లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్


strausskahn_annesinclair

ఐ.ఎం.ఎఫ్ కార్యాలయంలోని స్త్రీతో వ్యవహారంపై ఓ కార్టూన్ ఫోటో

చివరికి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా తానూ మ(మృ)గాడినే అని నిరూపించుకున్నాడు. ఫ్రాన్సు దేశీయుడు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐ.ఎం.ఎఫ్) అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ ఒక లగ్జరీ హోటల్ లోని మెయిడ్ పై అత్యాచారానికి పూనుకున్నాడన్న నేరంపై న్యూయార్కులోని కెన్నెడీ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఫ్రాన్సులో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నికొలస్ సర్కోజీపై నిలబడి గెలుస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా సంఘటన జరిగింది. 2007 నుండీ ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న స్ట్రాస్ కాన్ ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో సమర్ధవంతంగా భాద్యతలు నిర్వహించాడని పేరు తెచ్చుకున్నట్లు బిబిసి తెలిపింది. హోటల్‌లోనే తన సెల్ ఫోన్‌తో పాటు ఇతర వ్యక్తిగత వస్తువలను వదిలేసి హడావుడిగా విమానాశ్రయానికి బయల్దేరి వెళ్ళినట్లు కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. రేప్ ప్రయత్నంతో పాటు మొత్తం మూడు నేరారోపణలను కాన్ ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. కాన్ నేరాన్ని అంగీకరించడం లేదని ఆయన్ లాయర్ తెలిపాడు.

కాన్ అరెస్టు వార్త తనను పిడుగుపాటులా తోచిందని ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకురాలు మార్టిన్ ఆబ్రే తెలిపింది. సర్కోజీపై స్ట్రాస్ కాన్ పోటీ చేసినట్లయితే గెలుపు సులభమని అందరూ భావిస్తున్నారు. అయితే తాను పోటీ చేసేదీ లేనిదీ కాన్ ఇంకా తెలపలేదు. ఆదివారం న్యూయార్కు రాష్ట్ర కోర్టులో కాన్‌ను హాజరుపరుస్తారు. పోర్చుగల్, గ్రీసు దేశాల బెయిల్-ఔట్‌ల గురించి చర్చించడానికి స్ట్రాస్ కాన్ సోమవారం బ్రసెల్స్ లో జరగనున్న ఇ.యు అర్ధికమంత్రుల సమావేశానికి హాజరు కావలసి ఉంది. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడి అరెస్టు వార్తను ఐ.ఎం.ఎఫ్ ప్రతినిధి ధృవీకరించిందని రాయిటర్స్ తెలిపింది.

న్యూయార్క్ పోర్టు అధికారులు, న్యూహార్కు పోలీసు డీపార్ట్‌మెంట్ (ఎన్.వై.పి.డి) విజ్ఞప్తి మేరకు స్ట్రాస్ కాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరపూరిత లైంగిక చర్య, రేప్ ప్రయత్నం, చట్టవిరుద్ధంగా ఖైదు చేయడం అనే మూడు నేరాలు కాన్‌పై నమోదు చేశామని ఎన్.వై.పి.డి ప్రతినిధి పాల్ బ్రౌన్ చెప్పాడు. మనహట్టన్ లోని ఓ హోటల్‌లో పని చేస్తున్న 32 ఏళ్ళ స్త్రీపై ఈ నేరాలకు పాల్పడినట్లు అతను తెలిపాడు. టైమ్ స్క్వేర్ దగ్గర్లో ఉన్న సోఫిటెల్ గా సదరు హోటల్‌ను గుర్తించారు. రోజుకు 3000 డాలర్లు ఖరీదు చేసే లగ్జరీ సూట్‌లో కాన్ బస చేసినట్లు తెలుస్తోంది. “మన్‌హటన్ మిడ్‌టౌన్ లోని ఓ హోటల్‌లో లగ్జరీ సూట్‌లో బస చేసిన వ్యక్తి అక్కడ పని చేస్తున్న ఛాంబర్ మెయిడ్ పై లైంగిక దాడి చేశాడనీ, అతను పారిపోయాడనీ మాకు ఫోన్‌లో సమాచారం అందింది” అని పాల్ బిబిసికి తెలిపాడు. “బలమైన దాడికి గురైనట్లూ, రూం లాక్ చేసి అత్యాచారానికి గురైనట్లు బాధితురాలు మాకు తెలిపింది” అని ఆయన చెప్పాడు.

