ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు


Osama photo fakeఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల కండబలానికి ఎదురొడ్డి తన పద్ధతుల్లో పోరాడిన లాడెన్, చరిత్రలో నిలిచి ఉంటాడు.

స్టాలిన్ మరణానంతరం సోవియెట్ రష్యా అప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికాతో పోటీ పడుతూ తన సామ్రాజ్యాన్ని మిలట్రీ ఆక్రమణలతో విస్తరించుకుంది. దాన్లో భాగంగా దక్షీణాసియాలో, మధ్యప్రాచ్యంలొని అరబ్ దేశాలకు సమీపంగా వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించుకుంది. సౌదీ అరేబియాలో సంపన్న కుటుంబానికి చెందినప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్‌పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఆఫ్ఘనిస్ధాన్ పరాయి దేశం అయినప్పటికీ ఒక అగ్ర రాజ్యం తన ప్రయోజనాల కోసం తన పొరుగు దేశాన్ని ఆక్రమించుకోవడం సహించలేకపోయాడు లాడెన్.

అప్పటి ప్రచ్ఛన్నయుద్ధ పరిస్ధుతుల్లో అమెరికా లాడెన్‌కు అన్ని విధాలా సాయపడింది. అధునాతన ఆయుధాలు సమకూర్చి పెట్టింది. గూఢచర్య సమాచారాన్ని అందించింది. రష్యా సైన్యంతో పోరాడ్డానికి తగిన ట్రైనింగ్ ఇచ్చింది. అన్ని విధాలుగా సహకరించింది. చివరికి యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ భారాన్ని మోయలేక రష్యా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. స్టాలిన్ మరణానంతరం రష్యాలో మొదలైన పెట్టుబడిదారీ వ్యవస్ధ యుద్ధ ఖర్చులు భారమై అప్పులు తీవ్రమై కుప్పకూలితే అది రష్యాలొ సోషలిష్టు వ్యవస్ధ కుప్పకూలడంగా ప్రచారం చేసుకుని మార్కెట్ స్వేఛ్ఛా ప్రియులు సంతృప్తి పడ్డారు. ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలడంతో ప్రపంచాధిపత్యం కోసం ఇతర దేశాల్లో ఉంచిన మిలట్రీ స్ధావరాలను రద్దు చేసుకుంది రష్యా. అందులో భాగమే ఆఫ్ఘనిస్ధాన్ నుండి రష్యా సేనల ఉపసంహరణ.

రష్యా కూలాక ప్రచ్ఛన్న యుద్ధం గెలిచామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ సీనియర్ ప్రకటించుకున్నాడు. అమెరికా దేన్లో గెలిచింది? అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక యుద్ధం జరుగుతుంటే అందులో అమెరికా గెలిచిందా? కాదు. ప్రపంచ దేశాల్లొ ఉన్న సహజ వనరుల సంపదను కొల్లగొట్టడంలో అప్పటి రెండు అగ్ర రాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్న పోటిలో అమెరికా నెగ్గింది. వాస్తవానికి అక్కడ పోరాటం ఏమీ జరగలేదు. ఆధీన ప్రాంతాలని విస్తరించుకునే క్రమంలొ అందుకు యుద్ధ ఆర్ధిక వ్యవస్ధలను నిర్వహించగలగాలి. అటువంటి యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించలేక రష్యా చతికిలబడడమే అమెరికా గెలుపుగా బుష్‌కి కనపడింది. తనకు కనిపడినదాన్ని ప్రపంచానికి చెప్పి నమ్మించాడు బుష్.

అయితే రష్యా గానీ, అమెరికా గానీ తమ ఆధీనంలో ఉంచుకున్నది కేవలం భూభాగాలు, ఆ భూముల్లో ఉన్న ఖనిజాలు తదితర సంపదలు మాత్రమే కాదు. అవి తమ సామ్రాజ్యవాద విస్తరణలో ఎన్నడూ పట్టించుకోని ముఖ్యమైన అంశం ఒకటుంది. ఏంటంటే అవి అధీనంలో ఉంచుకునే ప్రాంతాలు కొన్ని స్వతంత్ర దేశాలు. అక్కడ ప్రజలు నివసిస్తారు. వారికి ఒక సంస్కృతి, భాష, మతం, జీవనవిధానం ఇవన్నీ ఉన్నాయి. వారికి తమకంటు ఒక జాతీయ ఐడెంటిటీ ఉంటుంది. వారు బతకడానికి వారి భూభాగాల్లొని సంపదను వినియోగించుకుంటారు. తమ తమ సంపదలను తామే వినియోగించుకుని తమ జాతి, సంస్కృతి, భాష, జీవనాలను పరిరక్షించుకోవాలని భావిస్తారు. ఇది ప్రకృతి సహజం. దీన్నెవరూ కాదనలేరు. ప్రకృతి సహజ సూత్రాల్నీ, సహజ న్యాయ సూత్రాలనీ నమ్మే వారెవరు వాటిని కాదనరు. కానీ కాదనే ధూర్తులు ఉన్నారు.

అవే అమెరికా, సోవియట్ రష్యాలు (ఇప్పటి రష్యా కాదు). రెండు అగ్ర రాజ్యాలు. తాము కాక ఇతర దేశాలన్నీ తమ ఆధీనంలో ఉండాలి. అక్కడ సంపదలను తమకు దోచి పెట్టే బ్రోకర్లు అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యాలి. ఆ బ్రోకర్లకు సహాయం (ఎయిడ్) పేరుతో కొన్ని మెతుకులు విసిరితే అవి తిని తమ దేశాల సంపదలను దోచిపెట్టాలి. అలా చేయకపోతే ఆ పాలకులు టెర్రరిస్టులు, ధూర్తులు, శాంతికి భంగం కలిగించేవారు వగైరా, వగైరాలుగా ముద్రవేయబడతారు. అది వేరే సంగతి. ఆధీన ప్రాంతాలని విస్తరించుకోవడంలో రష్యా చతికిలబడి తన సేనల్ని ఉపసంహరించుకున్నాక రష్యా సేనల స్ధానంలో తన సేనలను ఉంచాలన్నది అమెరికా లక్ష్యం.

అప్పటివరకు రష్యా ఆక్రమణలో ఉన్న దేశాలు తన ఆక్రమణలోకి తెచ్చుకోవడం అమెరికాకి కావాలి. అది జరిగితేనే అమెరికాకి ప్రచ్ఛన యుద్ధం గెలుపు సంపూర్ణం అవుతుంది. అందుకోసమే ఆఫ్ఘనిస్ధాన్‌లో రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాటానికి దిగిన లాడెన్‌కి మద్దతు ఇచ్చింది. లాడెన్ శక్తివంతంగా మారడానికి కావలసిన అన్ని సహయాలు చేసింది. సరే. ఇక రష్యా ఎలాగూ కూలింది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. అప్పుడు ఆఫ్ఘనిస్ధాన్ ఏం కావాలి? రష్యా ఆక్రమణనుండి బైటపడిన స్వతంత్ర దేశం కావాలి. ఇండియాను ఆక్రమించిన బ్రిటన్ వెళ్ళాక ఇండియా స్వతంత్ర రిపబ్లిక్ కావాలని భారత ప్రజలు కోరుకున్నట్లే ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలూ కోరుకున్నారు. రష్యా వెళ్ళినందుకు సంబరాలు చేసుకున్నారు, భారతీయులు చేసుకున్నట్టే.

రష్యా పెత్తనం ముగిశాక అమెరికా పెత్తనం ఆఫ్ఘనిస్ధాన్‌లో స్ధాపించబడాలి. లాడెన్ లాంటి వివిధ గ్రూపులకు సాయపడింది అందుకే. అయితే రష్యా పెత్తనంపై పోరాడినవారు అమెరికా పెత్తనాన్ని అంగీకరిస్తారా? తమ దేశం తమదేననీ, ఎవరి పెత్తనం వద్దని రష్యాని తరిమికొడితే, ఇంకో పెత్తందారు రావాలని ఆఫ్ఘన్లు ఎందుకు కోరుకుంటారు? బ్రిటిష్ వాడు వెళ్ళాక ఇదిగో నేనున్నానంటూ ఈ ఫ్రెంచి వాడో, జర్మనీ వాడో వచ్చి పెత్తనం చేస్తామంటే భారతీయులు ఊరుకునే వారా? ఊరుకోరు సరికదా వారిమీద కూడా పోరాటం చేసేవారు.

