గడ్డాఫీని మరోసారి టార్గెట్ చేసిన నాటో దాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన


Injured in NATO bombing

నాటో బాంబింగ్‌లో గాయపడిన ట్రిపోలీ నివాసి -రాయిటర్స్

లిబియా ప్రజలను రక్షించే పేరుతో విచక్షణారహితంగా లిబియాపై వైమానికి దాడులు చేస్తున్న నాటో దళాలు మంగళవారం మరోసారి గడ్డాఫీ నివాస కాంపౌండ్‌పై పలు క్షిపణులతో దాడి చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించింది. ఏప్రిల్ 30 తేదీన నాటో బాంబు దాడుల్లో గడ్డాఫీ చివరి కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయాక గడ్డాఫీ బహిరంగంగా ఇంతవరకు కనపడలేదు. క్షిపణి దాడుల వలన అద్దాలు పగిలి చెల్లాచెదురు కావడంతో అవి తగిలి నలుగురు పిల్లలు గాయపడ్డారనీ, వారిలో ఇద్దరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉందనీ ప్రభుత్వ ప్రతినిధి తెలిపాడు.

లిబియా ప్రభుత్వాధికారులు విదేశీ విలేఖరులకు ట్రిపోలీలోని గాయపడినవారు ఉన్న ఆసుపత్రిని చూపించారు. క్షిపణిదాడుల ప్రభావంతో ఆసుపత్రి కిటికీ అద్దాలు పగిలి చెల్లాచెదురయ్యాయి. సమీపంలొని టెలికమ్యూనిషన్స్ టవర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. హై కమిషన్ ఫర్ ఛిల్డ్రన్ కార్యాలయమ్ ఉన్న భవంతిని కూడా అధికారులు విలేఖరులకు చూపారు. ఆ భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. లిబియా వలసగా ఉన్నప్పటి నాటినుండి ఉన్న ఈ భవనంపై ఏప్రిల్ 30 తేదీన కూడా క్షిపణిదాడులు జరిగి పాక్షికంగా ధ్వంసం అయ్యింది. కనీసం ఒక పేలుడు సంభవించిన దిశను బట్టి గడ్డాఫీ కాంపౌండ్‌ని టార్గెట్ చేశారని అర్ధమవుతోందని సాక్షులు రాయిటర్స్ కి తెలిపారు.

లిబియా అంతర్యుద్ధంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. గడ్డాఫీని గద్దె దించుతామంటూ ప్రారంభించిన తిరుగుబాటు ప్రభుత్వ బలగాలను ఎదుర్కొన లేక ఐక్యరాజ్య సమితిని సహాయం అర్జించింది. గడ్డాఫీ యుద్ధ విమానాలు ఎగరకుండా నో-ఫ్లై జోన్ అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని తిరుగుబాటుదారులు అర్ధించారు. లిబియా ప్రభుత్వ వైమానిక దాడుల్లో పౌరులు చనిపోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం చేసిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు పౌరుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సమితిలో తీర్మానం చేయించాయి. అప్పటినుండీ వైమానిక దాడులతో లిబియా ప్రభుత్వ ఆయుధ బలగంలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు నష్టపరిచామని నాటో చెప్పినా, తిరుగుబాటు దారులు మాత్రం ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.

లిబియాపై దుర్మార్గ దాడులకు నాయకత్వాన్ని అమెరికా, నాటో కి అప్పగించినా దాడుల్లో దాని పాత్ర యధావిధిగానే కొనసాగింది. తిరుగుబాటు దారులకు శిక్షణ ఇచ్చే పేరుతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు తమ గూఢచారులను, మిలట్రీ అధీకారులను లిబియాకి పంపాయి. సమితి తీర్మానం అనుమతించనప్పటికీ ఆయుధాలను సరఫరా చేశాయి. పశ్చిమ ప్రాంతంలోని మిస్రాటా, తూర్పు ప్రాంతంలోని అజ్దాబియా, ట్యునీషియా సరిహద్దువద్దా మొత్తం మూడు ప్రాంతాల్లో తీవ్రంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. మిస్రాటాలో పోర్టు ఉండటంతో ఆ పట్టణం కొసం తీవ్రంగా పోరు జరిపినా విజయం ఎవరికీ దక్కలేదు. ఈ పోర్టు ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆయిల్‌ను సోమవారం విక్రయించినట్లు తిరుగుబాటు ప్రతినిధులు తెలిపారు.

సోమవారం ప్రభుత్వానికి చెందిన ఆయుధ గిడ్డంగులపై నాలుగుసార్లు నాటో దాడులు చేసిందని రెబెల్స్ తెలిపారు. వాయవ్య ప్రాంతంలోని జింటానా పట్టణానికి 30 కి.మీ దూరంలొని ప్రభుత్వ గిడ్డంగులపై తీవ్ర స్ధాయిలో దాడి చేశాయని వారు తెలిపారు. అక్కడ 72 హంగార్లు ఉన్నాయని వీటిలో ఎన్ని ధ్వంసం అయిందీ తెలియలేదనీ తెలిపారు. దాడి జరిగిన ప్రతిసారీ అనేక పేలుళ్ళ శబ్ధాలు విన్నామని రెబెల్స్ ప్రతినిధిగా చెప్పుకున్న అబ్దుల్ రెహ్మాన్ టెలిఫోన్‌లో రాయిటర్స్‌కి తెలిపాడు. ఇదిలా ఉండగా ట్రిపోలీ శివారులో సాయుధ తిరుగుబాటు జరుగుతున్నదని రెబెల్స్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. వారికి తేలికపాటి ఆయుధాలు సప్లై చేశామని వారు తెలిపినా తనకేమీ కాల్పులు వినపడలేదని రాయిటర్స్ విలేఖరి తెలిపాడు. నాటో యుద్ధనౌకలు మిస్రాటా పట్టణంలో మిలట్రీ, పౌర లక్ష్యాలపై సోమవారం బాంబుదాడులు చేశాయని లిబియా టి.వి ప్రకటించింది.

సమితి తీర్మానంలోని లూప్‌హోల్స్ ను ఉపయోగించుకుని లిబియా తిరుగుబాటుదారులకు మరింత సహాయం అందించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు, ఐక్యరాజ్యసమితి రాయబారులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపించి. తాము విధించిన ఆంక్షలను రహస్యంగా ఉల్లంఘిస్తూ అన్ని సహాయాలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నా చైనా, రష్యాలు దానికి అభ్యంతరం తెలిపే అవకాశం ఉందనీ వారు తెలిపారు. ఇదిలా ఉండగా మిస్రాటావద్ద పోరు తీవ్రంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు కోసం ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s