ఇరాక్‌పై దాడికోసమే అబద్ధాలతో రిపోర్టు తయారు చేశాం -ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి


Chilkot inquiry

Chilkot inquiry

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” కలిగి ఉన్నాడనీ, వాటివలన ఇంగ్లండు భద్రతకు ముప్పు అనీ నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదిక (డొసియర్) వాస్తవాలపై ఆధారపడిన నివేదిక కాదనీ, తమకు వచ్చిన ఆదేశాల మేరకు ఇరాక్‌పై దాడిని అనివార్యం చేస్తూ లేని సాక్ష్యాలతో తయారు చేశామనీ నివేదిక రచయితల్లో ఒకరైన బ్రిటన్ ఇంటలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. సెప్టెంబరు 2002 తయారు చేయబడిన ఈ నివేదిక, మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రతినిధి ‘ఆల్‌స్టెయిర్ కేంప్‌బెల్’ గత సంవత్సరం చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ, ఆ నివేదిక దాడికోసం తయారు చేసిన నివేదిక కాదని, ఇరాక్ మారణాయుధాల పట్ల ఇంగ్లండ్‌కి ఉన్న భయాలు నిరూపించడానికి తయారు చేసిందని చెప్పడాన్ని ఇంటలిజెజ్స్ అధికారి మైఖేల్ లారీ తిరస్కరించాడు.

ఇరాక్‌పై దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేయడానికి 18 మాసాల క్రితం బ్రిటన్ ప్రభుత్వం సర్ జాన్ చిల్కాట్ ఆధ్వర్యంలో కమిషన్ నియమించింది. ఈ కమిషన్‌కి చట్టబద్దత లేదు. ఇంగ్లండు ప్రజల ఒత్తిడి మేరకు చట్టబద్ధ అధికారాలు లేని కమిషన్‌ను లేబర్ పార్టీ నాయకత్వంలోని గత ప్రభుత్వం నియమించింది. అప్పటినుండి కమిషన్ జరుపుతున్న విచారణలో ఇప్పటివరకూ వందకు పైగా సాక్ష్యాలను, నివేదికలను సేకరించింది. ఇరాక్ యుద్ధానికి ఇంటలిజేన్స్ విభాగం చెప్పిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని ఇప్పటికే గత ప్రభుత్వంలో పని చేసిన వివిధ అధికారులు చెప్పిన సాక్ష్యాల ద్వారా వెల్లడయ్యింది. అయినా రాజకీయ నాయకులు, వారి ప్రతినిధులు తమ అబద్ధాలను కొనసాగించారు. మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రతినిధి చెప్పిన సాక్ష్యంతో మైఖేల్ లారి విభేధించడం తాజా సంచలనం. మైఖేల్ లారి ఇంటలిజెన్స్ అధికారిగా ఇరాక్ యుద్ధానికి జరిగిన ఏర్పాట్లలో చురుకుగా పనిచేశాడు. గత సంవత్సరం ఆల్‌స్టెయిర్ ఇచ్చిన సాక్ష్యంతో విభేదిస్తూ లారీ కమిషన్‌కు జనవరి 2010 లో లేఖ రాశాడు.

ఇరాక్‌లో ఉన్నాయని భావించీన సామూహిక విధ్వంసక మారణాయుధాలపై తయారు చేసిన నివేదిక వెనక ఉన్న ఉద్దేశ్యంపై కేంప్‌బెల్ ఇచ్చిన వివరణను లారి తిరస్కరించాడు. 1997 నుండి 2003 వరకూ, నెం. 10 లో కమ్యూనికేషన్ విభాగానికి డైరెక్టర్‌గా పని చేసిన లారీ ఇరాక్ నివేదిక తయారిలో కీలక పాత్ర నిర్వహించాడు. సద్దాం ఆదేశం ఇచ్చిన 45 నిమిషాల్లో ఇరాక్‌లో ఉన్న మారణాయుధాలను ఉపయోగించే సదుపాయం ఉందని ఆ నివేదికలో పొందుపరిచారు. కేంప్‌బెల్ ఇచ్చిన సాక్ష్యంలో లారీ తాము ఇచ్చిన నివేదికలోని ప్రతి పదాన్నీ సమర్ధించుకున్నాడనీ, అప్పటి ఇరాక్‌కి సంబంధించి ఏ విధంగానూ అవాస్తవాలు రాయలేదని చెప్పాడనీ చెప్పాడు. నివేదిక చాలా జాగ్రత్తగా నిర్ధారణలకు వచ్చిందనీ, ఇరాక్‌పై దాడికి దిగేందుకు తయారు చేసింది కాదనీ, ప్రధాని టోనీ బ్లెయిర్ ఇరాక్ నుండి ఎదురుకానున్న భయాలపై ఎందుకు ఆందోళన చెందుతున్నదీ నిరూపించడానికే తయారు చేసారనీ కేంప్‌బెల్ తన సాక్ష్యంలో బల్లగుద్ది చెప్పాడు.

రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్న నిర్ధారణా టీములకి ఇరాక్‌పై గూఢచర్య సమాచారాలను అందించడానికి బాధ్యుడైన మైఖేల్ లారీ కేంప్‌బెల్ ఇచ్చిన సాక్ష్యాన్ని తిరస్కరించాడు. “విచారణా కమిషన్ ముందు కేంప్‌బెల్, నివేదిక ఉద్దేశ్యం ఇరాక్‌పై దాడికి తగిన (అబద్ధపు) సాక్ష్యాధారాలను తయారు చేయడానికి కాదని సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ నివేదిక సరిగ్గా ఆ లక్ష్యం కోసమే తయారు చేసిందనడంలో నాకెలాంటి అనుమానమూ లేదు. సరిగ్గా ఆ పదాలనే అప్పుడూ వాడారు” అని లారీ తన లేఖలో రాశాడు. “అప్పటికి అందుబాటులో ఉన్న గూఢచర్య సమాచారం ఏం చెబుతుందో ఆ నిర్ధారణకే వచ్చి, ఆ నిర్ధారణలపై అధారపడుతూ ఆ నివేదికను తయారు చేయలేదు. దానికి బదులు నివేదికను కేవలం “ఇరాక్ పై దాడి చేయడం” అనే లక్ష్యానికి వీలుగానే తయారు చేస్తున్నామని మాకు పూర్తిగా అవగాహన ఉంది. అంతే కాకుండా అప్పటికి ఆరు నెలల క్రితం ఇవే కారణాలకోసం సమర్పించీన నివేదికను తిరస్కరించారు. ఎందుకంటే ఇరాక్‌పై దాడి చేయడానికి తగినంత బలమైన కారణాలను చూపడంలో విఫలమైనందున తిరస్కరించారు. ఆ మొదటి నివేదికను తిరస్కరించినప్పటినుండీ సెప్టెంబరు వరకూ ఇరాక్‌పై దాడికి తగిన గూఢచర్య సమాచారాన్ని తయారు చేయాలని తీవ్రమైన ఒత్తిడిని మేము ఎదుర్కొన్నాము” అని లారీ తన లేఖలో రాశాడు.

Alstair Campbell giving evidence

పచ్చి అబద్ధాలకోరు ఆల్‌స్టెయిర్ కేంప్‌బెల్

ఇరాక్‌లోని ప్రతి అంగుళాన్ని పరిశీలించి, పరిశోధించి నివేదిక తయారు చేశామని చెప్పినప్పటికీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని లారి తన లేఖలో వివరించాడు. “వాస్తవానికి గూఢచర్య నిపుణులకు ఇరాక్‌లో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యంగా విమానాలు గాని, మిస్సైళ్ళు గానీ, మారణాయుధాలకు సంబంధించిన పరికరాలు గానీ ఏమీ దొరకలేదు” అని లారి వివరించాడు. దాంతో పాటు నివేదిక తయారు చేసి సంతకాలు చేసి సమర్పించడానికి భాధ్యురాలైన ‘జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ’ కి, నివేదిక తయారు చేస్తుండగా అనేక ఒత్తిడులూ, ఆదేశాలూ వచ్చాయని లారీ తన లేఖలో వెల్లడించాడు. “అంతిమ నివేదికలో నిజాలుగా చెప్పబడిన ప్రతి అంశమూ వాస్తవానికి ఇరాక్ పై దాడికి అనుకూలమైన కేసు తయారు చేయడం కోసం మేనేజ్ చేయబడినదే. అందుబాటులో ఉన్న గూఢచర్య సమాచారం ద్వారా వాస్తవంగా వ్యక్తమయ్యే నిర్ధారణలకూ, తయారు చేయబడిన నివేదికలో పొందుపరచబడిన నిర్ధారణలకూ అసలు సంబంధమే లేదు. అవి పూర్తిగా మేనేన్ చేయపడిన నిర్ధారణలు” అని లారి తన లేఖలో తేల్చాడు.

