పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం


Nakba 2011

ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడిన పాలస్తీనా పౌరుడు

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా సిరియాపై ఆగ్రహం వెళ్ళగక్కీంది. సిరియా భూభాగం “గోలన్ హైట్స్‌” ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ భూభాగంలోకి చొచ్చుకురావడానికి పాలస్తీనీయులకు సిరియా ప్రభుత్వం సహకరించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

1948 మే 15 తేదీనాడు అమెరికా, బ్రిటన్ ల కుట్రతో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి పాలస్తీనాను ఇజ్రాయెల్ గా గుర్తింప జేసాయి. పాలస్తీనా భూభాగంలొ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలను లక్షల మందిని వారి ఇండ్లనుండి బలవంతంగా తరిమేశాయి. వారి ఇళ్ళనూ, ఆస్తులనూ ఇజ్రాయెలీయులు వశం చేసుకున్నారు. అలా వెళ్ళగొట్టబడిన పాలస్తీనీయులు, సిరియా, జోర్డాన్, లెబనాన్ దేశాలలో శరణార్ధులుగా శరణార్ధి శిబిరాలలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ వారు ఎన్నడైనా తమ స్వస్ధలాలకు తిరిగి వెళ్ళకపోతామా అన్న ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. ఒక్క సిరియాలోనే 470,000 మంది పాలస్తీనియులు ఆశ్రయం పొందుతున్నారు. అప్పటినుండి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించిన మే 15 తేదీని “వినాశన దినం” (Catastrophe) గా (నక్బా) పాలస్తీనియులు పాటిస్తున్నారు.

ఈ అదివారం కూడా నక్బా పాటించడంలో భాగంగా తమ స్వస్ధలాల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. లిబియా పౌరులపై కాల్పులు జరుపుతున్నాడంటూ అబద్ధాలు ప్రచారం చేసి లిబియాపై బాంబుదాడులు చేస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ సైనికులు కాల్పుల్లో పౌరులు చనిపోయినందుకు ఇజ్రాయెల్ పై ఏ శిక్ష విధిస్తాయో చూడవలసి ఉంది. వాస్తవానికి మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ ఒక గూండా దేశంగా పెత్తనం చెలాయిస్తుంది. పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకున్నదే కాకా ఇప్పటికీ తాను ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపై అది ఇజ్రాయెల్ దేశీయుల కోసం సెటిల్‌మెంట్లు నిర్మిస్తోంది. సెటిల్మెంట్ల నిర్మాణాన్ని అమెరికా, యూరప్ లు ఖండిస్తాయే గానీ వాటిని ఆపడానికి ఏ ప్రయత్నమూ చేయవు. మధ్య ప్రాచ్యంలొ అమెరికా ప్రయోజనాలను ఇజ్రాయెల్ కాపాడుతుండడంతో ఇజ్రాయెల్ అక్రమాలన్నింటికీ అమెరికా, యూరప్ దేశాల వత్తాసు ఉంది.

అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉద్యమాలు చెలరేగుతున్న నేపధ్యంలో ఈ సంవత్సరం నక్బాను పాలస్తీనీయులు స్ఫూర్తివంతంగా జరుపునేందుకు పిలుపునిచ్చారు. దానితో ఇజ్రాయెల్ సర్వ సన్నద్ధమై కాల్పులకు తెగబడింది. రాళ్ళు విసరడం వలన హెచ్చరికగా గాల్లొకి కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనీయులు గాల్లోనుండి చొరబడుతున్నట్లు ఏ వార్తా సంస్ధా రాయలేదు. “పాలస్తీనీయుల జాతీయ ఆకాంక్షను అడ్డు పెట్టుకుని ఇరాన్ ఈ ఆందోళనలను రెచ్చగొట్టింది. సిరియా తన దేశంలోని ఆందోళనలనుండి దృష్టి మరల్చడానికే పాలస్తీనీయులను రెచ్చగొట్టి ఇజ్రాయెల్ మీదికి పంపింది” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించాడు. మరి లెబనాన్ వైపునుండి చొరబాటుకి ప్రయత్నించిన పాలస్తీనీయులను ఎవరు రెచ్చగొట్టిందీ ఆయన చెప్పలేదు. లెబనాన్ వైపునుండి చొరబాట్లను అడ్డుకోవడానికి లెబనాన్ సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది. అందువలన లెబనాన్ వైపు చొరబాట్లకు కారణం చెప్పలేని పరిస్ధితి ఎదురయ్యిందేమో తెలియాల్సి ఉంది.

సిరియా విదేశీ మంత్రి “ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలను” ఖండించాడు. పౌరుల మరణాలకు ఇజ్రాయెల్ భాధ్యతవహించాలని ప్రకటించాడు. సిరియావైపు నుండి వచ్చిన పాలస్తీనీయులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు సిరియా ప్రభుత్వం తెలిపింది. లెబనాన్ వైపునుండి వచ్చినవారిపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. గాజాతో ఉన్న సరిహద్దులవద్ద ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 82 మంది గాయపడ్డారని గాజాలోని హమాస్ ప్రభుత్వం తెలిపింది. పాలస్తీనా ప్రభుత్వం ఉన్నా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్టు బ్యాంక్ లో పాలస్తీనా యువకులు ఇజ్రాయెల్ సైనికులు మధ్య కొన్ని గంటలపాటు జరిగిన ఘర్షణలో కొన్ని వందలమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి ఘర్షణల్లో మొత్తం 12 మంది పాలస్తీనీయులు చనిపోయారనీ కొన్ని డజన్ల మంది గాయపడ్డారనీ బిబిసి తెలిపింది.

