సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా


syria-protests

సిరియాలో ఆందోళనలు

సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో అతని కుమారుడిని, ముగ్గురు మనవళ్లనూ చంపేశాయి. గడ్దాఫీ కూడా గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి.

లిబియా మాదిరిగానే సిరియా విషయంలో కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు పొరుల భద్రత పట్ల, పౌరులపై కాల్పులు జరుపుతుండడం పట్లా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. వారి ఆందోళన సిరియాలో కూడా తమ దోపిడీ హస్తాన్ని చాచేందుకు అవకాశం దొరకబుచ్చుకోవడానికె తప్ప మరొకటి కాదు. ఈ నేపధ్యంలోనే చైనా, రష్యా దేశాలు సిరియా విషయమై ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ సిరియా విషయం భద్రతా సమితిలో చర్చించే ప్రసక్తే లేదని తెలిపాడు. “భద్రతా సమితిలో సిరియాపై చర్చ జరపడానికి వీల్లేదు. అది స్పష్టమే” అని ఆ ప్రతినిధి తెలిపినట్లుగా ఇంటర్ ఫాక్స్ వార్తను బుధవారం ప్రచురించింది.

చైనా ప్రభుత్వం గురువారం సిరియా ప్రభుత్వానికి “స్దిరత్వం ఉండేలా చూడాలి, రక్తపాతం జరగకుండా నివరించాలి” అని సలహా ఇచ్చినట్లుగా జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. “మధ్య ప్రాచ్యంలో సిరియా ముఖ్యమైన దేశం. ఆ దేశం స్ధిరత్వం కొనసాగేలా చూస్తుందని భావిస్తున్నాం. సంబంధిత వర్గాలు రాజకీయ చర్చల ద్వారా తమ విభేధాలను తొలగించుకోవాలని కోరుతున్నాం” అని విదేశాంగ శాఖ ప్రతినిధి జియాంగ్ యు చెప్పీనట్లు ఆ సంస్ధ తెలిపింది. “సిరియా అంతర్గత వ్యవహారాల్లో బైటి శక్తులు జోక్యం చేసుకోరాదని భావిస్తున్నాం. అటువంటి జోక్యం పరిస్ధితిని మరింత క్లిష్టం చేస్తుంది” అని జియాంగ్ వ్యాఖ్యానించింది.

అంతర్జాతీయ కమ్యూనిటీ మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి, స్ధిరత్వాలను కాపాడ్డానికి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లుగా జియాంగ్ తెలిపింది. చైనా ప్రభుత్వం అంతర్జాతీయ అంశాలపై వ్యాఖ్యానించడం అరుదైన విషయం. తనకు ప్రయోజనం ఉంటే తప్ప ఏ విషయంలోనూ చైనా కలుగ జేసుకోదు. ఉత్తర కొరియా, తైవాన్ ల విషయంలో తప్ప చైనా ఇతర విషయాల్లో వ్యాఖ్యానం గానీ, ప్రకటన గానీ ఎన్నడూ చేయలేదు. అటువంటింది మధ్య ప్రాచ్యం గురించీ, సిరియా ఆందోళనల గురించీ ప్రకటన చేయడం మారుతున్న చైనా దృక్పధాన్ని సూచిస్తోంది. అందునా మధ్య ప్రాచ్యం లాంటి వివాదాస్పద రాజకీయాల గురించి ఒక ప్రకటన చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించడానికి ఉద్యుక్తురాలవుతున్నదని భావించవచ్చు.

2 thoughts on “సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా

 1. ఇదో అంతర్జాతీయ దరిద్రం. ఆడుకున్నేవాళ్లిద్దరు కొట్టుకుంటే మధ్యలో గీక్కునేవాడోచ్చి వాళ్ళ బొచ్చె గోకినట్లు మొన్న లిబ్యా పైన..ఇప్పుడు సిరియా పైన.. బావుందండీ.

  చైనా, రష్యాలకు వారి సొంతలాభాలు ఏవైనా ఉందనీ..మద్దతు ఇచ్చినన౦దుకు ధన్యవాదాలు.

  #“సిరియా అంతర్గత వ్యవహారాల్లో బైటి శక్తులు జోక్యం చేసుకోరాదని భావిస్తున్నాం.”

  అసలు సిరియా కానీ మరో దేశం కానీ.. బయటి దేశం వచ్చి వాళ్ళ అంతర్గతయవ్వారాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరిచ్చారండీ? నాకు ఎంతకూ అర్థం కాదు. ఒక రెండు మూడు పశ్చిమదేశాలు పెత్తనం చేస్తుంటే మిగిలినదేశాలు నసుగుతాయే కానే గట్టిగా బయటికీ రావెందుకండి?

  పై ప్రశ్నలకి మీరు నాకు కొద్దిగా జ్ఞానబోధ చేయగలరు 🙂

 2. జ్ఞాన బోధ చేసేటంత సీన్ నాకు లేదు గానీండి, నాకు తెలిసింది చెప్తాను.

  జోక్య చేసుకునే హక్కులు వాళ్ళే లాక్కున్నారు. అది ఎవరూ ఇవ్వరు కనుక, తమకు బలం ఉంది కనుక.

  అమెరికాతొ చైనా రష్యాలకూ పని ఉంది కదా. చైనా అమెరికా ట్రెజరీ బాండ్లలో రెండు ట్రిలియన్ల పైనే పెట్టుబడులు పెట్టింది. దాని ఎగుమతుల్లో సింహ భాగం అమెరికాకే వెళ్ళాలి. చైనా వాణిజ్య మిగులులో సగానికి పైగా అమెరికాతో ఉన్న మిగులే. చైనా ఎగుమతులపైన అమెరికా టారిఫ్ బేరియర్స్ పెట్టకుండా ఉండడం చైనాకు కావాలి. తన ఆర్ధిక ప్రయోజనాలు కొనసాగడానికి చైనా అమెరికాతో కుమ్మక్కు. ఇ.యుతో కూడా అంతే.

  రష్యాకీ అవే సమస్యలు దాని ఆయిల్ రవాణా చేసే సముద్ర మార్గాలు చాలావరకు అమెరికా కంట్రోల్ లో ఉన్నాయి. పాత సోవియట్ రష్యా దేశాల మీద ఇప్పటి రష్యా చేసే పెత్తనం గురించి (ఉదా: చెచెన్యా, జార్జియా) అమెరికా మాట్లాడకూడదు. అందుకని అమెరికా పెత్తనంపై రష్యాకూడా మాట్లాడదు. ఒకరినొకరు సహకరించుకుంటూనే ఒకరిదొకరు లాక్కునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇరాన్ విషయంలో అమెరికాకి చైనా, రష్యాలు మద్దతిచ్చాయి. లిబియా విషయంలో కూడా ఇచ్చాయి. అందుకుని సిరియాజోలికి రావద్దని అమెరికాని హెచ్చరిస్తున్నాయి. అందుకే సిరియా గురించి అమెరికా, ఇ.యులు పెద్దగా మాట్లాడవు. ఇహ పాక్ అమెరికా, చైనాలిద్దరికీ కావాలి.

  కొన్ని చోట్ల తగువు. మరికొన్ని చోట్ల సహకారం. రెండూ బాలెన్సు అవుతూ ఉంటాయి. బాలెన్సు తప్పితే పూర్తి పెత్తనం గానీ యుద్ధంగానీ తప్పవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s