ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్


A begger in Lisbon

పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో అడుక్కుంటున్న ఓ వ్యక్తి

గ్రీసు, ఐర్లండ్‌ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో అనివార్యంగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల సహాయ ప్యాకేజినుండి సహాయాన్ని (అదీ అప్పే) అర్ధించవలసి వచ్చింది.

దాదాపు నెలరోజులపాటు ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇసిబి) ల అధికారులు పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో బెయిలౌట్ నియమ నిబంధనలపై సుదీర్ఘ చర్చలు ‌జరిపిన అనంతరం గత మంగళవారం, మే 3 తేదీన 78 బిలియన్ యూరోల అప్పు జారీకి ఒప్పందం కుదిరింది. దీనిలో ఐ.ఎం.ఎఫ్ 26 బిలియన్ యూరోలు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఇ.యు దేశాలు సమకూరుస్తాయి. ఈ అప్పును రానున్న మూడు సంవత్సరాలలోపు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు ఎంత అనేదీ ఇంకా నిర్ధారణ కాలేదు. బాండ్ మార్కెట్ కంటె తక్కువ వడ్డీ రేటు అమలైనప్పటికీ, బెయిలౌట్ ప్యాకేజీతో పాటు కఠినమైన పొదుపు విధానాలు అమలు చేయాల్సి రావడం వలన అంతిమంగా ప్యాకేజీ ఖర్చు తడిసి మోపెడు అయ్యే సంగతి ఇప్పటికే గ్రీసు, ఐర్లండు ల ఉదాహరణలతో స్పష్టమయ్యింది.

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల ఉమ్మడి ప్యాకేజీ తీసుకున్నందుకు ప్రభుత్వ బడ్జెట్లొ విపరీతంగా కోతలు విధించబడతాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గించే పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలను గణనీయ సంఖ్యలో రద్దు చేస్తారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అందించే సదుపాయాలను రద్దు చేయడమో, కోత విధించడమో చేస్తారు. రిటైరయిన వృద్ధుల పెన్షన్ల ఖర్చును తగ్గించుకోవడానికి ప్రభుత్వం పెన్షన్ ఎకౌంట్ లో జమ చేయాల్సిన భాగాన్ని బాగా తగ్గించుకుని వారిపైనే భారం మోపుతారు. ఉద్యోగులపై పన్నుల భారాన్ని అధికం చేయడంతో పాటు వారికున్న సంక్షేమ సదుపాయాలను రద్ధు చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చు తగ్గించే పేరుతో అమలు చేస్తూనే అదే చేత్తో ప్రైవేటు కంపెనీలకు, సంస్ధలకు టాక్సు హాలిడే, ప్రోత్సహాకాల పేరుతో పన్నులను తగ్గిస్తారు. కొన్ని పన్నులను రద్దు చేస్తారు కూడా. పొదుపు విధానాల సారం వేతన జీవులపై భారం మోపుతూ సంపన్నులకు ప్రోత్సహకాలు ఇవ్వడమే.

ఈ చర్యల అమలుతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల ప్యాకేజీ అందుకున్న దేశాల్లో అనివార్యంగా ఆర్ధిక వృద్ధి పడిపోతుంది. అర్ధిక వ్యవస్ధ కుచించుకుపోయి రిసెషన్‌లోకి జారి పోతుంది. పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీస్ రానున్ను రెండు సంవత్సరాల పాటు దేశం రిసెషన్‌లో ఉంటుందని ప్యాకేజీపై సంతకం చేసిన రోజునే ప్రకటించాడు. పోర్చుగల్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ అధికారులతో సమావేశమై వారి ప్యాకేజీకి, దానితో పాటు అమలయ్యే పొదుపు విధానాలకు ఆమోదం తెలపడం విచిత్రం. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అమలు చేయనున్న పొదుపు విధానాలనే ప్రధాని సోక్రటీసు బడ్జెట్లో ప్రతిపాదిస్తే అవి బడ్జెట్‌ని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని పడగొట్టాయి. బెయిలౌట్ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ సోక్రటీస్ స్వంతగా పొదుపు విధానాలు అమలు చేయడం ద్వారా షరతులను తప్పించుకోవడానికి ప్రయత్నించినా, దాన్ని తిరస్కరించిన ప్రతిపక్షాలు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల కఠిన షరతులకు ఆమోదం తెలపడమే విచిత్రం.

జూన్ 15 లోగా బెయిలౌట్ అప్పు షరతులను పోర్చుగల్ ప్రభుత్వం ఆమూదించాల్సి ఉంది. జూన్ 5 న పోర్చుగల్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా బెయిలౌట్ నిబంధనలకు ఆటంకం కలగకుండా ఉండటానికే ఇసిబి, ఐ.ఎం.ఎఫ్ లు పోర్చుగల్ ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చలు జరిపి ఆమోదం పొందాయి. అయితే ఫిన్లాండ్‌లో జరగనున్న ఎన్నికల్లో యూరో వ్యతిరేక పార్టీ అధీకారంలోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది పోర్చుగల్ బెయిలౌట్ కు ఆటంకం కాగలదన్న ఆందోళన కూడా ఉంది. సభ్య దేశాలన్నీ ఒప్పుకుంటేనే ఏ నిర్ణయమైనా అమలు చేసే నిబంధన దీనికి కారణం.

