ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. బిల్లులో పేద, మద్య తరగతి వారిపై మరిన్ని పన్నులు విధిస్తూ, ధనికులకు పన్నులు తగ్గిస్తూ అనేక పొదుపు చర్యలను ప్రతిపాదించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యుడు తయారు చేసిన బిల్ల్లు రిపబ్లికన్లు మెజారిటీ కలిగి ఉన్న ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. సెనేట్ గా పిలిచే పెద్దల సభలొ డెమొక్రట్లదే మెజారిటీ. అందువలన అక్కడ ఆమోదం పొందకపోవచ్చని భావించడంతో స్టాండర్డ్ అండ్ పూర్ సంస్ధ అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అంచనాను తగ్గించింది.
ఎస్ & పి చర్య ను అమెరికా ట్రెజరీ ఖండించింది. ఆర్ధిక విధానాలు రూపొందించడంలొ అమెరికా నాయకుల సామర్ధ్యాన్ని తక్కువ అంచనా కట్టిందని ట్రెజరీ విమర్శించింది. భౌతిక వాస్తవాలను బట్టి చూస్తే అమెరికా అప్పుపై అంచనాను తగ్గించక తప్పలేదని ఎస్ & పి సంస్ద పేర్కొంది. అమెరికా ప్రభుత్వం మరింత అప్పు చేయడానికి వీలు లేకుండా గరిష్ట పరిమితి సమీపానికి ప్రస్తుత అప్పు చేరుకుంది. అప్పు పరిమితిని పెంచడానికి అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ లు ఆమోదిస్తే తప్ప 14.3 ట్రిలియన్ డాలర్లకు మించి అప్పు చేయడానికి వీలు లేదు. అప్పు పరిమితిని పెంచడానికి రిపబ్లికన్లు మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ ఆమోదిస్తుందో లేదోనన్న అనుమానాలు ఉన్నాయి. రిపబ్లికన్లు ప్రతిపాదించిన బడ్జెట్ కోతల బిల్లును డెమొక్రట్లు మెజారిటీగ ఉన్న సెనేట్ ఆమోదించడం ద్వారా రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభ చేత అప్పు పరిమితి బిల్లును ఆమోదింప జేసుకోవడానికి ఒబామా ప్రయత్నించే అవకాశం కనబడుతోంది.
కోతల బిల్లుతో అమెరికాలో పారిశ్రామిక అశాంతితో పాటు సామాజిక అశాంతి చెలరేగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ కోతల బిల్లు లేదా పొదుపు బిల్లులో ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలను పెద్ద ఎత్తున రద్దు చేయడానికి ప్రతిపాదించారు. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికాలో నిరుద్యోగం దాదాపు పది శాతంగా ఉంది. కంపెనీలు ఇంకా మూత బడుతున్నాయి తప్ప కొత్త ఉద్యోగాలు రావడం లేదు. సంక్షోభం దరిమిలా బహుళ జాతి సంస్ధలు, గుత్త సంస్ధలకు ఇచ్చిన బెయిలౌట్ ల పుణ్యమాని అమెరికా అప్పు మరింతగా పెరిగింది. దానితో కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్) కూడా పెరిగింది. ఈ లోటు తగ్గించే పేరుతో ప్రజలకు ఇస్తున్న అరకొర సంక్షేమ పధకాలను కోత పెట్టబోతున్నారు. దానివలన ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఉత్పత్తి మరింతగా మార్కెట్లో పేరుకొంటుంది. అధిక ఉత్పత్తి సంక్షోభం ఏర్పడుతుంది. ఫలితంగా ఫైనాన్స్ మిగులు పెట్టుబడిగా వినియోగం కావడానికి అవకాశాలు మరింతగా సన్నగిల్లుతున్నాయి. అంతిమంగా పెట్టుబడీదారీ సంక్షోభం ఇంకా తీవ్రమై రాజకీయ చర్యలకు ప్రజలను ప్రేరేపితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
“బిల్లులో పేద, మద్య తరగతి వారిపై మరిన్ని పన్నులు విధిస్తూ, ధనికులకు పన్నులు తగ్గిస్తూ అనేక పొదుపు చర్యలను.”
??