గాజా ప్రభుత్వ ప్రతినిధి అబు జుహ్రి ఆదివారం రోజుని “ఇజ్రాయెల్-పాలస్తీనా చరిత్రలో మూల మలుపు” గా అభివర్ణించాడు. ఇజ్రాయెల్ ఆక్రమణను అంతం చేయడానికి పాలస్తీనీయులు, అరబ్బులు కట్టుబడి ఉన్నారని ఈ రోజు స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించాడు. లెబనాన్ సరిహద్దులోని “మరౌన్ ఆల్-రాస్” లో ఇజ్రాయెల్ నిరాయుధులయిన పాలస్తీనీయులపై దుర్మార్గంగా కాల్పులు జరిపి చంపడాన్ని లెబనాన్ లోని హిజ్బోల్లా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కాల్పులు మానవహక్కులను ఉల్లంఘిస్తూ జరిపిన ప్రమాదకర కాల్పులని హిజ్బొల్లా ప్రతినిధి హసన్ ఫద్‌లల్లా ప్రకటించాడు. 2006లో లెబనాన్ పై ఏకపక్ధంగా ఇజ్రాయెల్ జరిపిన దాడిని హిజ్బోల్లా సాహసోపేతంగా తిప్పికొట్టింది. అప్పటివరకు మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా పేరు పొందిన “ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్” (ఐ.డి.ఎఫ్) కు అది తీవ్ర పరాభవంగా మిగిలిపోయింది.

“లెబనాన్‌లో ప్రతిఘటనా ఉద్యమం (హిజ్బోల్లా) పాలస్తీనా జాతీయ హక్కులకు మార్గ దర్శకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఆక్రమణపై పోరాటంలో అందరూ ఐక్యంగా నిలవాలి” అని హిజ్బోల్లా ప్రకటించింది. మరౌన్ ఆల్-రాస్‌లోనూ, గోలన్ లోనూ ఈ రోజు జరిగినది పాలస్తీనా ప్రజలు తమ స్వస్ధలాలకు తిరిగి చేరుకోవడానికి ప్రదర్శించిన తమ శక్తివంతమైన నిబద్ధతకు రూపం” అని హిజ్బోల్లా కొనియాడింది. దక్షిణాన పాలస్తీనీయులు ఇజ్రాయెల్ లో చొరపడకుండా ఈజిప్టు బలగాలు వందలమందిని నిరోధించాయి. సిరియా నుండి ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ లో ఉన్న డ్రూజ్ గ్రామంలోకి 40 నుండి 50 వరకూ ‘నక్బా’ ఆందోళనకారులు చొరబడ్డారని అక్కడి మేయర్ తెలిపాడు. ఐ.డి.ఎఫ్ బలగాలు వారిని గుర్తించడానికి ఇల్లిల్లూ వెతుకుతున్నాయని బిబిసి తెలిపింది.

16 thoughts on “పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

 1. “….పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకున్నదే కాకా ఇప్పటికీ తాను ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపై అది ఇజ్రాయెల్ దేశీయుల కోసం సెటిల్‌మెంట్లు నిర్మిస్తోంది…”

  ఇదే పని ఎడారులా మీదుగా మన దేశం మీదకు మూకలుగా వచ్చిపడి మన సంస్కృతిని నాశనం చేసినవారి మీద మనకు ఎటువంటి కోపం ఉండరాదు. అంతే కదూ!.

  కాశ్మీరు నుంచి తరిమి వేయబడ్డ మన దేశ ప్రజల గురించి కూడా కొద్దిగా పాలస్తీనా వారి గురించి పడే బాధలో వెయ్యో వంతు పడితే చాలు. మన దేశం గురించి మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా పాకిస్తాన్ల గురించి మనం ఆలోచించి ఆ శత్రు దేశాలను ఏవిధంగా లొంగ దీసుకుని, మన భారత దేశ సార్వభౌమికతను కాపాడుకోవటం ఎలాగో ఆలోచిద్దాం. ఆ తరువాత ఎక్కడో ఉన్న పాలస్తానీయులూ ఇతరులూ.

 2. చైనా, పాకిస్తాన్ లు శత్రు దేశాలని నేను భావించడం లేదు. కాశ్మీరులో ఉన్నదీ ప్రజలే. అక్కడి నుండి మన దేశ ప్రజలు తరిమివేయబడ్డారంటే మీరు కాశ్మీరీ పండిట్ల గురించి రాశారా? పండిట్ లను వెనక్కి రమ్మని జె.కె.ఎల్.ఎఫ్ చాలా సార్లు ప్రకటన చేయగా చదివాను. ఒక దేశం మరో దేశాన్ని లొంగదీసుకునే ఆలోచనే నాకు నచ్చదు. ఎవరి స్వతంత్రత వారికి గొప్ప. భారత దేశ సార్వభౌమతపై మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. చదివి తెలుసుకుంటాను.