ఆఫ్ఘన్ ప్రజలు చేసింది అదే. లాడెన్‌కి సహకరించాను కాబట్టి పెత్తనం నాకివ్వమని అమెరికా బేరం పెట్టింది. లాడెన్, ఇతర గ్రూపులు ఒప్పుకోలేదు. దశాబ్దాలు పోరాడి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది అమెరికా పెత్తనాన్ని ఆహ్వానించడానికి కాదు. స్వతంత్రంగా ఎదగడానికి. అలా ప్రపంచ దేశాలు స్వతంత్రంగా ఎదగడానికి సామ్రాజ్యవాద దేశాలు ఒప్పుకోవు. ఒప్పుకుంటే అది సామ్రాజ్యవాద దేశం కాదు. మంచీ, మర్యాదా ఉన్న దేశం అవుతుంది. రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడినన్నాళ్ళూ సన్నిహిత మిత్రుడుగా ఉన్న లాడెన్, తన పెత్తనాన్ని అంగీకరించకపోయేసరికి హఠాత్తుగా టెర్రరిస్టు అయ్యాడు. ఆఫ్ఘనిస్ధాన్ స్వతంత్రానికి పోరాడిన లాడెన్, దానిలో భాగంగానే అమెరికా పెత్తనాన్నీ వ్యతిరేకించాడు. రష్యాతో పోరాడితే మితృడూ, తన పెత్తనాన్ని వ్యతిరేకిస్తే టెర్రరిస్టూనా?

మరి జంట టవర్లపై దాడుల సంగతేంటి? అవును అది ప్రశ్నే. దాడి ఎవరు, ఎందుకు చేశారు అని కనిపెట్టడానికి పరిశోధన జరగాలి. దోషిని పట్టుకోవాలి. విచారణ జరపాలి. దోషిగా కోర్టులు తేల్చాలి. అప్పుడే దోషికి శిక్ష. శిక్ష విధించడానికీ ఓక పద్దతి ఉంటుంది. అనాగరికంగా దేశాలమీద బడి బాంబులేసి, ప్రజల్ని చంపి, చంపినవాళ్ళందర్నీ టెర్రరిస్టులని ముద్రవేస్తే అది న్యాయమేనా? విజ్ఞులు ఆలోచించాలి. ఇప్పటికీ చూడండి, లాడెన్‌ను అనుమానితుడుగానే ఏ వార్తా సంస్ధ అయినా రాస్తుంది. అనుమానితుడు అని కాకపోతే ఆ అర్ధం వచ్చే ఇంకోపదం. కానీ ఎవరూ లాడెన్నే టవర్లు కూల్చాడనీ, కూల్పించాడనీ భాధ్యత గల ఏ పత్రికా రాయదు. నేరం రుజువయ్యేదాకా ఎవరూ దోషి కాదు, అనుమానితుడు మాత్రమే అన్నది ఆధునిక ప్రజాస్వామిక సూత్రం. అటువంటి సూత్రాలతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి ఆంబోతులకు పని లేదు.

తాము పెంచి పోషించిన లాడేన్ తమ పెత్తనాన్ని వ్యతిరేకించడం వారికి నచ్చలేదు. ఫలితమే టవర్లపై దాడి. టవర్ల కూల్చి వేతలో అమెరికా పైనే అనుమానాలున్నాయి. అది ఈ బ్లాగరు సొంత అభిప్రాయం కాదు. అమెరికాలో ప్రముఖులే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక విమానం టవర్ పైభాగంలో తాకడంతోటే అది మొదలంటా పద్ధతిగా కూలిపోవడం, రెండో టవర్‌ని కూల్చిందింటున్న విమాన దిశ, వేగం ఉన్న పద్ధతి వాటన్నింటినీ విశ్లేషిస్తూ అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఓ ప్రముఖ హాలివుడ్ హీరో ఛార్లీ షీన్ (వాల్ స్ట్రీట్ సినిమాలో యువ హీరో) ఒక డాక్యుమెంటరీ కూడా నిర్మించాడు. అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియాలో పుట్టి అమెరికా సహకారంతోనే పొరుగు దేశం ఆఫ్ఘనిస్ధాన్‌ స్వతంత్రం కోసం పోరాడం చేసిన బిన్ లాడెన్, ప్రఛ్ఛన్న యుద్ధం ముగిశాక ప్రపంచ శాంతి నెలకొందని చెప్పబడుతున్న సమయంలో అమెరికాలోని టవర్లపై బాంబులు ఎందుకు వేస్తాడు? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. సరే లాడెనే కూల్చాడు. కూల్చాడని అమెరికా అనగానే అతను దోషిగా తేల్చేస్తామా? విచారణ జరగాలి. సాక్ష్యాలు చూపి దోషిగా నిర్ధారించాలి. న్యాయం వేసిన శిక్షను అమలు చేయాలి. ఇది నాగరిక ప్రజాస్వామిక సమాజాల లక్షణం.

అమెరికా అధికారులు, పాలకులు ఏ క్షణంలో కూడా టవర్ల కూల్చివేతపై విచారణ జరపడానికి ఉత్సుకత చూపలేదు. విచారణ జరిగింది కూడా తంతేనని అమెరికా స్కాలర్లు, పరిశోధకులు అనేక మంది రాశారు, మాట్లాడారు. అవేవీ ప్రచారానికి నోచుకోవు. కనీసం ఓ చిన్న వార్తగా కూడా పనికి రాఫు. ఇండియాలో పెయిడ్ న్యూస్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గానీ, ఘనత వహించిన పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు ఆ విషయంలో ఎప్పుడో పండిపోయాయి. వాటిలో కొన్ని పుట్టిందే అందుకు. ఉదాహరణకు లాడెన్ మరణంపై బిబిసి వార్తను చూడండి. దాన్లో నాలుగో పేరా ఇలా ఉంది.

Bin Laden is believed to be the mastermind of the attacks on New York and Washington on 11 September 2001 and a number of others.

టవర్ల కూల్చివేత వెనుక లాడెన్ మాస్టర్ మైండ్ ఉందని నమ్ముతున్నారని ఉంది తప్ప, అతనే దోషి అని నిర్ధారించలేదు. కానీ పదో పేరా వచ్చే సరికి దాదాపు నిర్ధారించింది. ఇలా…

Bin Laden had approved the 9/11 attacks in which nearly 3,000 people died.

ఇక్కడ చదవగానే లాడెనే కూల్చమని చెప్పినట్లుగా అర్ధం వస్తుంది. కొంచెం పరిశీలిస్తే, కూల్చిన తర్వాత “అలా చేయవలసిందే” అని అప్రూవ్ చేశాడు అని కూడా అర్ధం వస్తుంది. కానీ రెండో అర్ధం తట్టేలోపు వార్తను పూర్తిగా చదివేసి లాడెన్నే పధకం వేసి కూల్పించాడని నిర్ణయానికి వచ్చేస్తాం. ఇటువంటి ట్రిక్కులు అనేక సంఖ్యలొ ప్రతిరోజూ మనకు కనిపిస్తాయి, పరిశీలిస్తే. లిబియాలో ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని మొన్నటివరకు Rebels అని బిబిసి రాసింది. కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్ధ లిబియాలో మరణాలపై ఓ కమిటీ నియమించిందనీ, ఇరువైపులా నేరాల్ని పరిశీలిస్తుందని బిబిసి వార్త రాసింది. ఆ వార్తా కధనంలో లిబియా Rebels అని రాయకుండా Protesters అని పదం మార్చేసింది.

