శక్తివంతమైన భూకంపం, వినాశకర సునామీల ధాటికి దెబ్బతిన్న ఈశాన్య జపాన్ ని పునర్నించడానికి 300 బిలియన్ డాలర్లు అవసరమని జపాన్ ప్రభుత్వం లెక్కగట్టింది. భూకంపం, సునామీల్లొ ఫుకుషిమా దైచి వద్ద అణు విద్యుత్ కర్మాగారం దెబ్బతిని అందులోని నాలుగు రియాక్టర్ల నుండి రేడియేషన్ వెలువడుతున్న విషయం విదితమే. ప్రమాద స్ధాయి అత్యధిక స్ధాయి 7 గా నిర్ణయించిన ఫుకుషిమా అణు ప్రమాదం నుండి ఆ ప్రాంతాన్ని బైట పడేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడానికి అణు ప్ల్లాంటు ఆపరేటర్ ప్రతినిధులు సోమవారం నిరాకరించారు. రేడియేషన్ లీకును అరికట్టడానికి మరో మూడు నెలలు, కూలింగ్ వ్యవస్ధను పునరుద్ధరించడానికి తొమ్మిది నెలలు సమయం పడుతుందని టెప్కో తెలిపింది.
మానవ నివాస యోగ్యంగా ఫుకుషిమా ప్రాంతం మార్చడానికి పట్టే సమయాన్ని అంచనా వేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. హిటాచి, తోషిబా లాంటి కంపెనీలు ఫుకుషిమాకు మనిషి మళ్లీ తిరిగి వెళ్ళడానికి 10 నుండి 30 వరకూ సంవత్సరాలు పట్టవచ్చని చెబుతున్నాయి. పది సంవత్సరాల అంచనా మరీ ఆశావాద అంచనా అని కూడా కొందరు భావిస్తున్నారు.
భూకంపాలకు జపాన్ నిలయమైనందున వాటికి తట్టుకునే విధంగానే అక్కడ ఇళ్ళు నిర్మించుకుంటారు. ఆధునిక పద్ధతుల్లో తీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా జపాన్ లో ఇళ్ళు ఉంటాయి. కాని సునామీ కూడా తీవ్ర స్ధాయిలో సంభవించడంతో ఎక్కువ నష్ట జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సునామిలో మరణించీనవారిలో అత్యధికులు పెద్ద వయసు వారుగా లెక్కలు తెలుపుతున్నాయి. 90 శాతం మంది సునామీ వలన వచ్చిన సముద్ర నీటిలో మునిగిపొవడం వలన చనిపోయారని జపాన్ తెలిపింది. ఇప్పటి వరకు13,843 మంది చనిపోయారని నిర్ధారించగా, మరో 14,000 మంది గల్లంతయ్యారని తెలిపింది.
సునామీలో దెబ్బతిన్న ప్రాంతంలో సమస్తమూ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇళ్ళు, రోడ్లు, విద్యుత్, గ్యాస్ ఇలా సమస్త రంగాలకు చెందిన మౌలిక నిర్మాణాలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రతిదాన్నీ పునాదులతో మొదలు పెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే అణు కర్మాగారాన్ని మామూలు స్ధితికి తేవడం మరొక ఎత్తు. మామూలు స్ధితికి తేవడం దాదాపు అసాధ్యమే. చేయగలిగిందల్లా అణు రియాక్టర్లనుండి ఇంధనాన్ని వెలికి తీసి భద్రపరచడం, తర్వాత ప్లాంటును భూస్ధాపితం చేయడం. ఇది జరగడానికి ఎంత కాలం పడుతుందో టెప్కో చెప్పలేక పోతొంది. అణు ప్లాంటు శుద్ధి చేయడం, కప్పిపెట్టడానికి సంబంధించిన కాంట్రాక్టు కోసం తోషిబా, హిటాచి కంపెనీలు పోటి పడుతున్నాయి.
సోమవారం ఫుకుషిమా ప్లాంటు లోని ఒకటి, మూడవ రియాక్టర్లు ఉన్న భవనాల లోపల రేడియేషన్ స్ధాయిని కొలవడానికి టెప్కో రోబోట్లను లోపలికి పంపింది. వర్కర్లు లోపలికి వెళ్ళడానికి అనువైన పరిస్ధితి లేదని రోబోట్ రీడింగ్ చూశాక తెలిపారు. అయితే రోబోట్ చేసే పని చాలా తక్కువేననీ, వాస్తవంగా రేడియేషన్ స్ధాయి కొలవాలంటే మనిషి లోపలికి వెళ్ళాల్సిందేననీ టెప్కో తెలిపింది. రియాక్టర్లను భూస్ధాపితం చేసే ముందు భవనం లోనికి వెళ్ళీ ఇంధన రాడ్లను బైటికి తీసి భద్రపరచవలసి ఉంది. జపాన్ ప్రజలు అణు ప్రమాదం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిగ ఉన్నారు. మూడొంతులు ప్రధాని దిగిపోవాలని కోరుతున్నట్లు ఒక సర్వే తెలిపింది. కాని ప్రధానికి రాజీనామా చేసే ఉద్దేశ్యం లేనట్లు తెలుస్తోంది.