మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం


logo-london

"ది ఇండిపెండెంట్" లోగో

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి రంగం దిగాయనీ, అది చాలా గొప్ప కార్యక్రమమనీ చాలామంది భావిస్తున్నారు. అదే నిజమని గాఢంగా నమ్ముతున్నారు.

కానీ అది వాస్తవమేనా? ట్యునీషియా, ఈజిప్టులలో నియంతలను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. పోలీసులతో తలపడ్డారు. ఘర్షణలొ అనేక మంది పౌరులు చనిపోయారు. పదుల రోజులపాటు పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించి నియంతలు దేశం విడిచిపోయేదాకా ఆందోళనలు మానలేదు. ఆ దేశాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయా, లేదా కనీసం అందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అది వేరే సంగతి. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజలు నియంతలకు వ్యతిరేకంగా మూకుమ్మడి రాజకీయ చర్యకు దిగడం.

లిబియాలో అలా ప్రజలు వీధుల్లోకి వచ్చారా? లేదు. ఈజిప్టు, ట్యునీషియా, యెమెన్, బహ్రెయిన్ తదితర దేశాల్లో ప్రజల ఆందోళనలను చూపిస్తూ అనేక ఫోటోలు వార్తా సంస్ధలు ప్రచురించాయి. కానీ లిబియాలో ప్రజల ఆందోళనలపై కనీసం ఒక్క ఫోటోను కూడా అవి ప్రచురించలేక పోయాయి. కారణం అక్కడ ప్రజలు వీధుల్లోకి రాకపోవడమే. అకస్మాత్తుగా లిబియాలో ప్రజలు ఆందోళనలు జరుగుతున్నాయని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కొన్ని వార్తలు ప్రచురించాయి. పశ్చిమ దేశాలకు చెందిన ఆయిల్ కంపెనీలు ఉన్నట్లుండి తమ కార్యకలాపాలు మానేసి లిబియానుండి తమ ఉద్యోగులను తీసుకెళ్ళిపోయాయి. తూర్పున లిబియాలోని రెండవ పెద్ద పట్టణం బెంఘాజీ తిరుగుబాటుదారుల వశం అయ్యిందనీ ప్రజలు గడ్డాఫీ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ అవే వార్తా సంస్ధలు వార్తలు ప్రచురించాయి. కానీ ఇంతవరకూ తిరుగుబాటుదారుల బలగాలు తుపాకులు, ట్యాంకులు తదితర ఆయుధాలతో ఉన్న ఫోటోలు తప్ప ప్రజల ఆందోళనల ఫోటోలు గానీ పశ్చిమ దేశాలు ఆరోపించినట్లు గడ్డాఫీ సైన్యం చంపిన పౌరుల ఫోటోలు గానీ లేదా వారు కూల్చిన పౌరుల ఇళ్ళ ఫోటోలు గానీ ప్రపంచం దృష్టికి తేలేక పోయాయి.

కారణం అటువంటి సంఘటనలు వాస్తవంగా జరగక పోవడమే. లిబియాలో వార్తా సంస్ధలపై నిషేధం విధించడంతో అక్కడ విషయాలను ధృవీకరించలేక పోతున్నామని వార్తా సంస్ధలు రాశాయి. రాస్తున్నాయి. కానీ అజ్దాబియా పట్టణం దగ్గరా, తీవ్రపోరాటం జరుగుతున్న మిస్రాటా పట్టణం దగ్గర ఉన్న తిరుగుబాటు సైనికుల ఫోటోలు మాత్రం ఇప్పటివరకు ఈ వార్తా సంస్ధలు చాలా ప్రచురించాయి. దానర్ధం విలేఖరులు లిబియాలోకి వెళ్ళగలిగారనే అర్ధం. రెండ్రోజుల క్రితం బ్రిటన్ విలేఖరి ఒకరు, అమెరికా విలేఖరి ఒకరు -ఇద్దరు ఫోటో జర్నలిస్టులే- మిస్రాటా దగ్గర యుద్దంలో చిక్కుకుని చనిపోయారు. ఈ సంఘతన ద్వారా కూడా విలేఖరులు యుద్ధప్రాంతాలకు సైతం వెళ్ళగలిగారనే ధృవపడుతున్నది. కనుక విలేఖరుల ప్రవేశానికి లిబియాలో ఎటువంటి ఆటంకాలు లేవు.