రాయిటర్స్ కధనం ప్రకారం “కాన్ బాత్‌రూం నుండి నగ్నంగా బైటకు వచ్చాడు. హాల్‌వే గుండా స్త్రీ ఉన్న రూము (ఫోయర్) లోకి నడుచుకుంటూ వచ్చాడు. ఒక బెడ్ రూంలోకి లాక్కెళ్ళి అత్యాచారానికి ప్రయత్నించడం ప్రారంబించాడు. అప్పుడామే అతన్ని నెట్టివేసి పారిపోవడానికి ప్రయత్నించింది. కాన్ ఆమెను హాల్‌వే గుండా ఈడ్చుకెళ్ళి బాత్‌రూంలి లాక్కెళ్ళాడు. అక్కడ నేర పూరిత మైన లైంగిక చర్యకు పూనుకున్నాడు” అని బాధితురాలిని ఉటంకిస్తూ పాల్ బ్రౌన్ చెప్పినట్లుగా రాయిటర్స్ వివరించింది. “ఆ వ్యక్తి డొమినిక్ స్ట్రాస్ కాన్ అని పోలిసులు నిర్ధారించుకొనే లోపు ఆయన పారిస్ వేళ్లే ఫ్రాన్సు విమానం ఎక్కేశాడు. మా డిటెక్టివ్‌లు వెంటనే విమానాశ్రయానికి ఫోన్ చేసి ఆ విమానాన్ని ఆపమని చెప్పి అక్కడికి వెళ్ళి స్ట్రాస్ కాన్‌ను అదుపులోకి తీసుకున్నారు” అని పోలీసులు తెలిపారు. “మావాళ్ళు ఒక పది నిమిషాలు లేటై ఉన్నట్లైతే ఆయన గాల్లొ ప్రయాణిస్తూ ఉండే వాడు” అని వారు తెలిపారు.

ఇది మొదటిసారి కాదు

ఇలాంటి వ్యవహారాలు స్ట్రాస్ కాన్ కి కొత్త కాదని తెలుస్తోంది. ఐ.ఎం.ఎఫ్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో ఒకామెతో కాన్ సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది. 2008లో ఈ విషయమై కాన్ పై ఐ.ఎం.ఎఫ్ బోర్డు దర్యాప్తు జరిపింది. “అతని చర్యలు ఎర్రర్ ఆఫ్ జద్జిమెంట్ ని ప్రతిబింబిస్తున్నాయ”ని బోర్డు తేల్చింది. అయితే వారి సంబంధానికి పరస్పర అంగీకారం ఉందని తేల్చుకున్నారు. ఆ సంఘటన జరిగాక కాన్ తన భార్యకు, ఐ.ఎం.ఎఫ్ సిబ్బందికి క్షమాపణలు చెప్పుకున్నాడు. అతని భార్య అన్నే సింక్లైర్ ఫ్రాన్సులో టివీ రంగంలో ప్రముఖురాలుగా తెలుస్తోంది.

ప్రపంచ దేశాలకు అర్ధిక విధానాల అమలులో పాఠాలు చెప్పే స్ట్రాస్ కాన్, ఇటువంటి నీచానికి పాల్పడటం సిగ్గుచేటయిన విషయం. ఈయన పెట్టుబడిదారీ అర్ధిక వ్యవస్ధకు ప్రతినిధి అని గుర్తిస్తే పెట్టుబడి దారీ సిద్ధాంతవేత్తల నైతిక స్ధాయి ఏ స్ధాయిలో నిర్ణయమవుతుందో ఒక ఉదాహరణగా ఇది నిలుస్తుంది. ఏ నైతిక విలువలపైనా పట్టింపులు ఉండవు గనకే ఈ పండితులు పేద దేశాలకు అప్పులిచ్చి విషమ షరతులు విధించి ఆదేశాల్లొని ప్రజలు ఆకలి, దరిద్రాలకు గురయ్యేలా చేయగలుగుతున్నారు. వీరి దృష్టిలో స్త్రీల సాంగత్యం తమ మగతనానికి ప్రతీక. వీరి దృష్టిలో పలువురి స్త్రీల సాంగత్యం పురుష లక్షణం. వీరి దృష్టిలొ ఏం చేసైనా, దోపిడి చేసైనా సంపదలు కూడబెట్టడం విజయానికి ప్రతీక. వీరి దృష్టిలో డబ్బు, స్త్రీలు పరిపూర్ణ జీవితానికి సంకేతం. వీరు ఏ కుర్చీలో కూర్చున్నా, ఎంత లగ్జరీ హోటళ్ళలో బస చేసినా బుద్ధిమాత్రం నేలబారుగానే ఉంటాయి. వీరి ఆర్ధిక సిద్ధాంతాలే నేలబారువి.

2 thoughts on “లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్

  1. పెట్టుబడిదారీ అర్ధిక సిద్ధాంతాలు ఎంత అనైతికమో వారి ప్రతినిధుల చేష్టలు కూడా అంతే కదా! కాకపోతే ఈ విషయంలో అక్కడి పోలీసులు చాలా ఏక్టివ్ గా పనిచేశారు. అదే ఇండియాలో అయితే కనీసం అరెస్టు జరిగేదా? ఈ విషయంలో పోలీసుల్ని అభినందించవలసిందే.

  2. భాస్కర్ గారూ, సరిగ్గా నేనూ అదే అనుకున్నాను ఆ పోలీసుల గురించి. అది రాద్దామనుకుని అప్రస్తుతమని రాయలేదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s