అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ


U.S. debt and deficitప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై రిపబ్లికన్ల మొండి పట్టు వెరసి అమెరికా బాండ్ మార్కెట్ పెట్టుబడిదారులకు చెమటలు పుట్టిస్తున్నాయి. గండం గడిచేదెట్లా అని మదుపుదారులు అటు జో బిడెన్ నేతృత్వంలో జరుగుతున్న చర్చలవైపూ., ఇటు ‘గాంగ్ ఆఫ్ సిక్స్’ సమావేశాలవైపూ అతృతగా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా ట్రెజరీ బాండ్ల ద్వారా సేకరించే అప్పు విషయంలో 14.3 ట్రిలియన్ ల వద్ద పరిమితి ఉంది. ఆ పరిమితికి మంచి బాండ్ మార్కెట్లో అప్పు సేకరించడానికి అనుమతి లేదు. అంతకు మించి అప్పు సేకరించగలిగితేనే ఆగష్టు 2 నాటికి మెచ్యూరిటీ అయ్యే బాండ్లపై చెల్లింపులను అమెరికా చేయగలుగుతుంది. చెల్లించలేక పోతే అది దివాళా. అప్పు చెల్లించలేక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా తీసిందన్న ఘనమైన పేరు సిద్ధంగా ఉంటుంది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. కనుక అప్పు పరిమితిని పెంచాలంటే రిపబ్లికన్ల మద్దతు అత్యవసరం. కానీ రిపబ్లికన్లు బడ్జెట్ లోటు లేదా కోశాగారు లోటును (ఫిస్కల్ డెఫిసిట్) తగ్గించడానికి ప్రభుత్వ ఖర్చు తగ్గించాలంటూ ఓ బిల్లు తయారు చేసి దాన్ని ఆమోదించాలని పట్టుపట్టారు. రిపబ్లికన్ అయిన హౌస్ స్పీకర్ జాన్ బోనర్ గత వారం వాల్‌స్ట్రీట్ కంపెనీలతో మాట్లాడుతూ “అప్పు పరిమితి పెంపుపై జరిగే ఏ ఒప్పందమైనా, బడ్జెట్ ఖర్చులో తీవ్ర తగ్గింపులతోనే సాధ్యమవుతుందని పరోక్ష హామీ ఇచ్చేశాడు. వాల్‌స్ట్రీట్ కంపెనీల దురాశ ఎంతున్నా అంతా తీర్వాల్సిందే మరి.

రిపబ్లికన్ల బిల్లులో రిటైర్ అయిన ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం భరించే ఆరోగ్య భీమా ఖర్చును గణనీయంగా తగ్గించాలని ప్రతిపాదించారు. ఆ అంశాన్ని ఒబామా వ్యతిరేకిస్తున్నాడు. దాని బదులు సంవత్సర సంపాదన $250,000 దాటిన ధనికులపై పన్నులు విధించాలని ఒబామాతో పాటు డెమొక్రట్లు ప్రతిపాదిస్తున్నారు. ధనికులపై పన్ను వేయడానికి రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. అప్పు పరిమితి పెంచే బిల్లు ఆమోదించాలంటే ప్రభుత్వ ఖర్చు తగ్గించే పేరుతో రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న బడ్జెట్ లోటు బిల్లును ఆమోదించాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. వారి బిల్లులొ ఉన్నట్లు రిటైరీల ఆరోగ్య భీమా, పెన్షన్ల తగ్గింపుకు ఒబామా అంగీకరిస్తే రెండొ సారి శ్వేత భవనంలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ఒబామా ఆశలు గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పీట ముడి పడిపోయింది. ముడి విప్పడానికి ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఆద్వ్యర్యంలో ఓ కమిటీ, గ్యాంగ్ ఆఫ్ సిక్స్ పేరుతో మరో కమిటీ చర్చోప చర్చలు జరుపుతున్నారు.

