లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?


Mumbai policeman feeding child injured in terror attack

ముంబై ఉగ్రవాద దాడిలో గాయపడ్డ బాలుడికి మంచినీళ్ళు తాపిస్తున్న ముంబై పోలీసు (నవంబరు 28, 2008 ఫోటో)

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా అనుమతి లేకుండానే మాఇంట్లో జొరబడి వాడ్ని తీసుకెళ్తావు. అది నేరమైనా తప్పదు” అని ఒక పాకిస్తానీయుడు కామెంట్ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ రాసింది. ఇక్కడ లాడెన్ పైన నేరారోపణ మాత్రమే జరిగిందనీ, ఆ నేరం రుజువు కాలేదనీ లాడెన్ సమర్ధకులు మర్చి పోతున్నారు లేదా మరిచిపోయినట్లు నటిస్తున్నారు.

ముంబైలో తాజ్ హోటల్‌పై టెర్రరిస్టు దాడి జరిగింది. మూడు రోజులపాటు హోటల్‌ని వశంలో ఉంచుకుని లోపల ఉన్న భారత అతిధులను 370 మందికి పైగా చంపేశారు. ముంబైలోనే యూదు మత మందిరంపై దాడి చేసి అక్కడా కొందర్ని చంపేశారు. పట్టుకోబోయిన పోలీసు అధికారుల్ని కాల్చి చంపేశారు. ప్రపంచం అంతా ఈ ఘోరకలిని చూసింది. ఈ ఘోరానికి ముందు తాజ్ హోటల్‌ని సందర్శించి అన్ని మార్గాలను పటం గీసుకుని రెక్కీ నిర్వహించిన నిందితుడు హేడ్లీ ఇప్పుడు అమెరికాలో బందీగా ఉన్నాడు. అమెరికా, ఇండియాల మధ్య నేరస్ధుల అప్పగింత ఒప్పందం ఉంది. దాని ప్రకారం హేడ్లీని తమకు అప్పగించమని ఇండియా రెండు సంవత్సరాలనుండి అడుగుతోంది. హేడ్లీతో పాటు రాణా అనే మరో నిందితుడు కూడా అమెరికాలోనే ఉన్నాడు. “పాకిస్ధాన్ అధికారులు, పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశాల ప్రకారమే తాజ్ హోటల్‌పై రెక్కీ నిర్వహించామని హేడ్లీ చెప్పాడు. అది అన్ని పత్రికల్లో వచ్చింది. అంటే హేడ్లీ, రాణాలు నిందితులు మాత్రమే కాదు. దోషులు కూడా. హేడ్లీని కనీసం విచారించడానికి, అది కూడా ఇండియా దర్యాప్తు అధికారులు అమెరికా వచ్చి విచారించడానికి అనుమతి ఇవ్వమని ఇండియా ప్రాధేయపడుతున్నా అమెరికా అనుమతించడాం లేదు.

David Coleman Headley

ముంబై దాడుల ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్‌మెన్ హేడ్లీ

పాకిస్ధాన్ గగన తలంలో ఎగరాలంటే విదేశాలకు చెందిన చిన్న విమానమైనా పాకిస్ధాన్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. లేకుంటే గాలిలోనే పేల్చి కూల్చే అధికారం పాకిస్ధాన్‌ని ఉంటుంది. అటువంటి అంతర్జాతీయ చట్టం పాటించకుండా అమెరికా హెలికాప్టర్లు నాలుగు 69 కమెండోలతో వెళ్ళి పాకిస్దాన్ మిలట్రీ అకాడమీకి కూత వేటు దూరంలో ఉన్న ఇంటిపై దాడి చేసి నిరాయుధుడైన అనుమానితుడు లాడెన్‌ను కంటిలో, గుండెలొ కాల్చి చంపింది. చంపిన తర్వాత కూడా పాకిస్ధాన్‌కి చెప్పలేదు. లాడెన్ విగత శరీరాన్ని, గాయపడ్డ అతని భార్యతో సహా తీసుకొని అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధాన్ గగన తలాన్ని వీడిన తర్వాతే పాకిస్తాన్‌కి తెలిపినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. లాడెన్ ఇన్నాళ్ళూ పాకిస్ధాన్‌లో ఉండడం నేషనల్ ఎంబరాస్‌మెంట్ అని పాకిస్ధాన్ పత్రిక డాన్ అభివర్ణించింది గానీ, నిజానికి పాకిస్ధాన్ ప్రభుత్వానికి గానీ, మిలట్రీకి గానీ చెప్పకుండా వారి రాడార్లను జామ్ చేసి మరీ పాకిస్ధాన్ గగనతలంలో అమెరికా హెలికాప్టర్లు చొరబడడమే పాకిస్ధాన్‌కీ, పాక్ ప్రజలకూ నిజమైన “నేషనల్ ఎంబరాస్‌మెంట్ కాదా?

