డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ


google_watching_you

గూగుల్ చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త!

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో అత్యధిమ భాగాన్ని కంట్రోల్ చేస్తున్న గూగుల్ ఇలాంటి నేరాలకు పాల్పడటం కొత్తకాదు. అమెరికా, జర్మనీలతో సహా అనేక పశ్చిమ దేశాలు గూగుల్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాయి.

మొబైల్ ఫోన్ల కోసం గూగుల్ ఏండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసింది. ఓపెన్ సోర్సు ద్వారా అందుబాటులో ఉండే ప్రోగ్రాంల ఆధారంగా రూపొందించిన ఈ సిస్టం ఉచితంగా లభ్యమవుతుంది. దానితో మొబైల్ ఫోన్ల తయారీ సంస్ధలు ఏండ్రాయిడ్ సిస్టంను వినియోగించి తమ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులు ఏ ప్రాంతంలో నివసిస్త్తున్నదీ, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నదీ వివరాలను గూగుల్ సేకరిస్తున్నది. తద్వారా ఆయా ప్రాంతాల వారికి ఉపయోగపడే సర్వీసులు రూపొందించుకొని కస్టమర్లను ఆకర్షించడం, వివిధ లొకేషన్లకు తగిన ప్రకటనలను రూపొందించడం చేయడం ద్వారా మార్కెట్‌ను పెంచుకోవచ్చు. దానితో పాటు వినియోగాదారుల ఏకాంతానికి (ప్రైవసీ) భంగం కలిగించడానికి అనేక అవకాశాలు ఉంటాయి.

వినియోగదారుల లొకేషన్ల వివరాలు దొంగిలించి వాటి ఆధారంగా మార్కెట్ పెంచుకునే పద్దతి మొబైల్ మార్కెట్‌లో పోటీ లేకుండా చేసుకోవడానికీ, పోటీదారులపై అసంబద్ధమైన సానుకూలత (అడ్వాంటేజ్) సాధించడానికి తోడ్పడుతుంది. ఇది మార్కెట్ సూత్రాల ప్రకారం నేరం. అలాగే వినియోగదారుల సమ్మతి లేకుండా వారి డేటా దొంగిలించడం కూడా తీవ్రమైన నేరం. దొంగిలించడంతో పాటు ఆ వివరాల ఆధారంగా ప్రకటనలు రూపొందించి వినియోగదారులను హోరొత్తించడం మరోనేరం. లొకేషన్ వివరాలతో పాటు యూజర్ల ఇతర వ్యక్తిగత సమాచారం కూడా మొబైల్ ఫోన్లలో భద్రపరుచుకుంటారు. వాటిలో బ్యాంక్ ఎకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డు నంబర్లు, వివిధ ఏ.టి.ఎం ల పాస్‌వర్డులు, స్నేహితులు, బంధువుల ఫోన్ల నంబర్లు… ఇవన్నీ ఉంటాయి. వీటిని గూడా దొంగిలించవన్న గ్యారంటీ ఏమీ లేదు.

యూజర్ల వ్యక్తిగత వివరాల సేకరించి ప్రకటనల స్వభావాన్ని యూజర్ల అలవాట్లకు అనుగుణంగా రూపొందించడం మార్కెట్లొ ఆధిపత్యాన్ని సమకూర్చి పెడుతుంది. మొబైల్ ప్రకటనల రంగంపై ఆధిపత్యం సాధించడానికి తోడ్పడుతుంది. సమిపంలో ఉన్న హోటళ్ళు, గ్యాస్ స్టేషన్లు, షాపులు తదితర వివరాలను వినియోగదారులకు అందుబాటులో ఉండడం ఓ విధంగా అనుమతించదగ్గదిగా కనిపిస్తుంది. కాని వినియోగదారులు ఊహించలేని విధంగా వారి వివరాలను వినియోగించుకుని డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు వినియొగదారుల ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా ఒక్కోసారి రాజకీయ సామాజిక హక్కులు భంగంకావడానికి కూడా దారితీస్తుంది. లొకేషన్ ఆధారిత సర్వీసుల్లో అనేక లూప్ హోల్స్ ఉన్న సంగతిని అనేక మంది టెక్నాలజి నిపుణులు అంగీకరిస్తారు కూడా.