చర్చల్లో ఏదో ఓకటి తేల్చాలని ట్రెజరీ హైరాన పడుతోంది. ఆగస్టు 2 లోపు ఓ అంగీకారానికి రాకపోతే దివాళా ఖాయమని హెచ్చరిస్తోంది. ఈ గడువును రిపబ్లికన్లు పట్టించుకొవడం లేదు. జో బిడేన్ కమిటీలొ నలుగురు డెమొక్రట్లు, ఇద్దరు రిపబ్లికన్లతో జో తో కలిపి మొత్తం ఏడుగురు జరుపుతున్న చర్చలు నత్తనడకన సాగుతున్నాయి. మే ప్రారంభంలో ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పినవాళ్ళు ఇంకా పూర్తి కాలేదు. మే ఆఖరికైనా పూర్తవ్వవేమో నని సంకేతాలు పంపుతున్నారు. జూన్ దాటి జులైలోకి కూడా చర్చల కాలం కొనసాగవచ్చని చెబుతున్నారు. మరోవైపు గ్యాంగ్ ఆఫ్ సిక్స్ త్వరలొ ఒక అంగీకారానికి రాకపోతే వారి చర్చలు పనికిరానివిగా మిగిలిపోతాయి. ఏం చేయాలి? వాట్ టు డూ? కురుక్షేత్రంలో నిలబడిన అర్జునుడు తనకు విద్య గరిపిన కురువృద్ధులపై బాణం సంధించలేక నిలబడి శ్రీ కృష్టుడిని ప్రశ్నించినట్లుగా ఉంది అమెరికా పరిస్ధితి. కాకుంటే అక్కడ ఉన్నది అందరూ అర్జునులే. కర్తవ్యబోధ చేసే కృష్టుడే లేడు. అందుకే తామే రెండు ద్వైపాక్షిక కమిటీలు వేసుకుని మల్లగుల్లాలు పడుతున్నారు. లోటు తగ్గాలని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ భారం ఎవరి మీద అన్నదే సమస్య.

నిజానికి అప్పు పరిమితి పెంపు బిల్లుకు మోక్షం లభించకపోతే అందుకు భాధ్యత రిపబ్లికన్లదే అవుతుంది. దేశాన్ని దివాళావైపు నడిచిన వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. మరి ధనికులపై పన్నుల విధించాలంటే వారికి ఎన్నికల నిధులిచ్చిన కార్పొరేట్ కంపెనీలు కన్నెర్ర చేస్తున్నాయి. రిపబ్లికన్లకు ప్రాణ సమానులైన కార్పొరేట్ కంపెనీలు, ధనికులపై పన్నుల పెంపుకు వారికి మనసొప్పడం లేదు. ఈ సంవత్సరం బడ్జెట్ లోటు 1.4 ట్రిలియన్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న అనేక సంవత్సరాల పాటు కూడా బడ్జెట్ లోటు ఇలాగే ట్రిలియన్ పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఒకటిన్నర ట్రిలియన్ల అప్పు ఇప్పటికే హిమాలయాలను దాటిన అప్పుకు జత కలుస్తూ ఉంటుంది. అమెరికా ఇప్పుడు జరుపుతునన్ మూడు యుద్ధాలను ఆపితే దాని సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది. బోల్దంత డబ్బు ఆదా. బడ్జెట్ లోటు తగ్గించుకోవచ్చు. ఖర్చులూ కొనసాగించవచ్చు. కానీ డెమొక్రట్లయినా, రిపబ్లికన్లయినా అందుకు ఒప్పుకోరు. వారికి యుద్ధాలు కావాలి. యుద్ధాల ద్వారా ప్రపంచ మార్కేట్లపై ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం ద్వారా మరో దేశం సరుకులు కొననీయకుండా తమ సరుకులే కొనిపించాలి. అమెరికా ప్రజలు మాత్రం ప్రభుత్వం తమకు ఇస్తున్న సదుపాయాలను త్యాగం చేయాలి. అధిక ధరలు చెల్లించాలి. వేతనాలు తగ్గించుకోవాలి. ఉన్న ఉద్యోగాలను వదులుకోవాలి. లే-ఆఫ్ లను ఎదుర్కోవాలి. నిరుద్యోగ భృతి వదులుకోవాలి. వేతనాల స్తంభనలను భరించాలి. పెరిగే వైద్య ఖర్చుల్ని భరించలేక అవసరమైతే చావాలి తప్ప ధనికులపైన గానీ, కార్పొరేట్ల పైన గానీ పన్నులు మాత్రం వేయకూడదు. ముసలివాళ్ళకు ఇచ్చే ఆరోగ్య భీమా కూడా చెల్లించలేని కడు దీన స్ధితిలో నేడు అమెరికా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s