అయినా సరే, జస్టిస్ డన్ (న్యాయం జరిగింది) అని అమెరికా పత్రికలన్నీ పతాక శీర్ధికలు పెట్టి లాడేన్ మరణానికి సంబరాలు జరుపుకున్నారు. న్యాయం జరిగింది అనడమంటే బిన్ లాడెనే టవర్లను కూల్చాడని నిర్ధారించినట్టే. ఎవరు నిర్ధారించారు? అమెరికా అధ్యక్షుడు, అధికారులు, సి.ఐ.ఏ నిర్ధారిస్తే అది చెల్లుతుందా? కనీసం అమెరికా చట్టాలైనా అందుకు ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు. నిందితుడిపై నేరనిర్ధారణ జరిగే వరకూ దోషి కానేరడు అని ప్రజాస్వామిక సూత్రాలు చెబుతాయి. అవి అందరికీ ఆచరణీయమని అమెరికా, ఇండియాలతో పాటు ప్రజాస్వామ్య ప్రియులంతా అంగీకరిస్తారు. అవేమీ జరగకుండా లాడెన్ దోషి అని నిర్ధారించడమే కాకుండా అతను నిరాయుధుడై ఉన్నా అరెస్టును ప్రతిఘటించాడన్న సాకుతో కాల్చి చంపింది అమెరికా పాలక వ్యవస్ధ. అదేనా న్యాయం. అవును మూడువేలమంది పొట్టనబేట్టుకున్న నరహంతుకుడిపై విచారణ కావాలా? కాల్చి చంపడమే నీతి. అదే న్యాయం అని ప్రపంచంలోని ప్రధాన స్రవంతి కార్పొరేట్ పత్రికలు తేల్చాయి. ఇండియా ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తూ ప్రకటించింది. మన తెలుగువారు కూడా కోంతమంది సమర్ధిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని సమర్ధిస్తూ డిఫెన్సు లాయర్ లాగా వాదిస్తున్నారేంటి అని ఒక మిత్రుడు ఈ బ్లాగర్ పై ఒకింత నిరసన వ్యక్తం చేశాడు కూడా.

సరే ఆటవికమైనా అదే న్యాయం అనుకుందాం. దాదాపు నాలుగొందలమందిని మనం చూస్తుండగానే మూడురోజులపాటు నరకంతో సమానమైన మానసిక హింసలు పెట్టి చంపేశారు హేడ్లీ, రాణాలు. అమెరికా ప్రభుత్వానికి చెప్పకుండా, అమెరికా జైలులోకి చొరబడి హేడ్లీ, రాణాలను అక్కడే చంపేసి వద్దామా? ఈ లోపు అమెరికా చేతుల్లొ చనిపోతే అమరవీరులుగా మిగలవచ్చు. కానీ నాలుగొందలమందిని చంపిన వారిని అప్పగించండంటూ ఎన్నాళ్ళని దేబిరించాలి? టెర్రరిజంపై యుద్ధం అని అమెరికానె ప్రకటించింది గదా? అమెరికా, తన స్వార్ధం కోసం తయారు చేసిన టెర్రరిస్టులపైనే యుద్ధం ప్రకటించి, “నువ్వు నాతో లేకపోతే టెర్రరిజాన్ని సమర్ధించినట్లే” అన్న బుష్ గారి (అ)న్యాయ సూత్రానికి మనం కూడా తలలూపేము. తీరా మన భూభాగంపైనే ముస్లిం ఐన ఒక అమెరికన్ (హేడ్లీ) టెర్రరిస్టు దాడి జరిపి నాలుగొందలమంది చనిపోవడానికి కారణమైతే అతన్ని అప్పగించడానికి అమెరికా ఎందుకు ఒప్పుకోదు? అసలైనా అమెరికా ఒప్పుకునేదేంటి? మనమే రహస్యంగా వెళ్ళి హేడ్లీని చంపి వద్దాము. అందుకు తగిన పధకాన్ని భారత ప్రభుత్వం తయారు చేయాలి. సైనికులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి అనేక మంది సిద్ధం కావచ్చు. చంపదలుచుకుంటే అమెరికాలాగా హెలికాప్టర్‌లో వెళ్ళే చంపనవసరం లేదు. కానీ న్యాయం జరగాలి. నాలుగొందల మందిని భారతీయులతో పాటు, దైవ సమానమైన అధితులనూ చంపినందుకు న్యాయం జరగాలి. హేడ్లీని అమెరికా అనుమతి లేకుండా, విచారణ లేకుండా (నిజానికి విచారణ జరిగింది) దోషిగా రుజువు కాక పోయినా (నేరాన్ని నిందితులు ఒప్పుకున్నారు) హేడ్లీని చంపి న్యాయాన్ని నిలపాలి.