మరో ముఖ్యమైన విషయం. మిస్రాటాలో యుద్ధం తీవ్ర స్ధాయిలో జరుగుతుండడంతో అక్కడ చిక్కుకున్న విదేశీ కార్మికులను ఖాళీ చేయించదానికి బ్రిటన్ నౌకలను పంపింది. బ్రిటన్ అధికారులు గానీ, మంత్రులు గానీ, పశ్చిమ దేశాలకు చెందిన కొన్ని వార్తా సంస్ధలు గానీ ఏం చెప్పాయి? మిస్రాటాలొ గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు విచక్షణారహితంగా పౌరులపైనా, వారి ఇళ్ళపైనా కాల్పులు జరుపుతున్నాయనీ, పౌరులు అనేకమంది చనిపోతున్నారనీ, ప్రభుత్వ స్నైపర్లు నేరుగా పౌరులను కాల్చి చంపుతున్నారని చెప్పారు, రాశారు. కాని దానికి సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని చూపలేక పోయాయి. మిస్రాటాలో ప్రభుత్వ సైనికుల కాల్పులనుండి తప్పించుకోవడానికి ప్రజలు పారిపోవడానికి సిద్ధంగ ఉండడంతో వారిని ఖాళీ చేయించడానికే బ్రిటన్ నౌకలు వెళ్ళాయని కూడా చెప్పారు. ఈ వార్తలను బిబిసి, రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధల వెబ్ సైట్లలో చూడవచ్చు.

ది ఇండిపెండెంట్ పత్రికకు సంబంధించిన వెబ్ సైట్ లో మేరీ జెవిస్కీ శుక్రవారం రాసిన వార్తా ఆర్టికల్ ద్వారా మిస్రాటా నుండి బ్రిటన్ నౌకలు ఎవరిని ఖాళీ చేయిస్తున్నదీ తెలుస్తుంది. ఒబామా-సర్కోజీ-కామెరూన్ ల త్రయం ఉమ్మడిగా రాసిన ఓ వ్యాసంలో లిబియాలో పాలకుడిని మార్చడంలో తమకున్న ఆసక్తిని బహిరంగంగా ప్రస్తావించిన విషయాన్ని ఆమే ప్రస్తావిస్తూ ఇంకా ఇలా రాశారు. “…అదే సమయంలో ఏ చర్యకైనా లిబియా పౌరుల రక్షణను కారణంగా చూపి సమర్ధించుకోవడంలో అధికారుల సంభాషణలు, ప్రకటనలు క్రమం తప్పకుండా  పేర్కొనడాన్ని మర్చిపోలేదు. ఆ సమర్ధన వాస్తవానికి దూరంగా ఉన్నప్పటికీ వారలా సమర్ధించుకున్నారు. తాము చేస్తున్నది చట్టబద్ధమేనని కనీసం కనిపించడానికైనా ప్రయత్నించాలి. లేకుంటే తాము చూపేదానికీ, వాస్తవానిక మద్యగల భాషాత్మక తేడా మరింత విస్తృతమవుతుంది తప్ప తగ్గదు. బ్రిటన్ నిధులతో మిస్రాటానుండి ఖాళీ చేయడానికి పంపిన నౌక ఇందుకు దారుణమైన ఉదాహరణగా మిగులుతుంది. ఈ నౌక గాయపడిన వారూ, అవయువాలు కోల్పోయినవారితో నిండి ఉందని చెప్పగా, వాస్తవంగా 35 మంది గాయపడినవారూ, 4 గురు అవయువాలు కోల్పోయిన వారూ ఉండగా దాదాపు 1000 మంది యుద్ధంలో చిక్కుకుపోయిన విదేశీ వర్కర్లే ఉన్నారు”

