చైనాలో ప్రైవేటురంగ ఆధిపత్యం ఒక మిధ్య


Sinopec_Logo

చైనా ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ "సినోపెక్" లోగో

చైనా ఆర్ధిక వ్యవస్ధలో ఏ రంగ ఆధిపత్యం వహిస్తోంది? ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? గత 35 సంవత్సరాలనుండి చైనా సంస్కరణలను అమలు చేస్తున్నది గనక అక్కడ ప్రవేటు రంగానిదే ఆధిపత్యం అని అందరూ భావిస్తున్నారు. కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చైనా ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నమాట వాస్తవమె. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా పునరుద్ధరింపబడిన వార్తా వాస్తవమే. కానీ చైనాలో ఇంకా ప్రభుత్వ రంగ పెట్టుబడీదారీ విధానమే ఆధిపత్యంలో ఉందన్న విషయం చాలా తక్కువమందికే తెలుసు. రాజకీయంగా అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్టు వ్యవస్ధ నడుస్తున్నదని చైనా ప్రభుత్వం ఇప్పటికీ చెప్పుకోవడంలో ఎంత నిజం ఉందో సంస్కరణల ద్వారా ప్రవేటీకరణ విధానాలు అవలంబించడం వలన చైనా అంతలా అభివృద్ధి చెందుతోందనడంలో కూడా అంతే నిజం ఉంది.

2010 సంవత్సరంలో చైనాలోని పెట్టుబడుల్లో ప్రభుత్వ రంగ వాటా38 శాతమని చైనా ప్రభుత్వం తెలిపింది. కనుక మిగిలినదంతా (62 శాతం) ప్రవేటు రంగ పెట్టుబడే అన్న అర్ధం ధ్వనిస్తుంది. అమెరికాకి చెందిన “ఆసియా అధ్యయన కేంద్రం” (ఏసియన్ స్టడీస్ సెంటర్) లో రీసర్చ్ ఫెలో డెరిక్ సిజర్స్ ప్రకారం చైనా ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో వినూత్న మార్పులు చేపట్టింది. 1990 ల్లో చైనా ప్రభుత్వరంగ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది. అచ్చంగా ప్రవేటు కంపెనీలకు కూడా ఈ ఆస్తుల్ని అమ్మారు. కానీ రాజకీయంగా తీవ్రమైన విమర్శలను రావడంతో 2000 ల నుండి ప్రభుత్వ రంగ సంస్ధలను (ఎస్.ఒ.ఇ – స్టేట్ ఓన్డ్‌ ఎంటర్‌ప్రైజెస్) షేర్ హోల్డింగ్ సంస్ధలుగా మార్చింది. అలా మార్చడం వలన ఆటోమేటిక్ గా అవి ప్రవేటు సంస్ధలుగా మారినట్లు అనిపించినప్పటికీ, వాటి వర్గీకరణ అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది.

ఎస్.ఓ.ఇ లు షేర్‌హోల్డింగ్ సంస్ధలుగా మార్చిన తర్వాత అవి అచ్చంగా వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభించాయి. వీటి షేర్లను ప్రధానంగా షాంఘై, హాంకాంగ్ తదితర చోట్ల అమ్మారు. ఇ షేర్ హోల్డింగ్ సంస్ధలను “లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్లు” గా చైనా ప్రభుత్వం పిలిచింది. దానికి తక్షణ అర్ధం అవి ప్రవేటు సంస్ధలనే. అయితే వీటిని “wholly state owned (పూర్తి ప్రభుత్వస్వామ్యం)”, “non-Wholly state owned (పూర్తి ప్రభుత్వ స్వామ్యం కానివి)” అని రెండు రకాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. “లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్లు” అని పిలవడంతోటే వాటన్నింటినీ ప్రవేటు సంస్ధలుగా భావించనవసరం లేదని ఈ వర్గీకరణ ద్వారా మనకు అర్ధం అవుతుంది. అలాగే షేర్లు అమ్మడం వలనగానీ, షేర్ హోల్డర్ల పేర్లు ప్రకటించడం వలన గానీ ఒక సంస్ధ పూర్తిగా ప్రవేటు సంస్ధగా మారనవసరం లేదని కూడా అర్ధం అవుతుంది. ఇలా మిశ్రమ లక్షణాలను కలిగిఉన్న సంస్ధలను కూడా ప్రవేటు సంస్ధలుగా చాలామంది భావిస్తున్నారు. ఆ విధంగా చైనాలో ప్రవేటు సంస్ధలదే ఆధిపత్యం అన్న భావన వ్యాపించింది. ఇది పూర్తిగా చైనా పాలకుల ఎత్తుగడ. “చైనాలోని నిర్ధిష్ట పరిస్ధితులకు నిర్ధిష్ట విధానాలు” అన్న మావో సూత్రాన్ని ఈ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్ధకు గూడా అన్వయించగలిగిన చైనా పాలకులు ఒక రకంగా అభినందనీయులే.

