2009 లో మిలట్రీ కుట్ర ద్వారా హోండురాస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మరో మిలట్రీ స్ధావరం నెలకొల్పడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మాన్యువల్ జెలాయా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి కుట్ర తో కూల్చి వేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న నేరాన్ని మోపి రాత్రికి రాత్రి విమానం ఎక్కించి కోస్టారికా దేశానికి ప్రవాసం పంపారు. జెలాయా అధికారంలోకి వచ్చాక కార్మికులకు కనీస వేతనాలను పెంచడం తదితర చర్యలను చేపట్టడంతో పెట్టుబడిదారులు, మిలట్రీ కుమ్మక్కయ్యి కుట్రకు పాల్పడ్డారు.
హోండురాన్ రక్షణ మంత్రి మార్లన్ పాస్కల్, అమెరికా సదరన్ కమాండ్ అధిపతి డగ్లస్ ఫ్రేసర్ ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం “బే ఐలాండ్” లో అమెరికా కొత్తగా మిలట్రీ స్ధావరం నెలకొల్పుకుంటుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరి కట్టే సాకుతో ఈ మిలట్రీ స్ధావరాన్ని స్ధాపిస్తున్నారు. హోండురాస్ కు నికరాగువా దేశంతో ఉన్న సరిహద్దులో ఉన్న ‘గ్రేసియాస్ ఎ డియోస్” డిపార్ట్ మెంటు లో (హోండురాస్ దేశాన్ని 18 డిపార్ట్ మెంట్ల కింద విభజించారు) “పామెరోలా ఎయిర్ బేస్” పేరుతో అమెరికాకి ఇప్పటికే ఒక మిలట్రి స్ధావరం ఉంది. దీనిని గత సంవత్సరం ఏప్రిల్ లొ నెలకొల్పారు. మిలట్రీ కుట్ర జరిగిన సంవత్సరం లోపే అమెరికా హోండురాస్ లో రెండు మిలట్రీ స్ధావరాలను తెరిచింది.
మాన్యువల్ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయడం చట్టవిరుద్ధమనీ, మిలట్రీ, న్యాయ వ్యవస్ధ, కొందరు పౌర అధికారులు కలిసి కుట్ర చేసి చట్టవిరుద్ధంగా జేలాయాను ప్రవాసం పంపారనీ, జెలాయాపై కుట్రదారులు చేసిన ఆరోపణల్లో నిజం లేదనీ హోండురాస్ లో ఉన్న అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ను వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. కుట్ర జరిగిన రెండు వారాలకు ఒబామా జెలాయా తొలగింపు చట్ట సమ్మతం కాదు అని కూడా ప్రకటించాడు. కాని జెలాయా తిరిగి హోండురాస్ వచ్చి ఎన్నికల్లో పాల్గొనడానికి చేసిన ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఇవ్వలేదు. అమెరికా మద్దతు ఇవ్వకపోవడం వెనక మర్మం ఏమిటో మిలట్రీ స్ధావరం ఏర్పాటుతో ప్రపంచానికి తెలిసి వచ్చింది.
రెండు మిలట్రి స్ధావరాలకు కారణం “మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటం, ప్రాంతీయ భద్రత” లను కారణంగా అమెరికా చూపింది. దక్షిణ అమెరికా ఖండాన్ని అమెరికా తన పెరటి దొడ్డిగా భావిస్తుంది. దశాబ్దాల తరబడి మధ్య అమెరికా దేశాల్లో తనకు అనుకూలమైన వారిని అధికారంలోకి తేవడానికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చి వేస్తూ వచ్చింది. ఆ కుట్రలను ఇంకా అమెరికా కొనసాగిస్తూనే వచ్చింది. వెనిజులా, బొలీవియా, క్యూబా ల్లో అమెరికా అనుకూల విధానాలు అమలు చేయడానికి తిరస్కరించడంతో అక్కడి ప్రభుత్వాలని కూల్చడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యింది. దక్షిణ అమెరికా దేశాల్లో కొన్ని దేశాలు ఈ మూడు దేశాల నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పడి సొంత విధానాలను అమలు చేసుకుంటున్నాయి.