పాక్‌తో చెలిమి ఇండియాతో ఆయుధ వ్యాపారానికి చేటు -అమెరికా రాయబారి (వికీలీక్స్)


rafale-fighter-jet

ఫ్రాన్సు తయారీ "రాఫేల్" ఫైటర్ జెట్ (పెద్ద బొమ్మకై క్లిక్ చేయండి)

పాకిస్ధాన్‌తో అమెరికాకి ఉన్న స్నేహం వలన ఇండియాతో జరిపే ఆయుధ వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చని ఇండియాలోని అమెరికా రాయబారి అమెరికా మిలట్రీ అధికారులను హెచ్చరించిన సంగతి వికీలీక్స్ వెల్లడి చేసిన డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా బయటపడింది. అమెరికా ఆయుధాల అమ్మకానికి పోటీగా వచ్చే ఇతర దేశాల కంపెనీలు, పాకిస్ధాన్‌తో అమెరికాకి గల స్నేహం గురించి ఇండియాను హెచ్చరించవచ్చనీ, అందువలన కీలకమైన సమయంలో ఇండియాకి అవసరమైన మిలట్రీ విడిభాగాలు, మందుగుండుల సరఫరాను అమెరికా ఆపేయవచ్చని ఇండియాకు నూరిపోయడం ద్వారా కాంట్రాక్టులు కొట్టేయడానికి అవకాశాలున్నాయని అమెరికా రాయబారి కేబుల్ లో అభిప్రాయపడ్డాడు.

అక్టోబరు 29, 2009 తేదీన పెంటగాన్‌లోని అత్యున్నత మిలట్రీ అధికారి మిచేలే ఫ్లౌర్నాయ్ కి భారతదేశంలోని అమెరికా రాయబారి తిమోతి రోమర్ రాసిన కేబుల్ లో ఈ విషయాలున్నాయి. 11 బిలియన్ డాలర్ల విలువగల 126 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు నిమిత్తం ఇండియా అమెరికా కంపెనీలను తిరస్కరించి యూరప్ దేశాలవైపు మొగ్గు చూపిన నేపధ్యంలో ఈ కేబుల్ లోని సమాచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రఛ్ఛన్న యుద్ధ కాలంలో మిలట్రీ కొనుగోళ్ళకు ఇండియా రష్యాపై ఆధారపడగా, పాకిస్ధాన్ అమెరికాపై ఆధారపడింది. ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య జరిగిన మూడు యుద్ధాల్లో పాకిస్ధాన్ పరాజయం పాలయ్యింది. అమెరికా యుద్ద్దవిమానాలను కొన్నట్లయితే, మళ్ళీ పొరుగుదేశాల మధ్య యుద్ధం తలెత్తే పరిస్ధితుల్లో పాకిస్ధాన్‌తో ఉన్న స్నేహం కొద్దీ విమానాలకు అవసరమైన మందుగుండు, విడిభాగాలను యుద్ధ సమయాల్లో సరఫరా చేయడానికి అంగీకరించకపోవచ్చంటూ పోటీదారులు ఇండియాకు నూరిపోయవచ్చనీ, తద్వారా అమెరికాకి దక్కాల్సిన ఆయుధ సరఫరా కాంట్రాక్టులను తన్నుకుపోవచ్చన్నది కేబుల్ సారాంశం.

కేబుల్ రాసిన తిమోతి రోమర్, ఫైటర్ జేట్ విమాన కాంట్రాక్టును అమెరికా కంపెనీలకు ఇవ్వడానికి తిరస్కరించిన నేపధ్యంలో రోమర్ ఇండియా రాయబారి పదవికి రాజీనామా చేశాడు. వృత్తిగత, కుటుంబ కారణాలవలన రాజీనామా చేశానని రోమర్ చెప్పినా, కాంట్రాక్టు కోల్పోవడమే రాజీనామా కి కారణమన్నది బహిరంగ రహస్యం. ఫైటర్ జేట్ విమానాల కాంట్రాక్టు కోసం అమెరికా నుండి బోయింగ్, లాక్‌హీడ్ కంపెనీలు పోటీ పడ్డాయి. రష్యా, స్వీడన్ లు కూడా పోటీపడినా వాటిని కూడా ఇండియా తిరస్కరించింది. జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ ల ఉమ్మడి తయారి యూరోఫైటర్ (టైఫూన్), ఫ్రాన్సు తయారి (రాఫేల్) లవైపు ఇండియా మొగ్గు చూపింది. అమెరికాకి ఆయుధాలు అందించే కంపెనీల్లో లాక్‌హీడ్ మొదటి స్ధానంలో ఉండగా బోయింగ్ రెండో స్ధానంలో ఉంది. అమెరికా పొదుపు కోసం ఖర్చులు తగ్గించుకున్న వేపధ్యంలో ఇండియా తదితర దేశలకు ఆయుధాల అమ్మకంతో పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది.