రెబెల్స్ అంటే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నవారు అని అర్ధం. ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే దాన్ని పోలీసులు, సైన్యంతో అణచివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అది ప్రజాస్వామ్యం ఉందంటున్న దేశాల రాజ్యాంగాల్లో కూడా ఉంటుంది. అంటే తిరుగుబాటుదారులను (అదీ సాయుధ తిరుగుబాటుదారులను) అణచివేయడం ప్రభుత్వాల హక్కు గనక వారిని చంపినా నేరం కాదు. అందులో విచారించడానికి ఏమీ ఉండదు, నేరం కాదు గనక. కానీ ప్రొటెస్టర్స్ అనగానే స్వభావం మారిపోతుంది. ప్రజాస్వామిక వ్యవస్ధల్లో తమకు నచ్చని విధానాలపైన, ప్రభుత్వాల పైన నిరసన తెలిపే హక్కు ఉంటుంది. నిరసన హక్కుని ఉపయోగించుకుంటున్న ప్రజలను గడ్డాఫీ ప్రభుత్వం కాల్చి చంపుతున్నది అని రాస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చదివేవారికి గడ్డాఫీ అక్కడి పౌరుల్ని చంపుతున్నట్లూ, అందుకు మానవ హక్కుల సంఘం విచారన జరపబోతున్నట్లూ మదిలో నాటుకుని దానికి మనసులో ఆమోద ముద్ర పడిపోతుంది. ఇలాంటివి ప్రతిరోజూ రాయడానికి శిక్షణ, నిర్ధిష్ట భావాజాలానికి ఆమోదం కావాలి. పని చేస్తున్న క్రమంలో అటువంటి శిక్షణ ఇవ్వవచ్చు. లేదా ఏదో ఒక ఉదాత్త లక్ష్యాన్ని చూపుతూ ప్రత్యేకంగానూ ట్రైనింగ్ ఇవ్వవచ్చు.

ఆ విధంగా ఒకప్పుడు రష్యా ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడ్డానికి ఆయుధాలు, నిధులు ఇచ్చి పెంచి పోషించిన లాడెన్, అమెరికా ఆధిపత్యాన్ని కూడా తిరస్కరించగానే టెర్రరిస్టు అయ్యాడు. నిజానికి టెర్రరిస్టు అన్నదానికి అమెరికా ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు సరిగ్గా సరిపోతారు. అమెరికా కంటే టెర్రరిస్టు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎన్ని ప్రభుత్వాల్ని కూల్చింది, ఎంతమంది నాయకుల్ని చంపింది. ఎన్ని కుట్రలు చేసింది, అన్నీ తెలుసుకుంటే అమెరికా పట్ల కోపాన్ని ఎవరూ ఆపుకోలేరు. ఆ అమెరికా నేడు ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఒసామా-బిన్-లాడెన్ ని చంపించి. అరెస్టు చేసే అవకాశం ఉన్నా తలలొ కాల్చి చంపింది. అతని భౌతిక కాయాన్ని భూమిలో పాతిపెడితే ఆ సమాధి పవిత్ర స్ధలంగా మారి అమర వీరుడుగా ప్రసిద్ధిపొందుతాడని భయపడి సముద్రంలో పాతిపెట్టింది అమెరికా. అంటే ఒసామా-బిన్-లాడెన్ చనిపోయి కూడా మట్టికాళ్ళ మహా రాక్షసి అమెరికాని భయపెట్టాడన్నమాట!

మత మౌడ్యం గురించి ప్రశ్నలు రావచ్చు. నిజమే. మత మౌఢ్యం లాడెన్‌కో లేక తాలిబాన్‌కో లేక ఇస్లాంకో ఉన్న పేటేంట్ హక్కు కాదు. భూమండలం పై ఉన్న అన్ని మతాలూ మూఢులతో ఉన్నవే. క్రిస్టియానిటీ ఇప్పటికీ భూమి బల్లబరుపే అంటుంది. ఆదియందు భూమియూ, ఆకాశమూ ఏకమై ఉండెను అంటుంది. హిందూ మతం భూమిని చాప చుట్టి సంకలో పెట్టుకున్నాడంటుంది ఓ అవతారంలో. ఇస్లాం ఇంకోటంటుంది. ఒక్కో మతానిది ఒక్కో మూఢం. మతాలకు అతీతంగా కూడా కొన్ని మూఢత్వాలు ఉన్నాయి. ఇండియాలో ఏ మతం లోకి వెళ్ళినా దళితులు దళితులే. హిందూ మతంలో మాల, మాదిగ, కమ్మ, రెడ్డి అయితే, క్రిస్టియన్ మతంలో మాల క్రిస్టియన్, మాదిగ క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్. మూఢత్వం లేని దెక్కడ? సైన్సుని సైన్సుగా శాస్త్రీయంగా, సృజనాత్మకంగా అమలు చేయకుండా, మూఢత్వంగా నమ్ముతూ, సామాజిక వాస్తవాలకు దూరంగా అమలు చేయాలనుకునే ప్రబుద్ధులూ లేకపోలేదు.

ఇన్ని మౌడ్యాల్లో ముస్లిం మత మౌడ్యమే ప్రత్యేకంగా కనపడం వెనక కూడా ఒక నిర్మాణాత్మకమైన, క్రమబద్ధమైన ప్రచారం, భావాజాల వ్యాప్తి ఉన్నాయి. వాటిని చూడ్డానికి నిరాకరిస్తూ, వాటి ఉనికినే తిరస్కరిస్తూ తాము నమ్మిందే సూత్రం అంటే… ఎవరు మాత్రం ఏం చేయగలరు, ఎదురు చూడడం తప్ప? తాలిబాన్ మత మూఢంతో పాలిస్తే అక్కడి ప్రజలు చూసుకుంటారు. తమకి నచ్చకపోతే వారే కూల్చి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అలా ప్రజల కార్యాచరణ అనేక సార్లు యూరప్‌లాంటి చోట్ల సంభవించాక మాత్రమే ఇప్పటి ప్రజాస్వామిక భావాజాలం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశాలు ఏదో ఒక పేరుతో ఆక్రమించుకోవడం వలన మూడో ప్రపంచ దేశాల్లోని ప్రజల కార్యాచరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆక్రమించుకున్న దేశాలు ఆక్రమిత దేశాల్లోని సమాజ పరిణామ క్రమాన్ని సహజంగా జరగనీయకుండా తాము కోరుకున్న విధంగా మార్పులను ఆ దేశాలపై బలవంతంగా రుద్దాయి. దానితో మూడో ప్రపంచ దేశాల్లో సామాజిక అభివృద్ధి ఆగిపోయింది లేదా నెమ్మదిగా జరుగుతోంది. అందువలన మత మూఢత్వాలతో పాటు ఇంకా అనేక మూఢత్వాలు నశించడానికి అక్కడ సమయం పడుతుంది.

కాని ఏ దేశం గానీ, ఏ వ్యక్తిగానీ, ఏ గ్రూపుగానీ నాగరికతలను ఎగుమతి చేయడం అసాధ్యం. సంస్కృతులను రుద్దడం అవాంచనీయం. ఆక్రమించుకోవడం అనాగరికం. చంపడం పశుప్రవృత్తి కంటే హీనం. ఎల్లలు దాటి మరీ ఈ నేరాలు చేస్తున్న రాజ్యాలకు, రాజ్యాధిపతులకు ఎల్లకాలం కేక్ వాకే ఉండదు. తప్పనిసరిగా తిరుగుబాటును ఎదుర్కొంటారు. లిబియా ప్రజల్ని గడ్డాఫీ అణిచివేస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి తమకు నచ్చిన వ్యక్తినీ ఎన్నుకుంటారు. తమకు నచ్చీన ప్రభుత్వాన్ని నియమించుకుంటారు. కాని సంవత్సారల తరబడి కొద్దిమందిని మేపి, ట్రైనింగ్ ఇచ్చి వారి సాయంతో లిబియాపై తిరుగుబాటు రద్దడమే అభ్యంతరకరం. అందుకే లిబియా తిరుగుబాటుకు అక్కడి ప్రజల మద్దతు లేదు. తిరుగుబాటుదారులకు మద్దుతు ఇవ్వడం లేదంటే గడ్డాఫీని ప్రేమిస్తున్నట్లు కాదు. ఎక్కడినుండొ వచ్చి బాంబులేస్తూ నేను ప్రజాస్వామ్యం స్ధాపిస్తా అంటే లిబియా ప్రజలే కాదు, భారతీయులూ ఒప్పుకోరు. ఒక లాడెన్ గానీ, తాలిబాన్ గానీ చేస్తున్నది అదే.

