జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు


Michio Kaku

సైద్ధాంతిక భౌతిక శాస్త్ర నిపుణుడు మిఛియో కాకు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని అణు రియాక్టర్ల వద్ద రేడియేషన్ విడుదల ఆగిపోలేదనీ, అందువలన జపాన్ ప్రమాదం రష్యాలో జరిగిన చెర్నోబిల్ కంటే ఘోరమైన ప్రమాదంగా పరిణమించనుందని మిఛియో వెల్లడించాడు.

1986 లో రష్యాలో జరిగిన చెర్నోబిల్ అణు ప్రమాదాన్ని అణు ప్రమాద తీవ్రతా సూచికలో 7 వ నెంబరుగా నిర్ధారించారు. అణు ప్రమాద తీవ్రతలో ఇదే అత్యధిక స్ధాయి. జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టర్ల వద్ద విడుదలైన మొత్తం రేడియేషన్ కలిపి ప్రమద తీవ్రతను 7 గా నిర్ధారించీన సంగతి తెలిసిందే. చేర్నోబిల్ అంత ప్రమాద స్ధాయి కానప్పటికీ 7 తీవ్రతతో సమానమని నిపుణులు తేల్చారు. అయితే ఫుకుషిమా వద్ద ప్రమాద పరిస్ధితి స్ధిరంగా ఉందనీ మరో తొమ్మిది నెలల్లో పూర్తి ప్రమాద రహితంగా మార్చగలమనీ ఫుకుషిమ అణు రియాక్టర్ ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (టేప్కో) శనివారం ప్రకటించింది.

అయితే అణు భౌతిక శాస్త్రవేత్త మిఛియో ఫుకుషిమా ప్రమాద స్ధితి స్ధిరంగా ఉందనడాన్ని వ్యతిరేకించాడు. ఇప్పటివరకు విడుదలైన రేడియేషన్ లెక్కించి స్ధిరమని చెబితే అది సరైంది కాదని వాస్తవానికి అక్కడ రేడియేషన్ విడుదలను అరికట్టనందున ఇంకా వాతావరణంలోకి రేడియేషన్ విడుదలవుతోందనీ, రానున్న రోజుల్లొ ఈ రేడియేషన్ విడుదల ఫలానా స్ధాయివరకే ఉంటుందని చెప్పలేరనీ, కనుక భవిష్యత్తులో చెర్నోబిల్ కంటే ఘోరం గా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ మిచియో తెలిపాడు. “అమెరికా ప్రభుత్వం దైచి ఫ్యాక్టరీ చుట్టూ 50 మైళ్ళ పరిధిలోపల ఉండవద్దని తన దేశస్ధులకు చెప్పింది. ఫ్రాన్సు దేశం అసలు జపాన్ లోనే ఉండోద్దు వచ్చేయండని చెప్పింది. జపాన్ ప్రభుత్వం మాత్రం 10, 12, 15 మైళ్ళంటూ మీనమేషాలు లెక్కిస్తోంది” అని మిఛియో డెమొక్రసీ నౌ ఛానెల్ కి తెలిపాడు.

“లోయలోకి పడకుండా ఓ మనిషి తన గోళ్ళతో ఆధారాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్నాడు. చూసినప్పుడు అతను లోయలోకి పడకపోవచ్చు. కానీ మరికొద్ది సేపట్లో అతన్ని పైకి లాగకపోతే గోళ్ళు చిట్లి పడిపోతాడు. గోళ్ళతో పట్టుకుజి వేలాడుతున్న మనిషి లోయలోకి పడకుండా స్ధిరంగా ఉన్నాడని జపాన్ ప్రభుత్వం, టెప్కో లు చెబుతున్నాయి” అని మిచియో తేల్చాడు. “చెర్నోబిల్ ఇప్పటివరకు అత్యంత పెద్ద ప్రమాదం. అక్కడ విడుదలైన రేడియేషన్లొ పదో వంతు ఇప్పటివరకు ఫుకుషిమా వద్ద విడుదలైంది. ముఖ్యమైన విషయం, ఇంకా రేడియేషన్ విడుదలవుతూనే ఉంది. అలాంటప్పుడు పరిస్ధితి స్ధిరంగా ఉందని ఎలా చెప్పగలరు?” అని మిచియో ప్రశ్నించాడు. “ఫుకుషిమా వద్ద ఇప్పటికే 50,000 ట్రిలియన్ బిక్వేరల్స్ రేడియేషన్ విడుదలైంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ చిన్న భూకంపం వచ్చినా, మరో పైపు పగిలినా లేదా అక్కడ పనిచేస్తున్నవారు పని మానేసి బైటికి వచ్చినా పరిస్ధితి చెర్నోబిల్ ప్రమాదాన్ని దాటిపోతుంది” అని మిచియో వివరించాడు.

