మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం


NATO bomb hits Gaddafi compound

గడ్డాఫీ కాంపౌండ్‌పై నాటో బాంబు దాడి

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు జరిపిగానీ, లేదా బలప్రయోగంతో గానీ మిస్రాటాని ఖాళీ చేయిస్తారు.” అని ఖలేద్ చెప్పినట్లు ఆల్ జజీరా తెలిపింది.

“లిబియా ఆర్మీకి గిరిజన తెగలనుండి అల్టిమేటం అందింది. మిస్రాటా సమస్యను వారు పరిష్కరించ లేనట్లయితే సమీప పట్టణాలు లిటెన్, తర్హూనా, బాని వాలిద్, తవర్ఘా లనుండి తెగలు రంగం మీదికి వస్తాయి. వారు తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతారు. తిరుగుబాటుదారులు లొంగకపోతే గిరిజనులే వారిపై యుద్ధంలో తేల్చుకుంటారు” అని కైమ్ చెప్పినట్లుగా ఆల్ జజీరా తన వెబ్ సైట్ లో ప్రచురించిన వార్తా కధనంలో తెలిపింది. విదేశాంగ మంత్రి ప్రకటన లిబియా ప్రభుత్వ ఎత్తుగడల్లో మార్పును సూచిస్తోందని ఆల్-జజీరా వ్యాఖ్యానించింది. లిబియా పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారులు ఆధీనంలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటా. అక్కడ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న నేపధ్యంలో అక్కడి నుండి విదేశీ వర్కర్లను బ్రిటిష్ నౌకలు ఖాళీ చేయిస్తున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమ నౌకలనిండా ప్రభుత్వ సేనల దాడిలో గాయపడిన పౌరులతో నిండి ఉన్నాయని చెప్పినప్పటికీ వాస్తవంగా యుద్ధంలో చిక్కుకున్న విదేశీ కార్మికులను మాత్రమే అవి చేరవేస్తున్నాయని శుక్రవారం “ది ఇండిపెండెంట్” పత్రిక వెల్లడించింది.

టిపోలీపై నాటో దాడిలో ముగ్గురి పౌరుల దుర్మరణం

ఇదిలా ఉండగా నాటో విమానాలు మరోసారి లిబియా రాజధాని ట్రిపోలీ పై విరుచుకుపడ్డాయి. గడ్డాఫీ ఇంటి కాంపొండులో బంకర్లుగా భావిస్తున్న చోట బాంబులు కురిపించాయి. అక్కడ ఆయుధాలు దాచిపెట్టారని భావించినప్పటికీ అటువంటివేమీ లేవని ది ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది. ప్రభుత్వ ప్రతినిషి ముస్సా ఇబ్రహీం నాటో దాడుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారని వెల్లడించాడు. ఈ ప్రాంతం ఉపయోగంలో లేదని ఇబ్రహీం తెలిపాడు. లిబియా పౌరుల్ని కాపాడ్డానికే బాంబులు వేస్తున్నామంటున్న నాటో దేశాలు తమ దాడుల్లో పౌరులు మరణించడం పట్ల నోరు మెదపడం లేదు. అత్యాధునికమైన ఆయుధాలతో దాడులో చేస్తున్నప్పటికీ, ఆ దాడుల్లో గడ్డాఫీ ప్రభుత్వ సైనిక శక్తిలో 30 నుండి 40 శాతం వరకూ నష్టపోయినప్పటికీ తిరుగుబాటుదారులు పురోగమించకపోవడంతో తమ పశ్చిమ దేశాలు వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి సలహాదారుల పేరుతో తమ సైనికాధికారుల్ని పంపించాయి.

శుక్రవారం అమెరికా సెనేటర్ మెక్ కెయిన్ తిరుగుబాటుదారుల కేంద్రం బెంఘాజీని సందర్శించాడు. తిరుగుబాటుదారులు తమ హీరోలుగా అభివర్భించాడు. తిరుగుబాటుదారులకు బలమైన కేంద్రమని చెప్పిన బెంఘజీలొ మెక్ కెయిన్ కి కేవలం 50 మంది పౌరులు మాత్రమే ఆహ్వానం పలికారు. తిరుగుబాటుదారుల్లో ఆల్-ఖైదా తీవ్రవాదులు ఉన్నారంటూ వచ్చిన వార్తలను మెక్ కెయిన్ తిరస్కరించాడు. అమెరికా జాయింట్ ఛీఫ్స్&‌‌‌ ఆఫ్&‌ స్టాఫ్ ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ కూడా ఆల్-ఖైదా ఉనికిపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే 1990 ల్లో గడ్డాఫీ పాలనను కూలదోయడానికి ప్రయత్నించి విఫలమైన “ది లిబియన్ ఇస్లామిక్ ఫైటింగ్ గ్రూపు” కు ప్రస్తుత తిరుగుబాటును రెచ్చగొట్టినమాట వాస్తవమేనని ముల్లెన్ అంగీకరించిన విషయాన్ని ఆల్‌జజీరా వెల్లడించింది.