భారత దేశంలో టెర్రరిస్తు చర్యలకు పాల్పడుతున్న సంస్ధలకూ, తాలిబాన్, లాడెన్ లకూ అసలు సంబంధమే లేదు. లష్కర్ ఎ తొయిబా లాంటివి పాకిస్తాన్ పాలకులు పెంచి పోషించినవి. వాటికి భూమిక కాశ్మీరు. ఇండియాపై టెర్రరిస్టు చర్యలకు దిగుతున్న సంస్ధలను లాడెన్, తాలిబాన్ లతో కలిపేసి వారి అమెరికా దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని తప్పుగా అంచనా వేయడం, ఈసడించుకోవడం సరైందా కాదా అని మనం తర్కించుకోవాలి. ఆక్రమణలొ ఉన్నవారు స్వేచ్ఛకోసం పరితపిస్తారనీ, తమ భాషా, సంస్కృతులను కాపాడుకోవడానికి పోరడ్డానికి కూడా సిద్ధపడతారనీ గుర్తించగలిగితే లాడెన్, తాలిబాన్ ల పాత్ర ఏమిటో అర్ధం అవుతుంది.

20 thoughts on “ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

 1. మొత్తం చదివిన తరువాత(మీరు చాలా చక్కగా విశ్లేషించి రాసిన) ఎందుకో మీరు తీవ్రవాదులని సమర్ధిస్తూ (మీరు చెప్పినట్లే పాశ్చ్చాత్య మీడియా తమ అజెండాకు అనుకూలంగా వార్తని వక్రీకరించి రాసుకున్నట్లు) అవసరంలేని ప్రయాస పడుతున్నట్లనిపిస్తుంది. నేరం ఎవ్వరు ఎలా చేసినా తప్పే, అవునా…మరి అమెరికా తప్పు చేసింది కాబట్టి బిన్ లాడెన్ చేసింది ఒప్పు అవుతుందని మీ వాదన.ఇద్దరిదీ తప్పు అయినపుడు మీరు ఎందుకు ఒకరి పక్షం( మెజారిటీ ప్రజలు వ్యతిరేకించే పక్షం)తరపున వకల్తా పుచ్చుకుని డిఫెన్స్ లాయరు లాగా వాదిస్తున్నారు. క్షమించాలి, మీ అలోచనదొరణిలో ఎదో తప్పు ఉంది.

 2. వాసు గారికి,

  నేను రాసిన విషయంపై మీ అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా, నిర్మొహమాటంగానే రాస్తూ కూడా ఒక నాగరిక పద్దతిలో రాశారు. అందుకు చాలా కృతజ్ఞుడిని.

  తీవ్రవాదం అంటున్నారే, అదే సమస్యంతా. టవర్స్ కూల్చడం నిస్సందేహంగా ఘోరమైన నేరం. అది ఎవరు చేశారు? లాడెన్ చేశాడని అమెరికా ఆరోపించింది. లాడెన్ దొరకక పోయినా అతని పరోక్షంలో విచారణ జరపొచ్చు. జరిపారు కూడా. కాని లాడెన్ దోషి అని మాత్రం నిర్ధారించలేక పోయారు. దానిపై నమ్మకం లేకుంటే ఇంకా శక్తివంతమైన విచారణ జరిపి శిక్షించవచ్చు. అసలా ప్రయత్నమే జరగలేదే! ఎందుకని?

  లాడెన్‌తో పాటు అమెరికాలోని రాజకీయార్ధిక వ్యవస్ధలోని ఒక సెక్షన్ కూడా ఆరొపణలు ఎదుర్కొంటోంది. అందుకు సాక్ష్యాలను చూపుతూ ఇంటర్నెట్‌లో కొన్ని సైట్లు ఉన్నాయి. నేను రాసినట్లు ఒక హాలీవుడ్ హీరో దానిపై డాక్యుమెంటరీ నిర్మించాడు. అంటే లాడెన్‌తోపాటు ఇంకా అనుమానితులు ఉన్నారు. మరి ఒక్క లాడెన్ మాత్రమే ఎందుకు హత్య చేయబడ్డాడు?

  లాడెన్ తీవ్రవాదిగా నేరస్ధుడనుకుందాం. మరి లాడెన్‌ను పెంచి పోషించిన అమెరికా రాజకీయనాయకులకు, అధికారులకు శిక్ష ఉండదా? విచారణ జరపరా? లాడెన్ కోసమ్ జరిగిన వేట తన దేశంలోనే తీవ్రవాదిని పెంచిన వారిని శిక్షించాలి కదా?

  అమెరికా చేసిన తప్పు చిన్నదా వాసు గారూ? అందునా అది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. నికరాగువా, పనమా, గ్రెనడా, వెనిజులా, ఇరాక్, ఆఫ్ఘానిస్ధాన్, లిబియా… ఇవి మచ్చుకు కొన్ని. అమెరికా అంటే నేను చెప్పేది అక్కడి ప్రజలు కాదు, అమెరికాని ఏలుతున్న రాజ్య వ్యవస్ధ.

  బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా భారతీయులు చాలామంది చాలా రకాలుగా పోరాడారు. వారిలో భగత్సింగ్‌ని తీవ్రవాది అన్నారు. మనం ఒప్పుకుంటామా? చస్తే ఒప్పుకోం.

  మొదట అమెరికా ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిందన్న విషయాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోక పోతే బహుశా మన చర్చ ఇంతటితొ ముగుస్తుంది. ఒప్పుకుంటే ఆక్రమణకి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రజలు పోరాడతారు కదా. ఆక్రమణకి వ్యతిరేకంగా జరిగే పోరాటం జాతీయ పోరాటం. జాతీయ పోరాటం చేసే వారు ఆ దేశ ప్రజలకు జాతీయ వీరులు. సుభాస్ చంద్రబోస్ మనకు జాతీయ పోరాట వీరుడు. కాని బ్రిటన్ కి తన శతృదేశంతో చేతులు కలిపిన ద్రోహి. ఎక్కడినుండో వచ్చి మోసంతో దేశాన్ని ఆక్రమించుకుని ఆక్రమణకి వ్యతిరేకంగా తనకు ఉచితం అనుకున్న రీతిలొ పోరాడిన బోస్ ని ద్రోహి అంటే మనం సహిస్తామా?

  భగత్ సింగ్ మనకు వీరుడు, బ్రిటన్ కి తీవ్రవాది. భారత జాతీయ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమంది పాల్గొన్నారు. అనిబిసెంట్ లాంటివాళ్ళు. అసలు కాంగ్రెస్ ని స్ధాపించిందే బ్రిటిష్ జాతీయులే కదా. ఆ విధంగానే ఆఫ్ఘన్ స్వతంత్వ పోరాటంలో లాడెన్ పాల్గొన్నాడు. కాదంటారా?

  లాడెన్, తాలిబాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బాంబు పేలుళ్ళు, మరణాలు. అమెరికా అనగానే నాకు గుర్తొచ్చేది, ఇరాక్ మారణ హోమం. సద్దాం ని చూపి ఆ దేశం పై విధించిన ఆంక్షల వలన పసిపిల్లలు పోషకాహారం దొరక్క లక్షలు చనిపోయారు. అది యుద్ధ నేరం. అమెరికా బాంబు దాడుల్లో ఆఫ్ఘనిస్ధాన్ పౌరులు, పాకిస్ధాన్ పౌరులు, ఇరాక్ పౌరులు వందల వేల మంది చనిపోయిన సంగతీ, దాన్ని అమెరికా దాచి పెట్టిన సంగతీ అమెరికా రాయబారులే ఒప్పుకున్న విషయాలను వికీలీక్స్ బైటపెట్టీన్ డిప్లొమెటిక్స్ ద్వారా రుజువయ్యింది కదా. కనుక అందులో అనుమానం అనవసరం.

  లాడెన్ టార్గెట్ చేసింది ఆఫ్ఘనిస్ధాన్ ని ఆక్రమించిన దేశాలు. అందుకు భిన్నమైన దేశాల్ని టార్గెట్ చేశాడా? అయినా సరే ప్రజల్ని చంపడం నేరమే. కాని ఏ దాడులతో లాడెన్ కి సంబంధం ఉన్నదీ విచారణ చేయకుండా నిర్ధారించ వచ్చునా? ఇవి లాడెన్ ని సమర్ధనగా రాస్తున్నవి కాదు. అమెరికా, దాని మిత్ర దేశాల దురన్యాయాలను చెప్పడానికి రాసినవి. దేశంలో సైన్యాన్ని దింపి, అత్యాధునిక ఆయుధాలతో దేశాన్ని స్మశానంగా మార్చినందుకు ఏ శిక్షా లేక పోవడం, ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడిన వారిని తీవ్రవాదిగా గుర్తించి అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నా కాల్చి చంపి అంతిమ సంస్కారాలకి కూడా వీలు లేకుండా శవాన్ని మాయం చేయడాన్ని మామూలుగా ఎలా చూడగలం? నాకు కవిత్వం రాదు గానీ వస్తే ఓ కావ్యం రాసే వాడ్ని.

