ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి ఒప్పందానికి వచ్చాయి. ఎన్నికలు నిర్వహించడంపై ఈ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పక్షాలూ సహకరించుకుంటూ పాలస్తీనా విముక్తికి ఉమ్మడి కృషి జరపడానికి అవకాశాలు ఏర్పడ్డాయని భావించవచ్చు. అరబ్ ఉద్యమాల నేపధ్యంలో ఫతా, హమాస్ ల ఐక్యత కోసం పాలస్తీనా ప్రజలు కూడా వేల సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించడంతో సహకారం వైపుగా ఫతా, హమాస్ లు అడుగువేయక తప్పలేదు.
ఫతా పార్టీ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌కి (పి.ఎల్.ఓ) సంబంధించిన పార్టీ. మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలోని ఈ పార్టీ ఇజ్రాయెల్, అమెరికాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ, అమెరికా నుండి సంవత్సరానికి 450 బిలియన్ డాలర్ల సహాయం పొందుతోంది. ఇజ్రాయెల్‌కు వెస్ట్‌బ్యాంకులోని అత్యధిక భాగాల్ని ధారాదత్తం చేస్తూ పి.ఎల్.ఓ రహస్యంగా కుదుర్చోబోయిన ఒప్పంద పత్రాలు “పాలస్తీనా పేపర్స్” పేరుతో లీకయ్యాయి. దానితో పి.ఎల్.ఓకూ, అబ్బాస్కూ పాలస్తీనాలో ఉన్న పరువు ప్రతిష్టలు అడుగంటాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, పాలస్తీనా ప్రజలు హమాస్‌పై ఉన్న అభిమానాన్ని పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదు. వెస్ట్‌బ్యాంకులో కూడా హమాస్ కే ఎక్కువ ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కుయుక్తులతో ఫతా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వమన్న పేరే తప్ప ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఫతా తన ప్రజలకోసం ఒక్క చర్యనుకూడా తీసుకోలేదు. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఫతా ప్రభుత్వం కొన్ని నెలలపాటు హమాస్ నేతలను, కార్యకర్తలనూ వేటాడి చంపిన చరిత్ర ఉంది. ఈ నేపధ్యంలో ఫతా ద్రోహాన్ని మరిచిపోయి హమాస్ ఒప్పందానికి అంగీకరించడం పాలస్తీనా భవిష్యత్తు దృష్యా అభినందనీయమే.
ఒప్పందం ప్రకారం ఫతా, హమాస్ పార్టీలు కొద్ది రోజుల్లో ఉమ్మడిగా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి. సంవత్సరం లోపు ఎన్నికలు నిర్వహిస్తాయి. 1967 నాటి అరబ్ యుద్ధంలో పాలస్తీనా భూభాగాలను దురాక్రమించడమే కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనీయులపై హేయమైన జాతి వివక్షను ప్రదర్శిస్తున్నది. ఫతా ఆధ్వర్యంలోని ప్రభుత్వం కింద ఉన్న వెస్ట్ బ్యాంకు లో పాలస్తీయునీయుల ఇళ్ళను కూల్చివేసి, బలవంతంగా ఖాళీ చేయించి ఇజ్రాయెలీయులకు సెటిల్మెంట్లు నిర్మిస్తోంది. హమాస్ ఆధ్వర్యంలో ఉన్న గాజా ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందకుండా అష్ట దిగ్బంధం కావించింది. ఇజ్రాయెల్ దిగ్బంధనానికి సహకారంగా ఈజిప్టు మాఫీ అధ్యక్షుడు ముబారక్ గాజాతో తమ దేశానికి ఉన్న రఫా సరిహద్దును మూసివేశాడు. 2009 డిసెంబర్లో గాజాపై “ఆపరేషన్ కాస్ట్లీడ్” పేరుతో దాడి చేసిన ఇజ్రాయెల్, ప్రభుత్వ మౌలిక నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి, 1400 మందికి పైగా పౌరులను టార్గెట్ చేసి మరీ చంపింది. దాడిలో కూలిపోయీన ఇళ్ళు నిర్మించుకోవడానికి సిమెంటు లాంటి నిర్మాణ సామాగ్రిని గాజా పౌరులు దిగుమతి చేసుకోకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డగిస్తోంది.
