ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అమెరికా జాతీయ భద్రత చనిపోయిన వ్యక్తి ఫోటోల్లో నిక్షిప్తమై ఉండడం చాలా ఆశ్చర్యకరం.
ప్రపంచ వ్యాపితంగా కొన్ని వందల మిలట్రీ స్ధావరాలు ఏర్పాటు చేసుకుని రెండు దురాక్రమణ యుద్ధాలు చేస్తూ, మరో దేశంపై (లిబియా) దురాక్రమణ దాడికి కాలు దువ్వుతున్న ప్రపంచ టెర్రరిస్టు అమెరికా ప్రభుత్వ వ్యవస్ధ, చనిపోయిన వ్యక్తి ఫొటోలను ధైర్యంగా విడుదల చేయలేని హీనమైన పరిస్ధితుల్లో ఉండటం అనుమానించదగిన విషయం. పాకిస్ధాన్ మిలట్రీ అకాడమీకి కూతవేటు దూరంలొ ఉన్న ఒబామా స్ధావరాన్ని కనిపెట్టడానికి ప్రపంచంలోని నెంబర్ వన్ కుట్రల సంస్ధ సి.ఐ.ఏకి పది సంవత్సరాలు పట్టడం వింతల్లొ వింత. సి.ఐ.ఏ తాబేదారు, ముంబై తాజ్ హోటల్ దాడుల్లో పాల్గొన్నవారికి లైవ్లో సూచనలు అందించగలిగిన ఐ.ఎస్.ఐ కూడా పాకిస్ధాన్ నడిబొడ్డున ఉన్న ఒబామా ఇంటిని కనిపెట్టలేక పోయాననడం ఇంకా విచిత్రం. లాడెన్ కొరియర్ల కదలికలపైనా, అతని స్ధావరంపైనా గత సంవత్సరం జులై లోనే సి.ఐ.ఏ కి ఐ.ఎస్.ఐ సమాచారం ఇచ్చినా పది నెలల తర్వాత మాత్రమే అతడిని చంపడానికి పూనుకోవడం మరింత విచిత్రం.
ఒసామా నిజంగా అమెరికా చెబుతున్నట్లు మే 2 తేదీనే చంపారా, లేక ఎప్పుడో చనిపోయిన ఒసామాను దురాక్రమణ యుద్ధాలను కొనసాగించడానికి ఇప్పటివరకూ బతికించి ఉంచి రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నిమిత్తం తన రేటింగ్ పెంచుకోవడానికి ఇప్పుడు చావు నాటకం ఆడారా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలతో పాటు కౌంటర్కరెంట్స్ లాంటి వెబ్సైట్లలో ఇటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ విశ్లేషకులు వ్యాసాలు రాస్తున్నారు. కుట్ర కుతంత్రాల పుట్టలైన సి.ఐ.ఏ, ఐ.ఎస్.ఐల చేత ఇలాంటి కధలు పుట్టించడానికి, నాటకాలు రక్తి కట్టించడానికి అమెరికా తెగిస్తుందనడంలో సందేహం లేదు. ఎవరో ఎందుకు? అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న రిపబ్లికన్ పార్టీ ప్రముఖులే ఒసామా చావు ఫోటోలు విడుదల చేయకపోవడం సరైంది కాదంటున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికైనా అమెరికా సదరు ఫోటోలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఫోటోల వల్ల జాతియ భద్రతకు విఘాతం కలుగుతుందనడం, మరిన్ని టెర్రరిస్టు చర్యలకు ఆస్కారం ఇస్తుందనడం “తాటి చెట్టు ఎందుకెక్కావంటే, దూడ మేతకోసం” అనడంతో సమానం.
పాలస్తీనియుల భూభాగాన్ని దౌర్జన్యంగా లాక్కొని ఇజ్రాయెల్ దేశాన్ని అక్రమంగా ఏర్పాటు చేసి లక్షలమంది పాలస్తీనీయులకు నిలవ నీడ లేకుండా చేసిన ఫలితంగానే అమెరికా, పశ్చిమ రాజ్యాలపై అరబ్, ముస్లిం ప్రజలు కడుపుమండి టెర్రరిస్టులు గా మారిన సంగతి ప్రపంచ రాజకీయాల మహామహా పరిశీలకులంతా ఏకగ్రీవంగా అంగీకరించే విషయం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై దాడులపై విచారణ చేసిన సెనేట్ కమిటీ విచారణలో అమెరికాపై ముస్లింల ఆగ్రహావేశాలకు ఇదే కారణమన్న సంగతి వెల్లడైంది కూడా. తనమాట వినని ఇరాన్, సూడాన్, లిబియా, ఆఫ్ఘనిస్ధాన్ లపై ధూర్త రాజ్యాలుగా ముద్రవేసి వారిపై అన్యాయంగా అన్నిరకాల ఆంక్ధలు విధించి అనేక మంది ముస్లిం ప్రజలు చనిపోవడానికి దోహదం చేసీనందున అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలపై టెర్రరిస్టు దాడులు కొనసాగడానికి కారణమని పశ్చిమ దేశాల స్కాలర్లే బహిరంగంగా అంగీకరించే వీషయం. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా మేధావి నోం ఛోమ్స్కీ ఈ విషయంలో అనేక పుస్తకాలు, వ్యాసాలు రాయడమే కాక ప్రపంచ వ్యాపితంగా సెమినార్లు, సదస్సులలో అనేక వందల సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కూడా.
ఈ వాస్తవాలన్నింటినీ తన కార్పొరేట్ వార్తా సంస్ధల గోబెల్సు ప్రచారంతో మరుగుపరిచి వికీలీక్స్ లీక్ చేస్తున్న డిప్లొమేటిక్ కేబుల్స్ వలన జాతీయ భద్రతకు విఘాతమని చెప్పుకోవడం పరమ రోత పుట్టించే విషయం. అదలా ఉండగానే ఇప్పుడు లాడెన్ మృత ఫోటోలవల్ల జాతీయ భద్రతకు విఘాతమని చెప్పుకోవడం ప్రపంచంలో నియంతృత్వ ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాలను స్ధాపిస్ధానని ఊరేగే ప్రపంచ పోలీసు రాజ్యాధిపతి ఒబామాకి అబద్ధం చెప్పినా అతికినట్లుండాలన్ని సంగతి తెలియదనుకోవాలా? లాడెన్కోసం రెండు దేశాల్లో లక్షల మందిని చంపిన వాడు ఒక్క టెర్రరిస్టు మృత ఫోటోలకు భయపడడమా!? నవ్విపోదురు గాక నాకేమిటికీ సిగ్గు! అని డిసైడ్ చేసుకున్నాడా ఒబామా?
“మృత ఫొటోలు” ఏంటండీ? “మృతి తాలూకు” ఫొటోలా?
అవునండీ. “సోమవారం మా కమెండోల కాల్పుల్లో చనిపోయాడు. అందుకు సాక్ష్యం ఇవిగో చనిపోయిన లాడెన్ ఫోటోలు” అని ఫోటోలు విడుదల చేయమని అడుగుతున్నారు. ఎక్కడ సమాధి చేశారో చెప్పడానికి కూడా వెనకాడుతున్నారు. అందుకనే అనుమానాలు.
‘మృతి ఫోటోలు’ అంటే సరిపోతుందా?
అవును. ఫోటోలే మృతి చెందినట్టు అర్ధం వస్తోందిక్కడ. గుర్తించి తెలియజేశారు. కృతజ్ఞతలు. మారుస్తాను.