  నేను అసహజంగా రాసిన అంశం ఏమన్నా ఉంటే ఎత్తి చూపండి. సవరించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తా. కానీ ఇప్పటివరకూ మనం పత్రికల్లో లాడెన్ గురించి చదివిన దాన్ని పక్కన బెట్టి అతన్ని ఓ వ్యక్తిగా చూస్తూ నేను రాసినదాన్ని మరోసారి చదవండి దయచేసి.

  లాడెన్ ను సమర్ధించే అవసరం నాకస్సలు లేదు వాసు గారు. నేను దానోడ్ని కాదు. అతని పైన ఇప్పటివరకు తెలుసుకున్నదంతా నెగిటివ్ గానే ఉండడంతో నిష్పాక్షికంగా చూడడంలో విఫలమయ్యె అవకాశం ఉండొచ్చేమో ఆలోచించండి. ఇప్పుడే వెంటనే సమాధానం అవసరం లేదు. కొన్ని రోజులైన తీసుకోండి. లేదా నేను రాసిన అంశాల్లో ఒక్కోదాన్నీ చర్చించడానికీ నేను సిద్ధం. ఒక్కో అంశాన్ని చూడడంతో పాటు వాటిన్నింటినీ కలిపి మళ్ళీ విహంగ వీక్షణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయత్నించండి.

  ధన్యవాదాలు.

 3. మీ విశ్లేషణ చాలా బాగుంది విసేకర్ గారు, కానీ నాకు ఒక్క విషయం అర్ధం కాలేదు. అమెరికా ప్రబుత్వం తన ప్రజలను ఎందుకు చంపుకుంది. దేశానికే గర్వ కారణం మరియు ముఖ్యమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూల్చే అవసరం ఎందుకు వచ్చింది. జరిగింది ఆస్తి నష్టం మాత్రమే కాదు కదా, దాదాపు ౩౦౦౦ మంది ప్రజలు చనిపోయారు కదా. ఎంత దురాక్రమణ చేసే ఆలోచన ఉన్నా తన దేశ ప్రజలను ఎలా చంపుకుంటుంది.

 4. ప్రజాస్వామిక సూత్రాలు ఆంబోతులకు అర్ధం కావని బాగా చెప్పారు.పేరేదైతేనేం ఇన్నాళ్ళూ ప్రపంచ పోలీసు ను కూడా గజగజ వణికించిన ఒక శక్తి ఉండేది.
  ప్చ్ —

 5. ప్రవీణ్ గారు, అమెరికా స్వయంగా తన ప్రజల్ని చంపుకుంది అనే అర్ధంతో నేను రాయలేదనుకుంటున్నా. ఒకవేళ అలా అర్ధం వచ్చే విధంగా ఎక్కడైనా ధ్వని ఉంటే…

  నేను రాసింది లాడెన్ తో పాటు అమెరికాలోని రాజకీయార్ధిక వ్యవస్ధ లోని ఒక సెక్షన్ పై కూడా ఆరోపణలున్నాయని. విచారించి ధోషి అని తేలితే లాడెన్‌ని శిక్షించండి. కాని విచారణ జరగాలి. సాక్ష్యాలతో రుజువు చేయండి. జడ్జి వేసిన శిక్ష అమలు చేయండి. కానీ ఒకరి మీద ఆరోపణ చేసేసి నిర్ధారణ చేయడం సరైంది కాదని నేను చెప్పాను. ఇక్కడ నిర్ధారణ చేయడమే కాక చంపేశారు కూడా. శవం కూడా దొరకనివ్వకుండా చేశారు.

  ఆరోపణ వచ్చిన ఒకర్ని చంపారు. మరింకా ఆరోపణలు వచ్చినవారు ఉన్నారు. వారు ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నత స్ధానల్లో ఉన్నారు. వారినికూడా చంపి సముద్రంలో పాతేస్తారా? అలా చేసే హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే అమెరికాకి ఆటోమేటిక్ గా సంక్రమిస్తుందా? తమది ప్రజాస్వామ్య దేశం అని చెప్పడం నిజం అయితే అలా చేయగలరా.

  అమెరికా పాలకుల్లో ఉన్న సెక్షన్ గురించి మాట్లాడదాం. అప్పటికే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా ఉద్యోగులు, కార్మికుల వేతనాల్లో 1970 లనుండీ స్తంభన ఏర్పడి వారి కొనుగోలు శక్తి పడిపోతూ వచ్చింది. మరోపక్క సంక్షోభం పరిష్కరించుకోవడానికి కార్మికులకు, ఉద్యోగులకీ అందిస్తున్న సంక్షేమ పధకాలు మెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. దాని వల్ల కొనుగోలు శక్తి మరింత పడిపోయింది. ప్రపంచంలొ అభివృద్ధి చెందిన దేశాలనుండి, చైనా, ఇండియాలాంటి ఎమర్జింగ్ దేశాల వరకు ఎగుమతులు అమెరికా ప్రజల వినిమయ సంస్కృతిపైన ఆధారపడ్డవే. అందువలన అక్కడకీ సంక్షోభం అనివార్యంగా వ్యాపించింది. కానీ అమెరికాకి చేసిన ఎగుమతుల వల్ల యూరప్‌లొని ప్రధాన దేశాలు, చైనా, జపాన్ లాంటి దేశాలకు వాణిజ్య మిగులు పేరుకుపోయింది. ఈ నేపధ్యంలో జర్మనీ, ఫ్రాన్సుల నాయకత్వంలో యూరప్, చైనా, బ్రెజిల్, ఇండియా, రష్యాల నాయకత్వంలో ఎమర్జింగ్ కూటమి, జపాన్ నాయకత్వంలోని కొన్ని ఆసియా టైగర్లు అర్ధిక కేంద్రాలుగా ముందుకు వచ్చాయి. అంటే అమెరికా ఆర్ధికంగా దిగజారుతుంటే దానికి పోటీగా పైన చెప్పిన కేంద్రాలు పోటీగా ముందుకు వస్తున్నాయి.

  కాని అమెరికాకి ఉన్న మిలట్రీ పవర్ అపారం. అమెరికా దానిపైనె నమ్మకం పెట్టుకుంది. జపాన్‌ అమెరికా మిత్ర దేశం అక్కడ దాని సైన్యం ఉంది. యూరప్‌లో కూడా చాలా మిలట్రీ స్ధావరాలున్నాయి. కానీ చైనా, ఇండియాలపైన చెకింగ్ లేదు. చైనా సొంతగా మిలట్రీ పెంచుకుంటోంది. ఆర్ధికంగా సవాలు విసురుతోంది. మరో ఇరవై ముప్ఫై సంవత్సరాలకి అమెరికా జిడిపిని మించవచ్చు అని విశ్లేషకులు అదేపనిగా రాస్తున్నారు. మిడిల్ల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కి ఇరాన్ పోటీగా తయారవుతోంది. ఈ నేపధ్యంలో అటు మిడిలీస్ట్, ఇటు దక్షిణాసియా, దానిపైన చైనా.. వీటన్నింటికీ ఆఫ్ఘనిస్ధాన్ అనువైన ప్రాంతం. అక్కడ దాని మిలట్రీ తిష్ట వేస్తే ఈ ప్రాంతాలన్నింటిపైన నిఘా ప్రస్ బెదురు పెట్టవచ్చు.

  కాని ఆఫ్ఘనిస్ధాల్‌లో తిష్ట ఎలా వేయాలి. లాడెన్, తాలిబాన్ లు అది పెంచి పోషించినవే. వారు లొంగడం లెదు. వారిపైన యుద్ధం ప్రకటించడానికి అనువైన కారణం కావాలి. అదీ ప్రపంచం మెచ్చుకునే కారణం కావాలి. బలమైన కారణమ్ కావాలి. అక్కడే టవర్లపై దాడి ఆలోచన పుట్టిందనీ నేను చెప్పిన వారు గట్టిగా వాదిస్తున్నారు.

