భారత దేశానికి ద్రవ్యోల్బణం బెడద మరో సంవత్సరం తప్పేట్టు లేదు. జి.డి.పి వృద్ధి రేటులో చైనా తర్వాత అత్యధిక వేగవంతమైన పెరుగుదలను నమోదు చేస్తున్న ఇండియాకు ద్రవ్యోల్బణం గత ఒకటిన్నర సంవత్సరం నుండి వెంటాడుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఆయిల్ (ఇంధనం) ద్రవ్యోల్బణంలు ఏప్రిల్ 9 తేదితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పెరుగుదలను నమోదు చేసాయి. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఎనిమిది సార్లు బ్యాంకు రేట్లను పెంచింది. మార్చితో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి గాను, 5.5 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గిస్తామని ప్రధాని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్.బి.ఐ గవర్నరు ముగ్గురూ హామీ ఇచ్చినా అది నేరవేరకపోగా అందనంత స్ధాయిలో నిలిచింది.
గత వారంలో ముగిసే సంవత్సరానికిఆహారద్రవ్యోల్బణం 8.28 శాతం నమోదు కాగా ఏప్రిల్ 9 తో ముగిసే సంవత్సరానికి 8.74 శాతానికి పెరిగింది. అదే కాలంలో ఇంధన ద్రవ్యోల్బణం 12.97 శాతం నుండి 13.05 శాతానికి పెరిగింది. బంగాళాదుంపలు, పళ్ళు ధరలు పెరగడం వలన ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం చెప్పింది. అంతర్జాతీయ పరిణామాలతో ఆయిల్ ధరలు పెరగడంతో పారిశ్రామిక ఇంధనం పెరిగి ఇంధన ద్రవ్యోల్బణం పెరగడానికి దారి తీసిందని ప్రభుత్వం ప్రకటించింది.
ద్రవ్యోల్బణం తగ్గించడమే తమ ప్రధమ ప్రాధాన్యంగా ప్రధాని దగ్గర్నుండి, ఆర్.బి.ఐ గవర్నరు వరకూ హమీల మీద హామిలి ఇస్తున్న ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైఫల్యానికి కారణాలను ప్రజలకు వివరించాల్సిన భాద్యత ప్రధానికీ, ఇతర మంత్రులకు ఉన్నప్పటికీ వారెన్నడూ దాన్ని నెరవేర్చలేదు. మే నెలలో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో మరోసారి బ్యాంకు రేట్లను ఆర్.బి.ఐ పెంచక తప్పదని విశ్లేషకుల అంచనా. కొంతమంది 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీరేటు పెంచే అవకాశం ఉందని చెబుతుండగా, తాజా ద్రవ్యోల్బణం అంకేలతో 50 బేసిస్ పాయింట్లు పెంచక తప్పదని మరికొందరు భావిస్తున్నారు. మొత్తం మీద మరొకసారి వడ్డీరేట్లు పెంచడానికి ఆర్.బి.ఐ పై ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం అంకెలు వెలువడ్డాక ఇండియా సావరిన్ బాండు రేట్లు స్వల్పంగా పెరిగాయి.
ప్రధాన ద్రవ్యోల్బణం పెరగడంతో ద్రవ్యోల్బణం పై ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ సమావాశమై ద్రవ్యోల్బణం కట్టడికి ఏ చర్యలు తీసుకునేదీ చర్చిస్తుందనీ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు కౌశిక్ బసు తెలిపాడు. ఈ సారి చర్యలు భిన్నంగా ఉండబోతున్నాయని ఆయన తెలిపాడు. ధనికుల ద్వారా మార్కెట్ లో చెలామణిలో ఉన్న డబ్బు, అధిక వృద్ధి రేటు నీడలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు అంతిమంగా సామాన్య మానవుడిని కృంగ దీస్తున్నాయి. నిత్యావసరాలు సైతం కొనుక్కోలేని దుస్ధితిలో పేదలు మధ్యతరగతి జీవులు మునిగిపోతున్నారు. జిడిపి వృద్ధి రేటును చైనాతో పోటీగా రెండంకెలకు చేర్చాలన్న దృష్టి తప్ప ప్రధాని మన్మోహన్, ఆయన మార్కెట్ ఫ్రెండ్లీ మిత్రులకు మరోధ్యాస లేదు. కొన్నాళ్ళు డిమాండ్ సంబంధిత కారణాలు, మరికొన్నాళ్ళు వర్షాలు, ఇప్పుడు సరఫరా సంబంధిత కారణాలను ద్రవ్యోల్బణానికి సాకుగా చూపడం తప్ప పటిష్టమైన చర్యలతో దాన్ని తగ్గించిన సంఘటన ఇంతవరకూ లేదు. మార్కెట్లో పరిస్ధితుల కారణంగా ధరలు తగ్గితే తప్ప సామాన్యునికి ఉపశమనం కలిగించే చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి పెడుతుందో లేదో.