పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల భారీ ఓటమి


1977 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన వామపక్ష కూటమి ఎల్.డి.ఎఫ్ 2011 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యింది. కేరళలో మాత్రం కొద్దిలో అధికారానికి దూరమయ్యింది. ముఠా తగాదాలను అధిగమించినట్లయితే కేరళలో అధికారం నిలిచేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు పార్లమెంటరీ రాజకీయాలు చేపట్టడంతోటే కమ్యూనిస్టు సిద్ధాంతాలనుండి వైదొలిగాయని భారత దేశంలోని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు ఎప్పటినుండో వాదిస్తూ వచ్చాయి. 1968 లో సి.పి.ఎం పార్టీ నయా రివిజనిజాన్ని చేపట్టిందని నిర్ణయించుకున్న అనేక మంది మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీల పేరుతో ఎక్కడికక్కడ విడిపోయి బైటికి వచ్చారు. వాటిలో కొన్ని అదృశ్యం కాగా దక్షిణ భారత దేశంలో అవి ఇంకా సజీవంగా ఉన్నాయి.

మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలుగా విడిపోయిన విప్లవ పార్టీలు పార్లమెంటరీ మార్గాన్ని తిరస్కరించగా, సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు మాత్రం కేరళ, బెంగాల్ ల మార్గమే తమ మార్గమంటూ పార్లమెంటు ఎన్నికల్లొ పోటీచేయడం ద్వారా కూడా సోషలిస్టు వ్యవస్ధను తీసుకురావచ్చని వాదించి పార్లమెంటు పంధాను ప్రధాన పంధాగా ఎంచుకున్నారు. ఆ దృక్పధంతోనే పశ్చిమ బెంగాల్ లో ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ గా ఏర్పడి 1977 నుండి వరుసగా గెలుస్తూ వచ్చారు. ప్రారంభంలో భూసంస్కరణలను కొంతమేరకు అమలు జరిపారు. కౌలురైతుల సమస్యలను పట్టించుకుని పనిచేశారు. రైతులు, కూలీలు, కార్మీకుల ప్రతినిధిగా వారి అభిమానంతో ఇన్నాళ్ళూ బెంగాల్ లో అధీకరం చెలాయించారు.

అయితే వామపక్ష కూటమి భూసంస్కరణలను చివరివరకూ కొనసాగించడంలో విఫలమయింది. ప్రారంభంలో చూపిన చిత్తశుద్ధి క్రమంగా పలచబడింది. పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండే అవలక్షణాలనన్నింటినీ అలవరుచుకుని ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ పోరాట పార్టీలకు ఛాంపియన్ గా చెప్పుకుంటాయో, బెంగాల్, కేరళలలో అవే విధానాలను అనుసరిస్తూ వచ్చాయి. పెద్ద శత్రువుకు వ్యతిరేకంగా చిన్న శత్రువుతో కలవచ్చు అన్న సూత్రాన్ని యాంత్రికంగా అమలు చేస్తూ భూస్వామ్య, పెట్టుబడిదారీ పార్టీలన్నింటితో ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకుని పని చేశాయి. అదే సూత్రాన్ని ఎన్నికల్లో గూడ అమలు చేసి ఎన్నిల పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు గెలుచుకుంటూ వచ్చాయి.

భారత దేశంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని తమ ప్రధాన శత్రువుగా గుర్తిస్తాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలలో అంకురించిన ప్రాంతీయ పార్టీలతో జత కట్టి పోరాటాలు నిర్వహించాయి. ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలు పొత్తుపెట్టుకుని కొన్ని చోట్ల అధికారంలో భాగం పంచుకున్నాయి. విమర్శనాక మద్దతు, అంశాలవారీ మద్దతు లాంటి పదబంధాలతో మంత్రిపదవులు చేపట్టకపోయినా అధికార పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఫలితంగా అందుబాటులో ఉండే సానుకూలతలను వినియోగించుకుని పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నించాయి. గెలిచినపుడు సంబరాలు జరుపుకోవడం, ఓడిపోయినపుడో, తక్కువ సీట్లు వచ్చినపుడో “గెలుపు, ఓటములతో మాకు నిమిత్తం లేదు. ప్రజల సమస్యల కోసం ప్రజా పోరాటాలు నిర్మించడమే మా లక్ష్యం” అంటూ కబుర్లు చెప్పేవారు. అలాగని ఎన్నికల కోసం, ఎన్నికల దృక్పధం తో పని చేయడం ఏనాడూ మానలేదు.

పార్లమెంటరీ రాజకీయాలు డబ్బు, కులం, అవినీతి లతో ముడిపడి ఉన్న బురదగుంట. వామపక్ష సిద్ధాంతాలు చెప్పేవారికి అదొక ఊబి. వర్గ ప్రయోజనాలు మారిపోయాక, కార్మిక వర్గ రాజకీయాలకు కట్టుబడి ఉండడం వీలయ్యే పని కాదు. అవసరమైతే సాయుధ పోరాటం చేయాలని రాసుకుంటారే గానీ, దాని గురించి ఏనాడూ వివరించిన పాపాన పోలేదు. 1947 ఆగస్టు 15 నాడు వచ్చింది నామ మాత్రపు స్వాతంత్రమేనని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు చెబుతుండగా అది ఆర్ధిక స్వాతంత్ర్యం కాదనీ, రాజకీయ స్వాతంత్ర్యమనీ సి.పి.ఐ, సి.పి.ఎం లు వాదించాయి. అయితే గాట్ విధానాలకూ, నూతన ఆర్ధిక విధానాలకూ వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినప్పుడు “మరో స్వాతంత్ర్య పోరాటం” అని నినాదాలు అవి ఇచ్చాయి. ఒకసారి వచ్చిన స్వతంత్రం కోల్పోవడం వలన మరో స్వాతంత్ర్య పోరాటమా, లేక అసలు స్వాతంత్ర్యం రాకపోవడం వలన మరో పోరాటమా అన్నది అప్పట్లో ప్రశ్నలు వచ్చాయి.