  పోతే, కాశ్మీరు దేశాన్ని ఇండియా, పాకిస్ధాన్ లు ఆక్రమించుకున్నాయని కాశ్మీర్ ప్రజలు నిరసిస్తున్నారు. ఆ సంగతి గురించి బాధపడాల్సిందే గదండీ! ఈరోజు పాలస్తీనీయులు నక్బా పాటిస్తున్నారు. వారికి నా మద్దతు ఈ పోస్టు ద్వారా.

  కాని పాలస్తీనీయుల గురించి బాధపడొద్దనడం ఏంటో నాకస్సలు అర్ధం కాలేదు. నా బ్లాగ్ లో నేనేమి రాయాలో శాసిస్తున్నారా, శివరాం గారూ?

 3. “…చైనా, పాకిస్తాన్ లు శత్రు దేశాలని నేను భావించడం లేదు…” బాగున్నది. ఇదన్నమాట మీ అభిప్రాయం. మన దేశాన్ని కబళించాలని 1962 లో దాడి చేసిన చైనా ఇప్పటికీ అరుణాచల్ తనదని, అస్సాం వరకూ తనదని అనే చైనా, మన దేశాన్ని నాశనం చేసే శక్తులు అన్నిటికీ సహాయం చేసే చైనా మనకు శత్రువు కాదు.!! మన దేశాన్ని తన టెర్రరిస్టులతో అల్లకల్లోలం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ శత్రు దేశం కాదు! మన మీదకు అనవసరంగా కవ్వించి నాలుగు సార్లు యుద్ధం చేసిన పాకిస్తాన్ శత్రు దేశం కాదు. ఆశ్చర్యం!!!.

  కాశ్మీర్ పండిట్లు అక్కడనుండి ఎందుకు తరిమివేయబడాలి మళ్ళి వెనక్కి రండి అని ఎవరో పిలిస్తేనే వాళ్ళు అక్కడకు వెళ్ళాలా? వీళ్ళకు చూపించని మీ సానుభూతి ఎక్కడో ఉన్న పాలస్తీనీయులకు చూపటం దేనికి? ఐనవాళ్లకు ఆకుల్లోనూ కాని వాళ్లకు కంచాల్లోనూ అన్నట్టుగా ఉన్నది.

  మీ బ్లాగు మీ ఇష్టం నేనెవరు శాసించటానికి . అయినా చైనా పాకిస్తాన్ లు శత్రు దేశాలు కాదంటున్నారు మీరు ఇంకేమిటి మీతో చర్చ.

 4. మనం ఇంతకుముందే తేల్చుకున్నాం, మన దృక్పధలు వేరని. అయినా చర్చకు ఎల్లప్పుడు అస్కారం ఉంటుందనేదే నా విశ్వాసం. ఆ విశ్వాసం ఇరు పక్షాలకీ ఉంటేనే చర్చలు సాధ్యం. మీకు లేకపోతే మీరన్నట్లు చర్చ సాధ్యం కాదు.

 5. I am sorry for me the fact that China and Pakistan are our enemy countries is not a matter for debate. Because of these two nasty neighbours, we are suffering for the last several decades and I do not know how many more years we have to suffer.

  This is all due to the wrong foreign policies perpetrated by the first Prime Minister of India.

 6. In my view, the people of a country should be seen separately from their regime. Because, nowadays, no regime is representing the wishes and characters of their people. As we well know that a country means not a land but the people of that country, I cannot see a country as an enemy simply because it’s regime’s policies are against to our country. Because, the people of any country do not see the people of other country as adversaries unless they are made to believe so, through never ending propaganda.

  That’s how I never see the other countries as enemies. Chinese people don’t need Kashmir or Arunachal Pradesh because they have a place to live, earn and to eat. Only regimes need the land of other countries, whether their claims are facts or not, in the name of security and to further their interests which are not actually the interests of the people of such country.

 7. దృక్పథాలు వేరైనపుడు అభిప్రాయ భేదాలుండటం సహజం. ఎదుటివారి భావాలు తాను నమ్మినదానికి విరుద్ధంగా ఉన్నా సంయమనం కోల్పోవాల్సిన అవసరం లేదు.
  ఈ టపా వ్యాఖ్యల్లో శివరామప్రసాద్ గారు ‘ఇంకేమిటి మీతో చర్చ’ అని అసహనంగానూ, ‘live in your own paradise and be happy’ అని వ్యంగ్యంగానూ రాయకుండా తన ఉద్దేశాన్ని కొంచెం tolerant గా చెప్పివుంటే బాగుండేది!
  ఇతర బ్లాగు చర్చల్లా కాకుండా ఇక్కడ స్నేహపూర్వకమైన, అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు నడుస్తున్నాయి కాబట్టే ఇంతగా చెప్పాల్సివచ్చింది. ధన్యవాదాలు!

 8. సాగర్ గారూ, నిజానికి కొంతమంది అసభ్యంగా రాస్తున్నారు. వాటిని తీసేస్తున్నాను గనక మీరన్నట్లు అర్ధవంతంగా జరుగుతోంది చర్చ. తీసెయ్యడం వలన వస్తున్న ఫలితం.

