ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు


గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి. ఇంతవరకూ భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) సాధించడం కష్టమని అవి తేల్చేశాయి. ఇండియాపై తాముంచిన అంచనాను గణనీయంగా తగ్గించాయి.

ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ పోయిన నేపధ్యంలొ అమెరికాకి చెందిన ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ “గోల్డ్‌మేన్ సాచ్” ఇప్పటివరకూ ఇండియా జిడిపి 8.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయగా, దాన్ని 7.8 శాతానికి తగ్గించుకుంది. ద్రవ్యోల్బణం కట్టడి చేయలేక పోవడం, మౌలిక సౌకర్యాల కల్పనలో ఆశించినంత అభివృద్ధి లేక సామర్ధ్య అవరోధాలు, సరఫరా అవరోధాలు కొనసాగుతుండడం వలన ఆర్ధిక వృద్ధి లక్ష్యం సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పెరుగుతున్న ద్వవ్యోల్బణానికి మరో వైద్యం కనిపెట్టాడు. కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్) తగ్గించడం, వ్యవసాయ వృద్దిరేటును గణనీయంగా పెంచడం… ఈ జోడు లక్ష్యాలను సాధించినట్లయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందని ప్రకటించాడు. రెండు సంవత్సరాల క్రితం వర్షపాతం సరిగా లేక పంటలు పండకపోవడంతో ఉత్పత్తి తక్కువై ధరలు పెరిగాయనీ అహ్లువాలియా చెప్పాడు. అంటే వర్షాలు పడలేదు గనక అధిక ధరలు భరించాల్సిందేనన్నది ఆయన ఉద్దేశ్యం. గత సంవత్సరం ప్రారంభంలో వర్షాలు రానివ్వండి అన్నాడు. సరే వర్షాలు బాగా కురిశాయి. బంపర్ క్రాపు వచ్చిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. గత డిసెంబరు నాటికి తగ్గినట్లు కనిపించిన ద్రవ్యోల్బణం జనవరి నుండీ మళ్ళీ స్వారీ మొదలు పెట్టింది.

Fiscal Deficit, India

ఇండియా కోశాగార లోటు (వార్షికం)

సరఫరా ఆవరోధాల వలన ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని అహ్లూవాలియా, ఆర్.బి.ఐ. ప్రధానిలు భాష్యం చెప్పారు. అంటే వ్యవసాయంతో పాటు, ఇతర ఉత్పత్తులను వినియోగదారుల వద్దకు తీసుకెళ్ళడానికి వాహనాలు రోడ్లపైన వేగంగా కదలాలి. రోడ్లు సరిగా లేక అవి వేగంగా వెళ్ళలేక పోయాయి. దానివలన ఆయిల్ ఎక్కువ ఖర్చవుతుంది. ఆయిల్ ధరల సంగతి తెలిసిందే. తర్వాత నిల్వలకు సరిపోయిన గోడౌన్లు లేవు. వివిధ సరుకులను ప్రాసెస్ చేసే యంత్రాలు పాతవి కావడం, సర్వీసింగ్ కి ఎక్కువ ఖర్చు కావడం కారణాల వలన ప్రాసెసింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఈ విధంగా నిలవ, రవాణా, ప్రాసెసింగ్ లు ఖరీదు కావడాన్ని సరఫరా అవరోధాలుగా (సప్లై కన్‌స్ట్రెయింట్స్) పిలుస్తారు. ఈ సరఫరా అవరోధాలే ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని మార్కెట్ ఎకానమీ పండితులయిన ప్రధాని, అహ్లూవాలియా, కౌశిక్ బసు (ప్రధానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు), సుబ్బారెడ్డి (ఆర్.బి.ఐ గవర్నరు) చెబుతూ  వచ్చారు. మార్చి నెల చివరికి ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతంగా నమోదయ్యింది.