  సోంత ప్రజలను ఎందుకు చంపుకుంటుందనా? సామ్రాజ్యవాదికి తన మన తేడా ఉంటుందా? అమెరికా బహుళ జాతి సంస్ధలు ఇతర దేశాల తో పాటు అమెరికా ప్రజల్ని కూడా దోచుకుంటాయి. అందుకేం మొహమాటపడవు. పైగా సొంత ప్రజలను చంపుకుంటున్నట్లుగా పచ్చిగా కనపపడేట్లు ఎందుకు చేస్తుంది? ఇరాక్, ఆఫ్ఘనిస్ధాలో యుద్ధాల్లో చనిపోతోంది బుష్, టోనీ బ్లెయిర్లు కాదు. వారి సైన్యాలే. ఆంక్షలతో ఇరాక్ లో లక్షలమంది పిల్లలను చనిపోతున్నారని యునిసెఫ్ లాంటివి మొత్తుకున్నా వినని అమెరికా పాలకులకు (రాజ్యానికి) మూడు వేల మంది అమెరికన్లు చనిపోతే లెక్క ఉంటుందా? ఏ బహుళజాతి సంస్ధకీ తాను పుట్టిన దేశ ప్రజలపైన ప్రేమ ఉండదు. అక్కడ మార్కెట్ దోపిడీ సరిపోకే గదా ఇతర దేశాలపైన దాడి చేస్తున్నది. మూడువేల మంది అమెరికన్ల కంటే అనేక రెట్ల మంది అమెరికన్ల జీవితాలని దరిద్రం లొకి నెడుతున్నాయవి. “కేపిటలిజం: ఏ లవ్ స్టోరీ” అని ఒక సినిమా వచ్చింది. అది నిజానికి సినిమా కాదు. సినిమా అంత డాక్యుమెంటరీ. ఆర్ధిక సంక్షోభంలో బహుళజాతి బ్యాంకులు ఎన్ని మిలియన్ల మంది కుటుంబాలను వీధిపాలు చేశాయో, ఎంతమందిని బికార్లుగా మార్చాయో చూపించారు. ప్రత్యక్షంగా వారితో మాట్లాడించారు. వాళ్ళంతా అమెరికన్లే. అమెరికన్లని దయ జాలీ ఏమీ చూపలేదు. అలాగే చంపడం కూడాను. అమెరికా రాజ్యవ్యవస్ధలోని ఒక సెక్షన్ ఇలా చేయించిందంటే ఎవరు నమ్ముతున్నారు? డాక్యుమెంటరీలు తీసి, ససాక్ష్యాలతో చూపిస్తున్నా ఆ విషయాలు తెలిసింది కొద్ది మందికే. అమెరికన్లకే తెలియదు. ఇక మనదాక ఎందుకు వస్తుంది. ఆ పనిమీద ఉంటూ, అమెరికా ఆగడాలమీద కొద్దో గొప్పో స్పృహ ఉన్నవారే కారణాలకోసం అన్వేషణలొ ఉంటారు.

  దేశానికి గర్వకారణమని అమెరికా ప్రజలు అనుకుంటారేమో కాని పాలకులకీ, బహుళజాతి సంస్ధలకు అదేమీ లెక్కకాదు. ఎక్కడన్నా నాశనం జరిగితే బహుళజాతి సంస్ధలు సంతోషిస్తాయి. ఎందుకంటే పునర్నిర్మాణ కాంట్రాక్టులు దొరుకుతాయి కదా. ఆఫ్ఘనిస్ధాన్ వినాశనం తర్వాత ఇండియా పెట్టుబడిదారులకి కూడా కాంట్రాక్టులు దొరికాయి. అందుకె ఇండియా అమెరికాకి వత్తాసు. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ల యుద్ధాలకి అప్పటి ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆయిల్ రీఫిల్లింగ్ చేస్తామని వెంటబడింది. అది మెటీరియలైజ్ అయ్యేలోపు ఎన్నికలు, ఓటమి సంబవించింది.

  ఇప్పుడు జపాన్లో ఫుకుషిమా ప్రమాదం ఇంకా ముగియలేదు. కాని అక్కడ రేడియేషన్ విడుదల ఆగాక క్లీనింగ్, పునర్నిర్మాణాలకు హిటాచి, తోషీబా కంపెనీలు ఇప్పటినుండే పోటీ పడుతున్నాయి. పునర్నిర్మాణానికి ఒకరు 20 సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటే మరోకరు ఎలా చేయగలరు, కనీసం 30 సం. ఐనా కావాలని వాదులాడుకుంటున్నాయి. దానికి తగిన ప్లాన్లను ప్రభుత్వానికి సమర్పించడానికి బిజీగా ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే అక్కడ ఇంకా రేడియేషన్ విడుదల ఆగలేదు. దాన్ని ఎలా ఆపాలో కూడా తెలియడం లేదు. ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా ప్రయత్నించడమే తప్ప ఇలా చేయవచ్చు అని నిర్ధారించుకుని చేస్తున్న ప్రయత్నాలు కావవి. అయినా పునర్నిర్మాణాల కాంట్రాక్టుల గురించి వాదులాడుకోవడం బహుళజాతి సంస్ధలకు ఏమీ సిగ్గు కాదు. వాటి లక్షణమే అది. మనుషులు, జీవితం, సమాజం, దేశం, అభివృద్ధి ఇవేవీ వాటికి పట్టవు. కాని అవి చేసే పనులన్ని ఆ ముసుగులోనే చేయడం వాటి గొప్పతనం.

  అలాగే అమెరికా వ్యాపారులు. ఆర్ధిక సంక్షోభమే చూడండి. కేవలం వాల్‌స్ట్రీట్ కంపెనీల అత్యాశ, వేగంగా లాభాలు రావలనే దురాశ వల్ల సంక్షోభం వచ్చింది. సబ్ ప్రైమరీ సంక్షోభం వస్తుందని ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకులతో పాటు స్టిగ్లిడ్జ్, నౌరీల్ రౌబిని లాంటి ఆర్ధిక వేత్తలు నెత్తినోరూ బాదుకున్నారు. పట్టించుకోలే. దాని వల్ల చిన్న పెద్ద మధ్య తరగతి లో మెజారిటీ అదృశ్యమైపోయింది. బికారులయ్యారు. ఇళ్ళు బ్యాంకులు లాక్కోవడంతో వీధిన పడ్డారు. చాలామంది కార్లలో కాపురాలు పెట్టారు. వాళ్ళని ఆ స్దితికి నెట్టింది అమెరికన్లే. ఆ విషయం అమెరికా ప్రభుత్వానికీ తెలుసు. వాల్‌స్ట్రీట్ కంపెనీలకు తెలుసు. లాభాలు, పెట్టుబడి పోగేసుకుని ఆ పెట్టుబడికి మార్కెట్ కోసం ప్రపంచ యుద్ధాలు చేయించిన కంపెనీలు మూడువేల అమెరికన్ల మరణాలకి చింతించే సమస్యే లేదు. ఇప్పుడు చనిపోయినవారికి ప్రతి సంవత్సరం నివాళులు ఇచ్చే వారిలో వారే ముందుంటారు. నివాళులు అర్పించడం కూడా లాభార్జనకు ఒక మార్గం. ఈవెంట్ మేనేజ్‌మెంటు సంస్ధలు అంతిమ యాత్రకు ఏడ్చేవారిని కూడా సప్లై చేసే స్ధాయికి ఎదిగాయి మరి.

  కనుక అమెరికన్లు చనిపోవడం అమెరికా రాజ్యానికి ఓ సమస్య కానే కాదు.

  ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. టవర్ల కూల్చివేతకు ఎవరు కారకులు అన్న విషయంలో ఉన్న వాదనలు, వాటికి సాక్ష్యాలు, ఇవి నేను రాశాను. దానర్ధం అమెరికాలో ని ఒక సెక్షనే టవర్లు కూల్చింది అని నేను నిర్ధారిస్తున్నట్లు కాదు. ఆరోపణలు ఉన్నాయి. బలంగా ఉన్నాయి. నిజం తేల్చాలని అమెరికా అనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. విమానాల్ని నడిపింది అమెరికాలో ట్రైనింగ్ పొందినవాళ్ళే. వాళ్ళు రహస్యంగా ట్రైనింగ్ పొందలేదు. వారి మూలాలు అమెరికాలోనే ఉన్న సంగతిని కొందరు సాక్ష్యాలు చూపించారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసే అమెరికా రాజ్యానికి టవర్లు కూల్చి ఆ నేరం కప్పి పుచ్చుకోవడం కష్టం కాదు. కాకుంటే అలాంటి పధకాల్లో ఎక్కడో ఒక చోట వీక్ లింక్ ఉంటుంది. అక్కడి నుండే రహస్యాలు వెల్లడవుతాయి. అమెరికా చరిత్ర, దాని దురాక్రమణల చరిత్ర తెలిసినవారు ఇంకొంచెం వేగంగా పరిణామాల్ని, పధకాలని అంచనా వేయగలుగుతారు.

  సారీ. కొంచెం ఎక్కువ రాసినట్టున్నాను.

 6. అమ్మయ్య! చాలా ధాంక్సండీ లక్ష్మి గారూ. నాచేత ఇంకా రాయించినందుకు వాసు, ప్రవీణ్ లకు కూడా మేనీ ధాంక్స్.

 7. నమస్కారమండీ !
  టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
  మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా “
  సంకలిని

  ” మీ ముందుకు తెచ్చాము.
  ఈ సంకలినిలో ప్రత్యేకతలు
  1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
  2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
  ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
  ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

  ఇట్లు
  సంకలిని బృందం

 8. యిప్పుడు లాడెన్ అనేదుష్టుడిని ఏకపక్షంగా చంపినందుకు సంతోషిస్తున్నాము. మరి భగత్‌సింగ్, సుభాష్ సంద్రబోస్‌ లాంటి వారు ఆమెరికాకు వ్యతిరేకులయివుంటే, దేశాల సార్వభౌమాధికారాలను ధిక్కరించడం కరెక్టే అంటారా? అమెరికా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని దిక్కరింసినా క్కిక్కురుమనుకుండా వున్నకారణమల్లా ఒక్కటే, భారత్ మీద దాడిచేయాలంటే ఆమెరికా సైనికిసహాయాలు పాకిస్తానికి అవసరం.

 9. భారత్, పాకిస్తాన్ ల శతృత్వం వల్ల లాభపడేది అమెరికాయే. ఇద్దరికీ ఆయుధాలు, మందుగుండు అమ్మి లాభపడుతోంది. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఇండియా పాలకులు పాకిస్తాన్ పై ఘర్షణలూ, రాజీలకు సిద్ధపడుతున్నారు.

  కార్గిల్ యుద్ధాన్ని అమెరికా ఆదేశం తోటే ఇండియా ఆపేసింది. గత సంవత్సరం అమెరికా బలవంతం మీదే పాకిస్తాన్‌తో శాంతి చర్చలను మన్మోహన్ ప్రభుత్వం జరిపింది. అది కూడా రెండు మూడు సమావేశాలు జరిపి ఆపారు.

  నిజానికి పాకిస్తాన్, ఇండియా వైరంలో ఇరు పక్షాల ప్రజల ప్రయోజనాలేవీ లేవు. ఇరు దేశాల్లోని పాలకుల ప్రయోజనాలు, వారి ఉమ్మడి బాసు అమెరికా ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. డిఫెన్సు బడ్జెట్ ఖర్చు, కార్గిల్ యుద్ధం లాంటి ఘర్షణల ఖర్చుల్ని మోసేది ఇరు దేశాల్లోని ప్రజలే.

  ఈ ఘర్షణల వల్ల ఒరిగేదేమీ లేదు. అనవసరంగా కొట్టుకుంటున్నం అని ఎవరైనా అంటే దేశభక్తి లేదని నిందించడానికి రేడీ అవుతారు.

 10. మీరు పైన రాసిన కారణాలు మాకు తెలియవా! పాకిస్తాన్ అనే ఒక ప్రాంతాన్ని దేశం గా మీరు గుర్తిస్తారేమో గాని గత 15సం|| నుంచి ఆప్రాంతం లో జరిగే విషయాలను పరిశిలిస్తే అదొక దేశమే కాదని నా అభిప్రాయం.

  Pakistan has lost dignity, self-esteem following US’ Osama operation: Imran Khan

  http://economictimes.indiatimes.com/articleshow/8157779.cms?prtpage=1

  LONDON: Pakistan has “lost its dignity and self-esteem” in the wake of the discovery and killing of elusive Al Qaeda chief Osama bin Laden by US troops in a luxury compound in Abbotabad, home to the country’s military academy, cricketer-turned politician Imran Khan has said.

  Pakistanis were dumbfounded as they woke up yesterday morning to be told the news that Osama bin Laden had been killed, especially when no statement was forthcoming from their government in the wake of the Obama speech, Pakistan Tehreek-e-Insaf (PTI) Chairman Imran wrote in The Independent.

  “The big questions that everyone began asking, and for which no answers have been forthcoming, were: who allowed the Americans to come to Pakistan and carry out this attack? And whatever happened to the Pakistani Army and its intelligence?” he said.

  Imran noted that many hours later, while Pakistan Prime Minister Syed Yousaf Raza Gilani claimed that all the intelligence had come from Pakistan, the US administration and the Western media said that Pakistan was totally out of the loop with no information sharing on this action.

  “All this has led to other serious questions being raised in Pakistan. For instance, if the Pakistan government or the army had this intelligence, why did we not take out Bin Laden ourselves? Why did we have to rely on the Americans coming over from their airbases in Afghanistan?” said the PTI chief.

  There is not just confusion that prevails in Pakistan, he said, but also a national depression at the loss of national dignity and self-esteem as well as sovereignty.

  “There is no answer to these questions and this simply allows allegations from the West and from India to go unchallenged that Pakistan has been protecting Bin Laden and other terrorists; that Pakistan knew he was here and kept him safe,” said Imran.

  President Asif Ali Zardari , Prime Minister Gilani, and the army “need to address this immediately and if, as they claim, they had the intelligence that led to the killing of Bin Laden, why it was not done by Pakistani forces?” the PTI chief demanded, pointing out that Pakistan would suffer a great loss of credibility until this happens.

  “The reason we will not get these answers, of course, is that we have the most corrupt and incompetent government in our history,” he added.

 11. visekhar గారు, మీ విశ్లేషణ చాలా బాగుంది, ఎంతో లోతుగా ఆలోచించారు. చాలా కొత్త విషయాలు తెలిసాయి. ధన్యవాదములు.

 12. శ్రీగారూ, మీరెవరో నాకు తెలియదు. మీపేరు పెట్టి చెప్పినట్టు అదేం ప్రశ్న? తెలిస్తే మంచిదేగా!

  మీ వార్తకు ధన్యవాదాలు. పాకిస్ధాన్‌లో ఇమ్రాన్ చెప్పిన ప్రశ్నలు, అనుమానాలు రావడం చాలా సహజం. న్యాయమైనవి కూడా. నిజానికి పాకిస్ధాన్‌కి తెలియదనడం కూడా నమ్మశక్యంగా లేదు. అమెరికా, పాకిస్ధాన్‌ రెండింటీ పాత్రా ఉండొచ్చు. పాకిస్ధాన్‌కి అమెరికా బిలియన్లకొద్దీ డాలర్లను ఇస్తోంది. పాకిస్ధాన్ పాలకులమీద అక్కడి ప్రజల్లో చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. కాని ప్రజల అభిప్రాయాలు ఎవరు పట్టించుకుంటున్నారు?

  అసలు లాడెన్ మృతే నాటకం అనీ అంటున్నారు. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకి పాకిస్ధాన్ పాలకుల సహకారం ఉన్న సంగతి ఈ ఘటనలవల్ల తెలుస్తోంది.

 13. The main consideration is acquiring/try to making commanding on oil/gas industries from middle east countries. There is no concentration on study/implementation of human rights in middle-east/gulf countries.

 14. బ్రిటిష్ ఆక్రమణకి వ్యతిరేకంగా భారతీయులు చాలామంది చాలా రకాలుగా పోరాడారు. వారిలో భగత్సింగ్‌ని తీవ్రవాది అన్నారు. మనం ఒప్పుకుంటామా? చస్తే ఒప్పుకోం.