వినియోగదారుల కదలికలను రికార్డు చేయడానికి అనువైన ప్రోగ్రాం బ్లాక్‌బెరీ మొబైల్ ఫోన్లలో ఉండే బ్లాక్‌బెరీ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం అమెరికాలోని పరిశోధకులు యాధృచ్చికంగా గుర్తించారు. బ్లాక్‌బెరీ ఫోన్ జేబులో పెట్టుకుంటే చాలు, ఒక వ్యక్తి ఏఏ సమయాల్లో ఎక్కడ ఉన్నదీ, అతను ప్రయాణించిన మార్గమూ అన్నీ రికార్డవుతున్న విషయాన్నీ, రికార్డయిన వివరాలు బ్లాక్‌బెరీ సర్వర్లకు చేరుతున్న విషయాన్ని వీరు కనుగొన్నారు. అంటే బ్లాక్‌బెరీ వినియోగదారుడి ప్రైవసీ మొత్తం ఆ కంపెనీల చేతిలో చిక్కుకుపోయినట్టే లెఖ్ఖ. కొరియాలో గూగుల్ వివరాల సేకరణపై కూడా అక్కడి అధికారులకు ఈ అనుమానాలు వచ్చాయి. “కొరియన్ కమ్యూనికేషన్ కమిషన్ అనుమతి లేకుండా వినియోగదారుల వ్యక్తిగత లొకేషన్ వివరాలను యాడ్‌మాబ్ సేకరించినట్లుగా మాకు అనుమానాలున్నాయి” అని సౌత్ కొరియా పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల దాడిని గూగుల్ ధృవీకరించింది. పోలీసులకి సహకారం అందిస్తున్నట్లు అది తెలిపింది.

గూగుల్, ఏపిల్ కంపెనీలు వినియోగదారుల వివరాలను సేకరించడం, వాటిని వినియోగిస్తున్న పద్ధతులపై అమెరికాలో కూడా విచారణ జరుగుతోంది. అక్కది సేనేట్ సభ్యులే స్వయంగా విచారిస్తున్నారు. వినియోగదారుల లొకేషన్ ఆధారంగా ప్రకటనలను టార్గెట్ చేస్తూ రూపొందించడం గురించి గతంలో గూగుల్ సి.ఇ.ఒ లు అనేక సార్లు మాట్లాడారుకూడా.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలతో సహా దాదాపు 30కి పైగా దేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్ల డేటా దొంగతనంపై విచారణ నిర్వహిస్తున్నాయి. ఒక్క సియోల్ లోనే మూడు స్ట్రీట్ వ్యూ కార్లను వినియోగించి 600,000 మందికి పైగా వైర్‌లెస్ ఇంటర్నెట్ వినియోగదారుల లొకేషన్, ఈమెయిల్, ఈమెయిల్ పాస్‌వర్డులను గూగుల్ దొంగిలించినట్లు గత జనవరి నెలలోనె సియోల్ పోలీసులు ధృవీకరించారు. స్ట్రీట్ వ్యూ కార్లను పట్టణాల్లోని ప్రధాన కూడళ్ళలో నిలిపిఉంచి చుట్టుపక్కల ఉన్న వివిధ షాపులు, రోడ్డు దృశ్యాలు అన్నింటినీ ఫోటోలు తీయడానికి వినియోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఆ పట్టణంలోని వివిధ ప్రధాన సెంటర్లు, హోటళ్ళు, ఇతర సర్వీసుల కేంద్రాల వివరాలను ఇంటర్నెట్‌లో స్ట్రీట్ వ్యూ సర్వీసు దారా యూజర్లకు అందుబాటులోకి తేవాలన్నది అసలు లక్ష్యం. అయితే బాగుంటుంది కదా అని అందరూ అనుకున్నారు.

కానీ స్ట్రీట్ వ్యూ కార్లలో కెమెరాలతో పాటు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల కంప్యూటర్లలోకి జొరబడి అక్కడి సమస్త వివరాలను సేకరించే సాఫ్ట్ వేర్ ఉన్న సంగతిని మొదటిసారి జర్మనీ కనుగొంది. వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌లో డేటా ప్రవాహానికి రక్షణ ఉండదు. డేటా కొద్ది సెకన్ల పాటు గాలిలో ప్రయాణించడం వలన, గాలిలో ప్రయాణిస్తున్నంతసేపు రక్షణ ఉండదు. తగినవిధంగా పరికరాలు, సాఫ్ట్‌వేరుని వినియోగించి ఆ డేటాను దొంగిలించవచ్చు. గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లు ఫోటోలు తీయడంతో పాటు వైర్‌లెస్ కనెక్షన్లనుండి డేటాను దొంగిలించాయి. దొంగిలించిన డేటాను వేరే సర్వర్లకు మళ్ళించి హార్డ్ డిస్కులలొ స్టోర్ అయ్యె విధంగా గూగుల్ ఏర్పాట్లు చేసుకుంది. ఇది కనిపెట్టి గూగుల్‌ని ప్రశ్నిస్తే అది చెప్పిన సమాధానంలోనే దాని దగుల్బాజీతనం అంతా బైటపడింది.