ఆపని చేద్దామా? హేడ్లీని చంపుదామా? న్యాయం సాధిద్దామా?

10 thoughts on “లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

  1. హాడ్లీ ని కావాలంటే అమెరికా ని నిరభ్యంతరంగా అడగొచ్చు. అడగండి. అంతే కాని, ఒసామాను పాక్ లో చొరబడి చంపిన తీరు గురించి ప్రశ్నించడం సహమతంగా లేదు.నాకయితే ఎలాంటి తప్పు కనిపించడంలేదు. ముల్లు ముల్లు తోనే తియ్యాలి. ఇది ఆటవిక న్యాయం ఎలా అవుతుంది? జరిగిన అన్యాయన్ని సహించలేక, అనుకున్నది అమలు పరిచారు.తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం సాధించుకున్నారు. వాళ్ళకి మనలా, అడుక్కోవడం, దేబిరించడం రాక, నిశ్శబ్దం గా చంపి సముద్రం లో విసిరేసారు. మాతృ భూమి పై ఉన్న మమకారం, అవమానానికి ప్రతీకారం లో ఎటువంటీ తప్పు కనిపించడం లేదు.

    ఇక భారత దేశం అంటారా? వెన్నెముక గల దేశం ఎప్పుడయ్యింది గనక? భారతీయులకు అన్యాయాలను చూస్తూ, సహించడం, ఊరుకోవడం, గుడ్లల్లో నీరు కుక్కుకోవడం, చెయ్యి చాపి దేబిరించడం (మీరన్నదే) నర నరాల్లో జీర్ణించుకుపోయింది.
    ఈ పనికి రాని, చేత కానితనానికి మనం అందంగా, శాంతి కాముకాత్వం అని పేరు పెట్టుకుంటున్నాం.

    మనదేశం లో జరుగుతున్న అన్యాయాలే తీసుకొండి. మొన్నొక రామ లింగరాజు, నిన్న రాజా,కల్మాడీ, ఇవ్వాళ ఇంకొకడు….ఇలా చూస్తూ ఉంటామే కాని, నోరెత్తి ఇదేమిటని అడగం. ఒక డెబ్భయి ఏళ్ళ ముసలాయన,ఇదేమిటని నిలదీస్తే, పోలో మంటూ దేశంమొత్తం ఆయన వెంట ప్లకార్డ్లు పట్టుకొని కొవ్వొత్తులు వెలిగించి ఆమాత్రానికే అదేదో దేశసేవలా చాతీలు రెండంగుళాలు ఉబ్బిపోయాయి . అంటే అప్పటిదాక ఇలా మెడలు వంచొచ్చన్న అలోచన అణుమాత్రమయినా రాలేదు మాకు.

    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయ్ లెండి. మన నిరసనలేవయినా ఉంటే, ఏడుపులేమయినా ఉంటే ఇలా బ్లాగుల్లో ఏడ్చేద్దాం.

  2. పేరు పూర్తిగా ఉంటే బాగుండేది. ఏదో ఒకటి, సంబోధన కోసం.

    మీ కామెంటు సారాంశం ఏదయినా అందులో మీ నిజాయితీ కనిపిస్తోంది.

    అమెరికాని ఇండియా చాలా సార్లు అడిగింది. ముందు అప్పగించమని నాలుక్కరుచుకొని ఊరికే విచారిస్తాం రమ్మంటారా అనడుగుతోంది. దానికీ అమెరికా ఒప్పుకోవడం లేదు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి సహకరించమని అన్ని దేశాల్ని బుష్ ఆజ్ఞాపించాడు. నావైపు లేక పోతే ఉగ్రవాదాన్ని సమర్ధించినట్టే అన్నాడు. అది సరైందేనా?

    బిన్ లాడెన్‌ గతంలో ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన రష్యాకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అతనికి అమెరికాయే ఆయుధాలు, డబ్బు అన్నీ ఇచ్చి పెంచి పోషించింది. రష్యా సైన్యం వెళ్ళిపోయాక అమెరికా సైన్యం ఆక్రమించుకుంది. కానీ రష్యా ఆక్రమణకి లొంగని లాడెన్ అమెరికా ఆక్రమణనీ వ్యతిరేకించాడు. అందుకే అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయ్యాడు.