చైనా ప్రవేటురంగంగా పేర్కోనే సంస్ధలు, పూర్తిగా విదేశీ సంస్ధలు కలిపి 2010 సంవత్సరంలో పెట్టిన పెట్టుబడి, మొత్తం పెట్టుబడిలో 24 శాతం మాత్రమే డెరిక్ సిజర్స్ పేర్కొన్నాడు. అంటే మిగిలిన పెట్టుబడి అంతా ప్రవేటు రంగంగా కనబడే మిశ్రమ సంస్ధలనుండే వచ్చిందన్న మాట. చైనా సంస్కరణలను ఈ విధంగా జాగ్రత్తగా రూపొందించింది చైనా కమ్యూనిస్టు పార్టీలొ నెం.2 గా పేర్కొనే “వు బాంగ్గువో” అని డెరిక్ తెలిపాడు. ప్రవేటురంగానికి ఆధిపత్యం అప్పగించడం అంటే చైనాలో మరో రాజకీయ పార్టీని అనుమంతించడంతో సమానమని వు అభిప్రాయం. ప్రవేటు రంగ ఆధిపత్యంపై చైనా కమ్యూనిస్టు పార్టీ లోని ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి అంత వ్యతిరేకత ఉన్నదన్నమాట! చైనా స్టాక్ మార్కెట్ జాబితాలో చోటు సంపాదించుకున్న కంపెనీల్లో చాలా వరకు ప్రభుత్వరంగ సంస్ధలే కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ లొ లిస్ట్ అవుతూ కూడా ప్రభుత్వరంగంలో కంపెనీలను ఎలా కొనసాగించవచ్చో చైనా పాలకులు చూపించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు! అటు మార్కెట్ ఎకానమీ ఇష్టులయిన పశ్చిమ దేశాలను సంతృప్తి పరచవచ్చు. ఇటు ప్రభుత్వరంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుకోవచ్చు. నెహ్రూగారి మిశ్రమ ఆర్దిక వ్యవస్ధలాగా కాకుండా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని నిఖార్సుగా అమలుచేయడంగా దీన్ని పేర్కొనవచ్చునేమో.

చైనాలో ఇలా మారిన ఎస్.ఓ.ఇలు పూర్తి ప్రవేటు సంస్ధలతో పోలిస్తే ప్రభుత్వం మద్దతును బాగా పొందుతాయి. 2006లో ప్రభుత్వం మాత్రమే పెట్టుబడి పెట్టాల్సిన రంగాల్ని ప్రభుత్వం గుర్తించింది. అవి విద్యుత్, టెలికం, విమానయానం రంగాలు. కాని ఆచరణలో అనేక రంగాల్లో ప్రభుత్వ రంగ ఆధిపత్యం కొనసాగుతోందని డెరిక్ అధ్యయనంలో తేలింది. బ్యాంకింగ్, రైల్వేలు, మీడియా రంగాలు వాటిలో కొన్ని. బ్యాంకింగ్ రంగాన్ని చేతిలో పెట్టుకోవడమంటే ద్రవ్య వ్యవస్ధ (ఫైనాన్షియల్ సెక్టార్)ని పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోవడమే. చైనాలాంటి పెద్ద దేశంలో రైల్వేలు ఎంత భారీరంగమో ఊహించుకోవలసిందే. ఎస్.ఓ.ఇ లకు ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ప్రవేటు కంపెనీలు ఎంత ధరైనా పెట్టి కొనలేని భూమి ఎస్.ఓ.ఇ లకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులనుండి వాటికి యధేచ్ఛగా అప్పులు లభిస్తాయి. కొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా అప్పును తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అంటే అప్పు ఎగ్గొట్టినా ఫర్లేదన్నమాట!