 9. పాకిస్తాన్ చైనాలు భారత్ కు శత్రువులు కారు అనుకునేవాళ్ళతో ఆ విషయం మీద ఏమి చర్చ చెయ్యాలి సాగర్ గారూ. అసహనం కాదు నేను వ్యక్తపరిచినది, అసంతృప్తి, తోటి భారతీయుడు ఇలా అనుకోవటం చూసి నివ్వెరపాటు ఆపైన బాధ. మన దేశానికి ఎంతో ద్రోహం చేసినవి ఇంకా ఇప్పటికీ చేస్తున్నవి ఆ రెండు దేశాలు అవి శత్రు దేశాలు కాకుండా ఎలా ఉంటాయి. ఏదైనా చర్చకు ఎక్కడో ఒకచోట కొంత అంగీకారం ఉండాలి అది లేనప్పుడు చర్చ సాగదు అదే నేను చెప్పినది.

  పాలస్తానీయుల మీద చూపే ప్రేమలో వెయ్యో వంతు మన దేశంలో భాగమైన కాశ్మీరులో అక్కడి హిందూ ప్రజల మీద చూపిస్తే ఎంతో సంతోషించగలం. కాని అటువంటి స్పందన మన దేశంలో హక్కుల గురించి మాట్లాడేవారి దగ్గర నుంచి కరువయ్యింది. అదే నా ఆవేదన. మన దేశంలో జరిగే వాటి గురించి ఏ మాత్రం స్పందించకుండా ఆకడేక్కడో జరిగే వాటి గురించి అదొక్కటే అన్యాయం అన్నట్టుగా పరిస్థతి కల్పించటం సబబు కాదు.

 10. పాకిస్తాన్ చైనాలు భారత్ కు శత్రువులు కారు అనుకునేవాళ్ళతో ఆ విషయం మీద ఏమి చర్చ చెయ్యాలి సాగర్ గారూ.
  ———————
  శివరాం గారు, చర్చ చెయ్యమని మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? అలా చేస్తే తప్పని సరిగా ఆలోచించాల్సిందే. చెప్పండి ఎవరు బలవంతపెట్టింది?
  * * *
  అసహనం కాదు నేను వ్యక్తపరిచినది, అసంతృప్తి, తోటి భారతీయుడు ఇలా అనుకోవటం చూసి నివ్వెరపాటు ఆపైన బాధ.
  —————————-
  పనిగట్టుకుని మరీ నివ్వెరపడవలసిన అగత్యం ఏమిటి సార్? చిత్రం కాకపోతే. మరి నాతోటి భారతీయుడు నాతో అంగీకరించడం లేదే, నా నివ్వెరపాటు, బాధ ల సంగతి కూడా కొంచెం పట్టించుకోండి మరి!
  * * *
  పాలస్తానీయుల మీద చూపే ప్రేమలో వెయ్యో వంతు మన దేశంలో భాగమైన కాశ్మీరులో అక్కడి హిందూ ప్రజల మీద చూపిస్తే ఎంతో సంతోషించగలం.
  ——————————-
  అదేదో సినిమాలో సీన్ గుర్తొస్తోంది మీ డిమాండ్లు చూస్తే. తన భార్యనుకుని బ్రహ్మానందం భార్యని వెనకనుండి వాటేసుకుంటాడు ఏ.వి.ఎస్. ఇహ బ్రహ్మానందం కనపడినప్పుడల్లా “మీ భార్యని వాటేసుకున్నాను సారీ సార్” అని చెపుతుంటాడు” అలా చెయ్యడం బాగోదని తెలుస్తుంది దానివల్ల.

  కాశ్మీరు విషయం వచ్చినపుడు నా భావాలు రాస్తాను. అప్పుడు స్పందిద్దురుగాని. మే 15 న పాలస్తీనీయులు నక్బా జరుపుకుంటున్న సందర్భంగా వారికి మద్దతుగా నా పోస్టు అని రాశాను చదవగలరు.

  అంతే కాకుండా నాలో స్పందనల ప్రకారమే నేను రాస్తాను తప్ప మీ బాధ, స్పందనలకోసం రాయడం నాకు సాధ్యం కాదని గుర్తించండి. అది కూడా నా భావాలే రాస్తాను తప్ప మీవి కాదు. మీ భావాలు రాయడానికి మీకూ బ్లాగ్ ఉంది కదండీ. మీకు నచ్చినట్లు నా బ్లాగ్ లో రాయమనడం భావ్యం కాదేమో ఆలోచించండి దయచేసి.

  పోతే ఒక్క హిందూ ప్రజల మీదనే కాదు ముస్లిం ప్రజల మీద కూడా ప్రేమ చూపించాల్సిందే సందర్భం వచ్చినపుడు.

 11. మీ బ్లాగు మీ ఇష్టం అని నా మొదటి కామెంట్లలోనే చెప్పాను.మరచినట్టున్నారు. మళ్ళి చెప్తున్నాను, మీరు హాయిగా మీ భావాలను వ్యక్తీ కరించండి. మీరు చెప్పిన బ్రహ్మానందం సినిమా ఉదాహరణ ఏవిధంగా సందర్భోచితమో మీకే తెలియాలి.

