లాడెన్ హత్య చట్టబద్ధమేనని నిరూపించుకోవడానికి అమెరికా తంటాలు


నిరాయుధుడుగా ఉన్న లాడెన్‌ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని ఎరిక్ హోల్డర్ బిబిసి తో మాట్లాడుతూ నమ్మబలికాడు. మా మనసుల్లో దాడిలో పాల్గొన్ననేవీ సీల్స్ రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నదనీ తెలిపాడు. అయితే అమెరికన్ కమేండోలపై లాడేన్ దాడికి దిగినట్లుగా అమెరికా ప్రకటించలేదు. పైగా నిరాయుధుడుగా లడేన్ ఉన్నాడని కూడా చెప్పించి. మరి కమెండోల రక్షణకు ప్రమాదం ఎలా ఏర్పడిందొ ఎరిక్ వివరించలేదు. బహుళా అది వివరించే కధ భవిష్యత్తులో వెలువడవచ్చు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో పాకిస్ధాన్ లో లాడెన్ హత్యకు నిరసనగా గురువారం పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అబ్బొత్తాబాద్ లో వందలమంది ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శకులు “అమెరికా, వెళ్ళిపో”, “ఒబామా డౌన్ డౌన్”, జర్దారీ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. అమెరికా కమెండోల దాడిపై పూర్తి న్యాయ విచారణ జరగాలని నవాజ్ డిమాండ్ చేశాడు. లాడెన్ నుండి లొంగిపోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలేవీ లేకపోవడంతోనే కమెండోలు కాల్చారని ఎరిక్ కొత్త సూత్రాన్ని చెబుతున్నాడు. ఎదుటివారి వద్ద తుపాకి ఉన్నపుడు సైతం మొదట లొంగిపోవాలని హెచ్చరించి, అవతలి వైపునుండి కాల్పులు జరిగాకే ప్రభుత్వ కమెండోలు ఎదురుకాల్పులు జరపడం ఆనవాయితీ. ఏ దేశంలో నైనా, ముఖ్యంగా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని గప్పాలు చెప్పుకునే అమెరికాలో కూడా ఇది ప్రాధమిక సూత్రం. ఇపుడు కొత్తగా ఎరిక్ హోల్డర్, లాడేన్ నుండి లొంగిపోతున్నట్లు సంకేతాలు లేకనే కాల్చామని కొత్త సూత్రం వల్లిస్తున్నాడు. మేం అనుకున్నదే సూత్రం అని చెబితే బహుశా సరిపోతుందేమో!

“సంభావ్యత (పాజిబులిటీ) ఉన్నట్లయితే, అక్కడ లొంగుబాటుకు అంగీకారయోగ్యమైన (ఫీజిబుల్) సంభావ్యత ఉన్నట్లయితే, అది (లొంగుబాటు) జరిగి ఉండేది” అని ఎరిక్ అన్నాడు. “కానీ రక్షణ, ఆ కాంపౌండ్ లోకి వెళ్ళిన బలగాల రక్షణ, మా మనసుల్లో అత్యంత ప్రాధాన్యత గలదిగా నేను భావిస్తున్నాను” అన్నాడాయన. అమెరికా అటార్నీ జనరల్ అటూ, ఇటూ గెంతడాన్ని ఇక్కడ గమనించవచ్చు. లొంగు బాటుకు సంకేతాలు కావాలట. ఆ సంకేతాలు కూడా మామూలుగా కాకుండా అమెరికా కమెండోలకు అంగీకారయోగ్యంగా ఉండాలట. అదేమి యోగ్యత? లొంగుబాటు అనేది ఏ దేశపు దృష్టిలోనైనా ఒక విధంగానే ఉంటుంది. అది అమెరికా కమెండో అయినా, యూరప్ కమెండో అయినా, ఇండియా కమెండో అయినా లొంగిపోతున్నామని చెప్పే సంకేతాలు ఒక విధంగానే చూస్తారు. ఒక వేళ మోసపు సంకేతం అయితే అది కూడా అందరికీ ఒకేలా ఉంటుంది. అమెరికా ప్రత్యేక దళాలకు మాత్రం లొంగుబాటు సంకేతాలు కూడా ప్రత్యేకంగానే ఉండాలనడం ఏంటి, విడ్డూరం కాకపోతే?

