అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు


Laden in Abbottabad

అబ్బొత్తాబాద్‌లో లాడెన్ అంటూ అమెరికా విడుదల చేసిన వీడియో కేప్చర్

పాకిస్ధాన్‌‌లోని  అబ్బోత్తాబాద్‌ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా ఆల్-ఖైదా నాయకుడుగా కొనసగాడని తెలిసిందనీ, అమెరికా జాతీయ భద్రతకు లాడెన్ హత్య ఎంత అవసరమో మరింతగా రుజువయ్యిందనీ తెలిపారు.

అమెరికాలో గూఢచార సంస్ధల్లో పనిచేసిన మాజీ సీనియర్ అధికారుల్లో ఒకరైన పాల్ పిల్లర్ ఈ వాదనను కొట్టి పారేశాడు. “టెర్రరిస్టు ఆపరేషన్లకు లాడెన్ చురుగ్గా నాయకత్వం వహించాడని చెప్పే విషయానికి వస్తే బిన్ లాడెన్ ప్రధాన కధానాయకుడుగా కధనాలు వెలువరించడం చాలా వరకూ తగ్గిపోయింది” అని రాయిటర్స్ సంస్ధతో మాట్లాడుతూ పేర్కొన్నాడు. రక్షణ రంగ విశ్లేషకుడు పాకిస్ధాన్ మాజీ జనరల్ తలాత్ మస్సూద్ “లాడెన్ అప్పుడప్పుడూ వీడియోలు పంచి ఉండవచ్చు. దాడులకి సంబంధించిన ఐడియాలతో ఉన్న హార్డ్ డిస్కులను తన కొరియర్లకు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆల్-ఖైదా కార్యకలాపాలన్నింటికీ అతని స్ధావరమే కేంద్రం అని చెప్పడం నమ్మశక్యంగా లేదు” అని పేర్కొన్నాడు.

లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న ఇల్లు కేంద్ర స్ధావరంగా పేర్కొనడాన్ని తిరస్కరించడానికి ప్రధానంగా రెండు కారణాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి: అబ్బోత్తాబాద్ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. కనీసం టెలిఫోన్ లైన్లు కూడా లేవు. అలాంటి ఇంటినుండి ప్రపంచ వ్యాపితంగా టెర్రరిస్టు నెట్‌వర్కు నడపడం పూర్తిగా అసాధ్యమని భావిస్తున్నారు. రెండో కారణం: లాడెన్‌ను చంపామని చెబుతున్నదానికి చాలా సంవత్సరాల ముందునుండే ఆల్-ఖైదా సంస్ధ ఒక కేంద్రం ఆదేశాలనుండి పని చేయడం మానేసిందనీ అధికారాలను వికేంద్రీకరించి ఒసామా లేకుండానే ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుని అమలు జరుపుతున్నారనీ అమెరికా ప్రభుత్వ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ అవగాహననుండి వెనక్కి మళ్ళి లాడెనే అన్నీ తానై చూశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అమెరికా, పాకిస్ధాన్ దేశాల్లోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“ఇది హాస్యాస్పదం. ఆ ఇంటిని చూస్తే టెర్రరిస్టు నెటవర్కును నడిపే కేంద్రంగా అసలు కనపడ్డం లేదు” అని పాకిస్ధాన్‌లోని ఒక సీనియర్ ఇంటలిజెన్స్ విశ్లేషకుడు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. పాకిస్ధాన్‌కి చెందిన మరో భద్రతాధికారి “బుల్‌షిట్” అంటూ ఆచరాణాత్మక పధకాలు, ఎత్తుగడలు రూపొందించడం లో లాడెన్ చివరిదాకా చురుగ్గా ఉన్నాడని చెప్పడాన్ని కొట్టిపారేశాడు. “వారిష్టమొచ్చినట్లు చెబుతారు. నేనే రేపొచ్చి లాడెన్ అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు తయారు చేయడానికి పధకాలు వేశాడని చెబుతా. మీరు నమ్ముతారా? వారు చెప్పేదాంట్లో చాలా అతి ఉంది. కధలు చెబుతున్నారు” అని చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. అయితే లాడెన్ బలహీనుడుగా చెప్పడం వెనక పాక్ ప్రయోజనాలూ, చురుకైన నాయకుడుగా చూపడం వెనక లాడెన్ హత్యను గొప్ప విజయంగా ఎత్తి చూపే అమెరికా ప్రయోజనాలూ ఉన్నాయని రాయిటర్స్ సంస్ధ విశ్లేషించింది.