  “…పోతే ఒక్క హిందూ ప్రజల మీదనే కాదు ముస్లిం ప్రజల మీద కూడా ప్రేమ చూపించాల్సిందే సందర్భం వచ్చినపుడు….”

  ఏదీ ఆ సందర్భం ఎన్నడూ రాదే. బాధలు పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు. వాళ్లకి మద్దతు కాదు కదా సానుభూతి కూడా రావటం లేదు. అక్కడెక్కడో ఉన్న వాళ్ళ మీద మటుకు మనకు ఎంతో ప్రేమ. మనవాళ్ళు ఇక్కడ పడే బాధలకు కూడా సానుభూతి చూపండి అది నేను చెప్పింది.

  నా నేవ్వేరపాటు, నేను ఎన్నడూ ఎవరి దగ్గర్నుంచీ వినని మాట మీ దగ్గర నుంచి వచ్చింది. మనకి పక్కలో బల్లెల్లా ఉన్న రెండు దేశాలూ మనకు శత్రు దేశాలు కాదు అని. అందుకని నా నివ్వెరపాటు.

  చైనా పాకిస్తాన్లు భారత్ కు నిస్సందేహంగా శత్రు దేశాలే. అందులో నాకైతే ఎటువంటి అనుమానం లేదు.

 12. ‘మీ బ్లాగు మీ యిష్టం” అంటూనే కాశ్మీరు ప్రజల గురించి ఎందుకు రాయలేదు అనడుగుతున్నారు గదాని. సందర్భ రహితంగా ప్రేమ, దూషణ, ఆనందం, అపాలజీ లాంటివి చెబితే చూసేవాళ్ళకు బాగోదని చెప్పడానికి బ్రహ్మానందం ఉదాహరణ. పాలస్తీనా మీద రాయడానికి సందర్భం చెప్పాను. అయినా కాశ్మీరు సందర్భం లేకుండా కాశ్మీరు పండిట్లు గురించి రాయడం బాగోదు కదా. అంతేనండి.

  ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తోంది. ప్రజల్ని చంపుతోంది. ఆ యుద్దాలు జరుగుతున్నంతకాలం అది సందర్భంగానే ఉంటుంది. కనక వారిగురించి మాట్లాడుకుని వారికి సానుభూతి తెలపవలసిన సందర్భమేనని నా అభిప్రాయం. అక్కడెక్కడో ఉన్నా పక్కనే ఉన్న బాధల్లో తేడా ఉండదేమో కదండీ. ఆఫ్ఘనిస్ధాన్ మన పక్కనే ఉంది. నేను చెప్పిన విషయాలు, మీరు నివ్వెరపడిన విషయాలు చాలామందినుండి చాలా కాలంగా నేను వింటూనే ఉన్నాను. మనకు కామన్ సర్కిల్ లేదు కనక మీకలా అనిపించిందేమో.

 13. విశేఖర్ గారూ, చైనా పాకిస్తాన్ దేశాలను శత్రుదేశాలుగా భావించకూడదని ఎలా అంటున్నారో వివరించవచ్చుగా? నాలాంటి వాళ్ళకు పనికొస్తుంది!

  దేసమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నమాట నిజమే అయినా ఒక దేశ వైఖరిని ప్రతిబింబించేది ఆయా దేశాల ప్రభుత్వాలూ, వాటి చర్యలూనూ!ప్రజల అభిప్రాయాలను ఏ ప్రభుత్వాలూ ప్రతిబింబించవు ! మరి ఈ రెండు దేశాల చర్యలు చూస్తూనే ఉన్నాం కదా! మరి అవి శత్రు దేశాలు గా భావిచడం లేదని ఏ బేస్ మీద అంటున్నారో వివరించగలరా?

  మొత్తానికి మీ బ్లాగు ని బుక్ మార్క్ చేసుకోవాల్సి వచ్చేట్టుంది/

 14. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న దేశాలేవీ ప్రజల ప్రయోజనాలని నెరవేర్చడానికి ప్రయత్నించడం లేదన్న విషయాన్ని మొదట అంగీకరించాలి.

  ప్రతి దేశానికీ ప్రజల్ని పాలించే రాజ్యం (స్టేట్) ఒకటి ఉంటుంది. రాజ్యం అంటే ప్రభుత్వం కాదు. వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వస్తూపోతుంటాయి. రాజ్యం మాత్రం ఎప్పుడూ ఒకటే. అది కొందరి చేతుల్లో ఉంటుంది. రాజ్యం అంటే ప్రభుత్వం, బ్యూరోక్రసీ, న్యాయవవస్ధ, ఆర్మీ తదితర బలగాలు, ఇంకా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే పత్రికా వ్యవస్ధ. ఇవన్నీ కలిపి రాజ్యం లేక రాజ్య వ్యవస్ధ అంటారు.

