మధ్యధరా సముద్రంలో 63 మంది శరణార్ధులను వారి చావుకు వదిలేసిన నాటో యుద్ధనౌక


charles-de-gaulle

ఫ్రాన్సుకి చెందిన యుద్దవిమాన వాహక నౌక "ఛార్లెస్ డి గల్లె"

లిబియా పౌరుల రక్షణే తమ ధ్యేయమనీ, వారిని రక్షించండి అని ఆదేశించిన సమితి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడమే తమ కర్తవ్యమనీ నాటో ఆధ్వర్యంలో లిబియాపై బాంబులు మిస్సైళ్ళుతో దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు చెబుతున్నాయి. గడ్డాఫీ ఇంటిపై బాంబులేసి అతన్ని చంపాలని ప్రయత్నించినా, అతని కొడుకూ, ముగ్గురు మనవళ్ళను చంపినా, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులను నాశనం చేసినా, చివరికి లిబియా పౌరులే చనిపోయినా అవన్నీ అంతిమంగా లిబియా పౌరుల రక్షణకోసమే నని ఆ దేశాల అధికారులు, ప్రభుత్వాధిపతులు ప్రకటించారు. లిబియాకి సంబంధించి ఏ ప్రకటన చేసినా దానికి ముందూ, వెనకా పౌరుల రక్షణకే అని చెప్పడం మర్చిపోవడం లేదు.

అయితే తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై బడి అరాచకాలు చేస్తున్న ఈ ఆంబోతు దేశాలకు నిజానికి పౌరుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వరనీ ‘ది గార్డియన్’ పత్రిక వెలువరించిన ఒక కధనం ద్వారా వెల్లడయ్యింది. లిబియా ఆయిల సంపదలను తమకు పూర్తిగా అప్పగించని గడ్డాఫీని చంపో, గద్దె దించో తమకు అనుకూలురైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు కంకణణ్ కట్టుకున్న విషయాన్ని చాలామంది గ్రహించలేక పోతున్నారు. వారి కళ్ళు తెరిపిస్తూ నాటోకి చెందిన ఒక యుద్ధ వాహక నౌక, యుద్ధ హెలికాప్టర్లు మధ్యధరా సముద్రంలో ఇంధనం నిండుకుని దారీ తెన్నూ తెలియక చిక్కుకుపోయిన ఒక శరణార్ధుల పడవను చూసి కూడా రక్షించకుండా వెళ్ళిపోయిన అమానుషాన్ని గార్డియన్ పత్రిక బయటపెట్టింది.

మార్చి నెల చివరలో ట్రిపోలినుండి 72 మంది శరణార్ధులతో ఒక పడవ ఇటలీకి చెందిన ద్వీపం లాంపెడూసా కి బయలుదేరింది. వీరంతా అఫ్రికా దేశాలనుండి పనికి వలస వచ్చిన కార్మికులు. అమెరికా శిక్షణ పొందిన కొద్దిమంది లిబియన్లు లిబియా తూర్పు పట్టణం బెంఘాజీలో తిరుగుబాటు ప్రారంభించిన దగ్గర్నుండీ లిబియా, ట్యునీషియా, ఈజిప్టు లనుండి యూరప్‌కి వలసలు ఎక్కువయ్యాయి. శరణార్ధుల రవాణాకు ఫ్రాన్సు, బ్రిటన్‌లు కూడా నౌకలు, వాహనాలు సమకూర్చామని చెప్పాయి కూడా. ట్రిపోలీనుండి బయలుదేరిన పడవలో ఉన్న శాటిలైట్ ఫోన్‌లో ఇంధనం కొరవడిన సమాచారం అందించినా, హెలికాప్టర్లలో వచ్చినవారు హామీ ఇచ్చినా, యుద్ధ వాహక నౌక వైపుకు పడవ కొట్టుకెళ్ళినా ఎవరూ వీరికి సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో ప్రయాణీకుల్లో 63 మంది ఆకలి, దాహం లకు గురై మరణించిన వార్త ఎవరినైనా కలచివేయక మానదు.