“ది లిబియన్ ఇస్లామిక్ ఫైటింగ్ గ్రూపు” గురించి తెలుసుకోవడం అవసరం. దీని నాయకుడు ఖలీఫా హెఫ్తిర్. ఈయన 1980 ల్లో గడ్డాఫీ సైన్యంలో కల్నల్ గా పని చేశాడు. గడ్డాఫీ తరపున పొరుగుదేశం ఛాద్ పై యుద్ధంలో పాల్గొన్నాడు అప్పట్లో ఛాద్ దేశాన్ని అమెరికా అనుకూల ప్రభుత్వం పాలిస్తుండేది. లిబియా, ఛాద్ ల ఘర్షణ జరుగుతుండగానే ఒక దశలో హెఫ్తిర్ గడ్డాఫికి వ్యతిరేకిగా మారాడు. ఛాద్ లో లిబియన్ నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ స్ధాపించి అక్కడినుండి గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు ప్రారంభించాడు. కాని 1990 లో ఛాద్‌లో ఉన్న అమెరికా అనుకూల ప్రభుత్వం కూలిపోవడంతో ఖలీఫా హెఫ్తిర్ అమెరికాకి పారిపోయాడు. గడ్డాఫీ సైన్యంలో పనిచేసిన ఒక కల్నల్ కి అమెరికాలో ప్రవేశం దొరకడం నిజంగా ఆశ్చర్యకరమే. హెఫ్తిర్ గడ్డాఫీకి వ్యతిరేకిగా ఎందుకు మారాడొ ఆయన అమెరికాకి పారిపోయాక లోకానికి అర్ధమయ్యింది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాకి పారిపోయిన హెఫ్తిర్ వర్జీనియాలోని వియాన్నలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నివాసం లాంగ్లే లోని సి.ఐ.ఏ కేంద్ర కార్యాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. వియన్నాలో ఉంటూ హెఫ్తిర్ లిబియన్ నేషనల్ ఆర్మీని (ఎల్.ఎన్.ఎ) స్ధాపించాడు. దాని ఆధ్వర్యంలో 1996 లో గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ ఎల్.ఎన్.ఏ నే ది లిబియన్ ఇస్లామిక్ ఫైటింగ్ గ్రూపు గా పిలుస్తున్నారు. పదిహేనేళ్ళ తర్వాత ఖలీఫా హెఫ్తిర్ మళ్ళీ బెంఘాజీలో ప్రత్యక్షమయ్యాడు. లిబియా ప్రభుత్వం నుండి బైటికి వచ్చిన మాఫీ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ అబ్దుల్ ఫతే యూనిస్ తో జత కలిసాడు. ఈ యూనిస్ సైన్యాన్నే రాస్ లానుఫ్ పట్టణం నుండి ప్రభుత్వ బలగాలు తరిమికొట్టాయి. ఖలీఫా చరిత్రను ఇండియా పక్షపత్రిక ఫ్రంట్ లైన్, తన ఏప్రిల్ 22 సంచికలో వెల్లడించింది.

లిబియా ప్రభుత్వ బలగాలతో ఫ్రంట్‌లైన్‌ లో పోరాడుతున్న తిరుగుబాటుబలగాలు మిస్రాటాలో ఉన్న బలగాలపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి వస్తున్న ఆయుధాలను తమ వద్దే ఉంచుకుంటున్నారనీ, బ్రిటన్ అందించిన శాటిలైట్ ఫోన్లను కూడా అన్నీ తమవద్దనీ ఉంచుకున్నారనీ వారు అసంతృప్తితో ఉన్నారు. కమాండర్లుగా చెప్పుకుంటున్నవారు ఫ్రంట్‌లైన్‌లో ఉంటూ పోరాటానికి నాయకత్వం వహించే బదులు  బెంఘాజీలో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నారని కూడా వారు ఆరోపించారు. గడ్డాఫీ పై వ్యతిరేకత ఉన్న గిరిజన తెగలు సైతం పశ్చిమ దేశాల సైనిక బలగాలను లిబియాపై దాడులకు ఆహ్వానిస్తున్న తిరుగుబాటుదారులను తివ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని ఫలితమే మిస్రాటాలో గిరిజన తెగల అల్టిమేటం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s