సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా బెంగాల్ లో అత్యంత సున్నితమైన అంశం సెజ్ ల ఏర్పాటు విషయంలోనే ఈ తేడాలు ఉండటం గమనార్హం.
బెంగాలి భాషలో ఉన్న మేనిఫెస్టోలో స్పెషల్ ఎకనమిక్ జోన్ లు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని త్రిణమూల్ కాంగ్రెస్ వాగ్దానం చేసింది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలొ సింగూరు, నందిగ్రాం లలో సెజ్ ల ఏర్పాటుకు భూమిని రైతుల నుండి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడం వలన ప్రజలు పెద్ద ఎత్తున విషయం అందరకూ తెలిసిన విషయం. సెజ్ వ్యతిరేక ఉద్యమానికి త్రిణమూల్ కాంగ్రెస్సే నాయకత్వం వహించింది. ఇంగ్లీషులో వెలువరించీన మానిఫెస్టోలో త్రిణమూల్ కాంగ్రెస్ సెజ్ ల ప్రస్తావనే చేయలేదు. బెంగాలీ మేనిఫెస్టో బెంగాల్ ప్రజల కోసం, ఇంగ్లీషు మానిఫెస్టో పెట్టుబాడుదారూల కోసం త్రిణమూల్ తయారు చేసిందని భావించవచ్చన్నమాట.
సెజ్ ల విషయంలొ లెఫ్ట్ పార్టీలుగా చెలామణి అవుతున్న సి.పి.ఐ, సి.పి.ఎం ల ద్వంద్వం విధానం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్న చొట్ల సెజ్ లు ఏర్పాటు చేయడంలో ముందుండే ఈ పార్టీలు తాను అధికారంలో లేని చోట్ల మాత్రం సెజ్ ల ఏర్పాటుపై ఉద్యమాలు నిర్వహిస్తాయి. అంతే కాకుండా జాతీయ స్ధాయిలో కూడా సెజ్ లను వ్యతిరేకిస్తాయి. ద్వంద్వ విధానం అనుసరించడం ఒక ఎత్తయితే, అది ద్వంద్వ విధానం కాదని వాదించడం మరో ఎత్తు. కాంగ్రెస్ గానీ లేదా దానిలాంటి పార్టీలకు అలా చెప్పడం మామూలు విషయం. కాని మార్క్సిజాన్ని తమ సిద్ధాంతంగా చెప్పుకుంటూ అలాంటి విధానాలు అవలంబించడమే అభ్యంతరకరమైన విషయం.
స్పెషల్ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేసే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఆమోదించింది. కానీ పశ్చిమ బెంగాల్ లోని వామపక్ష ప్రభుత్వం “పశ్చిమ బెంగాల్ సెజ్ చట్టం” పేరుతో సెజ్ చట్టాన్ని 2003 సంవత్సరం లోనే ఆమోదించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలొ 50 సెజ్ లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పూర్తయి పారంభం కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొన్ని ఆమోదించే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత దేశానికి సెజ్ లను పరిచయం చేసిన ఖ్యాతి లెఫ్ట్ పార్టీలదే. చైనాలో డెంగ్ ఆధ్వర్యంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వైపుకు తిరుగు ప్రయాణం కట్టాక సెజ్ లతోనే ఆ ప్రయాణం మొదలై సాగింది.
ఇప్పుడు త్రిణమూల్ కాంగ్రెస్ అధికారానికి చాలా దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తోంది. దానితో దానికీ ద్వంద్వ విధానాల అవసరం గుర్తుకొచ్చినట్టుంది. తన వెబ్ సైట్లో ఇంగ్లీషు మానిఫెస్టో పేరును విజన్ డాక్యుమెంటుగా పేర్కొంది. కానీ ప్రింటులో మేనిఫెస్టో గానే పేర్కొన్నట్లు సెజ్ విరోధి ప్రచార్ మంచ్ అనే సంస్ధ తెలిపింది. ఈ ద్వంద్వ విధానం విడనాడి సెజ్ లపై తమ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆ సంస్ధ త్రిణమూల్ కాంగ్రెస్ ని డిమాండ్ చేస్తోంది.