జనవరిలో చెప్పిన సరఫరా అవరోధాలను తొలగించడానికి చర్యలేవీ ఇంతవరకు ప్రకటించలేదు. అసలు అవి తొలగిపోయాయా లేదా అన్న ఊసే లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గాల, వ్యవసాయోత్పత్తి పెరగాల, అప్పుడే ద్రవ్యోల్బణం తగ్గేది అని మన్మోహన్, అహ్లూవాలియా లు కొత్త పల్లవిని అందుకున్నారు. మరి జనవరిలో చెప్పిన సరఫరా అవరోధాల సంగతేంటి? బహూశా వాటిని వచ్చే జనవరి కోసం అట్టిపెట్టి ఉండవచ్చు. కోశాగార లోటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మార్చి 2010కి 6.9 శాతంగా ఉన్న కోశాగార లోటును 6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని 3 జి స్పెక్ట్రం వేలం వలన వచ్చిన లక్ష కోట్ల ఆదాయం వలన 5.1 శాతానికి తగ్గించారు. (ఎగువ ఛార్టు చూడండి)

లోటు అంత తగ్గించినా ద్రవ్యోల్బణం తగ్గలేదు. వచ్చే మార్చి 2012 నాటికి కోశాగార లోటుని 4.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. 2010-11 ఆర్ధిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్‌ని 6.9 నుండి 5.1 శాతానికి, అంటే 1.8 శాతం తగ్గించినా తగ్గని ద్రవ్యోల్బణం 20011-12 లో 5.1 శాతం నుండి 4.6 శాతానికి, అంటే 0.5 శాతం తగ్గిస్తే, ప్రధాని, వాలియా లు చెబుతున్నట్లు తగ్గుతుందా? మొన్నటి దాకా పనిచేసిన సరఫరా అవరోధాలను తొలగించకుండా కొత్తగా కోశాగారు లోటు, ఫ్యవసాయోత్పత్తి పెంపుదల లను ప్రస్తావించడం, పైగా అవరోధాల గురించి అసలు ప్రస్తావించకపోవడాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ద్రవ్యోల్బణానికి ఇప్పుడు చెప్పిన కారణాలు మరో సంవత్సరం గడిస్తే ప్రజలు గుర్తుంచుకోరనే ధైర్యం మన పాలకులకి దండిగా ఉందని భావించాలా? ప్రజలకెలాగూ ఆర్ధిక లెక్కలు అర్ధం కావు, కనక పట్టించుకోరు. మరి విలేఖరులు, వ్యాపార వార్తల ఛానెళ్ళు, పత్రికలకు కూడా గుర్తుండవా? బహుశా పత్రికలు, ఛానెళ్ళు ఆ వ్యాపార బిలియనీర్లవే కనక ఈ లెక్కలు వాటికి అవసరం లేదేమో!?

ఏప్రిల్ 21 న జరిగిన ప్రణాళికా సంఘం సమావేశం ముగిశాక అహ్లూవాలియా పత్రిలతో ఇలా అన్నాడు. “అంతర్జాతీయ పరిస్ధితుల రీత్యా చూసినా, దేశీయ పరిస్ధితుల రీత్యా చూసినా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తిరగబెట్టడం ఒక బలహీనతగా మేము గుర్తించాము. దానికి పరిష్కారం కోశాగార క్రమశిక్షణ (ఫిస్కల్ డిసిప్లెయిన్ – అమెరికా, యూరప్ లలొని ప్రజలపై పెనుభారం మోపుతూ అమలు జరుపుతున్న పొదుపు విధానాల అమలుకు ముందు అక్కడి పాలకులు దీనిగురించి ఒకటే కలవరించారు) లో ఉంది. కోశాగార లోటును గట్టి నియంత్రణలో ఉంచుతూ, వ్యవసాయ రంగ ఉత్పత్తిని బాగా పెంచే చర్యలను మేము పూర్తిగా ఆమోదిస్తామని నేనింతకు ముందే చెప్పాను గదా” అన్నాడు అహ్లూవాలియా. గతంలో ఫిస్కల్ డిసిప్లెయిన్ గురించి చెప్పినా ద్రవ్యోల్బణానికి దానికీ లింకు పెడుతూ అహ్లూవాలియా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన సరఫరా అవరోధాల గురించి ఇప్పుడు ప్రస్తావించనే లేదు.