ఆపరేషన్ చట్టబద్ధమేనని చెబుతూ ఎరిక్ శతృ కమేండర్లను చంపడానికి అంతర్జాతీయ చట్టాలు అనుమతిస్తాయని మరో సూత్రం వల్లిస్తున్నాడు. సైన్యాలు పరస్పరం మొహరించి ఉన్నపుడు ఉండే సూత్రం తెచ్చి ఏకపక్ష దాడి విషయంలో అన్వయించాలని ప్రయత్నించడం ద్వారా లాడేన్ హత్య చట్ట బద్దం కాదని పరోక్షంగా అంగీకరించడమే. పైగా లాడెన్ నిరాయుధుడు. అతని కదలికలను బట్టి ప్రమాదకరంగా కదులుతున్నాడని భావించి చంపేశారని అమెరికా మిలట్రీ అధికారులు స్పష్టంగా ప్రకటించారు. అపరేషనేమో “పట్టుకోండి, వీలుకాకుంటే చంపేయండి” అనే ఆపరేషన్ అని కూడా చెబుతున్నారు గదా? ఆయుధం లేనివాడు ఎక్కడో కవర్ కోసం ప్రయత్నించడం సహజం. అది కూడా లాడెన్ చేసినట్లుగా అమెరికా చెప్పలేదు. కమెండోల రక్షణకు ప్రమాదం ఎదురైనట్లు కూడా చెప్పలేదు. అయితే ఎందుకు కాల్చి చంపినట్లు?

“నిజానికి నేనేమనుకుంటున్నానంటే, ‘ఐ’ కి చుక్కలు పెట్టడంలో, ‘టి’ కి అడ్డగీత పెట్టడంలో అమెరికా, మా మిత్రులైన బ్రిటన్ తదితర దేశాలను, మేము పోరాడుతున్న వారినుండి వేరుపరుస్తుందని” అని ఎరిక్ అంటున్నాడు. ఆ మాటకొస్తే వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య ఆ విషయంలో తేడాలుండడం సహజం. ఆ తేడాను బట్టి యుద్ద సూత్రాల్లో తేడాలుంటాయని చెప్పడం సమర్ధన కోసమే. అసలు అటువంటి తేడాల వలన పొరబాట్లు జరగకుండా ఉండటానికే కదా అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటు చేసుకుంది? తేడాలు జరగకుండా ఉండటానికి రూపొందించుకున్న చట్టాలను నగ్నంగా, అడ్డంగా ఉల్లంఘించింది కాక, ఆ తేడాల్నే సాకులుగా చూపడం ఒక్క అమెరికా, దాని మితృలకే చెల్లుతుంది. అటువంటి సూత్రాలేవీ ఇతర బలహీన దేశాలకు వర్తింపజేయడంలో మాత్రం నిజాయితీ వీరికి ఏ కోశానా ఉండదు. తమ పెత్తనం, అంతర్జాతీయ రౌడీయిజం తో దేశాలను కబళించే ప్రపంచ పోలీసు అమెరికా చట్టబద్దత పై పాఠాలు చెప్పడమే విచిత్రం.

“మేము చట్టబద్ధ సూత్రాలను గౌరవిస్తాం. మా ప్రవర్తన సరిగా ఉండటానికి, మావాళ్ళు కూడా సరిగా ప్రవర్తించడానికి  కొన్ని పద్దతులున్నాయి. అమెరికా, బ్రిటిష్ విలువలకు అనుగుణమైన పద్ధతుల్లోనే ఆ నేవీ సీల్స్ ప్రవర్తించారనీ నేను భావిస్తున్నాను” ఎరిక్ హోల్డర్ అసలు గుట్టు విప్పాడు. అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. కానీ అమెరికా, బ్రిటిష్ విలువలకు అనుగుణమైన చట్టాలు లేదా పద్దతులు వేరే ఉంటాయి. వాళ్ళు పాటించేది తమ విలువలకు అనుగుణమైన పద్దతులే తప్ప అంతర్జాతీయ చట్టాలు కాదని ఎరిక్ హోల్డర్ సిగ్గు లేకుండా ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకున్నందుకు ఎరిక్‌ని అభినందించవచ్చు. అమెరికా, బ్రిటిష్ అధికారుల్లో చాలా మందికి అలా అందంగా ఒప్పుకోవడం తెలియదు. ఎరిక్ వద్ద వీళ్ళంతా శిక్షణ పొందాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతైనా అటార్నీ జనరల్ కదా! ఇంతకీ ఏంటా అమెరికా, బ్రిటన్ విలువలు? వ్యాపారం పేరుతో వచ్చి తగువులు పెట్టి ఇతర దేశాల్ని వలసల క్రింద మార్చుకోవడం, స్వతంత్రం పేరుతో వెళ్తూ వెళ్తూ మత వైషమ్యాలు పెంచి వెళ్ళడం, ఇతర దేశాల పాలకుల్లో తమకు నచ్చని వారిని ఏదో పేరుపెట్తి చంపేయడం. తమకు లొంగి ఉంటే నియంతలనైనా కాపాడ్డం, లొంగకపోతే మిలట్రీ కుట్రలతో ప్రభుత్వాలని కూల్చడం, తమ రహస్య కుట్రలు బైట పెట్టినందుకు తమ దేశం వాళ్ళైనా బ్రాడ్లీ మేనింగ్ లాంటివారిని అస్సాంజ్ లాంటివారిపై తప్పుడు కేసులు పెట్టమని చిత్రహింసలు పెట్టడం, స్వేఛ్ఛ గొప్పదంటూనే ఇతరులందరి స్వేఛ్ఛని హరించివేయడం, బెదిరించడం, గూండాగిరీ… ఇవీ అమెరికా బ్రిటిష్ వారి విలువలు. ఇవి కొన్నే సుమా. అదిగో ఆ విలువల వెలుగులోనే నిరాయుధుడైన లాడెన్ ని దుర్మార్గంగా కాల్చి చంపగలిగారు. చంపడమే కాక శవం కూడా దొరక్కుండా చేశారు.