    ట్రేడ్ సెంటర్ టవర్స్ కూల్చడం వెనక అమెరికా పాలకుల్లోని ఒక సెక్షనే పూనుకుందని అమెరికాకి చెందిన ప్రముఖులే చాలా విశ్లేషణలు రాశారు. డాక్యుమెంటరీలు తీశారు. టవర్లు పద్ధతిగా కూలిపోవడం వెనక బాంబింగ్ (బిల్డింగ్ లోపల) ఎలా జరిగిందీ వివరాలతొ హాలీవుడ్ హీరో చార్లీ షీన్ ఓ డాక్యుమెంటరీ తీశాడు. అవేవీ వెలుగులోకి రాలేదు.

    లాడెన్ ఒక్కడే కాకుండా అమెరికా వారి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. నేరస్ధుడ్ని విచారించి నేరం రుజువు చేయకుండానే కాల్చి చంపటానికి పోలీసుకి అనుమతిస్తే అతను కాల్చి చంపిన వారంతా నేరస్ధులే పొమ్మంటాడు.

    అమెరికా కనీసం పోలీసు కూడా కాదు. రెండొందల దేశాల్లో ఒక దేశం. అసలు నేరం చేశాడని ఆరోపించబడినవాడు నేరం చేసిందీ లేనిదీ విచారించకుండా శిక్షించడాన్ని ఎలా సమర్ధించగలమో నాకర్ధం కాదు. ఇక చట్టాలెందుకు? నేర విచారణా వ్యవస్ధలెందుకు? నేరం చేశాడంటున్నారు కదా. కోర్టులో అదే నిరూపించండి. శిక్షించండి. శిక్షించడానికి చట్టాలు, పద్దతులూ ఎందుకు పెట్టుకున్నాం? బలం ఉన్నవాడి చేతిలో న్యాయం బందీ కాకుండా ఉండటానికి. రేపు ఇండియా మీదికి కూడా వస్తాడు అమెరికనొడు. అందుకే ఆఫ్ఘనిస్ధాన్లొ తిష్టవేయడానికి యుద్ధం చేస్తున్నాడు.

    దేశాల స్వాతంత్రాల్నీ, సార్వభౌమాధికారాల్నీ గుర్తించని అమెరికాకి శిక్ధించే అధికారం ఎక్కడిదని అడగడం పోయి, వాడికే మద్దతిస్తే ఇక స్వతంత్ర దేశాలేవీ మిగలవు.

    నేనంటున్నది లాడెన్ దోషి కాదని కాదూ, అవుననీ కాదు. అతని దోషిత్వాన్ని నిరూపించి శిక్షించండి అని మాత్రమే. చట్టాల్నీ, సూత్రాల్నీ పాటించి వాటి ప్రకారమే శిక్షించండి అనే అంటున్నా. చట్టాలూ, నిబంధనలు పాటించనవసరం లేదని బలం ఉన్నవాడికి అవకాశం ఇస్తే వాడి అరాచకాలకి అంతూ పొంతూ ఉండదనీ మన భారత దేశ వలస చరిత్రే నిరూపించడం లేదా?

    అమెరికన్లకి మాతృ భూమిపై మమకారం ఉన్నట్లే మీకూ, నాకూ, ఇరకీయులకీ, ఆఫ్ఘన్లకూ కూడా ఉంటుంది. మరి ఆ రెండు దేశాల్ని ఆక్రమించి మిలియన్లమంది జనాల్ని చంపుతున్నందుకు శిక్ష ఏంటి అని దీని తర్వాత పోస్టు లో అడిగాను. దానికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

  3. లాడెన్ “అమెరికా నా బద్ధ శత్రువు” అని పబ్లిక్ గ అన్నట్లు హీడ్లీ “ఇండియా నా బద్ధ శత్రువు” అంటే మీరన్న పని చెయ్యచ్చు.

  4. లాడెన్‌కి అమెరికా ఒకప్పుడు మిత్రుడే. అసలు లాడెన్‌ని పైకి తెచ్చిందే అమెరికా. తర్వాత అమెరికాకి శత్రువుగా ఎందుకు మారాడో ఆలోచించారా?

    అమెరికాకి మిత్రుడిగా ఉన్నపుడూ, శతృవుగా ఉన్నపుడూ ఒసామా ఒకటే పని చేశాడు. అది ఆఫ్ఘనిస్ధాన్ ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడ్డం.

    పోరాడ్డానికి లాడెన్ ఎంచుకున్న పద్ధతిపైన ఇతరులకు అభ్యంతరాలుండవచ్చు.