సామర్ధ్యం అవరోధాలు కూడా ఇండియాని పట్టి పీడిస్తున్నాయని అనేక మంది విశ్లేషకులు ఎప్పటినుండో చెబుతున్నారు. విద్యుత్తు, రోడ్లు, విద్య రంగాల్లో భారత దేశం వెనకబడి ఉంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తులో అధిక భాగం సరఫరా నష్టాలకింద పోతోంది. రోడ్ల విషయానికి వస్తే ఆ స్వర్ణ చతుర్బుజి తప్ప ఇంకో రోడ్డు అభివృద్ధి చెందలేదు. దానికే మళ్ళీ మళ్ళీ రిపేరు చేయడంతోనే సరిపోతోంది. వ్యవసాయాభివృద్ధి ప్రధానంగా రైతుల పైన ఆధారపడి ఉంది. విత్తనం వేసేటప్పుడు ఉండే ధర పంట తీసే నాటికి ఉండదు. రైతుల దగ్గర ఉన్న ఉత్పత్తిని మార్కెట్టు బాగాలేదనో, ఉత్పత్తి నాణ్యంగా లేదనో సవాలక్షా కారణాలు చెప్పి దళారులు తక్కువ ధరకు కొంటారు. సరుకు రైతు చేయి దాటాక ధరలు ఉన్నపళంగా పైపైకి దూసుకుపోతాయి. పండించిన రైతుకు నష్టం, దళారికి లాభం. ఫలితమే రైతుల ఆత్మహత్యలు. రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్ధుతులను దేశంలో అలాగే ఉంచి వ్యవసాయోత్పత్తి పెంచాలని ప్రధాని, వాలియాలు ఎంత ఆశించినా ఏం ప్రయోజనం?

మార్కెట్ పండితులు మరిచిపోయే లేదా మరిచిపోయినట్టు నటించే ముఖ్య విషయం ఒకటుంది. ఇండియా వరకు తీసుకుంటే ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. 65 శాతం మంది రైతులు, వారిమీదే ఆధారపడ్డ కూలీలు దేశంలో ప్రధాన భాగం. కంపెనీలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, ఇంకా సవాలక్షా ఉత్పాదక , అనుత్పాదక రంగాలు తయారు చేశే ఉత్పత్తులన్నింటినీ వీరే కొనాలి. కొనాలంటే వీరి దగ్గర డబ్బులుండాలి. వారికి డబ్బులు వ్యవసాయం ద్వారానే రావాలి. రైతుల దగ్గర డబ్బు ఉండాలంటే వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలివ్వాలి. దానికి తగిన మద్దతు -ఎరువుల సబ్సిడీలు, విత్తన సబ్సిడీలు  కల్తీ విత్తనాల నిరోధం, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చే యంత్రాంగాన్ని చురుకుగా ఉంచడం, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆదుకోవడం మొదలైనవి- రైతులకు అందిస్తే వారి దగ్గర కాసులు గలగలలాడేది. అప్పుడే వారు మార్కెట్ కి వెళ్ళీ అవసరం ఉన్నా, లేకున్నా వివిధ సరుకుల్ని కొంటారు. వారు కొన్నప్పుడే పెట్టుబడిదారులు లాభాలు పొందేది. కాని ఏ ప్రాధమిక మార్కెట్ మీద ఆధారపడి సరుకులను పరిశ్రమలు ఉత్పత్తు చేస్తాయో, ఆ ప్రాధమిక మార్కెట్టు అయిన వినియోగదారుల (రైతులు, కూలీలు, ఉద్యోగులు) పైనే పొదుపు విధానాలు, నూతన ఆర్ధిక విధానాల పేరుతో దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే, మరి బహుళజాతి సంస్ధలు, దేశీయ పెట్టుబడిదారులకూ లాభాలు ఎక్కడినుండి వస్తాయి? ఇది ప్రాధమిక ప్రశ్న.

