ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని ఎడిబి అంచనా వేసింది. ఈ సంవత్సరం చాలా ఆసియా దేశాల్లో దేశీయ ఆహార ధరలు 10 శాతం పెరిగాయని ఎడిబి ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో ఆయిల్ ఉత్పత్తి చేసే అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాలు, వీటిని అడ్డం పెట్టుకుని పశ్చిమ దేశాలు లిబియా, సిరియాలాంటి చోట్ల రెచ్చగొడుతున్న స్పాన్సర్డ్ ఉద్యమాల కారణంగా ఆయిలు ధర విపరీతంగా పెరుగుతోంది. సమీప కాలంలో ఇవి చల్లారే అవకాశాలు కనిపించడం లేదు. చల్లారే అవకాశాలు వచ్చినా, తమ అనుకూల ప్రభుత్వాలు వచ్చే వరకూ పశ్చిమ దేశాలు ఆ ఉద్యమాలను చల్లారనివ్వవు. ఆహార ధరలకు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన ధరలు కూడా పెరుగుతుండడంతో ఆసియా దేశాల ఆర్ధిక వృద్ధి పైనా, ప్రజల పైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతున్నది.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఆసియా దేశాలు వేగంగా బయటపడటంతో అక్కడ జీవన ఖర్చులు (కాస్ట్ ఆఫ్ లివింగ్) బాగా పెరిగాయి. ధరలు పెరగడం వలన ఇప్పటికే పేదలుగా ఉన్న వారిని తీవ్ర దారిద్ర పీడితులుగా మారే అవకాశం పుష్కలంగా ఉందని ఎడిబి హెచ్చరించింది. దేశీయ ఆహార ధరల్లో 10 శాతం పెరుగుదల జరిగితే ఆసియా దేశాల్లో కనీసం 65 మిలియన్ల మంది (6.5 కోట్లు) తీవ్ర దారిద్ర్యం లొకి నెట్టబడతారని ఎడిబి తెలిపింది. ఎడిబి ముఖ్య అర్ధికవేత్త ఛాంగ్‌యాంగ్ రీ అంచనా ప్రకారం, అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లోని పేద కుటుంబాలు తమ ఆదాయంలో 60 శాతం భాగాన్ని ఇప్పటికే ఆహారం పై ఖర్చు పెడుతున్నాయి. ఆహార ధరల పెరుదలతో వారు తమ పిల్లల చదువుకు గానీ, వైద్య అవసరాలకోసం గానీ ఖర్చు పెట్టలేని స్ధితికి చేరుకుంటున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకుంటే ఇప్పటి వరకు సాధించిన దారిద్ర నిర్మూలన కాస్తా అటకెక్కుతుందని ఎడిబి ఆందోళన చెందింది.
ప్రతికూల వాతావరణం వలన కొన్ని దేశాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా డాలరు విలువ తగ్గుతుండడం, ఇంధన ధరలు పెరగడం వలన కూడా ఆహార ధరలు పెరిగాయని ఎడిబి విశ్లేషించింది. ఫలితంగా ఆసియా దేశాలు ఆహారం, ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించాయి. ఎగుమతుల నిషేధం అది ఉద్దేశించిన లక్ష్యానికి విరుద్ధమని ఎడిబి చిత్రంగా వ్యాఖ్యానించింది. “ఆహార సంక్షోభం నుండి బైట పడడానికి సామాజిక భద్రతా నెట్‌వర్కును శక్తివంతం కావించుకుంటూనే, ఎగుమతులపై నిషేధం విధించే ధోరణిని నియంత్రించాలి” అని చాంగ్‌యాంగ్ రీ వ్యాఖ్యానించాడు. ఇదేలా అంగీకార యోగ్యమో ఆయన వివరించాల్సి ఉంది.
ఏ దేశమైనా తమ ప్రజలకు ఆహర పధార్ధాలను తగినంతగా అందుబాటులో ఉంచాలనుకుంటే, వాటి ఉత్పత్తి తగ్గినపుడు తప్పనిసరిగా ధాన్యం ఎగుమతిపై నిషేధం విధిస్తాయి. ఎడిబి చెప్పినట్లు సామాజిక భద్రతా వ్యవస్ధను శక్తివంతం కావించడానికే మరిన్ని ఆహార పదార్ధాలను, ధాన్యాన్ని దేశీయంగా నిలవ ఉంచుకోవడం అవసరం. అలా నిలవ ఉంచుకోకుండా ఎగుమతిలు చేయ్యండి అని ఎడిబి సలహా ఇవ్వడం ప్రభుత్వాలను, ప్రజలను తప్పుదారి పట్టించడమే. తాను చేసిన విశ్లేషణక ఫలితంగా అనివార్యమైయ్యే పరిష్కారానికి పూర్తిగా భిన్నమైన పరిష్కారాన్ని సూచించడం ఎలా సాధ్యమో ఎడిబి ఆర్ధిక వేత్త వివరించలేదు. బహుశా ఎగుమతులు తగ్గడం వలన దిగుమతి దేశాలకు ఆహారం తక్కువైతుందన్నది ఎడిబి భావన కావచ్చు. కాని తమ ప్రజల అవసరాలను పక్కన బెట్టి ఎగుమతులు చేయాలనడం సరైన పరిష్కారం ఎలా అవుతుంది?
తాము బోధిస్తూ, నమ్మే ఆర్ధిక సూత్రాలలోనె ఈ ప్రాధమిక వైరుధ్యం ఉంటే తప్ప ఈ విధంగా విశ్లేషణకు విరుద్ధమైన పరిష్కారం రాదు.