16 రోజులపాటు సముద్రంలో అలలు ఎటు తీసుకెళ్తే అటు కొట్టుకుపోయిన పడవ తిరిగి లిబియా తీరానికి కొట్టుకొచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. “ప్రతి ఉదయం నిద్ర లేచే వాళ్ళం. మరింతమంది శవాలుగా మిగిలిన దృశ్యాన్ని చూసేవాళ్ళం. ఎవరైనా రక్షించకపోతారా అన్న ఆశతో శవాలను 24 గంటలపాటు మాతో ఉంచుకుని ఆ తర్వాత సముద్రంలోకి విసిరేవాళ్ళం” అని బతికున్న తొమ్మిది మందిలో ఒకరైన అబు కుర్కే తెలిపాడు. “చివరి రోజుల్లో మేమెవరమో కూడా తెలియని స్ధితికి చేరుకున్నాం. అందరమూ ప్రార్ధన చేస్తూనో, చచ్చిపోతూనో గడిపాం” అని కుర్కె తెలిపాడు. ఐక్యరాజ్యసమితి శరణార్ధుల సంస్ధ (యు.ఎన్.హెచ్.సి.ఆర్) సివిల్, మిలట్రీ నౌకల మధ్య సహకారం పెంపొందాలని ఈ సందర్బంగా కోరింది. “మధ్యధరా సముద్రం వైల్డ్ వెస్ట్ గా మారడానికి వీల్లేదు. సముద్రజలాల్లో ప్రజలను రక్షించనివారు ఏ శిక్షా పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదు” అని యు.ఎన్.హెచ్.సి.ఆర్ ప్రతినిధి లారా బోల్డ్&‌రిని చెప్పింది.

“వాళ్ళు తమపై ఉన్న భాధ్యతను లెక్కచేయలేదు. ఫలితంగా పిల్లలతో సహా 63 నిండు ప్రాణాలు బలయ్యాయి. అది నేరం. చనిపోయినవారు ఆఫ్రికాకి చెందిన వలసీకులైనంత మాత్రాన, క్రూయిజ్ లైనర్‌లో ప్రయాణిస్తున్న టూరిస్టులు కానంత మాత్రాన ఆ నేరానికి పాల్పడినవారు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదు” అని రోమ్ లో శరణార్ధి శిబిరం నడుపుతున్న ఎరిత్రియా దేశపు క్రైస్తవ ఫాదర్ మోజెస్ జెరాయ్ ఆక్రోశించాడు. అఫ్రికాలో తాము పుట్టిన ప్రాంతాల్లో ప్రకృతితో కలిసి జీవిస్తున్న నల్లజాతి వారిని అత్యంత హేయమైన పద్ధతుల్లో, పశువులకంటే హీనమైన పరిస్ధితుల్లో అమెరికా ఖండానికి రవాణా చేసి బానిసలుగా మార్చుకొని శతాబ్దాలపాటు వారి రక్త మాంసాలతో సంపదలను సృష్టించుకున్న యూరోపియన్లకు బహుశా ఫాదర్ మోజెస్ ఆక్రోశానికి స్పందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పటికీ నల్లవారిని హీనంగా చూసే తెల్లతోలు అహంకారులకు భారతీయులు కలర్ మనుషులే తప్ప మామూలు మనుషులుగా కనపడరన్నది అందరూ ఎరిగిన సత్యమే.

మార్చి 25న ట్రిపోలిలొ బయలుదేరిన పడవలో 47 మంది ఇధియోపియన్లు, 7 గురు నైజీరియన్లు, మరో 7 గురు ఎరిత్రియన్లు కాగా 6 గురు ఘనా 5 గురు సూడాన్ దేశాలకు చెందినవాళ్ళు. వారిలో 20 మంది మహిళలు, ఇద్దరు ఒక సంవత్సరం లోపు పసిపిల్లలు. ఘనా దేశానికి చెందిన పడవ కెప్టెన్ ట్రిపోలీకి వాయవ్య దిశగా 290 కి.మీ దూరంలో ఉన్న ఇటలీ ద్వీపం లాంపెడూసాని లక్ష్యం చేసుకుని ప్రయాణం ప్రారంభించాడు. సముద్రంలొ 18 గంటలో ప్రయాణించాక ఇంధనం కారిపోవడం మొదలయ్యింది. బతికి బట్టకట్టిన సాక్షులు, వారి ప్రయాణంలో శాటిలైట్ ఫోన్ ద్వారా సంబంధంలో ఉన్న వ్యక్తుల నుండి వివరాలను సేకరించిన ‘ది గార్డియన్’ పత్రిక జరిగిన విషయాన్ని పూస గుచ్చింది. గార్డియన్ కధనం ప్రకారం దురదృష్టం, బ్యూరోక్రసీ, రక్షించే అవకాశం ఉండీ అందుకు పూనుకోని యూరప్ మిలట్రీ బలగాల నిర్లక్ష్యంలతో కూడిన వారి నరక ప్రయాణం భాధామయంగా సాగింది.