వెస్ట్‌బ్యాంక్‌లో సెటిల్మెంట్ల నిర్మాణం అక్రమమని ఐక్యరాజ్య సమితి తీర్మానాలు ఘోషిస్తున్నాయి. గాజా దిగ్బంధనం మానవతా నేరమని పలు సంస్ధలు, ప్రముఖులు ఖండిస్తూ ఎత్తివేయమని డిమాండ్ చేసినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతున్నది. ప్రపంచంలో అనేక దేశాలు ఇజ్రాయెల్ అణచివేత చర్యలను, దురాక్రమణ విధానాలను ఖండిస్తున్నా ఇజ్రాయెల్ లెక్క చేయదు. భూమి, నీరు లాంటి సహజవనరులను స్వాయత్తం చేసుకుని పాలస్తీనా అరబ్బులు తమ దయా దాక్షిణ్యాలపై అధారపడే స్ధితికి నెట్టివేసింది. ప్రపంచ పోలీసు అమెరికా ప్రయోజనాలను మధ్యప్రాచ్యంలో కాపాడుతున్న ఇజ్రాయెల్ దురన్యాయాలను ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తోంది తప్ప పాలస్తీనా ప్రజలను, వారి హక్కులను కాపాడానికి ధృఢ ప్రయత్నాలు చేయలేక పోతున్నాయి. లిబియా, ఐవరీ కోస్టులలో పౌరులను రక్షించే పేరిట అక్కడి ప్రభుత్వాలను కూల్చివేయడానికి బాంబుదాడులు చేసే పశ్చిమ దేశాలు గాజా పౌరుల నరకయాతనను మాత్రం పట్టించుకోవు.
కొత్త సంవత్సరంలో వెల్లువెత్తిన ప్రజాస్వామిక ఉద్యమాల వలన పాలస్తీనా ప్రజల విముక్తి వైపుగా ప్రయత్నాలు జరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వత్తాసుగా ఉన్న ముబారక్ ప్రభుత్వం కూలిపోవడం ఒక అనుకూలాంశం. మధ్యంతర ప్రభుత్వం ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య ఉన్న శాంతి ఒప్పందాన్ని గౌరవిస్తామని ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరిగి ప్రజల ఓట్లతో నడిచే ప్రభుత్వాలు వచ్చాక ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని రద్ధు చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఎన్నికలు జరగకముందే ఈజిప్టు మధ్యంతర ప్రభుత్వం పాలస్తీనాలోని వైరి పక్షాల మధ్య ఒప్పందం కుదిరేలా ప్రయత్నించి సఫలం కావడం శుభసూచకం. అయితే ఫతా, హమాస్ ల మధ్య వైరం లోతైనది కావడంతో ఒప్పందం అమలు జరిగేవరకూ ఒక నిర్ణయానికి రాలేము.
ఈజిప్టు, ట్యునీషియా పరిణామాలు అక్కడి ప్రజలకు సంతోషకారకాలు కాగా ఇజ్రాయెల్‌లోని జాత్యంకార ప్రభుత్వానికి మాత్రం దడ పుట్టిస్తోంది. ముబారక్ ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికా ఆమోదం తెలపడం ఇజ్రాయెల్‌కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇజ్రాయెల్ భయపడినట్టే పాలస్తీనాకూ ఈజిప్టుకు మధ్య స్నేహ సంబంధాలు ప్రారంభమయ్యాయి. గాజాపై తాను విధించిన దుష్ట దిగ్బంధనం కఠినంగా ఉండటానికి ముబారక్ బాగా సహకరించాడు. గాజాకు ఈజిప్టుకు మధ్య ఉన్న రఫా సరిహద్దును తెరిచినట్లయితే ఇజ్రాయెల్ దిగ్బంధనం చాలా వరకు విఫలమవుతుంది. ఈజిప్తు నియంతృత్వ పాలనలో అక్కడి ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు గురైనా ఇజ్రాయెల్‌కు అంగీకారమే. గాజా ప్రజలకు కొంత ఊపిరినిచ్చే ప్రజాస్వామిక ప్రభుత్వం ఈజిప్టులో వస్తే గనక ఇజ్రాయెల్ దుష్ట విధానాలకు తీవ్రం ఆటంక గనక అక్కడ ప్రజలు నియంతృత్వంలో మగ్గవలసిందే.