ఆఖరికి తీవ్రవాదులుగా ముద్రపడిన వారైనా, ప్రత్యక్షంగా వందలమంది మృతికి కారణమైన వాడు దొరికినప్పుడు కూడా ఏళ్ళు గడిచిపోయినా శిక్ష పడకుండా జైళ్ళలో వీఐపీ స్థాయి మర్యాదలతో వారిని రక్షించుకుంటున్న వ్యవస్థ ఇది. ఆర్థిక విలువలు, నైతిక విలువలను తొక్కి పారేస్తున్నాయి. అందువల్లనే అక్రమంగా ఆస్తులు సంపాదించడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం లాంటి సామాజిక నేరాలను అందులోని వ్యక్తులు చాలా సహజంగా అంగీకరించేలా విలువలు దిగజారుతున్నాయి. సమాజంలో నైతిక విలువలు దిగజారడానికి కారణమైన కారణాలను వ్యవస్థ లోతుల్లో వెతకడం సరైన ఆలోచన. ఆ ప్రయత్నం ప్రారంభించారుగా. మరిన్ని రాయండి. సుజాతగారు,
  ఆయన ఈ రెండిటికి ముడిపెట్టిన అంశం నాకు సబబుగా తోస్తోంది.

 4. బిబిసి రాసిన మొదటి వార్తలో ఇలానే ఉంది. ‘మెయిడ్స్ ఉండే హాల్ నుండి’ అని అర్ధం వచ్చేలా బిబిసి రాసింది. దాన్ని నేను రూం అని రాశాను, తేడా ఉండదు అన్న ఉద్దేశ్యంతో. “Dragged through hallway” అన్న దానికి ‘ఈడ్చుకెళ్ళి’ అని రాశాను. ఈ పోస్టులో సంఘటనను పూర్తిగా రాయలేదు. దీనికి ముందు రాసిన పోస్ట్ లొ పూర్తిగా వివరించాను. వీలయితే చూడగలరు.
  BTW, thanks for your keen observation.

 5. $విశేఖర్ గారు

  బాధాకరమైనా మంచి అంశాన్ని స్పృశించారు.

  #..62 సంవత్సరాలు..ఒంటరి మెయిడ్ ని..తిరగబడినందుకు ఆనక చెరబట్టి అత్యాచారానికి…ఓ సామాన్య, హీన, నీఛ, నికృష్ట రేపిస్టు నేటి స్ట్రాస్ కాన్.

  ఇలాంటి అశుద్దభక్షకులకి “అది” కోసి పడేసే శిక్ష వేయాల౦డి.

  #ఆయన ఈ రెండిటికి ముడిపెట్టిన అంశం నాకు సబబుగా తోస్తోంది.

  నాకు కూడా కించిత్ సందేహం లేకుండా. పొద్దుగూకులూ పక్కోడిని తొక్కేద్దాము అనుకునేవాడి ఆలోచనాతరంగాలు మంచివైపు మరలవు. ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి ..మగాడు అన్నది పక్కన బెడితే.. అంత ఉన్నతస్థితిలో ఉండి, ఆ తుచ్చ ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉండి కూడా తనకు నచ్చి దొరకనిదాన్ని ఎలా అయినా నయాన్నో/భయాన్నో దొరకపుచ్చుకుని క్రూరంగా అనుభవించాలి అనే మనస్తత్వం ఖచ్చితంగా ఆంబోతు అంశ కలిగిన పెట్టుబడిదారి మనస్తతత్వమే. అందులో ఎంతమాత్రమూ సందేహం లేదు..ఈ మనస్తత్వం ఆడవారికీ కూడా ఉంటుంది సమపాళ్ళలోనే. అందువాల్ల ఆడ, మగ ప్రసక్తి పక్కనబెడితే శేఖర్ గారు చెప్పింది అక్షరాలా నిజం.

 6. రాజేష్ గారూ, పెట్టుబడి పోగేసుకున్నవారు పెట్టుబడిదారీ మనస్తత్వం విషయంలో ఆడా, మగా ఒకటే మీరన్నట్లు. ప్రస్తుత సందర్భంలోని కాన్ మనస్తత్వం విషయంలో ఆడవారిని మీరు మినాయించే ఉంటారనుకుంటున్నా. (పాపము శమించుగాక!)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s