ఆల్-ఖైదాకు సంకేతాత్మకంగా నాయకత్వం వహిస్తూ వచ్చిన ఒసామా బిన్ లాడెన్ ను చంపేశామని అమెరికా అధ్యక్షుడు విజయ గర్వంతో ప్రకటించుకున్నాడు. హాలివుడ్ సినిమాల్లొ చూపినట్టు బిన్ లాడెన్ స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమేండోలు వెళ్ళడం అక్కడ ఉన్న ముగ్గురు యువకులను (ఒకరు లాడెన్ తనయుడుగా భావిస్తున్నారు) రక్తపు మడుగులో మునిగేలా కాల్చి చంపడం, బిన్ లాడెన్ తో ఉన్న అతని భార్యను మోకాలిపై కాల్చి అనంతరం లాడెన్ కంటిలోనా, గుండెపైనా కాల్చి చంపడం… వీటన్నింటినీ అమెరికా అధ్యక్షుడు తెరపై చూశాడని పత్రికలు తెలిపాయి.
అయితే, ఇప్పుడు బిన్ లాడెన్ హత్య అతను నాయకత్వం వహిస్తున్న ఆల్-ఖైదా సంస్ధపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నను దాదాపు అన్ని వార్తా సంస్ధలు వేసుకుని జవాబులు చెప్పాయి. లాడెన్ హత్యతో ఆల్-ఖైదా క్రమంగా అంతరించిపోవడం ఖాయమని దాదాపు మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాడెన్ చనిపోయాడు గనక అమెరికా ఇక ఆఫ్ఘనిస్ధాన్ లో తన తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలని కొంతమంది కోరారు. లాడెన్ హత్యతో టెర్రరిజంపై పోరాటం పూర్తికాలేదనీ ఇంకా చేయవలసింది చాలా (మందిని చంపాల్సి) ఉందనీ ఒబామా ఉపన్యాసాలు గుప్పించాడు.
కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళితే అమెరికాకి చెందిన మిలట్రీ, సి.ఐ.ఏ తో పాటు పలు ఇతర భధ్రతా సంస్ధలు ఆల్-ఖైదాలో వచ్చిన మార్పులను గూర్చి చెప్పిన విషయాలు మననం చేసుకోవచ్చు. ఆల్-ఖైదా ఇక ఏ మాత్రం ఒకే కేంద్రం నుండి ఆదేశాలు అందుకుంటూ పనిచేసే సంస్ధగా లేదని అవి విశ్లేషించుకున్నాయి. ప్రపంచంలో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలన్నింటిలోనూ ఆల్-ఖైదా చిన్న చిన్న గ్రూపులుగా విస్తరించి ఉందనీ, అధికారాలను విస్ట్రుతంగా వికేంద్రీకరించబడిన పరిస్ధితిలో ఉందనీ ఆ సంస్ధలు వివరించాయి. వివిధ ఘర్షణ ప్రాంతాలకు అనుగుణంగా స్ధానికంగా స్వంత నాయకత్వాలను కలిగి ఉన్నదనీ తెలిపాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణమైన కార్యక్రమాలనూ, వ్యూహాలనూ, ఎత్తుగడలనూ రూపొందించుకుని ఈ గ్రూపులు పని చేస్తున్నాయనీ అమెరికా సంస్ధలతో పాటు స్వతంత్ర రక్షణ నిపుణులు సైతం విశ్లేషించారు.
ఒకే వ్యక్తి సింగిల్ సెంట్రల్ కమాండ్ గా పని చేస్తూ అతని ఆదేశానుసారం ఆల్-ఖైదా పని చేయడం లేదన్న సంగతి వివిధ టెర్రరిస్టు చర్యలు సంభవించినపుడు వెలువడిన ప్రకటనలు ధృవీకరించాయి. బిన్ లాడెన్ ఒక సంకేతాత్మక సైద్ధాంతిక నాయకుడుగానే తప్ప వివిధ ఆపరేషన్లు నిర్వహించడానికి కార్యకర్తలకు ఆదేశాలిచ్చే వాడిగా లేడని స్పష్టమయ్యింది. యెమెన్ లో ఎ.క్యు.ఎ.పి (ఆల్-ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా) గా పేరు పెట్టుకుని స్వతంత్ర సంస్ధగానే కార్యక్రమాలు నిర్వహించిన ఉదాహరణలు గత సంవత్సరం జరిగాయి. లెటర్ బాంబులు, గాల్లో ఉండగా ఒక ముస్లిం ఆఫ్రికన్ యువకుడు తన వద్ద ఉన్న బాంబు పేల్చడానికి విఫలయత్నం చేయడం ఇవన్నీ ఎ.క్యు.ఎ.పి ఆద్వర్యంలో జరిగాయి. వీటికి బిన్-లాడెన్ ఆదేశాలు ఉన్నాయన్న సూచనలు ఎక్కడా కనిపించలేదు.
అటువంటి పరిస్ధితుల నేపధ్యంలో బిన్ లాడెన్ మరణం ఆల్-ఖైదాపై ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఒక గ్రూపుకు మరో గ్రూపుకు పెద్దగా సంబంధాలు లేని ఆల్-ఖైదా గ్లోబల్ నెట్ వర్క్ పై లాడెన్ మరణం ప్రభావం చూపడం అసాధ్యం. రెండు ముస్లిం దేశాలపై దురాక్రమణ దాడులు చేసిన అమెరికా విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఎల్లలు ఎరుగని అమెరికా సామ్రాజ్యవాద దౌష్ట్యానికి ఎదురొడ్డిన వ్యక్తిగా లాడెన్ ముస్లిం ప్రపంచంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతని నుండి అమెరికా ఆక్రమణకి వ్యతిరేకంగా టెర్రరిస్టు చర్యలు పాల్పడిన వ్యక్తులు స్ఫూర్తిని పొందారే తప్ప ఆదేశాలు కాదు. నిరాయుధంగా ఉన్న లాడెన్‌ను హత్య చేశామని ఒబామా సగర్వంగా ప్రకటించుకున్నాక లాడెన్ అమర వీరుడుగా ముస్లిం యువతకు మరింత స్యూర్తిని అందించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఆల్-ఖైదాకి సంబంధించినంత వరకూ లాడెన్ స్ధానాన్ని మరొకరు ఆక్రమిస్దారు తప్ప అమెరికా దురాక్రమణ కొనసాగినన్ని రోజులూ దురాక్రమణకు ప్రతిఘటన కూడా కొనసాగుతూనె ఉంటుంది.