ఒకవైపు ఆర్ధిక సంక్షోభాలకు కారణం బహుళజాతి సంస్ధలు, కంపెనీలు, బడా బడా ద్రవ్య సంస్ధలు. సంక్షోభానికి కారణమైనందుకు వారిని శిక్షించాల్సింది పోయి వారికే బెయిలౌట్లు, పన్నుల తగ్గింపు లేదా రద్దు లాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. వారికిచ్చే బెయిలౌట్లు, ప్రోత్సాహకాల పుణ్యమాని అప్పూ పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కనుకు లోటు పెరుగుతుంది. ఆ లోటు తగ్గించడానికి, లోటుతో ఏ విధంగా సంబంధం లేని ప్రజలపైన బాదుడు మరోవైపు. ప్రజలే అన్ని సమయాల్లొనూ త్యాగాలు చేస్తూ ఉండాలి. అధిక ధరలు చెల్లించాలి. సబ్సిడీల్ని వదులుకోవాలి. నాలుగైదు రూపాయలయ్యే పెట్రోలు వందరూపాలైన చెల్లించుకోవాలి. కాని పెట్టుబడుదారులు మాత్రం లాభాలు పెంచుకుని, తగ్గిన పన్నులు కూడా ఎగ్గొట్టి మరీ నల్లడబ్బు పోగేసుకుని దాన్ని దేశ సరిహద్దులు దాటించి నిశ్చింతగా ఉంటే అడిగే నాధుడు ఉండడు. వారిని అడగక పోగా మళ్ళీ ప్రజలూ, ఉద్యోగులపైనే దాడి. “… అమ్మో మీరు మూడు పూటలా తింటున్నారా? ఆఫ్రికాలో రెండు పూటలేగా తినేది, అది చాల్లే. మీ బతుక్కి టిఫిన్, కాఫీలు కూడానా, అవతల ఫిస్కల్ డెఫిసిట్టు హద్దు మీరుతుంటేనూ? 3 జి వేలం ఆదాయమా, అది ఎగ్గొట్టిన పన్నులకే సరిపోయింది కదా, మీకు టీ, కాఫీలకి కావాలంటే ఎలా?…” ఇదీ ఈ మాయదారి ప్రభుత్వాల దాదాగిరీ. వీరి అన్యాయాలు అడక్కుండా, వీరికి మద్దతుగా రావడానికి పోలీసులు, స్పెషల్ పోలీసులు, పారా మిలట్రీలు, సరిహద్దు కాపలా బలగాలు.. ఇవన్నీ కాకుంటే సైన్యం. ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా ఎలా వుంటుంది. అసంతృప్తిని పసిగట్టడానికి మళ్ళీ వేగులు. ఈ వేగులకి అనేక పేర్లు. అమెరికాలో సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ లో మొస్సాద్. పాకిస్తాన్లో ఐ.ఎస్.ఐ. ఇండియాలో రా, ఐబి, ఇత్యాదులు.