వరల్డ్ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్ధలలో ఉన్నతాధికారులుగా అమెరికా, యూరప్ దేశాల అధికారులు, పాలకులు రోటీన్ గా నియమితమవుతూ ఉంటారు. ముఖ్యంగా అమెరికా ప్రవేటు రంగంలోని ద్రవ్యసంస్ధల (ఇన్వెస్టుమెంటు బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు) సి.ఇ.ఓ లు అమెరికా ఆర్ధిక వ్యవస్ధను నియంత్రించే అధికారులుగా నియమితులు కావడంతో పాటు ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకులకు కూడా అధికారులుగా నియమితులవుతారు. ఒక స్ధానం నుండి మరొక స్ధానానికి యధేచ్ఛగా మారుతుంటారు. తద్వారా అమెరికా, యూరప్ ల బహుళజాతి సంస్ధలు అంతర్జాతీయ సంస్ధలపై ఆధిపత్యాన్ని నిలుపుకుంటాయి. (ఈ విషయం కొణతాల దిలీప్ అనువదించిన “ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకంలో చూడవచ్చు)  సరిగ్గా అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నతస్ధానాల్లో ఉన్నవారు ఎస్.ఓ.ఇ లకు ఉన్నతాధికారులుగా నియమితమవుతూ ఉంటారు. తద్వారా చైనా ప్రభుత్వ రంగంపైనా, తద్వారా మొత్తం ఆర్ధిక వ్యవస్ధపైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం చెక్కుచెదరకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

సైనోపెక్, బ్యాంక్ అఫ్ చైనా లాంటి అత్యంత భారీ సంస్ధలను లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్స్ గానే చైనాలో పిలుస్తారు. వాస్తవంలో ఇవి ప్రభుత్వ రంగ సంస్ధలే. వీటికి ప్రభుత్వ నిధులు భారిగా అందుతుండడమే దానికి రుజువు. చైనా నేషనల్ పెట్రోలియం, చైనా మొబైల్ సంస్ధలకు 2009లో వచ్చిన లాభాలు, చైనాలో 500కు పైగా ఉన్న ప్రవేటు సంస్ధలకు వచ్చిన మొత్తం లాభాలకంటే ఎక్కువని చైనా ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ప్రభుత్వాలు అప్పు పెట్టుబడులు సేకరించడానికి ట్రెజరీ బాండ్లు (సావరిన్ డెట్ బాండ్లు) జారీ చేయడం ద్వారా సేకరిస్తాయన్నది తెలిసిన విషయమే. అయితే చైనా సేకరించిన అప్పులో అత్యధిక భాగం ఈ బాండ్లతో సంబంధం లేకుండా సేకరించబడిన విషయాన్ని ఆసియా అధ్యయనం కేంద్రం గమనించింది. 2005-2010 సంవత్సరాల మద్య ఇలా సేకరించిన పెట్టుబడుల్లో 95 శాతం పెట్టుబడులను ఎస్.ఓ.ఇ లే సమకూర్చాయని ఈ కేంద్రం అంచనా వేసింది. అంటే చైనాలో పెట్టుబడులను ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్ధలో సమకూరుస్తున్నాయన్న మాట! ప్రపంచంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్నప్పటికీ వాటికంటే అధికంగా చైనా ప్రభుత్వ రంగ పెట్టుబడులు ఉండడం గమనార్హం.

ప్రభుత్వరంగ సంస్ధల పాత్ర తగ్గించడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. ఇకముందుకూడా జరుగుతాయి. అయితే ఆ ప్రయత్నాలను ప్రభుత్వ రంగ సంస్ధలు గట్టిగా వ్యతిరేకిస్తాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రభుత్వరంగ పెట్టుబడిదారీ విధానానికి మెజారిటీ మద్దతు ఉన్నదని భావించవచ్చు. మెజారిటీ మద్దతు ప్రవేటు పెట్టుబడిదారీ విధాన మద్దతుదారుల పక్షానికి మళ్ళిన రోజున ప్రవేటు రంగ ఆధిపత్యం పెరగవచ్చునేమో! చైనా కమ్యూనిస్టు పార్టిలో సంస్కరణల వేగంపై జరుగుతున్న ఘర్షణను ఈ అంశం వెల్లడిస్తున్నది. చైనా ప్రభుత్వ రంగంలో ఉన్న కొన్ని బ్యాంకులు, టెలికం సంస్ధలు, ఆయిల్ కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలుగా పేరుపొందాయి. ఇవి ప్రభుత్వానికి భారిగా నిధులు అందిస్తున్నాయి. ఉద్యోగాలు కూడా భారీగానే ఇస్తున్నాయి. చైనా పట్టణాల్లో ఉన్న ఉద్యోగుల్లో సగం మందికి పైగా ప్రభుత్వ రంగ సంస్ధల్లోనే పనిచేస్తున్నారని ఒక అధ్యయనం తెలిపింది. చైనాలోని చాలా రంగాల్లో ప్రభుత్వ రంగాల పెట్టుబడి పోగా మిగిలిన మార్కేట్ లోనే విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు.

