లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?


ban_ki-moon

పశ్చిమ దేశాల ప్రతినిధి బాన్-కి-మూన్

లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది. వారికే సి.ఐ.ఏ చేత అమెరికాలో శిక్షణ ఇప్పించిన అమెరికా అరబ్ దేశాల్లొ ప్రజాస్వామిక సంస్కరణలకోసం ప్రజలు చేస్తున్న ఆందోళనలను అడ్డు పెట్టుకుని వారిని బెంఘాజీలో కృత్రిమ తిరుగుబాటుకు పురమాయించింది.

తమ చేతుల్లో ఉన్న తిరుగుబాటుదారుల సైనికాధికారుల ద్వారా గడ్దాఫీ సైన్యాలు గగనతలం  నుండి బాంబులు వేసి ప్రజల్ని చంపుతున్నాడని ప్రచారం చేయించిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియా పౌరుల రక్షణ పేరుతో నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి సమితిలో తీర్మానం చేయించింది. దీనికి రష్యా, చైనా, ఇండియాలు కూడా పరోక్ష మద్దతును అందించాయి. పౌరుల రక్షణ పేరుతో నాటో దళాలు లిబియా ప్రభుత్వ ఆయుధాగారాల్ని ధ్వంసం చేశాయి. ప్రభుత్వ భవనాలపై బాంబులేసి ధ్వంసం చేశాయి. గడ్దాఫీని చంపడానికి ఆయన నివాస భవనాలపై బాంబులేసి అతని కొడుకును, ముగ్గురు మనవళ్ళను పొట్టనబెట్టుకున్నాయి. గడ్దాఫీని చంపడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

వాస్తవానికి లిబియా ప్రజలు తమ దేశంపై వైమానిక దాడులు చేస్తూ ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తూ, పౌరుల మరణాలకు కారణమవుతున్న పశ్చిమ దేశాల దురాక్రమణ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వారి దాడులకు ఎదురొడ్డుతున్న గడ్డాఫీ ప్రభుత్వం వెనక సమీకృతులై ఉన్నారు. గడ్దాఫీకి మద్దతుగా ప్రజలు నిర్వహించిన ఊరేగింపుల ఫోటోలను కూడా వార్తా సంస్ధలు ప్రచురించాయి. అంతేకాదు. లిబియాపై దాడులు చేయండంటూ పశ్చిమ దేశాల సైన్యాన్ని ఆహ్వానిస్తున్న తిరుగుబాటుదారులను లిబియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం గడ్దాఫీ తెగపై ఉన్న వ్యతిరేకతపైనే ఆధారపడిన కృత్రిమ తిరుగుబాటును ఫ్రాన్సు, ఇటలీలు గుర్తించాయి. లిబియా ప్రభుత్వ సార్వభౌమాధికార స్ధాయిలో లిబియా దేశానికి ఉన్న విదేశీ ఎకౌంట్లను ఇ.యు స్తంభింప జేసింది. లిబియా ప్రభుత్వానికి ఆయుధాలు అందకుండా ఆంక్షలు విధించిన అమెరికా, ఇ.యులు ఆ ఆంక్షలను ఉల్లంఘిస్తూ తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందిస్తున్నాయి.

ఇప్పుడు ఏకంగా బెంఘాజిలో కార్యాలయాన్నే తెరవబోతున్నాయి. ఈ కార్యాలయం ద్వారా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులకు మరింతగా సాయపడ్డానికి వీలవుతుందని ఇ.యు ఆశాభావం వ్యక్తం జేసింది. అంటే గడ్దాఫీని వ్యతిరేకించేది ఎవరైనా వారికి సాయం చేస్తుందన్నమాట. గడ్దాఫీ వ్యతిరేకతే ఇ.యు సాయానికి ప్రాతిపదిక తప్ప లిబియా ప్రజల బాగోగులు కాదు. ఇ.యు పార్లమెంటులో సభ్యులకు సమాధానం ఇస్తూ ఇ.యు విదేశాంగ విధాన ముఖ్య అధికారిణి కేధరిన్ ఏష్టన్ ఈ విషయం ప్రకటించింది. గడ్డాఫీని గద్దె దిగాల్సిందేననీ, అందుకు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనీ ఆవిడ సెలవిచ్చారు. యూరప్ దేశాల్లో సంక్షోభం ఫలితంగా అక్కడ ప్రభుత్వాలన్నీ పొదుపు విధానాల్ని పాటిస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగులకు ఎంతోకొంత సాయంగా ఉన్న సంక్షేమ సదుపాయాలన్నింటిని రద్ధు చేయడమో కోతవిధించడమో చేస్తున్నాయి. ఓవైపు ప్రజలపై పన్నుల భారం మోపుతూ, మరోవైపు ధనికులకు, కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తున్నాయి. డబ్బులేదని ప్రజలపై ఖర్చు తగ్గిస్తున్న ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ దేశాలు లిబియాపై దాడులకు డబ్బు ఎక్కడినుండి వచ్చింది? ఈ దేశాల ప్రభుత్వాలకు లిబియా ప్రజల ప్రయోజనాల సంగతి తర్వాత, తమ ప్రజల ప్రయోజనాలే అవసరం లేదని దీని ద్వారా స్పష్టం అవుతోంది.

లిబియా తూర్పు ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు ద్వారా ఇ.యు తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి ఆర్ధిక సాయం అందిస్తానంటోంది. లిబియా ప్రభుత్వం ఉండగానే ఆదేశంలో ఒక ప్రాంతాన్ని ఆధీనంలో ఉంచుకున్న తిరుగుబాటు కమిటీని గుర్తిస్తూ ఆర్ధిక సాయం చేయడమంటే లిబియా దేశాన్ని రెండు భాగాలుగా గుర్తించడమే. లిబియా ప్రభుత్వ ప్రాంతాల్లో అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తూ, మరో ప్రాంతంలో ఆర్ధిక సహాయానికి పూనుకోవడం స్వతంత్ర దేశమైన లిబియా అంతర్గత విషయాల్లో జోక్య చేసుకోవడంతో సమానం. లిబియా పౌరుల పట్ల మొసలి కనీరు కార్చే సమితి సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు పాల్పడుతున్న ఈ అంతర్జ్జాతీయ నేరాలను చూసీ చూడనట్లు పోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఐక్యరాజ్య సమితి కేవలం పశ్చిమదేశాల ప్రయోజనాలకే తప్ప అన్ని దేశాలకు సమాన న్యాయం అందించే సంస్ధ కాదని మరోసారి రుజువవుతోంది.

5 thoughts on “లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?

  1. వినోద్ గారూ, ధన్యవాదాలు.

    తప్పకుండా కొనసాగిస్తాను, మీలాంటి వారి మద్దతుతో.

  2. మంచి సమాచారమే. మీరే స్వంతంగా రాస్తున్నారా? ఎక్కడినుంచి సేకరించారు అనేది రాస్తే బాగుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s