భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో సమావేశమైనపుడు “మోస్ట్ వాంటేడ్ జాబితా”ను అందజేశాడు. ఆ జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు వెల్లడించారు. బిన్ లాడెన్ ఆరు సంవత్సరాలపాటు పాకిస్ధాన్‌లో రక్షణ పొందటంలో అక్కడి సైన్యం, ఐ.ఎస్.ఐ ల పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తున్న సమయంలో ఈ జాబితా వెల్లడి కావడం గమనార్హం.
166 మంది చనిపోయిన ముంబై దాడి పాకిస్ధాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశాల మేరకే జరిగిందని నిందితులు హేడ్లీ, రాణాలు అమెరికా కోర్టులొ అంగీకరించారు. లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మహమ్మద్ లాంటి తీవ్ర వాద సంస్ధలను పాకిస్ధాన్ పెంచి పోషిస్తూన్నదని భారత ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. వీటిని పాకిస్ధాన్ తిరస్కరించినప్పటికీ భారత ప్రభుత్వం సంబంధిత సాక్ష్యాధారాలతో కూడిన జాబితాను పాక్ కు అందించింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాజాగా బిన్-లాడెన్‌ను హత్య చేశామని అమెరికా ప్రకటించడంతో పాకిస్ధాన్ పై టెర్రరిజం పోషకురాలుగా అన్నివైపులనుండి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపధ్యంలో మోస్ట్ వాంటేడ్ జాబితాలో ఉన్న పాకిస్ధాన్ ఆర్మీ అధికారుల పేర్లు వెల్లడయ్యాయి.
పాక్ సైన్యంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఐదుగురు అధికారులతో పాటు, జాబితాలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. ఆల్-ఖైదా, లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మహమ్మద్ సంస్ధల్లో సభ్యులుగా అనుమానిస్తున్న పలువురు పేర్లు జాబితాలో ఉన్నాయని భారత ప్రభుత్వాధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వెల్లడించింది. మూడు సార్లు యుద్ధంలొ తలపడిన ఇండియా, పాక్ లమధ్య అమెరికా ఒత్తిడితో 2004 నుండి శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. 2008లో ముంబై తాజ్ హోటల్ తో పాటు ఇతర చోట్ల జరిగిన టెర్రరిస్టు దాడుల అనంతరం ఈ చర్చలను ఇండియా బహిష్కరించింది. టెర్రరిస్టు దాడుల దోషులను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది.
బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు అబ్బొత్తాబాద్ లో నివాసం ఉండటానికి పాకిస్ధాన్ గూఢచార సంస్ధకు సామర్ధ్యం లేకపోవడమో లేక లాడెన్ తో కుమ్మక్కు కావడమో జరిగి ఉండాలని అమెరికా ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలను పాక్ తిరస్కరిస్తున్నది. టెర్రరిజం వ్యతిరేక పోరాటంలో పాక్ కంటే మరే దేశమూ ఎక్కువగా పాల్గొనలేదని వాదిస్తున్నది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తామని అమెరికా చెప్పడాన్ని భారత పాలకులకి రుచించడం లేదు. ప్రస్తుత పరిస్ధితుల్లో అమెరికా సైన్యం ఉపసంహరించినట్లయితే ఆఫ్ఘన్ లో పాక్ ఆధిపత్యం కొనసాగుతుందనీ ఇండియా ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని భారత్ పాలకులు భావిస్తున్నారు. తన పెరడులో మిలిటెంట్ల ఆధిపత్యం కొనసాగుతుందని భయపడుతున్నారు. ఈ లోపే ఆఫ్ఘన్ లో తన ప్రభావాన్ని నెలకొల్పడానికి ఇండియా ప్రయత్నిస్తున్నది.
ఇండియా ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్ధాన్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇండియా చెబుతుంది. రోడ్లు, భవనాలు తదితర కాంట్రాక్టులను భారత వ్యాపారులు చేపట్టారు. అదే ఇండియా అక్కడ చేసిన అభివృద్ధి. ఇండియా ఎంత పాకులాడినా అమెరికా ఆఫ్టనిస్ధాన్ కి సంబంధించిన వరకూ పాకిస్ధాన్ కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఈ పరిస్ధితి ఇప్పట్లో మారే అవకాశం లేదు. త్వరలో ఆఫ్ఘనిస్ధాన్ సంసర్సిస్తానని భారత ప్రధాని మన్మోహన్ ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో తన ప్రభావాన్ని పెంచే విధంగా కొన్ని వ్యాపార ఒప్పందాలను ప్రధాని కుదుర్చుకునే అవకాశం ఉంది.
పొరుగు దేశంలో అమెరికా దురాక్రమణ కొనసాగాలని భారత పాలకులు కోరుకోవడం ఖండనార్హం. వివిధ దేశాల భవిష్యత్తును నిర్మించుకునే హక్కు ఆయా దేశాల ప్రజానీకానికె ఉంటుందన్న సహజ న్యాయానికి గౌరవించకుండా తన వ్యాపార ప్రయోజనాలకోసం ఇండియా ఆఫ్ఘన్ నుండి అమెరికా సైన్యాలు కొనసాగాలని కోరుకోవడం అన్యాయం. ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేరుపోందిన చైనా, ఇండియాలపై నిఘా ఉంచడానికే అమెరికా ఆఫ్ఘనిస్ధాన్లో సైనిక ఉనికిని కోరుకుంటున్న సంగతి భారత పాలకులకు పట్టకపోవడం విచారించదగిన విషయం.