అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?


సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను కూల్చారని అమెరికా తేల్చింది. ప్రపంచ ప్రజలంతా ఔరా, అవునా! అని నోరెళ్ళబెట్టారు. జరిగిన ఘోరాన్ని చూసి కోపం తెచ్చుకున్నారు. దోషుల్ని శిక్షించాల్సిందే అన్నారు. అమెరికాకి, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకూ తమ సానుభూతి తెలిపారు.

అనుమానితుడెవరో అమెరికా స్వయంగా ప్రకటించీంది. ఇంత దారుణానికి పాల్పడింది ఎవరైనా వారిని చట్టం ముందుకు తెచ్చి, విచారించి, నేరాన్ని నిరూపించి తగిన శిక్ష విధించాల్సి ఉంది. బహుశా దోషులకు మరణ శిక్షే సరైందని ప్రపంచమంతా భావించి ఉంటుంది. అయితే నిందితుడు ఎక్కడున్నాడు? ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నాడు. తాలిబాన్ రక్షణలో ఉన్నాడు. అందుకే ఆఫ్ఘనిస్ధాన్‌పై అమెరికా నాయకత్వంలో మూకుమ్మడి దాడులకి దిగాయి. కార్పెట్ బాంబింగ్, ప్రెసిషన్ బాంబింగ్ లాంటి అధునాతన ఆయుధాలు, యుద్ధ టెక్నిక్కులతో అతి పేద దేశమైన ఆఫ్ఘనిస్ధాన్‌పై విరుచుకుపడ్డాయి. దేశాన్నంతటినీ నేల మట్టం చేశాయి. అక్టోబరు 14, 2001 తేదీన గార్డియన్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. డబ్ల్యు.టి.సి. టవర్లపై దాడిలో లాడెన్‌ పాత్ర ఉందనడానికి సాక్ష్యాలు చూపినట్లయితే బిన్ లాడెన్‌ను మూడో దేశానికి అప్పగించడానికి సిద్ధమేననీ, అయితే అలా జరగడానికి ముంది ఆఫ్ఘనిస్ధాన్‌పై బాంబుదాడులను నిలిపేయాలని తాలిబాన్ అమెరికాని కోరింది. అందుకు తగిన చర్చలకు సిద్దమని తాలిబాన్ ప్రభుత్వం తరఫున ఉప ప్రధాని హాజి అబ్దుల్ కబీర్ ఈ ప్రకటన చేశాడు.

అయితే తాలిబాన్ ప్రతిపాదనను జార్జి బుష్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. “దోషిత్వంపైనా, అమాయకత్వంపైనా చర్చలు జరపవలసిన అవసరం లేదు. లాడెన్ దోషి అని మాకు తెలుసు. లాడెన్‌ని అప్పగించాలి. అతని అనుచరులందరినీ అప్పగించాలి. వారి ఆధీనంలో బందీలెవరైనా ఉంటే వారినీ అప్పగించాలి. అంతవరకూ బాంబింగ్ ఆపే ప్రసక్తే లేదు.” అని బుష్ హుంకరించాడు. లాడెనే దాడులకు కారణమని రుజువులు చూపినట్లయితే ఆఫ్ఘనిస్ధాన్ వినాశనం తప్పేది. పశ్చిమ దేశాల కూటమి దాడుల్లో పదుల వేలమంది ఆఫ్ఘన్ అమాయక పౌరుల మరణం తప్పేది. కాని యుద్దోన్మాది జార్జి బుస్ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికి పది సంవత్సరాలనుండి ఆఫ్ఘన్ యుద్ధం జరుగుతున్న మే 2, 2011 వరకు లాడెన్ జాడ ఆఫ్ఘనిస్ధాన్ లో దొరకలేదు.

మరో రెండు సంవత్సరాలకి సద్దామ్ హుస్సేన్ ఇరాక్ లో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని వాటివలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని చెబుతూ ఇరాక్ పై దాడి చేశాయి అమెరికా నేతృత్వంలోని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు. అప్పటికి పన్నెండు సంవత్సారాల నుండి ఇరాక్ దేశం పైన అన్ని రకాలుగా ఆంక్షలు విధించారు. ఆయిల్ అమ్ముకోకుండా నిషేధించారు. చివరికి పసిపిల్లల పాలడబ్బాలపైనా, పోషకాహారాలపైనా ఔషధాలపైనా నిషేధం విధించాయి. ఫలితంగా ఇరాక్ లో లక్షలాది పిల్లలు పది సంవత్సరాల లోపు వారు పోషకాహార లోపాలతో చనిపోయారు. జబ్బుపడిన వారు మందులు దొరక్క చనిపోయారు. ప్రాణాధార మందులు దొరక్క బతికించగలిగిన పేషెంట్లూ మరణించారు. మారణాయుధాలు ఇరాక్ లో లేవని అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) అధిపతి ఎల్ బరాదీ ఐదారు సంవత్సరాలపాటు ఇరాక్ లో అణువణువునా గాలించి తేల్చాడు. మరో ఇన్స్పెక్టర్ రిఛర్డ బట్లర్ (ఆస్ట్రేలియా దేశీయుడు) కూడా ఇరాక్ లో తనిఖీలు నిర్వహించి ఏ ఆయుధాలను చూపలేకపోయాడు. ఇరాక్ పై దాడిని బట్లర్ తీవ్రంగా ఖండించాడు. అందులో ఆస్ట్రేలియా పాల్గొనడాన్నీ ఖండించాడు. అస్ట్రేలియా ప్రధాని జాజ్ హోవర్డ్ ప్రజలను మోసగించి ఇరాక్ యుద్దానికి దిగాడనీ ఆరొఫించాడు.