    అసలు మూడు వేలమంది అమెరికన్లను చంపాడు (నిరూపణ కాకపోయినా). క్రూరుడు కాబట్టి చంపడం కరెక్టే అంటారే గాని, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో మిలియన్ల మందిని చంపి ఇంకా చంపుతూనే ఉన్న అమెరికా క్రూరత్వం గురించి ఒక్క ముక్క గూడా ఆలోచించరేం?

  5. అదేనండి. మన ప్రారబ్ధం!!!

    ఒకసారి విన్నవించుకున్నాం
    వేడుకున్నాం
    సలహా అడిగాం.
    అమెరికా హూంకరించేసరికి, మెల్లిగా “అబ్బే లేదు. ఏదో ఫార్మాలిటి కోసం విచారణ చేసుకుంటాం: అంటున్నాం.అంతే గా…
    ఇంతోటి భాగోతానికి, మనకి ఏళ్ళు పట్టాయి.

    మనకున్న సహనం అమెరికా కి లేదు. తాడొ పేడో తేల్చుకోవాలనుకున్నారు . తేల్చేసారు…. న్యాయం ధర్మం, చట్టం తర్వాత చూసుకుందాం అన్న తెంపరితనం తెగువ కి అభినందించాలి.

    మన భారతీయులం అలా ఇంకో వందేళ్ళకయినా దావూద్ ఇంటి మీద దాడి చెయ్యగలమా? అంత ధైర్యం మనకుందా?

  6. బిజినెస్ లోనూ, యుద్ధం లోను, మానవత్వం పనికి రాదు.
    పోరాడుతున్నప్పుడు, మన గెలుపు గురించి, ఎదుటిమనిషి ఓటమి గురించి మాత్రమే అలోచించాలి.
    ధర్మం, న్యాయం అస్సలు పనికి రావు.

    చట్టం గురించి మాత్రమే అలోచించాలి. లాభ నష్టాల బేరీజులు మాత్రమే ఉంటాయి

    అన్నట్టు నా పేరు రాయక పోవడానికి పెద్ద కారణాలేం లేవు.
    అనవసరమయిన పబ్లిసిటీ ఇష్టం ఉండదు గనక..
    అంత మాత్రాన నేనేదో ఫేక్ ఐ డి అనుకొనేరు…..
    మైల్ ఐడి ఉంది కదా..

  7. అమెరికా ప్రపంచ పోలీసు. దానికే సర్వహక్కులూ, అతిక్రమణల అధికారాలున్నాయని భావిస్తుంది. ప్రపంచంలో నెంబర్ వన్ టెర్రరిస్టు దేశం అమెరికా. అమెరికా టెర్రరిజాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి?

  8. అవును. ధైర్యం లేదనుకోండి. అలా చొరబడి చంపడంలో ఉన్న చట్ట వ్యతిరేకతని తెలియజేయడానికి పోల్చాను.

    ధైర్యం గురించి కాదు నేనంటున్నది. అది సరైందేనా అని.

  9. అబ్బే మీపేరే రాయాలని కాదు. నేను జవాబు ఇచ్చేటప్పుడు సంబోధించి రాయడం అలవాటు. ఇంటర్నెట్లో అలియాస్ పేరే వాడాలి. సొంతపేరు, ఊరు, వివరాలు ఇస్తే వాటిని గూగుల్ లాంటి సంస్ధలు వ్యాపారానికి వినియోగించుకుంటాయి. గూగుల్ ఘోరాలపైన రెండు ఆర్టికల్స్ రాశాను. వీలుంటే చదివి అభిప్రాయం రాయండి. రాయకపోయినా ఫర్లేదు.

    చట్టం గురించి ఆలోచించాలన్నారు కదా. అదే నేనూ అంటున్నది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అలా మరొకరి దేశంలో జొరబడి వారి దేశంలో ఉన్నవారిని చంపి శవాన్ని దొంగిలించడం, అతని భార్యని తీసుకెళ్ళి పోవడం చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తుంది కనకనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ న్యాయ స్ధాన ఏర్పాటులో అమెరికా సంతకం చేయకుండా తప్పించుకుంది.

    యుద్ధాల సందర్భాల్లో కూడా కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నాయి దేశాలు. జేనీవా తీర్మానాలని అంటారు. చిత్రం ఏంటంటే అమెరికా వాటిని అడ్డంగా ఉల్లంఘిస్తూనే ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్ధాన్ లమీద దాడులు చేయడానికి ఆ తీర్మానలనే అడ్డం పెట్టుకుంటుంది.

  10. లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?
    ______________________________________________

    Thats a good idea. But పిల్లి మెడలో గంటకట్టేదెవరు?

వ్యాఖ్యానించండి