  లాడెన్ ని మన భగత్సింగ్ తో పోల్చడం సరి కాదు శేఖర్ గారు.

  ఎన్ని జరిగినా కానీ అఫ్ఘాన్ లో ఒక్క మహిళ ఐనా లాడెన్ తమ ఆప్తుడు అనుకుంటుందా?

  భయంకరమైన ఉన్మాదంతో తాలిబాన్ చేసే విక్రుత మత సంస్థాపన మీకు తెలియదు అని నేననుకోను.

 15. వెంకట్ గారూ, అమెరికా దురాక్రమణ గురించీ, ఆఫ్ఘన్ లో ప్రతి రోజూ చస్తున్న పౌరుల గురించీ, అమెరికా చేస్తున్న నరమేధ గురించీ కూడా మీరు పట్టించుకోవాలి. అమెరికా దురాక్రమణని వ్యతిరేకించడం ఉన్మాదం ఎలా అవుతుంది? తాలిబాన్ గురించి ప్రపంచానికి అందుతున్న వాస్తవాలు చాలా తక్కువ. అది ముస్లిం సంస్ధ అయి ఉంటే అయి ఉండొచ్చుగాక. క్రిస్టియన్ తీవ్రవాదులు, హిందూ తీవ్రవాదులు, జుడాయిజం తీవ్రవాదులూ లేరా? వీరెవరికి రానంత ప్రచారం ఒక్క ముస్లిం తీవ్రవాదానికే ఎందు కొచ్చింది? అమెరికా దురాక్రమించి వనరులను కొల్లగొట్టడానికి తన సైన్యాన్ని నడిపిన దేశాలన్నీ ముస్లిం దేశాలే. అందుకే ముస్లింల ప్రతిఘటనే మనకు ఎక్కువ కనిపిస్తుంది. మరొక మతం తీవ్రవాదం కనిపించకపోవడానికి కారణ ఆ మతాల దేశాలపై అమెరికా దాడి ఇంకా జరగలేదు కనుక.

  తాలిబాన్ ఆడవాళ్లని తక్కువ చూపు చూస్తుందని ఆరోపణ అంగీకరించవచ్చు. ఒక్క తాలిబానేనా? ఎన్ని దేశాల్లో ఆడవాళ్ల పరిస్ధితి సుఖంగా ఏడ్చింది? ఇండియాలో ఆడవాళ్ళేమన్నా సుఖపడుతున్నారనా? అమెరికాకి వెళ్ళి కూడా వరకట్నం కోసం చంపుతున్నారే? వారు సుఖపడుతున్నారనా? ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఆడవారి పరిస్ధితి మగవారికి సమానంగా లేదు. యూరప్, అమెరికాల్ని కూడా తీసుకోండి. అక్కడ ఆడవారిపైన అఘాయిత్యాల గురించి వార్తలు తక్కువేమీ కాదు. సినిమాలు కూడా అనేకం. క్లబ్బులు, లాస్ వేగాస్, పోర్న్ ఇండస్ట్రీ ఎక్కడ అభివృద్ధి చెందింది? అమెరికాలో కాదా? ఆడవాళ్ళు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ, పోర్న్ ఇండస్ట్రీలోకి తెలిసీ దిగుతారా? ఆ ఇండస్ట్రీలో వారిపై అఘాయిత్యాలగురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? ఒక్క ఆఫ్ఘనిస్ధాన్ లోనే మహిళల గురించి ప్రపంచం తెగ బాధపడిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో సారా వ్యతిరేకోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమాలను పనిగట్టుకుని, లిక్కర్ మాఫియాల కోసం విఫలం చేశారు గదా? అది మహిళలపై అణచివేత కాదా? ఆ అణచివేతని భారత మహిళలు ఎంజాయ్ చేస్తున్నారా? తక్కువ కులపోడిని పెళ్ళి చేసుకుందని ఇద్దర్నీ చంపేస్తున్నారే? అది అణచివేత కాదా? పబ్బుల్లో ఇంకో పెగ్గు అదనంగా పొయ్యలేదని కాల్చి ఫ్రై చేసారే? అదేమన్నా వినోదమా? మహిళలు సంతసించగల వినోదమా? పుట్టకముందే ఆడపిండాల్ని చంపుతున్నారే? డబ్బున్న వాళ్లె ఇళ్లల్లోనే ఆడ పిండాల హత్య అధికమని ఈ బ్లాగ్ లోనే ఒక పోస్టు ప్రచురించాను. అదేమన్నా తక్కువా? యూరప్ లో ఆడవారికి జీతాలు తక్కువిచ్చే కంపనీలున్నాయి. తక్కువ జీతాల్ని ఆడవాళ్లు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఆడవాళ్ల చేత దుస్తులిప్పించి డాన్సులేపించి క్లబ్బుల్లో ఖుషీ చేస్తూ తాగుతారే? అదొక మామూలు విషయం అమెరికాలో. అదేమన్నా అమెరికా ఆడోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? ఆడోళ్లు ఒక్క ఆఫ్ఘనిస్ధాన్ లోనే కాదు, ప్రపంచం అంతా ఉన్నారు. ఇండియాలో ప్రధానిగా ఇందిరా పనిచేస్తే, పాక్ లో భుట్టో పని చేసింది? తేడా ఉందా? ప్రపంచంలో పత్రికలన్నీ అమెరికా, యూరప్ లవే గనుక అవి చేసే అకృత్యాలు, అక్రమాలు రాయవు. వాళ్ల పత్రికలే గనక అవి ఆఫ్ఘన్, ఇరాక్, లిబియాల్లో చేసే నరమేధం గురించి రాయవు. ఆఫ్ఘన్ ఆడవాళ్ల పరిస్ధితి గురించి తెగ కన్నీళ్ళు కార్చేస్తాయి మరి.

  ఆఫ్ఘనిస్ధాన్ ముందు ఆఫ్ఘన్లది. అ దేశాన్ని ఆ దేశస్ధులకి అప్పజెపితే, దాని అభివృద్ధి వారు చూసుకుంటారు. అమెరికా, యూరప్ లు వేలు పెట్టని చోటు ఎక్కడండీ? అవన్నీ మానేస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఏ తీవ్రవాదమూ ఉండదు. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ తదితర సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల్ని ఏ దేశంలోనూ వేలు పెట్టకుండా కూర్చోమని చెప్పండి. దేశాల సార్వభౌమత్వాలని గౌరవించమని చెప్పండి. అది జరిగితే ప్రపంచంలో ఏమూల కూడా తీవ్రవాదం అనేదే ఉండదు. అది జరుగుతుందా? జరగదు. అది జరిగే వరకూ తీవ్రవాదం అలానె ఉంటుంది. పశ్చిమ దేశాలపత్రికల పేజీల్లో అవి తీవ్రవాదం అయ్యాయి గానీ లేదంటే ఆ పోరాటాల్లోని వాస్తవాలను గమనించినట్లయితే అవి తమ తమ అస్తిత్వం కొసం ఆయా జాతులు, తెగలు, ప్రాంతాలు, దేశాలు చేస్తున్న పోరాటాలుగా అర్ధమవుతాయి. ఎవ్వరూ కావాలని బాంబులు చుట్టుకుని పేల్చుకోరు, ఇష్టంగా. రాజకీయ లక్ష్యం, వారి చుట్టూ ఉన్న దురాక్రమణ పరిస్ధితులు… అవే వారినలా ప్రేరేపిస్తున్నాయి. ఎవరి బతుకుని వారిని బతకనిస్తే మార్పు, అభివృద్ధి లను ఆయా దేశాల ప్రజలే సాధించుకుంటారు.

 16. “భారత దేశంలో టెర్రరిస్తు చర్యలకు పాల్పడుతున్న సంస్ధలకూ, తాలిబాన్, లాడెన్ లకూ అసలు సంబంధమే లేదు”, visekar garu ee mata yanta varaku samuchitam. laden declared that india was unfinished chapter ( means she was not islamized completely like pakistan , bangladesh ,afganistan). how can you say there is no link between terror attacks in india and laden? usa oka dopidi, terrorist desam ani chepparu ok , memu kuda voppukuntam but laden aa desaniki veerudu kavachu adi kuda ok but prapancham mottanni islamize cheyyali ane LeT , Other terror organizations manastatvaanni ye vidamga ardam chesukovali?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s