పాకిస్ధాన్ పార్లమెంటు ఊహించని విధంగా ఓ ముందడుగు వేసింది. అది సంకేతాత్మకమే (సింబాలిక్) అయినప్పటికీ ఇప్పటి పరిస్ధితుల్లో అది ప్రశంసనీయమైన అడుగు. దాదాపు పది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో అమెరికన్ కమెండోలతో కూడిన హెలికాప్టర్లు మే 2 తేదీన అనుమతి లేకుండా పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి అబ్బొత్తాబాద్ లో సైనిక చర్య చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే మానవ రహిత డ్రోన్ విమానాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా మిలిటెంట్లను చంపే పేరుతో పాక్ పౌరులను చంపడాన్నీ ఖండించాయి. డ్రోన్ దాడులను ఆపకుంటే పాకిస్ధాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘన్ లోని అమెరికా సైన్యానికి ఆయుధ, ఆహార సరఫరాలకు అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అబ్బోత్తాబాద్ దాడి పాకిస్ధాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని తీర్మానం తేల్చి చెప్పింది.
పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా బిన్ లాడెన్ స్ధావరంపై ఏమ పక్షంగా దాడి చేసిన నేపధ్యంలో అమెరికాతో పాకిస్ధాన్కి ఉన్న సంబంధాలను సమీక్షించాలని పార్లమెంటు కోరింది. అమెరికా ఏకపక్ధ దాడిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది. డ్రోన్ దాడుల్ని ఆపకుంటే నాటో వాహానాల ఆఫ్ఘన్ సరఫరాలపై నిషేధం విధించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. శుక్రవారం సరిహద్దు బలగాల్లో చేరడానికి శిక్షణ పూర్తి చేస్తున్న పాక్ భద్రతా బలగాలపై రెండు ఆత్మాహుతు దాడులు జరిగాయి. వెంట వెంటనే జరిగిన ఈ అత్మాహుతి దాడుల్లో యాభై మందికి పైగా కానిస్టేబుళ్ళు చనిపోయారనీ, ఇంకా వందకు పైగా గాయపడ్దారనీ పాక్ ప్రభుత్వం తెలిపింది. ఆత్మాహుతి దాడులకు తానే బాధ్యురాలిగా తాలిబాన్ ప్రకటించింది. బిన్ లాడెన్ హత్యకు అవి ప్రతీకార దాడులని తాలిబాన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో పాక్ పార్లమెంటు సమావేశమై అమెరికా విధానాలపై తీర్మానాలను ఆమోదించింది.
అటు అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం పాక్కి ఇస్తున్న బిలియన్ల డాలర్ల సహాయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిన్ లాడెన్ అన్ని సంవత్సరాలపాటు పాక్లో ఆశ్రయం పొందుతున్న సంగతి పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరగదని వారు అభిప్రాయపడుతున్నారు. లాడెన్ హత్య తర్వాత ఆయన పాక్లో రక్షణ పొందడానికి పాక్ ప్రభుత్వానికి బాధ్యత ఉందంటూ ఒబామా పరోక్షంగా హెచ్చరికతో కూడిన సూచన చేయడం, పాక్ విదేశాంగా మంత్రిత్వ శాఖ ఆ సూచనను తీవ్రంగా ఖండిస్తూ, టెర్రరిస్టు వ్యతిరేక పోరాటంలో తాము అనేక త్యాగాలను చేసిన సంగతిని గుర్తు చేయడం పాఠకులకు విదితమే. ఇద్దరు పాక్ పౌరులను సి.ఐ.ఏ గూఢచారి రేయాన్ డేవిస్ కాల్చి చంపడం, అతన్ని జైలులో ఉంచి విచారణ చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడం, చివరికి ఏ శిక్షా లేకుండా డేవిస్ ను విడుదల చేయడంతో ప్రజలు ఆగ్రహం చెందడం తదితర సంఘటనల నేపధ్యంలో పాక్, అమెరికా ల సంబంధాలు బలహీనపడ్డాయి.
“పాకిస్ధాన్ ప్రజలు అలాంటి చర్యలను ఇక మాత్రం అంగీకరించరు. అటువంటి ఏక పక్ష చర్యలు పునరావృతమయితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచంలో కూడా శాంతి, సుస్ధిరతలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది. అమెరికా దాడికి భాధ్యులను గుర్తించడానికీ, అటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండటానికి తగిన చర్యలను సిఫారసులు చేయడానికి స్వతంత్ర దర్యాప్తు జరగాలి” అని తీర్మానం పేర్కొన్నట్లుగా ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో మిలిటెంట్లు తలదాచుకుంటున్నారని చెబుతూ మానవ రహిత డ్రోన్ విమానాలతో బాంబుదాడులు చేయడం ఆమూదనీయం కాదని తీర్మానం తేల్చి చెప్పింది. డ్రోన్ దాడులు ఆపనట్లయితే ఆఫ్గనిస్ధాన్ లోని తన సేనలకు సరఫరాలకు అనుమతి నిరాకరించే విషయాన్ని పరిగణించాలని తీర్మానం కోరింది.
పార్లమెంటు సమావేశంలో పాక్ ఆర్మీ ఛీఫ్లు హాజరై బిన్ లాడెన్ ఉదంతంపై తమ వివరణలు ఇచ్చారని తెలుస్తోంది. పాకిస్ధాన్ భద్రతా సేవల అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా అమెరికా దాడికి భాద్యత వహిస్తూ రాజీనామాకి సిద్ధపడినా అతని పై అధికారులు అంగీకరించలేదని పార్లమెంటుకు తెలిపనట్లుగా బిబిసి తెలియజేసింది. ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతున్న నేపధ్యంలో డ్రోన్ దాడులను తగ్గించాలని పాక్ అర్మీ అమెరికాను కోరుతోంది. అమెరికా మాత్రం మిలిటెంట్లపై దాడులకు ప్రధానంగా డ్రోన్ విమానాలపై ఆధారపడుతొంది. డ్రోన్ విమాన దాడులకు తమ అనుమతి లేదని పాక్ ప్రభుత్వం చెబుతుంది. డ్రోన్ దాడులు జరిగినప్పుడల్లా ఖండన ప్రకటనలు జారీ చేస్తుంది. అయితే డ్రోన్ దాడులకు పాక్ ప్రభుత్వ పరోక్ష అంగీకారం ఉందని వార్తా సంస్ధలు అభిప్రాయపడుతున్నాయి. పాక్ అర్మీ అధికారులు పాక్లో ఉన్న సి.ఐ.ఏ సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించాలని డిమాండ్ చేసినప్పటినుండి అమెరికా, పాక్ ల మద్య సంబంధాలు బలహీనపడడం మొదలయ్యింది.