వేరే అవసరం కోసం గూగుల్ ఉద్యోగి ఒకరు ఒక సాఫ్ట్ వేర్ రాసి పట్టుకున్నాడట. అతనికి తెలియకుండా ఆ సాఫ్ట్ వేర్ వచ్చి స్ట్రీట్ వ్యూ సాఫ్ట్ వేర్ లో కలిసిందట. అలా కలవడాన్ని గూగుల్ మేధావులు గమనించలేదట. ఈ విధంగా డేటా దొంగిలించడం ప్రారంభమైన ఐదు సంవత్సరాల మాత్రమే గూగుల్ అకృత్యం వెలుగులొకి వచ్చింది. ఆ ఐదు సంవత్సరాలూ ఇలా డేటా దొంగతనం నిరాటంకంగా కొనసాగింది. ఆ డేటాని భద్రంగా గూగుల్ దాచిపెట్టుకుంది కూడా. ఐదు సంవత్సరాలపాటు జరుగుతున్న సంబంధం లేని సాఫ్ట్ వేర్ కలిసి ఉండటాన్ని తాము కనిపెట్టలేకపోయామని గూగుల్ అధికారులు చెప్పారు. వారి మాటలని ఎవరూ నమ్మలేదు. బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గూగుల్ ది దుష్టబుద్ది అని తేల్చేశారు. అన్ని సంవత్సరాలపాటు వారికి తెలియకుండా జరిగిందనడం పూర్తి అబద్ధమని చీదరించారు. వినియోగదారుల్ని మోసం చేసిందని తూర్పారబట్టారు. ఎన్ని తిట్టినా గూగుల్ దులిపేసుకుంది. అబ్బే మెము అలాంటివారం కాదని చెప్పినా దాని చేష్టలకి తగిన కారణం ఇంతవరకూ చెప్పలేదు.

పశ్చిమ దేశాల్లొ ప్రభుత్వాలు బహిరంగంగా తిట్టి, విచారణ చేపట్టినా గూగుల తన కార్యక్రమాలని దక్షిణకొరియాలో యధావిధిగా కొనసాగించడం చాలా ఆశ్చర్యకరం. గూగుల్ అమెరికా కంపెనీ కావడం వల్లనే దాని ఆటలు కొనసాగుతుండవచ్చు. అమెరికాలోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కూడా గూగుల్ పై విచారణ జరుపుతున్నామని ప్రకటించింది. ఆ విషయం సంవత్సరం నుండీ చెబుతున్నా ఇంతవరకూ గూగుల్ పై ఏ చర్యా లేదు. ఇప్పటికీ వినియోగదారుల డేటా దొరకబుచ్చుకోవడానికి గూగుల్ అనేక పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఒకట్రెండు సంవత్సరాలనుండి గూగుల్ ప్రతి సర్వీసుకీ మొబైల్ నంబరు అడుగుతోంది. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేనప్పుడు అందించిన సర్వీసులకి కూడా ఇప్పుడు వాటిని అడుగుతోంది. దానికి సంబంధంలేని కారణాలు చెబుతూ మొబైల్ నెంబరు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. మొబైల్ నెంబరు దొరికిందంటే వినియోగదారుడికి సంబంధించిన చాలా వ్యక్తిగత వివరాలు గూగుల్ కి అందుబాటులోకి వస్తాయి. వాటన్నింటినీ అది సేకరించి భద్రం చేసుకుంటుంది.

ఈమెయిల్, బ్లాగర్, బజ్, పికాసా, ఆర్కుట్ ఇలా అనేక సర్వీసుల్ని గూగుల్ నిర్వహిస్తోంది. గత సంవత్సర కాలంగా అనేక సర్వీసుల్ని అది కొనుగోలు చేసింది కూడా. తన సర్వీసులన్నింటిని వినియోగించి వినియోగదారుల వివరాలను ఏదో పద్ధతిలో గూగుల్ సేకరిస్తుంది. ప్రపంచంలొ ప్రతి వినియోగదారుడి డేటా సేకరించపెట్టుకోవడాన్ని తన లక్ష్యంగా కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి సి.ఇ.ఒ ప్రకటించిన విషయాన్ని వార్తా సంస్ధలు గుర్తు చేస్తుంటాయి. “డోన్ట్ గో ఈవిల్” అన్నది గూగుల్ మోటోగా అది చెప్పుకుంటుంది. తన మోటోకి పూర్తి వ్యతిరేక దిశలో దాని వ్యాపారం, నడక, నడత అన్నీ ఉన్నాయి. గూగుల్ లేనిరోజుల్లొ ప్రపంచం శుభ్రంగా నడిచింది. ఇప్పుడు కూడా నడవగలుగుతుంది. ఉచితంగా లభించే సర్వీసుల కోసం వినియోగదారులు ఏదో ఒకటి కోల్పోవలసి వస్తుంది. కానీ వ్యక్తిగత ప్రైవసీ అనేది వ్యక్తుల అస్తిత్వానికీ, వారి వ్యక్తిత్వ సమగ్రతకీ శ్రీరామ రక్ష లాంటిది. అది దొంగతనానికి గురికావడానికి ఎట్టిపరిస్ధితుల్లో అంగీకరించరాదు. అవసరమైతే గూగుల్ సర్వీసుల్ని బహిష్కరించడానికి సైతం సిద్ధపడడం ద్వారా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s