ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ


Afghan Jail tunnel

కాందహార్ జైలు సెల్‌లో సొరంగ ద్వారం

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. జైలు గేటును భారీగా రూపొందించారు. జైలు ఆవరణ పరిధిని పెంచి అడుగడుగుకీ చెకింగ్ వ్యవస్ధని ఏర్పాటు చేశారు. ఇనప కంచెలను అంచెలవారీగా అమర్చారు. జైలు గదుల గేట్లను నాణ్యమైన మందపు ఉక్కుతో తయారు చేసి అమర్చారు. పటిష్టమైన తాళాలను ఏర్పాటు చేశారు. కాపలాకు కొత్త టవర్లు నిర్మించారు. ఈ జైలు ఆధునీకరణకు మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టారు.

ఇంత చేసినా, అమెరికా, దాని మిత్రుల అత్యాధునిక భద్రతా ఏర్పాట్లను హేళన చేస్తూ ఏకంగా 488 మంది తాలిబాన్లు ఒకే సొరంగం ద్వారా తప్పించుకుపోయారు. తప్పించుకున్న వారిలో 13 మంది సాధారణ నేరస్తులు కాగా మిగిలిన వారంతా తాలిబాన్లే. జైలు బైట ఉన్న ఒక ఇంటిలోనుండి సొరంగం తవ్వడం ప్రారంబించి జైలు లోపల ఉన్న ఒక సెల్‌లోపల తెరుచుకునే విధంగా పూర్తి చేశారు. దీన్ని తవ్వడానికి ఐదు నెలలపైనే పట్టిందని తప్పించుకున్న వారి ద్వారా తెలిసింది. అంతమంది తప్పించుకోవడానికి నాలుగు గంటల సమయం పట్టినప్పటికీ జైలులోని భద్రతాధికారులు పసిగట్టలేకపోయారు. చివరి ఖైదీ తప్పించుకున్న అరగంట తర్వాత మాత్రమే ఖైదీల పరారీ విషయాన్ని తెలుసుకున్నారు. ఉదయం పూట తనిఖీల్లొ గాని విషయం బైట పడలేదు. జైలు సిబ్బంది సహకారం లేనిదే తప్పించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నా, ఐదు నెలల పాటు సొరంగం తొవ్వుతుంటే పసిగట్టలేక పోవడం, అదీ జైలు సమీపంలోనే జరుగుతున్నా పసిగట్టకపోవడం ఖచ్చితంగా జైలు భద్రతా వైఫల్యమే.

ఆఫ్ఘనిస్ధాన్ దక్షిణ భాగంలో ఉన్న కాందహార్ పట్టణం తాలిబాన్లకు ముఖ్యమైన కేంద్రం. కాందహార్ నుండే తాలీబాన్లు ప్రయాణమై ఒక్కో యుద్ధ ప్రభువును ఓడిస్తూ ఆఫ్ఘనిస్ధాన్ మొత్తాన్ని తమ ఆధినంలోకి తెచ్చుకున్నారు. ఉత్తరాన ఉన్న యుద్ధ ప్రభువు హెక్మత్యార్, అమెరికా దాడి తర్వాత తాలిబాన్లతో కలిసి అమెరికా ఆక్రమణపై పోరాడుతున్నాడు. ఈ ఘటన తమకు అవమానకరమైనదేనని ఆఫ్ఘన్ ప్రభుత్వం అంగీకరించింది. ఆఫ్ఘన్ భద్రతా దళాలకు మరో మూడు నెలల తర్వాత దేశాన్ని అమెరికా దళాలు అప్పగించనున్న తరుణంలో ఈ ఘటన అమెరికా తొత్తు ప్రభుత్వమైన హమీద్ కర్జాయ్ ప్రభుత్వ శక్తియుక్తులపైన తీవ్ర అనుమానాలు రేకిత్తిస్తోంది. వచ్చే జులైలో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్ లో పోరాట భాద్యతలనుండి తప్పుకుంటుందని ఒబామా గత సంవత్సరం ప్రకటించాడు.

