రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్కు వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా పెంచడంద్వారా దేశంలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్ధాయిలో ఉన్న విషయాన్ని తెలియజెప్పింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించడమే తన ద్రవ్యవిధానం ప్రధాన కర్తవ్యమని చాటి చెప్పింది.
ప్రతి సంవత్సరం ద్రవ్యవిధానాన్ని అర్.బి.ఐ నాలుగు సార్లు సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి కావడానికి అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు కూడా సమీక్షించడానికి ఆర్.బి.ఐ గత సంవత్సరం నిర్ణయించింది. తాజాగా మంగళవారం జరిపిన సమీక్షా సమావేశంలో ఆర్.బి.ఐ రెపో రేటు, రివర్సు రెపోరేటు లను పెంచడానికి నిర్ణయం తీసుకుంది.
రెపో రేటును (అర్.బి.ఐ నుండి వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకున్నపుడు చెల్లించవలసిన వడ్డీ రేటు) 6.75 శాతం నుండి 7.25 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) పెంచింది, రివర్సు రెపో రేటును (వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లను ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసుకుంటే పొందే వడ్డీ రేటు) 5.75 నుండి 6.25 శాతానికి (50 బేసిస్ పాయింట్లు) పెంచింది.
రానున్న కాలంలో ద్రవ్యోల్బణం కట్టడికి రేపో రేటుపై ఆధారపడనున్నట్టు ఆర్.బి.ఐ గవర్నరు దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. ఇప్పటివరకు రెపోరేటును ఎంత పెంచితే రివర్సు రెపో రేటు కూడా అంతే పెంచుతు వచ్చింది ఆర్.బి.ఐ. ఇప్పటినుండి ఒక్క రేపోరేటు మాత్రమే పెంచే అవకాశం ఉందని ఆర్.బి.ఐ చెబుతున్నది. అది మరింత అగ్రెసివ్ అప్రోచ్ అవుతుంది.
దాదాపు రెండు సంవత్సరాలనుండి ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్.బి.ఐ, భారత ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆర్.బి.ఐ ఇప్పటికి తొమ్మిది సార్లు వడ్డీ రేట్లను పెంచింది. అయినా కట్టడి కాలేదు. ప్రభుత్వం కానీ, ప్రణాళీకా సంఘం గానీ ద్రవ్యోల్బణం తగ్గించచడమే తమ లక్ష్యం చెప్పడమె తప్ప అందుకోసం నిర్ధిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిర్ధిష్టత లేకుండా కారణాలు చెప్పడం, తగ్గిస్తామని హామీలు ఇవ్వడం మాత్రం క్రమం తప్పకుండా చేస్తుంటారు.
కొన్నాళ్ళు వర్షాలు పడక పంటలు బాగా పండకపొవడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని కారణాలు చెప్పారు. గత సంవత్సరం పంటలు బాగా కురిసినా ద్రవ్యోల్బణం తగ్గలేదు. సరఫరా అవరోధాలు ద్రవ్యోల్బణం పెంపుదలు కారణాలని మాట మార్చారు. ఇప్పుడేమో కోశాగార లోటు అధికంగా ఉండటం, ఫిస్కల్ డిసిప్లెయిన్ లేకపొవడం ద్రవ్యోల్బణం పెంపుకు కారణాలని చెబుతున్నారు. ఇవన్నీ ఆర్.బి.ఐ పరిధిలో లేనివే. కేవంలో ప్రభుత్వ చర్యల ద్వారానే ఆ కారణాలు వైదొలగుతాయి.
సరఫరా అవరోధాలు తొలగించాలంటే రోడ్లు, రైల్వేలు, ఆహార నిల్వ గిడ్డంగులు, మొదలైన మౌలిక రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దానికోసం “ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను” కూడా ప్రభుత్వం రెండు సంవత్సరాలనుండి అమ్ముతోంది. కానీ మౌలిక నిర్మాణాల ఆధునీకరణ పై కేంద్రీకరించిన దాఖలాలు లేవు. తానేమే కృషి చేయకుండా కేవలం ఆర్.బి.ఐ చర్యల మీదే ఆధారపడడం వలన ద్రవ్యోల్బణం కట్టడికి చిత్తశుద్ధితో కృషి జరగడం లేదని భావించవచ్చు.
ప్రస్తుతం ప్రధాన ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి దగ్గరగ ఉంది. నిజానికి దీన్ని 5.5 శాతానికి తగ్గించాలని గత సంవత్సరం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుని సాధించలేకపోయారు. ప్రస్తుత సంవత్సరం 6 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యం సాధించేది కూడా అనుమానమే. లక్ష్యాలు ఘనంగా పెట్టుకుని వాటిని చేరుకోవడానికి విఫలం కావడంలో ఇండియాకు ప్రపంచంలో ఘన చరిత్ర ఉంది. అందువలన తాజా లక్ష్యాన్ని కూడా మదుపుదారులు అనుమానంగానే చూస్తున్నారు.
ఆహార ధరలు, గత రెండు మూడు నెలలుగా పెరుగుతున్న ఇంధనం ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి తమ వంతుగా దోహదపడుతున్నాయి. ఈ ధోరణి దాదాపు ప్రధాన ఆర్ధిక వ్యవస్ధలన్నింటిలోనూ ఉంది. కాని ఇండియాలో మిగతా దేశాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం ఉంది. ఆర్ధిక వ్యవస్ధలోని మూఖ్యమైన పాత్రధారులపై నియంత్రణ లెకపోవడం, అవినీతి, నల్లధనం వ్యాప్తి లను అరికట్టడానికి రాజకీయ, పాలనా నిబద్ధతలు లేకపోవడం ఇండియా ఆర్ధిక వ్యవస్ధకు శాపాలు. వీటిని అరికడితే ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిపై నియంత్రణను సాధించవచ్చు. కాని అది జరిగే అవకాశం కనిపించడం లేదు.
అన్నా హజారే నిరహార దీక్షకు స్పందించి లోక్పాల్ బిల్లు తయారు చేసే కమిటీలో పౌర ప్రతినిధులను అంగీకరించీన కేంద్ర ప్రభుత్వం తీరా కమిటీ నియమించాక కమిటీలోని పౌర ప్రతినిధులపై దుష్ప్రచారం మొదలు పెట్టారు. కఠినమైన లోక్పాల్ బిల్లు రూపొందడానికి మార్కెట్ విధానాల పందితులకూ, వారికి వత్తాసు పలికే మంత్రులకూ ఇష్టం లేదని దాన్ని బట్టి అర్ధం అవుతున్నది. అంతే కాదు. మార్కెట్ స్వేచ్ఛా అర్ధిక విధానాలకూ, అవినీతికీ ఉన్న అవినాభావ సంబధాలను కూడా లోక్పాల్ గొడవ నిర్ద్వంద్వంగా నిరూపించింది.