ప్రయాణీకులు మొదట పడవలో ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా రోమ్‌లో ఉన్న ఫాదర్ మోజెస్ జెరాయ్‌ని కాంటాక్టు చేశారు. ఆయన వెంటనే ఇటలీ కోస్టుగార్డ్ కు విషయం తెలిపాడు. ట్రిపోలీనుండి 100 కి.మీ దూరంలో పడవ ఉందని అంచనా కట్టారు. అప్రమత్తంగా ఉన్నారనీ, సంబంధిత అధికారులను హెచ్చరించామనీ కోస్టు గార్డ్ సిబ్బంది ఫాదర్ మోజెస్ కి హామీ ఇచ్చారు. కొద్దిసేపట్లోనే మిలట్రీ హెలికాప్టరొకటి పడవపై ప్రత్యక్షమైంది. దానికి ఒక పక్క అర్మీ అని రాసి ఉంది. కాప్టర్ పైలట్లు నీళ్ళ బాటిళ్ళను, బిస్కట్ పాకెట్లను పడవలోకి తాళ్ళతో జారవిడిచారు. ప్రయాణీకులను రక్షించడానికి మరో రెస్క్యూ బోట్ వస్తుందనీ, అంతవరకూ ఓపిక పట్టండనీ హెలికాప్టర్‌లో ఉన్నవారు సైగలతో తెలిపారు.

హెలికాప్టర్‌ను తామే పంపామని ఇంతవరకూ ఏ దేశం చెప్పలేదు. ఇటాలియన్ కోస్టుగార్డ్ ప్రతినిధి “మేము మాల్టా వైపుగా పడవ ప్రయాణ దిశ ఉందనీ, వారి రెస్క్యూ జోన్‌లో ఉందనీ మాల్టా అధికారులకు తెలిపాము. అంతే గాకుండా సముద్రంలో ప్రయాణంలో ఉన్న అన్ని నౌకలకీ సమాచారం అందించి వారూ వెతికి శరణార్ధులను రక్షించాలని కూడా సందేశాలు పంపాము” అని చెప్పాడు. అయితే మాల్టా అధికారులు తమకు ఎటువంటీ పడవ విషయమూ తెలియదని చెబుతున్నారు. చాలా గంటలపాటు ఎదురు చూశాక సహాయం అందడం లేదని పడవ ప్రయాణికులకు అర్ధం అయ్యింది. పడవలో 20 లీటర్ల ఇంధనమే మిగిలి ఉంది. పడవ కేప్టెన్ లాంపెడూసా ద్వీపం దగ్గరలోనే ఉందనీ, ఎవరి సాయం లేకుండానే చేరుకుంటామనీ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కానీ కెప్టెన్ అంచనా తప్పైంది. మార్చి 27 నాటికి పడవ సముద్రంలో తప్పిపోయింది. ప్రవాహం ఎటువెళ్తే అటు పడవ కొట్టుకుపోవడం మొదలయ్యింది. “పడవకు దిక్కూదరీ లేకుండా పోయింది. ఆయిల్ అయిపోయింది. ఆహారం, నీళ్ళు కూడా ఐపోయాయి. వాతావరణమేమో భయంకరమ్గా ఉంది” అని ఇదియోపియాలోని ఒరోమియా ప్రాంతంలో జరుగుతున్న తెగల కొట్లాటనుండి పారిపోయి వచ్చిన 24 ఏళ్ళ కుర్కే తెలిపాడు. మార్చి 29 లేదా 30 తేదీల్లో పడవ నాటోకి చెందిన విమాన వాహక నౌక వద్దకు కొట్టుకెళ్ళింది. నౌకకు పడవ ఎంత దగ్గరగా వెళ్ళిందంటే దానిని చూడకుండా ఉండడం అసాధ్యం అని బతికినవారు తెలిపారు. నౌకపై నుండి రెండు జెట్ విమానాలు గాల్లోకి లేవడాన్ని పడవలోని వారు చూశారు. అవి పడవపై చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళాయి. పడవలో ఆకలి, దప్పికలతో అలపటిస్తున్న ఇద్దరు పసిబిడ్డలను తమ చేతుల్లో ఎత్తిపట్టి డెక్ మీద నిలబడి కేకలు వేశారు ప్రయాణీకులు. కాని ఫలితం దక్కలేదు.