ఇంతా చేసి వీరు చెబుతున్న రెండంకెల జిడిపి వృద్ధి సాధించారా అంటే అదీ లేదు. 2010-11 సంవత్సరానికి 8.7 శాతం ఆర్ధికాభివృద్ధి సాధిస్తామన్నారు. వారి మిత్రుడు గోల్డ్ మెన్ సాచ్ కంపెనీ దాన్ని తుస్సుమనిపించింది. అది కుదరదు, 7.8 శాతమే అని తేల్చింది. దీన్ని 2011-12 సంవత్సరంలో 9 శాతానికి పెంచుతామని ప్రణాళికా సంఘం సమావేశంలో ప్రధాని, వాలియాలు నిర్ణయించారు. అంతే కాదు, 2012-17 పంచవర్ష ప్రణాళికకి గాను సగటు వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటుందని ప్రణాళిక సంఘ సమావేశంలొ అంచనా వేశారు. గోల్డ్‌మేన్ సాచ్ కంపెనీ ఇండియా ద్రవ్యోల్బణం 2011-12 చివరికి 6.7 శాతం ఉండగలదని మొన్నటి వరకూ అంచనా వేస్తూ వచ్చింది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి పెంచింది. అంటే ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించగలదని గతంలో వేసిన అంచనాపై నమ్మకం కుదరక అంచనానే పెంచింది. బైట ఉండి పరిశీలిస్తున్న విశ్లేషకులు ఈ ధోరణిలో ఉంటే, ప్రధాని ధోరణి దానికి వ్యతిరేకంగా ఉంది. 2012-2017 పంచవర్ష ప్రణాళికకు గానూ 9 నుండి 9.5 శాతం మద్యలో భారత దేశ ఆర్ధిక వృద్ధి నమోదు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ప్రణాళికా సంఘానికి సూచించాడు. లక్ష్యమే కదా, దాన్ని సాధించి తీరాల్సిన భాధ్యత ఉండదు గనక పెట్టుకోవచ్చని ప్రధాని ధైర్యం అయిఉండొచ్చు. కనీసం వచ్చే ఐదు సంవత్సరాలు పాటు ఆ అంకెను వల్లె వేసుకుంటూ గడపవచ్చు. భారత దేశ పాలకులకి ఈ విషయంలో గట్టి పేరే ఉంది. లక్ష్యాలను ఘనంగా విధించుకుని, వాటిని చేరుకోవడానికి ఏ దశలోనూ ప్రయత్నించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో వారికి మంచి పేరు ఉంది. అది జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) కానివ్వండి. మౌలిక రంగాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) నిర్మాణం కానివ్వండి, ద్రవ్యోల్బణం తగ్గింపు కానివ్వండి. “చేరకుండా ఉండటానికే లక్ష్యాలు” అన్నట్టుగా ఉంటుంది మన పాలకుల ధోరణి.

ప్రధాని, బ్యూరోక్రసీ పని ఇలా ఉంటే ఆర్.బి.ఐ కూడా వీరికి ఏమీ తీసిపోలేదు. గత సంవత్సరంలో కేవలం ద్రవ్యోల్బణం తగ్గించడానికే బ్యాంకు (రిజర్వ్ బ్యాంకు) రేట్లను మొత్తం ఎనిమిది సార్లు పెంచింది. రేపు మే నెలలో భారత ద్రవ్య విధానాన్ని సమీక్షించ బోతున్నారు. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడంతో మరో సారి రేట్లు పెంచక తప్పదని విశ్లేషకులంతా ఏకగ్రీవంగా అంచనా వేస్తున్నారు. కాకుంటే 25 బేసిస్ పాయింట్లు పెంచుతారా లేక  50 బేసిస్ పాయింట్లు పెంచుతారా అన్నదే సమస్య. ఎంత పెంచినా పెరిగేది వడ్డీ రేట్లు తప్ప ద్రవ్యోల్బణం తగ్గే సమస్యే ఉండకపోవచ్చు. గత సంవత్సరం ఒక దశలో ద్రవ్యోల్బణం తగ్గించలేక విసిగిపోయి కొత్త ప్రాతిపదికను (న్యూ నార్మల్) నిర్ణయిద్దామని కూడా భావించారు. అంటే ద్రవ్యోల్భణం ఇండియా విషయంలో 3 నుండి 4 శాతం మధ్య ఉంటే నార్మల్ గా ఉన్నట్లు భావిస్తారు. (ఇతర దేశాలకు ఇది మారవచ్చు) ఈ నార్మల్ ని రద్దు చేసి ఏ ఆరో, ఏడో కనిష్టం అని నిర్ణయించుకుంటే అది కొంచెం సులభంగా ఉంటుంది. ఎత్తు ఎగరలేక ఎగరాల్సిన ఎత్తును తగ్గించుకోవడం అన్నమాట. దారిద్ర రేఖను దిగువన ఉన్నవారి సంఖ్యను తగ్గించలేక రేఖనే (నిజ రేఖ) కిందికి జరుపుతూ వచ్చాయి వివిధ ప్రభుత్వాలు. ఇదే పద్దతిని ద్రవ్యోల్బణం విషయంలో అనుసరిద్దామని ఒక దశలో ఆలోచన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ద్రవ్యోల్బణం ఎంతుంది అని చూసేది భారతీయులు మాత్రమే కాదు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఎఫ్.డి.ఐలు, ఎఫ్.ఐ.ఐ లు కూదా చూస్తాయి.