చైనా యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదనీ దానివలన చైనాకి వాణిజ్య మిగులు పెరుగుతున్నదనీ కనుక యువాన్ విలువ తగ్గడానికి చైనా ప్రభుత్వం అనుమతించాలని అమెరికా, యూరప్ లతో పాటు ఇండియా కూడా చాలా కాలంగా వాదిస్తున్నాయి. కాని యువాన్ కంటే చైనా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్ధలకు ఇస్తున్న సబ్సిడీలు తదితర్ మద్దతే చైనా సరుకులను అంతర్జాతీయ వాణిజ్యంలో గట్టి పోటీ ఇవ్వడానికి ప్రధాన కారణంగా ఉంది. అంతేకాక ఆర్ధిక సంక్షోభం తర్వాత చైనా దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకొంటోంది. అంటే ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను దేశీయాధారితంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా సంక్షోభం వచ్చినప్పుడు తట్టుకోవడం సులభమవుతుంది. 2008 ద్రవ్య సంక్షోభం నుండి చైనా సులభంగా తప్పించుకోవడానికి కారణం అక్కడ ప్రభుత్వరంగం ఆధిపత్యంలో ఉండడమే. చైనా అంత కాకపోయినా ఇండియాలో కూడా ప్రభుత్వరంగంలోనే ద్రవ్య సంస్ధలు ప్రధానంగా ఉండడం వలన ద్రవ్య సంక్షోభం నుండి కొద్దిలో తప్పించుకుంది.

చైనానుండి ఇండియా పాలకులు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సామ్ర్యాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి సంస్ధల కోసం ఇండియా పాలకులు ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలంటే తెల్ల ఏనుగులనీ, పోటీకి తట్టుకోలేవనీ దుష్ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా వాటిని బలహీన పరచి ప్రవేటీకరణ గావిస్తున్నారు. దానికోసం ఒకప్పటి ప్రపంచ బ్యాంకు ఆర్ధిక వేత్తను ప్రధానిగా నియమించుకున్నాయి భారత దేశ దళారీ పాలకవర్గాలు. ఇప్పుడు వరసగా ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్ముతున్నాయి. బడ్జెట్ లో ఆదాయం ఖాతాల్లో ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అనే సబ్ హెడ్డింగ్ ఉండటం మామూలైపోయింది. అదేమంటే ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు), ఫిస్కల్ డిసిప్లెయిన్ లాంటి పదాలు వల్లించడం ఫ్యాషనై పొయింది. ఇరవై సంవత్సరాలనుండి లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మక తప్పదని చెబుతూ వచ్చిన భారత పాలకులు ఇప్పటికీ లోటు గురించే మాట్లాడుతున్నారు. దానర్ధం గత ఇరవై సంవత్సరాలనుండి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలని అనుసరిస్తూ వచ్చిన విధానాలు లోటు తగ్గించడంలో విఫలమయ్యాయనే కదా అర్ధం? వారి సంస్కరణ విధానాలు ఫలవంతం కావడానికి ఇంకెన్నాళ్ళు కావాలో మరి! నిజానికి సంస్కరణలు, లేదా నూతన ఆర్ధిక విధానాలు భారత ఆర్ధిక వ్యవస్ధను పరాధీనం కావించడానికే ఉపయోగపడ్డాయి. చైనాలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆధిపత్యం ద్వారానే అత్యంత వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి జరిగిందన్న విషయం గమనిస్తే, ప్రభుత్వ రంగంపై సామ్రాజ్యవాదుల ప్రచారం దుష్ప్రచారమేనని స్పష్టంగా అర్ధం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s