అప్పటినుండీ ఎటువంటి సాయం అందలేదు. విమానవాహక నౌకకు మరింత దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినా కుదరలేదు. మెల్ల మెల్లగా పడవ నాటో విమానవాహక నౌక నుండి దూరంగా కొట్టుకుపోయింది. ఫోన్‌కి ఛార్జింగ్ లేకపోవడం, నీళ్ళు ఆహారం ఐపోవడంతో ఆకలి, దప్పికలకు ఒక్కొక్కరూ చనిపోవడం మొదలయ్యింది. గార్దియన్ పత్రిక విమానక వాహక నౌక ఏ దేశానికి చెందిందీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి ఫ్రాన్సుకి చెందిన “ఛార్లెస్ డి గల్లే” నౌకగా వారు గుర్తించారు. ఆ కాలంలో తమ నౌక అక్కడ లేదని చెప్పి ఫ్రాన్సు అధికారులు తమ భాధ్యతను తిరస్కరించారు. కాని నౌకకు సంబంధించిన వార్తలను సాక్ష్యంగా చూపాక ఫ్రాన్సు ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించాడని గార్డియన్ తెలిపింది. లిబియాపై దాడులకు నాయకత్వం వహిస్తున్న నాటో ప్రతినిధి తమకు ఏ పడవనుండి రక్షించమంటూ సంకేతాలు అందలేదని చెప్పాడు.

“నాటో దళాలకు తమ భాధ్యతల గురించి బాగానే తెలుసు. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సముద్ర జలాల్లో ఆపదలో ఉన్నవారిని మిలట్రీ నౌకలతో పాటు అన్నీ కాపాడాల్సిన భాధ్యత ఉందనీ పూర్తిగా తెలుసు” అని ఒక అధికారి చెప్పాడు. కాపాడమన్న సంకేతాలను నాటో నౌకలు ఎన్నడూ విస్మరించలేదు. అవసరమైన అన్ని సార్లూ అవి సహాయం అందించాయి. ప్రాణాలకు కాపాడడానికి నాటో నౌకలు ప్రధమ ప్రాధాన్యం ఇస్తాయి” అని ఆయన చెప్పుకున్నాడు. అవును మరి అందుకేగా లిబియాపై బాంబులు, మిసైళ్ళతో దాడి చేస్తోంది. అందుకేగా గడ్డాఫీ కొడుకునీ, మనవళ్ళనూ చంపడమే కాక గడ్డాఫీని కూడా చంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకేగా ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో మారణహోమం సృష్టించి మిలియన్ల మంది పౌరుల ప్రాణాలను హరించడమేకాక ఇంకా ఆ మూకుమ్మడి హత్యాకాండలను కొనసాగిస్తున్నది! టెర్రరిస్టుల చేతుల్లో చనిపోతున్న వందలమందిని కాపాడడానికేగా మరిన్ని మిలియన్ల మందిని చంపుతున్నది!? హతవిధీ! పాపము శమించుగాక!