ఇప్పటికే ద్రవ్యోల్బణం లెక్కించే బేస్ సంవత్సరాన్ని ముందుకు జరిపారు. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యు.పి.ఐ) కి బేస్ సంవత్సరం మార్చారు గనక ఆటోమేటిక్‌గా ద్రవ్యోల్బణం బేస్ సంవత్సరం మారుతుంది. గతంలో 1993-94 సంవత్సరంలో ఉన్న సరుకుల ధరలను ప్రాతిపదికగా తీసుకుని డబ్ల్యు.పి.ఐ, ద్రవ్యోల్బణం లను లెక్కించే వారు. గత సంవత్సరం ఆగస్టు నుండి దీనిని 2004-05 కి జరిపారు. అంటే 11 సంవత్సరాలు ముందుకు జరిపారు. ఇది చాలా ఘోరం. దీనికి ప్రభుత్వం చెప్పిన కారణాలు: అప్పటికంటే ఉత్పత్తవుతున్న సరుకుల సంఖ్య పెరగడం, అదనంగా కలిసిన సరుకుల ధరలు ద్రవ్యోల్బణంలో కలవకపోవడం. చెప్పడానికీ, వినడానికీ ఈ కారణాలు ఆమోదయోగ్యంగానే కనిపిస్తాయి. క్రింద టేబుల్ 1 చూడండి.

Inflation Table 1

1993-94, 2004-05లలో సరుకులు, ద్రవ్యోల్బణం కోసం పరిగణించే ధరల కొటేషన్లకు పోలిక

ప్రధాన సరుకుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. ఇంధనం, శక్తి (విద్యుత్) ల విషయంలో అసలు మార్పే లేదు. తేడా వచ్చిందల్లా మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తులలో మాత్రమే. ఈ మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల్లో పెరిగిన ఉత్పత్తులు ప్రధానంగా పారిశ్రామిక వర్గాలు మాత్రమే వినియోగించేవి. అంటే కొత్తగా పెట్టిన పరిశ్రమలు సెజ్ లలో ఎక్కువగా పెట్టారు. సెజ్ లలో స్ధాపించిన పరిశ్రమల్లో ఉత్పత్తి చేసేవి ఎగుమతులకు ఉద్దేశించినవి మాత్రమే. అంటే సెజ్ లలోని పరిశ్రమలు భారత ప్రజలు వినియోగించే సరుకుల్ని ఉత్పత్తి చేయవు. అవి కేవలం ఎగుమతికే. అవి ఇతర దేశాలకు వెళ్ళి వేరే ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగిస్తారు. ఒక్క సెజ్ లే కాకుండా బైట్ పెట్టిన పెట్టిన పరిశ్రమలలో కూడా ఇక్కడి సహజ వనరులను తీసి ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసేవే. అంతిమ ఉత్పత్తులకోసం ఇక్కడ ప్రాసెసింగ్ చేసిన సరుకుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇవి కాక కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల లాంటి సరుకుల ఉత్పత్తి విదేశాల్లోనే జరుగుతుంది. అసెంబ్లీ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి సరుకుల్ని భారత ప్రజలు కొనే పరిస్ధితులు లేవని వేరే చెప్పనవసరం లేదు. ఇలా విదేశీ పరిశ్రమల ఉత్పత్తులను కూడా ఇండియా జిడిపిలో కలిపేస్తారు. ఆ సరుకుల అంతిమ వినియోగం భారత దేశంలో జరగక పోయినా అవి ఇండియా ఉత్పత్తికిందకే వస్తాయి. వీటిని కలిపితేనే ఇండియా జిడిపి ఆసియాలో మూడో పెద్ద జిడిపి, ప్రపంచంలో పదకొండో పెద్ద జిడిపి అయ్యింది. బిలియనీర్లుగా ఫోర్బ్స్ పత్రికలో చోటు సంపాదిస్తున్న భారతీయులు ఈ కంపెనీల్లో వాటాలు కొని బిలియనీర్లు అయిన వారే. అంటే వారి బిలియన్ల సంపద భారతీయులకు ఉపయోగపడేది కాదు.