మిస్రాటాలో చనిపోయిన బ్రిటిష్ విలేఖరి “ఎక్కడ చూసినా పేలుళ్ళే. కాని నాటో జాడే లేదు” అని ట్విట్టర్ లో రాసుకున్నట్లు పత్రికలు రాశాయి. దానికి కారణాన్ని మేరీ వివరించారు. “టిమ్ హెదరింగ్టన్ వేసిన పరోక్ష ప్రశ్నకు సమాధానం ఉంది. కానీ అది టిమ్ కోరుకున్న సమాధానం కాకపోవచ్చు. ఐక్యరాజ్యసమితి తీర్మానం అందుకు అనుమతించక పోవడం వలనే నాటో మిస్రాటా యుద్ధంలో జోక్యం చేసుకోలేదు. అంతేకాక మిస్రాటా యుద్ధం, ఛీర్ లీడర్స్ (ఒబామా-కామెరూన్-సర్కోజీ) కోరుకున్న విధంగా లిబియాలో సైనిక జోక్యానికి కావలసిన పరిస్ధితి ఏర్పాటుకు దారితీస్తుందని భావించడం వలన కూడా మిస్రాటాలొ జోక్యం చోటుచేసుకోలేదేమో. దండలు ఎదురవుతాయని పోతే బుష్-బ్లెయిర్ ల ద్వయనికి తుపాకులు ఎదురై ఆనక ఇరాక్ యుద్దంలో కూరుకుపోయిన పరిస్ధితే ఒబామా-కామెరూన్-సర్కోజీ ల త్రయానికి ఎదురయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది” అని మేరీ తన వ్యాసంలోనే మరో చోట రాసింది.

2 thoughts on “మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

  1. అంటే గడ్డాఫీ ప్రజలను కన్న బిడ్డలవలె 30ఏళ్ళు పరిపాలించాడని మమ్మల్ని నమ్మమంటారా? లిబియాలో అంతర్యుద్ధమే జరగడం లేదని అంటున్నారా?

    పోనీ, చైనాలో ప్రజాస్వామ్య వాదులను అణిచివేయలేదు, తియాన్మన్ స్క్వేర్లో ఏమీ జరగలేదు, శాంతి కపోతాలు మాత్రమే ఎగురవేయబడ్డాయి నేనంటే, మీరు ఒప్పుకుంటారనుకుంటా.

  2. గడ్దాఫీ పాలన గురించి చాలా సమాచారం నెట్ లో అందుబాటులో ఉంది. అతను నియంతగానే భావిద్దాం. కానీ లిబియాపై బాంబులెసి అక్కడి ప్రజలను చంపే అధికారం ఏ దేశానికి లేదు. అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి వ్యతిరేకం. లిబియా భవిష్యత్తు అక్కడి ప్రజల చేతిలో ఉందాలి తప్ప అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు చేతుల్లో కాదు. అంతర్యుద్దం జరగడం లేదని కాదు నేనంటున్నది. లిబియా అంతర్యుద్ధంలో బైటి దేశాలు ఎట్టి పరిస్ధితుల్లోనూ జోక్యం చేసుకోరాదు. అది కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రమే.

    చైనా గురించి వేరే పోస్టు కింద వ్యాఖ్యానంలో వేరే మిత్రుడి కి సమాధానంగా రాశాను. అన్యదా భావించకపోతే అది చదవగలరు. నా, మీ ఒప్పుకోలు ఇక్కడ అవసరం లేదేమో! విషయాన్ని చర్చించదలుచుకుంటే నేను సిద్ధం. కానీ వ్యంగ్యం చేయదలుచుకుంటే, సారీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s