  ఇప్పుడు సమాజంలో ఉత్పత్తికి ఉపయోగించే సాధనాలు: భూమి, పరిశ్రమలు, యంత్రాలు, ఆఫీసు భవనాలు మొ.వి. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో గమనించండి. భూస్వాములు, పెట్తుబడిదారులు, వీరు కాకుండా విదేశీ కంపెనీలు. భూస్వాములు భూములు తమ చెతిలో ఉంచుకుంటూ పెట్టుబడులు కూడా పెడుతున్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భూముల్ని ప్రభుత్వాల అండతో స్వాధీనం చేసుకుంటున్నారు. విదేశీ కంపెనీలకి సెజ్ ల పేరుతో వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. విదేశీ కంపెనీల్లో భారత పెట్టుబడుదారులకి కూడా వాటాలుంటున్నాయి. ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తోంది? పెట్టుబడిదారులు, భూస్వాములు, విదేశీ కంపెనీలు ఉమ్మడిగా దెశంలోని ఉత్పత్తి సాధనాలన్నింటికీ సొంతదారులుగా ఉన్నారని. రైతుల చేతుల్లొ ఉన్న భూమి చాలా తక్కువ. రెండు మూడు ఎకరాలు అంతకు తక్కువ ఉన్నవారే అధికం. వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేయలేక కౌలుకివ్వడమో, అమ్ముకుని పట్టణాల్లో కార్మికులుగా మారిపోవడమో చేస్తున్నారు.

  ఇలా ఉత్పత్తి సాధనాలని ఆధీనంలో ఉంచుకున్నవారే సమాజంలో పెత్తనాలు చేయగలరు. ఎందుకంటే మిగిలినవారంతా బతకాలంటే ఈ ఉత్పత్తి సాధనాల పైనే పనిచేయాలి. కార్మికులు పరిశ్రమల్లో పని చేయాలి. పరిశ్రమ పెట్టుబడిదారుడిది. రైతుల్లో అధికులు కౌలుదారులు. పంట నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చినా అది సొంతదారుడికి వెళ్తుంది తప్ప కౌలుదారుడికి రాదు. పెట్టుబడిదారులు బ్యాంకులు, ఇన్సూరెన్సు, చిట్‌ఫండ్ లాంటి నాన్ బ్యాంకిగ్ ఫైనాన్స్ కంపెనీలు స్ధాపిస్తే అందులో నెలజీతానికి ఉద్యోగులు చేరతారు. వీరికి సరిపడా జీతాలుండవని తెలిసిందే. పత్రికలు స్ధాపించగలిగేది ధనికులే. వాళ్ళకి వార్తలు తెచ్చిచ్చేది మళ్ళీ జర్నలిస్టులనబడే ఉద్యోగులు.

  ఇలా ఉత్పత్తి సాధనాలని చేతుల్లో పెట్టుకున్నవారే రాజ్యాన్ని చేతుల్లో పెట్టుకుంటారు. ఉత్పత్తి సాధనాల మీద పనిచేసేవారి శ్రమ వల్లనే ఏ ఉత్పత్తి అయినా వస్తుంది. పెట్టుబడిదారుడు డబ్బుతో యంత్రాలు కొని పరిశ్రమ పెట్టి అలా ఉంచితే ఉత్పత్తి రాదు. వాటిపైన కార్మికులు శ్రమ చేస్తేనే ఉత్పత్తి. మరి పెట్టుబడి దారుడు యంత్రం కొన్నాడు గదా అనవచ్చు. అవును కొన్నాడు. యంత్రం కోసం పెట్టుబడిదారుడు ఎంత ఖర్చు పెట్టాడో అంతవరకే యంత్రం తిరిగి తన సొంతదారుడికి ఇవ్వగలుగుతుంది. అంతకంటే ఒక్క నయాపైస కూడా ఎక్కువివ్వదు. కాని పెట్టుబడిదారుడు యంత్రాలకు, కార్మికులకు పెట్టిన డబ్బుపైన లాభాలు వస్తాయి. ఈ లాభాలు ఎవర్నుండి వస్తుంది? యంత్రం తన విలువ వరకే ఇస్తుంది. కనుక యంత్రం లాభం ఇవ్వదు. కార్మికుడి నుండే ఆ లాభాలు వస్తాయి. అతని శ్రమ కి ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువ విలువని కార్మికుడు పెట్టుబడిదారుడికి ఇస్తాడు. సజీవ శ్రమకి ఉన్న ప్రత్యేక లక్షణం అది. (యంత్రంలో ఉండేది నిర్జీవ శ్రమ. యంత్రం తయారైనపుడు ఆ యంత్రం తయారీకి కార్మికులు అందించిన శ్రమ దానిలో చేరి ఉంటుంది. అది నిర్జీవ శ్రమగా తనకు సమానమైన విలువనే ఇవ్వగలుగుంది)
  కార్మికులు ఉమ్మడిగా పనిచేస్తూ ఓ ఉత్పత్తి తీస్తే ఒక్కొక్కరు చేసే శ్రమ కంటే ఎక్కువ ఉత్పత్తి తీయగలుగుతారు. అది ఉమ్మడి శ్రమకి ఉన్న ప్రత్యేకత. ఇలా కార్మికులకు పెట్టుబడిదారుడు ఇచ్చిన విలువ కంటే శ్రామికుడు తన శ్రమ ద్వారా అదనంగా పెట్టుబడిదారుడికి ఇచ్చిన విలువని అదనపు విలువ అంటారు. అదనపు విలువ ని కనిపెట్టింది కారల్ మార్క్సు.