Inflation Table 2

ద్రవ్యోల్బణం వెయిటేజి

కనుక ప్రధానంగా విదేశాలకు ఎగుమతి అయ్యే సరుకులు పెరగడం వల్లనే భారత దేశంలో ఉత్పత్తయ్యే సరుకుల సంఖ్య పెరిగింది. మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల సంఖ్య అంత పెరిగినా వాటి ద్వారా ద్రవ్యోల్భణంలో వచ్చి కలిసే వెయిటేజిలో మార్పు రాలేదని టేబుల్ 2 లో గమనించవచ్చు. ద్రవ్యోల్బణానికి అధిక వెయిటేజి మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల ధరలు మాత్రమే. ప్రజలు, ఉద్యోగులు వాడే  ప్రైమరీ సరుకుల వెయిటేజి తగ్గించి తప్ప పెరగలేదు. పెట్రోలు వలన సరుకులన్నీంటి ధరలు పెరుగుతాయి కనక దాని వెయిటేజిలో పెరుగుదల ఉంది. ఏతా వాతా తేలేదేమిటంటే విదేశాలనుండి భారత దేశాన్ని, అక్కడి ప్రజలను ఉద్దరించడానికే వచ్చాయని మన పాలకులు చెబుతున్న కంపెనీలే భారత ప్రజలంతా భర్తిస్తున్న ద్రవ్యోల్బణం పెరుగుదలకు పూర్తిగా దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం భారం వేసేది బిలియనీర్లు, కోటీశ్వరులు (రెండూ ఒకటే కాని వివిధ తరగతులకు అర్ధం కావడానికి రెండూ రాశా) అయితే, దాని ఫలితం మోసేది ఒళ్ళొంచి పనిచేసే రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు. ఈ ఎవ్.డి.ఐ లు వచ్చి తెగ ఉద్యోగాలిచ్ఛేస్తాయనీ, ఉద్దరిస్తాయనీ ఒకటే సొల్లు తప్ప ఇచ్చిందీ లేదూ, చచ్చిందీ లేదు. పెప్సీ, కొకొకోలా లను అనుమతించేటప్పుడు అవి భలే ఉద్యోగాలిస్తాయని చెప్పారు. అవి వచ్చాక మీరు ఏ ఉద్యోగాలుచ్చారు చెప్పండంటే బడ్డీ కొట్లు, సీసాల రవాణాకి వాడే వాహనాల డ్రైవర్లు… వీటినే చూపాయి. వారు పెట్టిన పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగాలు అతి స్వల్పం. మిగిలిన పరిశ్రమలు కూడా అంతకంటే చేసేదేమీ లేవు.