నివేదికకు అప్పటి ప్రధాని బ్లెయిర్ ముందుమాట రాశాడు. దానిలో “ఇరాక్ లో రసాయన ఆయుధాలు తయారు చేయడం కొనసాగుతున్నదన్న విషయాన్ని గూఢచార విభాగం అనుమానం లేకుండా నిరూపించింది” అని రాశాడు. ఈ ముందుమాటను కూడా కేంప్‌బెల్ రాశాడని బిబిసి చెబుతోంది. ఆయన రాశాక బ్లెయిర్ చదివి ఆమోదించి సంతకం చేశాడు. “గూఢచర్య విభాగంలో ఎవరూ ఈ నివేదికను సవాలు చేయలేదు” అని రాశారు. అయితే నివేదికలో “ఆదేశం అందిన 45 నిమిషాల్లొ మారణాయుధం ప్రయోగించగల సామర్ధ్యం ఉంది” అని రాసిన భాగాన్ని ఇంగ్లండ్ ఇరాక్ యుద్ధం తర్వాత ఉపసంహరించుకుంది. ఆ విషయంలో నివేదిక మరింత స్పష్టంగా ఉండేందుకు అవకాశం ఉందని ఆ తర్వాత కేంప్‌బెల్ సవరించుకున్నాడు.

దొంగ సాక్ష్యాలు, అబద్ధపు నివేదికలు, మేనేజ్ చేయబడిన డొసియర్లు తయారు చేయమని గూఢచర్య విభాగానికి బ్రిటన్ ప్రధాని బ్లెయిర్ స్వయంగా అదేశాలు జారిచేశాడని స్పష్టమవుతోంది. ఇరాక్ లో అంగుళం అంగుళం వెతికినా ఏ మారణాయుధమూ దొరకలేదని గూఢచారులు తేల్చినా, ఇరాక్‌పై దాడి చేయాలంటే మారణాయుధాలు దొరికాయని చెప్పక తప్పదని నిర్ధారించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం తమ గూఢచారుల చేత తప్పుడు నివేదికలు తయారు చేయించుకుందని నిర్ద్వంద్వంగా తేలింది. ప్రజాస్వామిక వ్యవస్ధ ఉందని చెప్పుకుంటున్న బ్రిటన్, అమెరికాలు ఒక స్వతంత్ర దేశంపై దాడి చేయడం కోసమే అబద్ధాలు సృష్టించి దుర్మార్గంగా ఇరాక్ పై దాడులు చేశాయి. అయిదేళ్ళపాటు ఇరాక్ లో మారణహోమం సృష్టించాయి. అక్కడి సామాజిక వ్యవస్ధను ఛిద్రం చేశాయి. షియాలు, సున్నీలు, కుర్దులు తదితర జాతులు, మతాల మధ్య విధ్వేషాలు సృష్టించి ఇరాక్ దేశాన్ని మధ్య యుగాల్లోకి నెట్టివేశాయి. సద్దాం హుస్సేన్ పాలనలో ప్రజలు కడుపునిండా తిన్నారు. కొరుకున్న చదువులు చదివారు. మత మౌడ్యంతో నిండి ఉన్న దేశాల నడుమ ఉంటూ కూడ అత్యధిక స్ధాయిలో స్త్రీల అక్షరాస్యతను సాధించారు. తమ ఆయిల్ నిల్వలని వినియోగించుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకున్న ఇరాక్ ఇప్పుడు అన్ని దురవస్ధలకూ నిలయం. ప్రజాస్వామిక వ్యవస్ధను స్ధాపిస్తానని దొంగ కబుర్లు చెప్పి ఉన్న వ్యవస్ధను సర్వనాశనం చేశారు.

అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు అబద్ధాలు చెబుతాయనీ, పరాయి దేశాలని కబళించడానికి ఎంతకైనా దిగజారతాయని అనేక సార్లు రుజువైనా నమ్మడానికి కొంతమంది సిద్ధంగా లేరు. స్వార్ధ ప్రయోజనాల కోసం దురాక్రమణ దాడులు చేస్తున్న దేశాలను పరాక్రమ దేశాలుగా కొనియాడుతున్న బుద్ధి జీవులు వాస్తవాలు గ్రహించి కళ్ళు తెరవాలి. లాడెన్ చుట్టూ అల్లిన భయంకర కధలని నమ్మి కధలు తయారు చేసిన వారిని హీరోలుగానూ, అటువంటి హీరోల దుర్మార్గాలకు బలైన వారిని రాక్షసులుగానూ నమ్ముతున్నవారు వారి నమ్మకాలకు విరుద్ధమైన వాస్తవాలు ఉనికిలో ఉన్నాయని గ్రహించాలి. వాస్తవాలను చూడడానికి సిద్ధంగా ఉన్నపుడే అవి కనపడతాయి. అబద్ధాలని నమ్మి వాటికి విరుద్ధమైన ప్రతిదీ అబద్ధమేనని నమ్ముతామంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎదురు చూడటం తప్ప!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s