అమెరికా సైన్యమ్ ఆఫ్ఘనిస్ధాన్ విడిచి వెళ్ళడం జరగదు. విడిచి వెళ్ళడానికి అమెరికా సైన్యం రాలేదు గనక అవి వెళ్ళవు. అమెరికాకి కావలసింది ఆఫ్ఘనిస్ధాన్లో ప్రజస్వామ్యం కాదు. ఆర్ధికంగా ఎదుగుతున్న చైనా, ఇండియాలపై ఓ కన్ను వేసి ఉండటానికి దానికి దక్షిణాసియాలో స్ధావరం కావాలి. పాకిస్ధాన్ మిత్రదేశమే అయినప్పటికీ ఆ దేశానికి చెందిన అణు శాస్త్రజ్ఞుడు ఎ.క్యూ.ఖాన్ తన అణు పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు కూడా అందించడాంతో పాకిస్ధాన్ పై అమెరికాకి అంతగా నమ్మకం లేదు. పైగా ఐ.ఎస్.ఐకి టెర్రరిస్టు సంస్ధలను పోషిస్తున్నది. దానితో తన సైనికులను పెద్ద సంఖ్యలో మొహరింపజేయడానికి మరో దేశం అమెరికాకి కావాలి. రష్యా సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ ని ఖాళీ చేసి వెళ్ళాక అక్కడ స్ధిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. యుద్ధ ప్రభువుల మధ్య నిత్యం కొట్లాడుకుంటుండగా పాకిస్ధాన్ మద్దతుతో తాలిబాన్ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అయితే తాలిబాన్ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు లొంగి ఉండటానికి అంగీకరించలేదు. రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసీన్ ఆఫ్ఘన్లకు అమెరికా అన్ని రకాలుగా సహకారం అందించింది. ఆల్-ఖైదా సంస్ధలనూ, లాడెన్ లాంటి వారినీ పెంచి పోషించింది. కాని వారు అమెరికా ప్రయోజనాలకు లొంగి ఉండటానికి నిరాకరించడాంతో అక్కడ జొరబడడానికి కారణం కోసం వెతుకులాడింది. ఈ లోపు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు జరగడంతో అమెరికా పని సులువయ్యింది. అసలు అమెరికా పాలకుల్లోని ఒక సెక్షన్ డబ్ల్యు.టి.సి. టవర్లపై దాడులు చేయించిందని ఆరోపణలు బలంగానే ఉన్నాయి. టవర్లపై రెండో దాడి వాస్తవానికి విమానం ద్వారా జరగలేదనీ, బాంబులతో పేల్చివేశారని కొంతమంది అమెరికన్లే సాక్ష్యాధారాలను చూపించారు. ప్రపంచ వ్యాపితంగా రెండు టవర్లు మండుతున దృశ్యాన్ని టీవీల్లో చూపిన సంగతి తెలిసిందే. రెండో విమానం ఎగురుతున్న దిశ, ప్రయాణ వేగం అన్నిటినీ గమనించి అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా మేనేజ్ చేసినదని నిరూపించారు. అది కాకుండా రెండు టవర్లను విమానాలు డీకొన్న తర్వాత మధ్యలో అనేక పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళు అంతకుముందే అమర్చిన బాంబుల పేలుళ్ళని అనేక మంది అమెరికన్ నిపుణులే పేర్కొన్నారు.

మొత్తం మీద ఆఫ్ఘనిస్ధాన్ పై దాడికి అమెరికాకి కారణం దొరికింది. మొదట ఏకపక్షంగా దాడి ప్రారంభించాలని భావించిన జార్జి బుష్, గుంటనక్క బ్రిటన్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ సలహాతో ఐక్యరాజ్యసమితి తీర్మానం అంటూ నాటకాలాడి ఇతర దేశాలను కూడగట్టి ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ దాడి చేశాడు. అమెరికాకి తన సమస్యను ప్రపంచ సమస్యగా మార్చగల కళ ఉంది. టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం అని ప్రకటించి, దానిలో తనతో రానివందరూ తనకు వ్యతిరేకులే అంటూ గూండాగిరి న్యాయ సూత్రాన్ని జార్జి బుష్ ప్రకటించాడు. దాంతో టెర్రరిస్టుల భయం లేనివారు, టెర్రరిజానికి భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటున్నవారు సైతం ఈ “గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్‌” నినాదాన్ని అందుకున్నారు.

త్వరలో యుద్ధాల సీజన్ ప్రవేశిస్తోంది. అంటే ఘర్షణలు తీవ్రమవుతాయి. ఒబామా అదనంగా 30,000 మంది సైన్యాన్ని గత సంవత్సరం పంపించాడు. ఈ నేపద్యంలో తాలిబాన్లు అధిక సంఖ్యలో తప్పించుకోవడం అమెరికా సైన్యానికి ప్రతికూల పరిణామం. ఇప్పుడు తాలిబాన్లకు అదనంగా క్యాడర్ సమకూరినట్లే. వారికి కొత్తగా శిక్షణ కూడా అవసరం లేదు. ఇక మరిన్ని ఆత్మాహుతి దాడులు, మరిన్ని డ్రోన్ దాడులు మరింతమంది పౌరుల దుర్మరణం సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా ఎంతమంది తాలిబాన్, ఆల్-ఖైదా నాయకులను, మిలిటెంట్లను చంపినా కొత్తగా నాయకులు తయారవుతారు, కొత్త మిలిటెంట్లు వచ్చి చేరుతుంటారు. తమ దేశాన్ని పరాయి దేశం వచి ఆక్రమిస్తే ఎవరు మాత్రం సహిస్తారు? నిజానికి తాలిబాన్లు చేసేది టెర్రరిజం అని అమెరికా తదితర దేశాలు ఎంత ప్రచారం చేసినా, అవి ఆఫ్ఘనిస్దాన్ ని ఆక్రమించాయన్న విషయాన్ని దాచలేవు. విదేశీ ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నపుడు జాతియోద్యమమో లేక జాతీయ పోరాటమో అవుతుంది తప్ప టెర్రరిజం ఎలా అవుతుంది. భారత దేశాన్ని ఆక్రమించిన బ్రిటన్ కి వ్యతిరేకంగా భారతీయులు వంద సంవత్సరాలకు పైగా జాతీయ పోరాటం చేశారు. అలాగే అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపొయే వరకూ తాలిబాన్ తో యుద్ధం తప్పదు. ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అనివార్యంగా జాతియోద్యమాలకు మద్దతు ఇవ్వక తప్పదు. అమెరికా ఆఫ్ఘనిస్ధాన్ లో ఉంటే ఇండియాకు పక్కలో బాంబు ఉన్నట్లే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s