భారత దేశంలొ కార్మిక చట్టాలు బలహీనం. ఉన్నా అమలు చేయరు. అమలు చేయమంటే పోలీసుల్ని పిలిచి ఎలా హింసింప జేస్తారో హోండా కంపెనీలో చూశాము. కార్మిక సంఘం పెట్టుకోవడానికి ప్రయత్నించినందుకు పనిలో నుండి తీసేశారు. సమ్మె చేసినందుకు ఓ పార్కులో పడేసి పోలీసులు చుట్టుముట్టి ఎక్కడో చీకటి గదిలో ఇచ్చే ధర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంటు పబ్లిగ్గానే ఇచ్చేశారు, వార్తా ఛానెళ్ళ కేమెరాల సాక్షిగా. దేశం అంతా ఆ దృశ్యాన్ని చూసింది. పార్లమెంటులో మన కమ్యూనిస్టులు రెచ్చిపోయి మరీ ఉపన్యాసం ఇచ్చారు. వారి ధోరణీ చూస్తే ఈ దెబ్బతో ప్రవేటు కంపెనీల పని ఖాయం అన్నట్లుగా హావభావాలు ప్రదర్శించారు. తీరా ఆచరణలో ఏమీ కాలేదు. సంఘం అన్నవాళ్ళని మళ్ళీ పనిలోకి తీసుకోలేదు. గుర్గావ్ ప్రాంతంలో ఉన్న ఆ కంపెనీలో ఎక్కువగా తెలుగువారే పనిచేశేవారు. వారంతా ఆ దెబ్బతో తట్టా బుట్టా సర్దుకుని వచ్చేశాఅరు. విదేశీ కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలు, వారు చేసే ఉద్ధరణ ఇలాగే ఏడ్చింది అన్ని చోట్లా. బలహీన కార్మిక చట్టాలతో పాటు ఇక్కడ పర్యావరణ చట్టాలు కూడా నామ మాత్రం. ఈ మధ్య జైరాం రమేష్ నేహ్రూవియన్ సిద్ధాంతాలంటూ కొద్దిగా ఊగడం వలన కొన్ని పరిశ్రమలకి నో అన్నాడు గానీ అవి త్వరలో సెటిలవ్వడం ఖాయం. మన పర్యావరణం దెబ్బతినడం కూడా అంతే ఖాయం. ప్రపంచ పర్యావరణ సదస్సులొ మన ప్రధాని ఏమన్నారు? మేం ఇంకా అభివృద్ధి కాలేదు. పర్యావరణ నిబంధనల వలన మా ఆభివృద్ధి ఆగిపోతుంది. కనక పర్యావరణ నిబంధనలకు మేము కట్టుబడం అన్నాడు. అలా కట్టుబడకపోవడం వలన లాభపడుతున్నది విదేశీ కంపెనీలే. అమెరికా, యూరప్ లలో కఠినమైన, ఖరీదైన పర్యావరణ చట్టాలవలన అక్కడి పరిశ్రమలు ఇక్కడికి వచ్చి యధేచ్ఛగా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

చవకగా దొరికే శ్రమ (లేబర్), బలహీన కార్మిక, పర్యావరణ చట్టాలు, తమ సొంత దేశాల్లో ఉన్న అధిక వేతనాల ఎగ్గొట్టడం, పర్యావరణ నిబంధనలను అనుసరించే అవసరం లేకపోవడం… ఈ కారణాల వలన విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. అంటే తమ సొంత లాభానికి విదేశీ పెట్టుబడులు దిగబడుతున్నాయి తప్ప ఇండియాని ఉద్దరించడానికి కాదని గుర్తుంచుకోవాలి. ఇక్కడి కొచ్చి తక్కువ వేతనాలిచ్చి, అడిగితే పోలీసులతో కొట్టించి హింసించడాంతో పాటు విదేశీ పరిశ్రమలు ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచు తున్నాయన్నమాట. వారిచ్చేదే తక్కువ జీతాలు, పైగా ధరలు పెరగడానికి పరోక్షంగా కారకులవడం! ఇటువంటి వారు మనల్ని ఉద్ధరిస్తున్నారని భావించడం, భావించి నమ్మించాలని చూడడాన్ని బట్టి భారత పాలకులు ఎవరి పక్షమో తెలిసిపోతూనే ఉంది.

One thought on “ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

  1. ఇండియా వ్యాపారం కోసం అమెరికా సామ్రాజ్యవాదుల మీద ఆధార పడే దేశం. సామ్రాజ్యవాదులు తుమ్మితే semi-coloniesకి జలుబు చేస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు చెప్పాలనుకుంటున్నది ఏమిటి? ఇంత వరకు ఇండియా స్వతంత్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పాము, ఇప్పుడు అలా చెప్పడం సాధ్యం కాదు అనా? కేవలం సర్వీస్ సెక్టర్‌లోని వృద్ధి రేటు చూపించి, ఉత్పత్తి రంగంలో వృద్ధి రేటు తగ్గిపోయినా లెక్క చెయ్యకుండా, సర్వీస్ సెక్టర్ అభివృద్ధె నిజమైన అభివృద్ధి అనుకుంటే ఎలా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s