  సో కార్మికుల శ్రమ వలనే లాభాలు తప్ప, పెట్టుబడివలన కాదు. కాని తన ఆదిపత్యంతోటి పెట్టుబడిదారుడు దబాయించి అదనపువిలువ ని సొంతం చేసుకుని మరింత పెట్టుబడిని పోగేసుకుంటున్నాడు. మళ్ళీ ఆ పెట్టుబడి ఉత్పత్తి కార్యక్రమంలోకి వెళ్ళి కార్మికుల్నిండి మరింత అదనపు విలువని గుంజి మరింత పెట్టుబడి సంపాదిస్తాడు.

  ఈ క్రమం నిరాటంకంగా జరగదు. పెట్టుబడిదారుడు అంతకంతకూ లాభాలు పెంచుకోవడానికి కార్మికుడికి ఇచ్చేది తగ్గిస్తుంటాడు. అలా తగ్గించే కొద్దీ కార్మికుల బతుకు దుర్భరం అవుతుంది. భరించినంతకాలం భరించి ఇక సాధ్యం కాదనుకున్నపుడు తిరగబడతాడు. అలా తిరగపడినప్పుడు వారిని అదుపులో పెట్టేది రాజ్యవ్యవస్ధ. రాజ్యవ్యవస్ధ ఉత్పత్తి సాధనాలమీద ఆధిపత్యం ఉన్న వారి చేతుల్లో పనిముట్టు. పోలీసుల చేతిలో లాఠీ ఎలాగో రాజ్యం ఉత్పత్తి సాధనాల యజమానుల చేతుల్లో అలా ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం అని ఇప్పుడు అంటున్నారు కాని గతంలో బానిస, ఫ్యూడల వ్యవస్ధల్లో అదీ లేదు. బానిసలు తిరగపడ్డం వలన పరిమిత స్వేచ్ఛ గలిగిన ఫ్యూడల్ వ్యవస్ధ ఏర్పడింది. అక్కడ కూడా రైతులు, కూలీల అణచివేతపై తిరగబడితే పెట్టుబడిదారీ వ్యవస్ధ ఏర్పడింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో మరింత స్వేచ్ఛ వచ్చినట్లు కనబడుతుంది. అది యజమానులను మార్చుకునే స్వేచ్ఛ తప్ప దోపిడీ కొనసాగింది. ఒక కంపెనీ కాకుంటే మరో కంపెనీకి వెళ్ళే స్వేచ్ఛ ఉంది తప్ప అన్ని కంపెనీల్లో కార్మికుడి అదనపు విలువను దోచుకుంటారు.

  అదనపు విలువ సిద్ధాంతాన్ని పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్త లెవరూ ఇంతవరకూ తప్పని నిరూపించలేక పోయారు. పైగా పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు అర్ధం కాక దాస్ కేపిటల్ ని తిరగేస్తున్న పరిస్ధితి కూడా ఉంది.

  కనుక రాజ్యం అనేది సమాజంలోని అత్యధిక ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్న వారి ప్రయోజనాల పరిరక్షణకోసం ఏర్పరచుకున్న పనిముట్టు. కార్మికుడు సమ్మె చేస్తే సమ్మె చట్టవిరుద్ధం అంటారు. కొనసాగిస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. దానికి శిక్షా స్మృతిలో శిక్ష ఉంటుంది. సంఘంలో దొపిదీలు దొంగతనాలు జరక్కుండా రక్షణ వ్యవస్ధ ఉంది అంటారు కానీ నిజానికి దాని పని అది కాదు. అదే పని అని చెప్పడానికి పెట్టీ దొంగల్ని పట్టుకోవచ్చు. కానీ లక్ష కోట్లు (కాకుంటే వెయ్యి కోట్లనుకోండి) దోపిడి చేసాడంటున్న జగన్ పైన ఈగ వాలదు ఎందుకని? భోపాల్ విషవాయువు లీకైనప్పుడు యజమాన్ని విమానం ఎక్కించి గౌరవంగా పంపింది ప్రభుత్వం. న్యాయ వ్యవస్ధ కూడా బ్రాడ్ గా వారికి అనుకూలంగా పనిచేస్తుంది. రాజశేఖరరేడ్డి చేసిన దోపిడి సామాన్యం కాదు. అయినా కేంద్ర ప్రభుత్వం అతనికి అండగా నిలిచింది. జగన్ ని శిక్షించాలంటే అతను సోనియా, అహ్మద్ పటేల్, మన్మోహన్ ల అవినీతి బైటపెడతాడు. వీళ్ళందరూ దొంగలే. కాని వీళ్ళకి శిక్షలు పడవు. కారణం వారే రాజ్యాన్ని నడుపుతున్నారు.
  ————————

