2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ హెచ్చరిక చేశాడు. బీద దేశాలు ఆహార ధరల వలన ఒక తరాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయని ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ సమావేశాల్లో వ్యాఖ్యానించాడు.
వాషింగ్టన్ లోనే జి-20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశాలు జరుగుతున్నాయి. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో ఏర్పడిన నూతన ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం చేస్తామని జి-20 గ్రూపు దేశాలు ప్రతిన లాంటి హామీ ఇచ్చాయి. దానర్ధం ప్రజల ఆందోళనల ఫలితంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకునే లోగానే ఆర్ధిక సాయం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పుల ఊబిలోకి దించి విషమ షరతులతో వాటి మాడు పగలగొట్టనున్నాయన్నమాట! “పౌరుల రక్షణ, న్యాయం, ఉద్యోగాల ప్రాముఖ్యాన్ని ప్రపంచ అభివృద్ధి నివేదిక గుర్తించిందనీ, ఆ నివేదిక మేరకు పేద దేశాల్లో నిరుద్యోగాన్ని దూరం చేయాల్సి ఉందని రాబర్ట్ సెలవిచ్చాడు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు నోటి నుండి జాలువారిన మరో ముఖ్యమైన సలహా “మధ్య ప్రాచ్యం, ఉత్తరాఫ్రీకా దేశాల్లో సంస్కరణలను వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది” అని. కొత్త ప్రభుత్వాలు త్వరపడి తమ ఆర్ధిక విధానాలు తాము రూపొందించుకోక మునుపే వారి చేత ప్రవేటీకరణ, సరళీకరణ, గ్లోబలీకరణ విధానాలు అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు హెచ్చరిస్తున్నాడు. అరబ్ దేశాల్లొ తలెత్తీన తిరుగుబాట్లు ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామిక సంస్కరణలు ఆర్ధిక విధానాల్లోకి రూపాంతరం చెందితే అవి ప్రజలకు సహాయకారిగా, ప్రవేటు గుత్త సంస్ధలకు వ్యతిరేకంగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే త్వరపడాలని రాబర్ట్ జోల్లిక్ పిలుపునిస్తున్నాడు.
మూడు సంవత్సరాల క్రితం బద్దలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ లోని ధనిక దేశాలు పూర్తిగా కోలుకోలేదు. ప్రభుత్వ ఆదాయాన్నంతా ప్రవేటు కంపెనీలకు ధారపోస్తూ, ప్రజల నెత్తిన పొదుపువిధానాలు రుద్ధుతుండడం వలన అక్కడ నిరుద్యోగం తీవ్రమయ్యి, ఆర్ధిక వ్యవస్ధ కార్యకలాపాలు మందగమనంలొ ఉన్నాయి. సంక్షోభం నుండి కోలుకున్నామని చెబుతున్న దేశాల్లొ కూడా నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉంది. సాధించిన రికవరీ ఉద్యోగ రహీత రికవరీ గా మిగిలిపోయింది. సామాన్యంగా సంక్షోభంనుండి కోలుకున్నప్పుడు ఉద్యోగాలు (ప్రవేటు) ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి రావాలి. ప్రస్తుత రికవరీ అందుకు భిన్నంగా ఆర్ధిక వృద్ధి ఎంతో కొంత ఉన్నా ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు.
ప్రభుత్వం పన్నులుగా వసూలు చేసిన డబ్బుని ఆరగించిన ప్రవేటు బహుళ జాతి సంస్ధలు ఉద్యోగాలు కల్పిస్తాయని ప్రభుత్వాలు ఎదురుచూస్తున్నాయి. కానీ అవి సంక్షోభాల భయంతో ఉత్పాదక రంగంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నాయి. పెట్టుబడులన్నీ అనుత్పాదకరంగాలైన ఫైనాన్స్ (షేర్ మార్కెట్లు, రియల ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ.వి) రంగాల్లో కుమ్మరిస్తున్నాయి. దానితో ఉద్యోగాల కల్పన అసాధ్యంగా మారింది. ఈ సంగతి చెప్పకుండా నిరుద్యోగానికి ఇంకెవరో కారణమని చెప్పడానికి ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు నానా తంటాలు పడుతున్నాయి. ఓ వైపు పొదుపువిధానాల పేరుతో యూరప్, అమెరికాలలోనూ, సంస్కరణల పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ప్రభుత్వాల ఖర్చును తగ్గించి ప్రజల సదుపాయాల్లో కోత విధింప జేస్తున్న వరల్డ్ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు ఏమీ ఎరగనట్లు బీద దేశాల్లొ ఆహార సంక్షోభం వలన మరో ప్రపంచ సంక్షోభం ఏర్పడనుందని మొసలి కన్నీరు కారుస్తున్నాయి.
పశ్చిమ దేశాల్లోని బహుళజాతి సంస్ధలు ప్రభుత్వాలు, ప్రజల ఆర్ధిక వనరులన్నింటినీ నియంత్రిస్తున్నాయి. తాము అనుసరించే మార్కెట్ ఎకానమీ విధానాల వలన సంక్షోభాల్లొ కూరుకుపోతున్న ధనిక దేశాలు సంక్షోభం నుండి బయట పడటానికి తమ దేశాల్లొని ప్రజలకు ఉన్న సౌకర్యాలను కుదించి, మరింతగా సరళీకరణ విధానాలు అనుసరిస్తూన్నాయి. దానితో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాల ప్రభుత్వాల పై వివిధ మార్గాల్లొ ఒత్తిడి తెచ్చి సరళీకరణ, ప్రవేటీకరణ విధానాలను అనుసరింప జేస్తున్నాయి. ఇవి అంతిమంగా ప్రపంచ ప్రజానీకం నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం మున్నగు సమస్యల్లోకి కూరుకుపోవడానికి దారితీస్తున్నది. వనరులను ప్రవేటు గుత్త సంస్ధల నుండి లాక్కొని ప్రజలకోసం వినియోగించినప్పుడే సంక్షోభాలు పరిష్కారమవుతాయి తప్ప ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ అధికారుల ఉడత ఊపుల హెచ్చరికల వలన కాదు.