ఇండియా నిర్ణయం తెలిసాక అమెరికా ప్రభుత్వం తీవ్ర ఆశనిపాతానికి గురైనట్లు ప్రకటించింది. అయినా ఇండియాతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తూనే ఉంటామని అమెరికా అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఫైటర్ జెట్ విమానాల వ్యవహారం ఇండియా, అమెరికాల సంబంధాలకు తాత్కాలికంగానైనా విఘాతమేనని భావిస్తున్నారు. ఇండియా అణు పరీక్షలు జరిపిన దరిమిలా అమెరికా ఆంక్ధలు విధించిన అంశాన్ని అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోటీదారులు వాడుకుంటారని రోమర్ కేబుల్‌లో వివరించాడు. పాకిస్ధాన్‌తో దగ్గరి సంబంధాలున్న అమెరికాను నమ్మలేమని కూడా చెబుతారని కేబుల్‌లో స్పష్టం చేశాడు. పేరు చెప్పని వ్యక్తులను ఉటంకిస్తూ “ఇండియా, అమెరికా సరఫరా చేసీన్ ఆయుధాలను పాకిస్ధాన్‌వైపుగా ఎన్నడూ మొహరించబోదు” అని చెప్పినట్లుగా ఆయన రాశాడు. “ఎందుకంటే ఇండియా, పాకిస్ధాన్‌లు ఘర్షణ పడితే అమెరికా సరఫరాలు ఆపేసే అవకాశం ఉంది” అని చెప్పాడని కేబుల్ ద్వారా వెల్లడయ్యింది.

అమెరికా మిలట్రీ సరఫరాలపై ఇండియా అపనమ్మకాల ప్రభావం ఫైటర్ జేట్ కాంట్రాక్టుపై పడిందా అని రాయిటర్స్ విలేఖరి స్టేట్ డిపార్టుమెంట్ సీనియర్ అధికారిని ప్రశ్నించగా “ఇంతవరకూ అలాంటిదేమీ లేదు. సాంకేతిక కారణలవలనే అమెరికా కంపెనీలను తిరస్కరించారు. అమెరికా కాంట్రాక్టు తిరస్కరణ ద్వారా విశాలమైన వ్యూహాత్మక సంబంధాలపై ఏర్పడే ప్రభావాలపై దృష్టి పెట్టకపోవడం వలన కూడా ఈ నిర్ణయం జరిగింది” అని ఆయన వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ తెలిపింది. అమెరికా అధికారి భావం సుస్పష్టమే. అమెరికా, ఇండియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి సంబంధాలు మెరుగుపడుతున్న పరిస్ధితుల్లో అమెరికా కాంట్రాక్టును తిరస్కరించడం క్షేమకరం కాదన్న సంగతిని ఇండియా గుర్తించలేదనీ, అందువలన ఇండియా ఆ నిర్ణయం తీసుకుందనీ అమెరికా అధికారి పరోక్షంగా ఇండియాను హెచ్చరించాడు. ఫైటర్ జెట్ విమానాలు కొనకపోతేనే ఈ రకమైన హెచ్చరికలు చేస్తున్న అమెరికా, నిజంగా అమెరికా విమానాలను కోంటే గనక మనవాళ్ళు అనుమానించినట్లు యుద్ద సమయాల్లొ ఇండియాను నట్టేట్లో ముంచడం ఖాయమనే అర్ధం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s