ఆ తర్వాత పది రోజుల్లో పడవలో 11 మంది తప్ప అందరూ చనిపోయారు. “హెలికాప్టర్ నుండి విసిరిన నీళ్ళ బాటిళ్ళలో ఒక దాన్ని ఇద్దరు పసిబిడ్డల కోసం అట్టే పెట్టాము. ఆ పసిబిడ్డల తల్లి దండ్రులు చనిపోయాక కూడా వారికి నీళ్ళు తాపిస్తూ గడిపాము” అని కుర్కే తెలిపాడు. హృదయవిదారకంగా అనిపించే విషయం ఏంటంటే కుర్కే తన మూత్రాన్నే తాగి దప్పిక తీర్చుకున్నాడు. తన దగ్గర ఉన్న రెండు ట్యూబుల టూత్ పేస్టును కొంచెం కొంచెం తింటూ ప్రాణాలు దక్కించుకున్నాడు. “కానీ మరో రెండు రోజుల తర్వాత ఆ పసిబిడ్డలు కూడా ప్రాణాలు విడిచారు. వారు చాలా చిన్న పిల్లలు కదా” అని కుర్కే నిట్టూర్చాడు. చివరికి ఏప్రిల్10 తేదీన పడవ లిబియా తీరపట్టణం లిటాన్ (Zlitan) తీరానికి కొట్టుకెళ్ళింది. ఇది మిస్రాటా పట్టణానికి దగ్గర్లో ఉన్న పట్టణం. 72 మంది శరణార్ధులతో ప్రయాణం మొదలు పెట్టిన పడవ మళ్ళీ లిబియా తీరానికి కొట్టుకొచ్చేటప్పటికి 11 మంది మాత్రమే మిగిలారు.

తీరానికి వచ్చిన వెంటనే పదకొండు మందిలో ఒకరు చనిపోయారు. మిగిలినవారిని జైలుకు తరలించింది లిబియా ప్రభుత్వం. జైలుకి వచ్చీరాగానే మరోవ్యక్తి మరణించాడు. ఇక మిగిలింది తొమ్మిదిమంది. వీరు నాలుగు రోజులు జైలులో ఉంచిన అనంతరం విడుదల చేశారు. ఇటలీ ద్వీపానికి ప్రయాణం కట్టిన వారంతా ట్రిపోలీలో ఒక ఇధియోపియన్ ఇంటిలొ తలదాచుకునేవారమని వారు తెలిపారు. ఇంత జరిగినా ఆ తొమ్మిదిమంది మళ్లీ మధ్యధరా సముద్రం దాటి వెళ్ళడానికి రెడీ అంటున్నారు. లిబియాపై బలవంతంగా రుద్దిన అంతర్యుద్ద్దం దానికి కారణం. ఎంతోమంది ఆఫ్రికా దేశాల శరణార్ధులకు పని కల్పించిన లిబియా ఇప్పుడు నిరంతర జరుగుతున్న క్షిపణులు, బాంబు దాడుల నేపధ్యంలో శరణార్ధుల విషయంలో నిస్సహాయంగా మిగిలిపోయింది.

నౌకా తీరం ఉన్న మిస్రాటా నుండి శరణార్ధులను తమ నౌకలు నిరంతరం చేరవేస్తున్నాయని బ్రిటన్ చెప్పుకుంటుంది. శరణార్ధులను తీసుకెళ్తున్న నౌకల నిండా లిబియా ప్రభుత్వ బలగాల దాడుల్లొ గాయపడిన పౌరులే ఉన్నారని పచ్చి అబద్ధాలను సైతం బ్రిటన్ చెప్పడానికి సిగ్గుపడ్డం లేదు. వాస్తవంలో పెట్టుబడుల కోసం, పెట్టుబడుల లాభాలతో మరిన్ని పెట్టుబడులను పోగేయడం కోసం ప్రపంచ సహజవనరులన్నింటినీ కొల్లగొట్టుకు పోయే సామ్రాజ్యవాద దుష్ట బుద్ధితో ప్రపంచం అంతా సైనిక స్ధావరాలతో నింపిన అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రజల ప్రాణాలను కాపాడ్డానికే దురాక్రమణ యుద్ధాలను చేస్తున్నామని చెప్పుకోవడం అతి పెద్ద అబద్ధం. దారిన పోతూ ఆకలితో అలమటిస్తూ చేయిచాచిన వారిని రక్షించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపని వీరు ప్రపంచాన్ని రక్షిస్తామనడం పచ్చి మోసం. ప్రపంచ ప్రజలే పూనుకుని ఈ యుద్దోన్మాదులనుండి తమను తాము రక్షీంచుకోవడానికి నడుం బిగిస్తే తప్ప ఈ ధనమదాంధుల రక్త దాహానికి అంతం ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s