మరలాగే ఇండియా, పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్, చైనా లాంటి దేశాలక్కూడా తమ విలువలకు అనుగుణమైన పద్ధతులు ఉంటాయని ఎరిక్ ఒప్పుకుంటాడో లేదో తెలియదు. ఒప్పుకోడన్నది స్పష్టమే. నిన్న గాక మొన్న రేమండ్ డేవిస్ అనే సి.ఐ.ఏ గూఢచారి ఇద్దరు పాక్ పౌరుల్ని ఆత్మ రక్షణ కోసం (!) కాల్చి చంపేశాడు. పాక్ పోలీసులు అతన్ని ఇంటరాగేట్ చేసారని తెలిసి అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇద్దరు పాక్ పౌరుల్ని చంపిన అమెరికన్ హంతకుడిని బేషరతుగా విడుదల చేయాలని సాక్ష్యాత్తు ఒబామాయే ఫోన్ చేశాడు. పాక్ కోర్టు నామమాత్రంగా విచారించడం కూడా అమెరికాకి నచ్చలేదు. ఓ నలభై రోజులు తమ దేశీయుడిని, హంతకుడైనా సరే, జైలు పాలు చేసినందుకు అమెరికా అధికారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కానీ ముంబైలో టెర్రరిస్టులు దాడి చేశి రెండొందలమందిని చంపి నేరం ఒప్పుకున్న హేడ్లీ, రాణాలు అమెరికా జైలులో ఉన్నారు. వీరిని విచారించి శిక్షించడం కేవలం ఇండియా విలువలు మాత్రమే కాదు. అంతర్జాతీయ విలువలు కూడా. కనీసం ఇండియా అధికారులు అమెరికా వెళ్ళి నామమాత్ర విచారణ చేయడానిక్కూడా ఒప్పుకోవడం లేదే!? ఇండియా విలువలు అమెరికాకి అనవసరం. ఇండియా, పాక్, చైనాలే కాదు. అసలు అంతర్జాతీయ విలువలే అవసరం లేదు. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి ఒప్పందంపై సంతకాలు చేయాలని ఇండియా, పాక్ లపై ఒత్తిడి తెచ్చే అమెరికా అంతర్జాతీయ న్యాయ స్ధానం ఏర్పాటులో సంతకం చేయడానికి నిరాకరించింది. అమెరికా ఒప్పుకుంటే అమెరికా అధ్యక్షుడినుండి సాధారణ సైనికుడి వరకు అంతర్జాతీయ న్యాయ స్ధానంలో విచారించాల్సి ఉంటుంది. అమెరికా చేసిన అంతర్జాతియ నేరాలు ప్రపంచంలో మరేదేశమూ చేయలేదు. అందుకే సంతకం చేయనిది.