ఇంత చేసినా ఇరాక్ లో సామూహిక విధ్వంసక ఆయుధాలూ దొరకలేదు. బిన్ లాడెనూ దొరకలేదు. పశ్చిమ దేశాల దశాబ్దాల కాలపు ఆంక్షలు, మరో అర్ధ దశాబ్దకాలపు యుద్దం ఇరాక్‌ని సర్వనాశనం చేసింది. ఇరాక్ ఇప్పుడు మత ఘర్షణలకు, జాతి ఘర్షణలకు, అరాచకాలకు నిలయం. ఎన్నికలు జరిగినా సంవత్సరకాలం వరకు ప్రభుత్వం ఏర్పడని గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్ధ ఇప్పుడు అక్కడ ఉంది. అక్కడి ప్రధానిపై అమెరికా నిరంతరం వ్యతిరేకించే ఇరాన్ పాలకుల ఆధిపత్యం ఉంది. అటు ప్రజలకు శాంతి లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్ధాన్ దాడిలో లాడెన్ దొరకలేదు. ఇరాక్ ని విధ్వంసం చేసినా దొరకలేదు. ఈ రెండు యుద్ధాల ఫలితంగా అమెరికా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ట్రిలియన్ల డాలర్లను వాల్‌స్ట్రీట్ కంపెనీలకు ధారపోసి ఆ అప్పును ఇప్పుడు అమెరికా ప్రజలనుండి గోళ్ళూడగొట్టి వసూలు చేయడానికి డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు పొదుపు బడ్జెట్ పేరుతో చర్చలు జరుపుతున్నారు. ఒబామాకి అప్పులపై ఉన్న పరిమితిని పెంచే బిల్లు ఆమోదం పొందాలి. రిపబ్లికన్ లకు అమెరికా ఉద్యోగులు, కార్మికులు, వృద్ధులు, నిరుద్యోగులు మొదలైన వారి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను రద్ధు చేసి, పన్నులను పెంచే బిల్లు ఆమోదం పొందాలి. వీరిద్దరూ కుమ్మక్కై రెండింటికీ ఆమోదం సాధించి అమెరికా ప్రజలపై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చర్చలు ఓ వైపు జరుగుతుండగానే హఠాత్తుగా లాడెన్‌ని చంపే ఆపరేషన్ ముందుకొచ్చింది. అమెరికా ప్రజలంతా లాడెన్ హత్యకు సంబరాలు జరుపుకుంటుంటే డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు వారి గోళ్ళూడగొట్టే బడ్జెట్, అప్పు బిల్లుల్ని ఆమోదింపజేసుకునే బిజీలో ఉన్నారు.

ఇంతాజేసి లాడెన్ ఎలా దొరికాడు? 69 మంది కమెండోలు, 4 అపాచి హెలికాప్టర్లలో వెళ్ళి ఒక ఇంటిపై దాడి చేస్తే లాడెన్ దొరికాడు. అదికూడా శవాన్ని చూపలేదు. కారణం ఆ దృశ్యం భయంకరంగా ఉందట. అది చూసి మరిన్ని ప్రతీకార చర్యలకు టెర్రరిస్టులు దిగుతారట. అసలు లాడెన్ శవం వలన అమెరికా జాతీయ భద్రతకే ముప్పట. అందుకని ఎవరికీ చూపకుండా సముద్రంలో పాతిపెట్టారట. సరే. మరి పది సంవత్సరాలనుండి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో యుద్ధాలు చేసి సర్వ నాశనం చేసింది దేనికోసం? లాడెన్‌ని పట్టుకోవడానికి నాలుగు హెలికాప్టర్లు 69 మంది కమేండోలు సరిపోతే వందల వేలమంది సైన్యాన్ని దింపి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లను ఎందుకు నాశనం చేశారు? లక్షల మంది అమాయక పౌరులను ఎందుకు చంపారు? వేలమంది అమెరికా సైనికులను యుద్ధ విధ్వంసానికి ఎందుకు బలిచ్చారు? పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్నాడంటూ మానవరహిత విమానాలతో దాడులు చేసి వేలమంది పౌరులను ఎందుకు పొట్టన బెట్టుకున్నారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s