“సామాన్య ప్రజలకు అర్ధమయ్యేవిధంగా చెప్పాలంటే, ఓ వ్యక్తి కారు నడుపుతున్నాడు. అకస్మాత్తుగా కారు అదుపు తప్పింది. బ్రేకు వెయ్యబోతే అవి కూడా ఫెయిలయ్యాయి. అంటే భూకంపం, సునామీ తాకిన మొదటి నిమిషంలొనే ఫుకుషిమా వద్ద భద్రతా వ్యవస్ధలన్నీ నాశనమయ్యాయన్నమాట. తర్వాత కారు రేడియో వేడెక్కి పేలిపోతుంది. అణు రియాక్టర్లలో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువయ్యి రియాక్టరు పేలిపోయినట్లని అర్ధం. తర్వాత కారులో ఉన్న పెట్రోలు అంటుకుని కారంతా మంటలు వ్యాపించాయి.అంటే అణు రియాక్టర్లో పూర్తిస్ధాయి మెల్ట్ డౌన్ జరిగిందన్న మాట. అంటే ఇంధన కడ్డీల చుట్టూ ఉన్న నీరు తగ్గిపోయి అవి వేడేక్కడం వలన కరిగిపోయి ద్రవ స్ధితిలోకి ఇంధనం చేరుకుంది. కారు నడిపోయే వ్యక్తి ఏమి చేయాలో పాలుపోని స్ధితికి చేరుకుని పక్కన నది కనబడితే దాన్లొకి కారును దూకించాడు. ఫుకుషిమా దగ్గరా అదే జరిగింది. రియక్టర్లు పేలిపోయి ఇంధన కడ్డీలు కరగడంతో ఫసిఫిక్ సముద్రపు నీరు తెచ్చి కుమ్మరించడం మొదలు పెట్టారు.”

“కానీ సముద్రం నీరులో ఉప్పు ఎక్కువ. కారుని సముద్రంలొకి దూకిస్తే ఉప్పు వలన కారు రేడియేటర్ కోతకు గురయ్యింది. ఫసిఫిక్ సముద్రనీరులోని ఉప్పు వలన అణు రియాక్టరు, దాని చుట్టూ ఉన్న పరికరాలు, పైపులు గట్రా అన్నీ కోతకు గురయ్యి రేడియేషన్ లీకయ్యే ప్రమాదం మరింత పెరిగింది. ఏంచేయాలో పాలుపోని స్ధితిలో వెనకాముందూ చూడకుండా రియాక్టరులోని ఇంధన కడ్డీలను చల్లబరచడానికి సముద్రపు నీరు తెచ్చిపోయడం వలన ఆ పరిస్ధితి సంభవించింది. కారు డ్రైవరు అప్పుడు అగ్నిమాపక దళం కోసం ఫోను చేశాడనుకుందాం. జపాన్ ప్రభుత్వం ఇక్కడ ఆర్మీని పిలవాలి. మిలట్రీ వాళ్ళయితేనే పరిస్ధితిని వేగంగా ఎదుర్కోగలరు. చెర్నోబిల్ ప్రమాదం జరిగినప్పుడు రష్యా అధ్యక్షుడు గోర్బచెవ్ అదే చేశాడు. ప్లాంటు ఉద్యోగుల్ని బైటికి పంపి వారు సలహాల పనిలో ఉంచి చెర్నోబిల్ ప్లాంటు చుట్టూ కాంక్రీటు పోసి భూస్ధాపితం చేయించాడు. అది కూడా చాలా జాగ్రత్తగా చేయించాలి.” అని మిచియో వివరించాడు.

మిచియో ఇంకా ఇలా కొనసాగించాడు. “ఫుకుషిమా దగ్గర విషాధం ఏంటంటే అక్కడ ఇప్పటికే పెద్ద మొత్తంలొ అయోడిన్ రేడియేషన్ విడుదలయ్యింది. అయోడిన్ నీటిలో కలుస్తుంది. కనుక రేడియేషన్ భూమిలో ఇంకిపోయింది. వర్షం కురిసినప్పుడు వర్షం నీటిలో అయోడిన్ కరిగిపోయింది. కూరగాయలు, గడ్డీ లాంటిలోకి రేడియేషన్ చేరిపోయింది. రేడియేషన్ గడ్డి తిన్న ఆవులు రేడియేషన్ పాలు ఇస్తున్నాయి. జపాన్ లో ఫుకుషిమా సమీపంలో ఉన్న రైతులు తమ పశువులు ఇస్తున్న పాలను వారి పొలాల్లో పారబోస్తున్నారు. ఎందుకంటే పాలల్లొ మరీ ఎక్కువగా రేడియేషన్ ఉన్నట్లు తేలింది. ఇదీ పరిస్ధితి అక్కడ. ఫుకుషిమా వద్ద రేడియేషన్ ఎక్కువగా ఉండడం వలన అక్కడ వర్కర్లు ప్లాంటులోకి 15 నిమిషాలు వెళ్తే చాలు. సంవత్సరానికి సరిపడా రేడియేషన్ కి గురవుతారు. కనుక వర్కర్లు లోపలికి ఒకేసారి పదిహేను నిమిషాలు మాత్రమే వెళ్ళగలరు. గంట ఉంటే వాంతులు మొదలవుతాయి. జుట్టు రాలుతుంది. రోజంతా ఉంటే అది విషమే. చెర్నోబిల్ వద్ద 600,000 మందిని కదిలించాలు జట్టులవారిగా విభజించారు. ప్రతి జట్టూ లోపలికి వెళ్ళి పది హేను నిమిషాల పాటు సిమెంటు, ఇసుక, కాంక్రీటు వేసి బైటకు రావడం… అలా అక్కడ ప్లాంటును భూస్ధాపితం చేశారు.” అని మిచియో వివరించాడు.

టెప్కో పూర్తిగా నిజాలు చెప్పడం లేదని మిచియో ఆరోపించాడు. రేడియేషన్ దుష్పలితాలను ఫుకుషిమా వర్కర్లు, చుట్టూ నివసించే ప్రజలు ఎదుర్కోకముందే ప్రభుత్వం త్వరపడి మిలట్రీని వినియోగిందాలని మిచియో సలహా ఇచ్చాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s