పోర్చుగల్‌కి ప్రస్తుతం బడ్జెట్ లోటు జిడిపిలో 9.1 శాతంగా ఉంది. బెయిలౌట్ నిబంధన ప్రకారం ప్రస్తుత బడ్జెట్ సంవత్సరం చివరినాటికి ఈ లోటును 5.9 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. మొదట 4.6 శాతానికి తగ్గించాలని షరతు విధించారు. చర్చల్లో ఆపద్ధర్మ ప్రధాని 5.9 శాతానికి పెంచగలిగాడు. అయినప్పటికీ ఒక సంవత్సరంలోనే 3.2 శాతం లోటును తగ్గించడం మాటలు కాదు. కార్మికులు, ఉద్యోగులు తదితర శ్రమ జీవులపై తీవ్రమైన భారాన్ని మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సంవత్సరంలో పోర్చుగల్‌లో కార్మికులు, ఉద్యోగులు కోతల విధానాలపై పెద్ద ఎత్తున సమ్మె పోరాటాలు నిర్వహించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) 2012 సంవత్సరాంతానికి 4.5 శాతానికీ 2013 సంవత్సరాంతానికి 3 శాతానికీ తగ్గించాల్సి ఉంటుంది. 2013 చివరికల్లా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల అప్పును పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 2013 తర్వాత పోర్చుగల్ అప్పుకోసం బాండ్ మార్కెట్ వైపుకి తిరిగి వస్తుందని ప్రధాని చెప్పడం వెనక ఉద్దేశ్యం ఇదే.

అప్పులో 12 బిలియన్ యూరోలని బ్యాంకులకి కేటాయించాలని నిబంధన విధించారు. అంటే అంత మొత్తం బడ్జెట్లో ప్రజలకోసం ఖర్చు పెట్టకుండా బ్యాంకులకు వడ్డీ లేకుండా లేదా నామమాత్రపు వడ్డీకి ధారపోయాలన్నమాట. ఈ బ్యాంకుల్లో అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి పెత్తందారీ దేశాల బ్యాంకులు కూడా ఉంటాయి. ఓ వైపు అప్పు ఇస్తూనే మరోవైపు సోంత బ్యాంకులను మేపే పధకం ఇది. దాంతో పాటు షరతుల్లో భాగంగా 5.3 బిలియన్ డాలర్ల మేరకు ప్రవేటీకరణ రెవిన్యూ సంపాదించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగంలోనె కంపెనీలను అమ్మేయడం ద్వారా ప్రవేటీకరణకు రహదారి వేసి 5.3 బిలియన్ యూరోలు సంపాదించాలని షరతు విధించారు. ఇక్కడే బెయిలౌట్ అసలు ఉద్దేశ్యాలు స్పష్యం అవుతున్నాయి.

మొదట ఒక దేశం అప్పు పరిమాణం పట్ల ఆందోళనలు మార్కెట్లో వ్యాపిస్తాయి. ఆ దేశ అప్పు చెల్లింపు సామర్ధ్యం పట్ల హఠాత్తుగా మార్కెట్లోని ఇన్వెస్టర్లకు అపనమ్మకాలు బయలుదేరుతాయి. మార్కేట్‌లో రణగొణ ధ్వనులు కొనసాగుతుండగానే ఫిచ్ గానీ, ఎస్ & పి గానీ, మూడీస్ గాని రంగంలోకి దిగి ఆదేశం కోశాగార స్ధితి ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్ ఫైనాన్సెస్ పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంది. కనుక అప్పులు చెల్లించే సామర్ధ్యం పట్ల అనుమానులున్నాయి, అని చెపుతూ ఆ దేశ సావరిన్ అప్పు రేటింగ్‌ని తగ్గిస్తాయి. దాంతొ సావరిన్ అప్పుపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. అప్పు రేటు పెరిగే కొద్దీ నమ్మకం తగ్గి వడ్దీ రేటు మరింత పెరుగుతుంది. మార్కెట్ లో అప్పు సేకరణ ఖరీదై అనివార్యంగా బెయిలౌట్ ప్యాకేజీ తలుపు తట్టాల్సిందే. అదే అవకాశంగా ప్రభుత్వాల బడ్జెట్‌లను ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు శాసిస్తాయి. బడ్జెట్లో గణనీయ మొత్తాన్ని ప్రవేటు బ్యాంకులకీ, సంస్ధలకీ కేటాయించేలా ఒత్తిడి చేస్తాయి. ప్రవేటీకరణ పెద్ద ఎత్తున చేపట్టేలా విధానాలు రుద్దుతాయి. కార్మికులు, ఉద్యోగులు తదితర ప్రజానీకంపై అధిక భారాన్ని మోపుతూ సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారీ బహుళజాతి గుత్త సంస్ధలకు అధిక లాభాలు, నిధులు మళ్ళేలా చర్యలు తీసుకుంటాయి.

ఈ ప్రక్రియకే నూతన ఆర్ధిక విధానాలనీ, సరళీకరణ గ్లోబలీకరణలనీ, అప్పు దొరకని దేశాలని ఆదుకుంటున్నామనీ వివిధ పేర్లు పెడుతున్నారు. ఈ విధంగా బహుళజాతి గుత్త సంస్ధలు ప్రభుత్వాల కంటే శక్తివంతంగా మారి ప్రపంచ వ్యాపితంగా సంపదలు మరింత కేంద్రీకృతం కావడానికీ, శ్రమ చేసే వర్గాలు మరిన్ని ఆకలి, దారిద్రాలకు గురికావడానికీ దోహదం చేస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s