ఆల్-ఖైదా నెట్‌వర్క్‌కు బిన్ లాడెన్ కేంద్రకంగా ఉన్నాడన్న సూచన ఎప్పుడో మాసిపోయింది. పశ్చిమ దేశాల్లోని టార్గెట్‌లపై దాడులకు పధకాలు స్ధానికంగా స్వయం నిర్ణయాలతో వ్యవహరించే స్ప్లింటర్ గ్రూపులే నిర్వహించడం అంతకంతకు పెరిగిన మాట వాస్తవమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఇంటిలో లాడెన్ మహా చెయగలిగితే వీడియో, ఆడియో లను రికార్డు చేయగలడని పాక్ భద్రతాధికారి రాయిటర్స్ విలేఖరికి వివరించాడు. ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్ధ లేకుండా మొత్తం ఆల్-ఖైదా కార్యకలాపాలని ఆ ఇంటినుండి ఎలా నిర్వహించగలరు? ఇద్దరు కాపలాదారులు, 18 అంగుళాల టెలివిజన్ సెట్ తో, పెద్ద ఆయుధాలేవీ లేకుండా అన్ని ఆల్-ఖైదా కార్యకలాపాల్నీ నియంత్రించడం ఎలా సాధ్యం? లేని దాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారు” అని ఆయన ప్రశ్నించాడు.

బహుశా పాకిస్ధాన్ భద్రతాధికారి ప్రశ్నలకు జవాబులు మరికొన్ని రోజుల్లో వెలువడవచ్చు. అమెరికన్ కమెండోలు పట్టుకెళ్ళామని చెబుతున్న అత్యంత భారీ ఇంటలిజెన్సు సమాచారంలో ఆ సమాధానాలు నిక్ధిప్తమై ఉండి ఉండవచ్చు. ఆ సమాచారంలోనే ఇంకా కరుడుగట్టిన ఉగ్రవాదుల పేర్లు, ఊర్లు బయటపడవచ్చు. ఇంకా చాలా విషయాలు ఎన్‌క్రిప్ట్ అయిఉండి వాసికెక్కిన కంప్యూటర్ నిపుణులకు లొంగని ఎన్‌క్రిప్షన్‌ను బాగా శ్రమించి ఇంకో ఐదు, పది సంవత్సరాల కాలంలో డిక్రిప్ట్ చేసింతర్వాత మరింత విలువైన, మానవాళికి వినాశకరమైన సమాచారం బయటపడవచ్చు. ముఖ్యంగా అమెరికా జాతీయ భద్రతకు ఆ సమాచారం తీవ్ర ఆటంకం కలిగించే విషయం అయి ఉంటుంది. అప్పుడు అమెరికా జాతీయ భద్రత కోసం ఇప్పుడు పాకిస్ధాన్‌లో జొరబడినట్లే ఏ చైనాలోనో, ఇండియాలోనో జొరబడి తగిన చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు కూడా టెర్రరిజంపై సాహసోపేతమైన యుద్ధాలు చేస్తూ అసమాన ప్రతిభాపాటవాలు చూపుతున్న అమెరికా సైనికులకు చైనీయులు, భారతీయులు వేనోళ్ళా కీర్తించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. లేకుంటే “నువ్వు నాతో లేకుంటే టెర్రరిజంతో ఉన్నట్లే” అన్న బుష్ గారి హుకుం అమలులోకి వస్తుంది.

రానున్న కాలంలో “మేరా భారత్ మహాన్ హై” బదులు “హమారా అమెరికా మహాన్ ఔర్ మహత్వ్ హై అంటూ వంటినిండా ఎర్రగీతలు, చుక్కలు పూసుకొని పండగ జరుపుకోదగిన ఉద్విగ్నరోజులొచ్చి అందరి జీవితాలు కాంతిమంతమవుతాయి.

One thought on “అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు

  1. ఒకే దృష్టితో చూసే పద్ధతిని ఇంపీరియలిజం అలవాటు చేసింది. అమెరికా అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించింది. పచ్చి కట్టుకధలు చెప్తున్నా ప్రేక్షకుల్లాగా చప్పట్లు కొట్టడం దేశ దేశాల అన్యాయం. …పి.ఆర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s