నూతన అర్ధిక విధానాలు, సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ తదితర విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు చేసిన ఆందోళనలు, నిరసనలు ప్రజల్లో కొద్దో గోప్పో రాజకీయ చైతన్యం ఉన్నవారిని ఆకట్టుకోలేకపోయాయి. తాము అధికారంలో ఉన్న బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ,  అధికారంలో లేని చోట ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామని చెప్పుకొవడాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేక పోయారు. అడిగినవారికి వితండ వాదంతో సమాధానాలు చెప్పడం తప్ప తమ ద్వంద్వ విధానాలను విడిచి పెట్టడానికి ఏ నాడూ ప్రయత్నించ లేదు. నూతన ఆర్ధిక విధానాలను వ్యతిరేకించడంలో వీరి నిజాయితీ ఎప్పుడూ ప్రశ్నగానె నిలిచింది. బెంగాల్ నూతన పారిశ్రామిక విధానం పేరిట వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడానికి కృషి చేయకుండానే, వ్యవసాయం రంగం అభివృద్ధి చెందింది, ఇక పరిశ్రమల అభివృద్దే మిగిలింది అన్నట్లుగా స్వదేశీ, విదేశీ ప్రవేటు పరిశ్రమలకు అన్ని రాష్ట్రాలకంటే ముందుగా ఆహ్వానం పలికారు.

ముఖ్యంగా రైతుల వ్యవసాయ భూములను, సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్ని కూడా టాటా కారు పరిశ్రమ కోసం సింగూరులో బలవంతంగా లాక్కున్న తీరు దేశంలోని బూర్జువా ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే పశ్చిమ బెంగాల్ లోని వామపక్ష ప్రభుత్వం స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టాన్ని తెచ్చిన సంగతి గమనార్హం. సెజ్ పేరుతో సింగూరు, నందిగ్రామ్ లలో రైతుల భూములను లాక్కున్న తీరు, తిరగబడిన రైతులపై క్రూర నిర్బంధం అమలు జరిపిన తీరు, పార్టీ కార్యకర్తలకు తుపాకులిచ్చి నిరసనలు తెలిపిన నందిగ్రాం ప్రజలను కాల్చి చంపిన తీరు… ఈ దేశంలో నిర్బంధ విధానాల అమలులో ఒక ఒరవడికి వామపక్షాలు అద్యులుగా నిలిచాయని చెప్పక తప్పదు. సి.పి.ఎం పార్టీ ప్రజా సంఘాలకు, ముఖ్యంగా విద్యర్ధి సంఘానికి చెందిన కార్యకర్తలు ఇతర పార్టీల ప్రజా సంఘాల వారు ఆందోళనలు జరుపుతున్నపుడు స్వయంగా నిర్బంధ చర్యలకు పూనుకోవడం నిస్సందేహంగా వారికే సాధ్యమైన ఒరవడి.

భారత దేశపు సో కాల్డ్ వామపక్షాలు ఎన్నుకున్న పార్లమెంటరీ పంధా అనివార్యంగా వారి ఇప్పటి స్ధితికి నెట్టివేస్తుంది. అధికారం కోసం బూర్జువా పార్టీలతో పోటీపడి తామే పాలక పార్టీలుగా పరిణామం చెందిన విధానం పార్లమెంటరీ విధానపు అసలు రంగుని తేటతెల్లం చేసింది. ఫలితమే నేటి ఓటమి. మళ్ళీ అయిదు సంవత్సరాలకి ఈ వామ పక్షాలు అధికారంలోకి రావచ్చు. మళ్ళీ అధికార వైభవం పొందవచ్చు. కానీ వారికి మళ్లీ వచ్చేది పార్లమెంటరీ వైభవమే గాని వామ పక్ష సిద్ధాంతాల వైభవం కాదు. వారు ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి ప్రజల అభిమానం సంపాదించుకున్నా, ఆ అభిమానాన్ని మళ్ళీ పార్లమెంటరీ వధ్య శిలపై బలి ఇవ్వడానికే నని ప్రజలు తెలుసుకుంటున్నారు. పాలక వర్గ పార్టీలపై ప్రజలు పెంచుకుంటున్న ఏవగింపు వారిపైన కూడా ప్రసరించీన సంగతి బెంగాల్, కేరళల ఓటమిలతో స్పష్టమయ్యింది. వారి ఎర్ర జెండా పార్లమెంటరీ బురదలో పొర్లీ పొర్లీ తన వాస్తవ రంగును కోల్పోయింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలపై వారికి ఏమాత్రం గౌరవం ఉన్నా తమ పార్టీల పేరులో ఉన్న కమ్యూనిస్టు అన్న పదాన్ని తొలగిస్తారు. ఒకప్పటి యూరప్ కమ్యూనిస్టు పార్టీలు పేరు మార్చుకున్నట్లుగానే సోషల డెమొక్రట పార్టీలుగా తమ పార్టీల పేర్లూ మార్చుకుంటే కమ్యూనిజం పరువూ దక్కుతుంది, తమ పరువూ దక్కుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s