లాడెన్ కుటుంబ సభ్యులు లాడేన్ ను పట్టుకోవడానికి ప్రయత్నించకుండా ఎందుకు చంపారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్ట్టబద్ధం అని అర్జెంటుగా సమర్ధించుకుంటున్నాడు. తన చిత్తం ప్రకారం లాడేన్ ని చంపడాన్ని అతని భార్య కొడుకులు విమర్శిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా లాడేన్ హత్య చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేయడం నూతన పరిణామం. సమితి ప్రత్యేక అధికారులు క్రిస్టఫ్ హేన్స్, మార్టిన్ షెనిన్ లు తీవ్ర స్ధాయి బలగాలను (డెడ్లీ ఫోర్సెస్) అరుదైన కేసుల్లో మాత్రమే అనుమతించాలని ఒక ప్రకటనలొ పేర్కొన్నారు. అది కూడా చివరి ప్రయత్నంగా మాత్రమే వినియోగించాలని వారు తెలిపారు. “నిబంధనల ప్రకారం టెర్రరిస్టులను నేరస్ధులను చూసినట్లుగానే చూడాల్సి ఉంటుంది. చట్టాల ప్రకారం అరెస్టు చేయాలి. న్యాయస్ధానాల్లో విచారించాలి. న్యాయ సూత్రాల ప్రకారమే శిక్షలు విధించాలి” అని వారు నిర్ధారించారు. ఇవేవీ అమెరికా, దాని మితృలకు పట్టవు. లాడేన్ లాంటి వాడిని విచారించాలా? అని కొంతమంది ప్రశ్నిస్తుండడం అతనిపై పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు చేసిన దుష్ప్రచారమే కారణం. నిజానికి లాడేన్ ప్రోద్బలంతో జరిగిన టెర్రరిస్టు దాడుల్లొ చనిపొయినవారి లెక్క తీస్తే అది పదుల్లోనో, లేక గరిష్టంగా కొద్ది వందల్లోనే ఉంటుంది. ప్రపంచంలో జరిగిన టెర్రరిస్టు దాడులన్నీ కలిపినా ఆ మరణాల కంటే ఎన్నో రేట్ల మరణాలు అమెరికా, దాని మితృలు జరిపిన ఒక్క ఇరాక్ దాడిలోనే జరిపారు. అసలు ఇరాక్ పై యుద్ధవిమానాలు, ట్యాంకులతో దాడి జరగడానికి ముందే ఆ దేశంపై విధించిన ఆంక్షల వలన లక్షలాదిమంది పౌష్టికాహారం లేక, ఆకలి, దరిద్రాలకు గురై చనిపోయారు.

లాడేన్ క్రూరత్వం ఊహించుకుని వాదించేవారికి ఇవన్నీ చావులుగా కనపడవు. లాడేన్ వలన అమెరికా దాడి జరిపిందంటారే గాని, అమెరికా ఆంక్షలు, దురాక్రమణ దాడులకు ప్రతిఘటనగానే టెర్రరిజం పుట్టి కొనసాగుతున్న విషయాన్ని చూడరు. అసలు ఏదేశమైనా ఇతర దేశంపై ఏక పక్షంగా, ఏ కారణం చూపైనా దాడి చేయడం చట్ట విరుద్ధమన్న సంగతే వారికి పట్టదు. టెర్రరిజాన్ని చూపి దురాక్రమణ దాడికి సమర్ధనే తప్ప, రౌడీ దాడులకు పరిష్కారం ఆలోచించరు. శతాబ్దాల పాటు ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమన దాడులు జరిగాయి. ఫలితంగా స్ధిరమైన ప్రభుత్వాలు లేక అన్ని రంగాల్లో వెనకబడి ఏ నాడూ అభివృద్ధి గురించి ఆలోచించే తీరికే వారికి ఇవ్వలేదు. అటువంటి దేశంపై అత్యాధునిక ఆయుధాలతొ విరుచుకుపడి, అదీ ఒక వ్యక్తి కోసం బాంబులేసి చంపుతుంటే ఇదేం న్యాయం అని అడగడం మాని ముస్లింల మతతత్వమో, వారి మత సూత్రాలో తలుచుకుని వారిపై దాడి చేయాల్సిందే అని సమర్ధించేవారికి కనీస ప్రజాస్వామిక విలువల పట్ల గౌరవం లేదనే భావించాలి. పత్రికల్లో వచ్చే వార్తల్లో నిజానిజాల గురించి కనీసం ఆలోచించాలి. అవి జరగడానికి గల అవకాశాలను పరిశీలించాలి. ఆ తర్వాత మాత్రమే నిజాలను నిర్ధారించుకోవాలి. అలా జరగనంత కాలం మన మెదళ్ళు ధనికుల అధీనంలోని దుష్ప్రచారాలకు కట్టివేయబడి, ప్రజాస్వామిక సూత్రాలు, విలువలను గౌరవించాలన్న స్పృహను కోల్పోతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s