  ఇదంతా చెప్పడం ఎందుకంటే చైనా, పాకిస్ధాన్ ల చర్యలు అక్కడి రాజ్యాన్ని చేతుల్లో పెట్టుకున్న ధనిక స్వాముల చర్యలే తప్ప, అక్కడి ప్రజలకు ఆ ప్రభుత్వాల చర్యలతో సంభంధం లేదు. చైనా దేశం అంటే అక్కడి ప్రజలు అని మనం గుర్తించాలి. కాని ఇండియన్ పాలకులకి చైనా అంటే చైనా పాలకవర్గాలనే. అండ్ వైస్‌వర్సా. అలాగే పాకిస్ధాన్ విషయంలో కూడా. చైనా, పాకిస్ధాన్‌ ప్రజలతో సంబంధం లేని వారి పాలకుల చర్యలపైన భారత ప్రజలు కోపం తెచ్చుకొని బి.పి లు తెచ్చుకుంటె పాడయ్యేది మన ఆరోగ్యాలే. ఉత్సాహవంతులు సైన్యంలో చేరి ఆ దేశాలపైకి వెళ్తే వచ్చేది నెల జీతమే. జరగరానిది జరిగితే ఫలితం చెప్పనవసరం లేదేమో. కనీసం దండలు కూడా వెయ్యరు. జెండా గుడ్డ పార్సిల్ లో రావచ్చు.

  చైనా, పాక్, ఇండియా ల సంబంధాల గురించి ఓ పోస్టు రాశాను. చదివారో లేదో. అందులో చెప్పాను. చైనా ఇండియాల మద్య వాణిజ్య సంబంధాలు భేషుగ్గా ఉన్నాయి. ఇంకా పెంచుకోవాలంటున్నారు. పాక్‌తో వాణిజ్యం పెట్టుకోవడానిక్కూడ మన ప్రభుత్వాలకి అభ్యంతరం ఉండదు. కాకుంటే పాక్ మీద మొదటినుండీ ద్వేషం పెంచి పోషించారు. పాక్ (రాజ్య) చర్యలు కూడా అందుకు దోహదం చేశాయి. పాకిస్ధాన్ ఇండియాపై చేసే టెర్రరిస్టు చర్యలవలన పాక్ రాజ్యానికి ప్రయోజనాలున్నాయి. దాంతో పాటు ఇండియా రాజ్యానికీ ప్రయోజనాలున్నాయి. వాటి కోసమే ఆ చర్యలు.

  అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లకు సంబంధించిన సరిహద్దు తగాదాలే ఘర్షణలకు మూలం అని తెలుసు కదా? మరి కాశ్మీరు, అరుణాచల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ప్రాంతాలు ఎటువైపు ఉండాలని నిర్ణయించవలసింది ఆంధ్ర, ఢిల్లీ ప్రజలు కాదు. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే. కాశ్మీరు ప్రజలు తమకు పాక్ వద్దు, ఇండియా వద్దు మాదొకదేశం అంటున్నారు. వారి అభిప్రాయాలు ముఖ్యమా మన అభిప్రాయాలు ముఖ్యమా? మనకిక్కడ ఏదో ఉద్యోగమో, పోలమో ఏమీ లేకపోతే దరిద్రమో ఏడ్చింది. కాశ్మీరు ప్రజలకి దరిద్రం కూడా దక్కడం లేదు. నిరంతరం పొలీసులు, సైన్యం పహారా. వాళ్ళమానాన వాళ్ళని బతకనివ్వరు. ఉన్నట్లుండి ఇళ్ళలొకి జొరబది కుర్రాళ్ళని పట్టుకెళ్లి పాక్ నుండి వచ్చిన మిలిటేంట్ అని కాల్చేస్తారు. రేప్ లు నిత్య కృత్యం. కాశ్మీరే కాదు. మణిపూరూ అంతే. అక్కడ భారత ప్రభుత్వం ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చట్టం విధించింది. పారా మిలట్రీ, మిలట్రీకి సర్వాధికారాలు. రేప్ లు నిరాటంకంగా జరుగుతుంటాయి. శిక్షించమంటే కేంద్ర ప్రభుత్వం సైనికబలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుంది అందువల్ల శిక్ష కుదర్దు అంటుంది. గత సంవత్సరం మనోరమ అనే అమ్మాయిని రేప్ చేసి చంపెసి రోడ్ మీద పడేశారు. అప్పుడు ఓ డజను మంది నడివయసు మహిళలు పూర్తిగా బట్టలిప్పి అర్మీ ఆఫీసు ముందు ప్రదర్శన దేశారు, ఓ బేనర్ పట్టుకుని “భారత సైనికులారా, మమ్ముల్నీ రేప్ చేయండి” అని ఆ బ్యానర్. ప్రపంచం అంతా గగ్గోలు పెట్టింది ఆ వార్తతో. అయినా ఆపని చేసిన వారికి శిక్షా పడలేదు. ఆ స్పెషల్ చట్టాన్నీ రద్ధూ చెయ్యలేదు. అదీ మన భారత దేశ ప్రభుత్వం లేదా రాజ్యం గొప్పతనం.

  (మీరడిగిన ప్రశ్న చిన్నదే కానీ జవాబు రెండు మూడు వాక్యాల్లో చెప్పేది కాదు. ఇంత రాసినా మీకు సంతృప్తి కలుగుతుందో లేదో అనుమానమే. అందుకే శివరాం గారి ప్రశ్నకి జవాబివ్వడం కోసం సాహసించలేకపోయాను.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s