లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కి ఆర్ధిక నాయకుడుగా ఉన్న జర్మనీ కూడా తమ ఫైటర్ జెట్ విమానాలను పంపాలని అవి గట్టిగా కోరాయి. కాని జర్మనీ, స్పెయిన్ లు తగిన విధంగా స్పందించలేదు.
అమెరికా కూడా మరోసారి విమానదాడులు చేయాలని ఫ్రాన్సు కోరినప్పటికీ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ‘హిల్లరీ రోధమ్ క్లింటన్’ అందుకు నిరాకరించింది. లిబియాపై మిలట్రీ చర్యకు అమెరికా నాయకత్వం వహించడానికి నిరాకరించి ఆ బాధ్యతను “నాటో” కూటమికి అప్పగించీన్ సంగతి తెలిసిందే. బెర్లిన్ సమావేశం తర్వాత అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల ప్రభుత్వాధినేతలు ఒబామా, సర్కోజీ, కామెరూన్ లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గడ్డాఫీ గద్దె దిగాలని ఆ ప్రకటనలో కోరాయి. “గడ్డాఫీ నాయకుడుగా ఉన్న లిబియాను భవిష్యత్తులో ఊహించడం” అని వారు తమ ప్రకటనలో ప్రకటించాయి. పశ్చిమ దేశాలకు లిబియా ఆయిలు పై పెత్తనం ఇవ్వడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీ ఇంకా పదవిలో కొనసాగడం వాటికి కష్టంగానే ఉంటుంది మరి.
పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న మిస్రాటా పట్టణాన్ని స్వాధీనమ్ చేసుకోవడానికి గడ్డాఫీ బలగాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గడ్దాఫీ బలగాలు పట్టణాన్ని ముట్టడించి ఉన్నాయి. రెండు వారాల పైగా ఈ ముట్టడి కొనసాగుతోంది. గడ్డాఫీ బలగాలు పౌరులపై కాల్పులు జరుపుతున్నాయనీ ఆసుపత్రులన్నీ పౌరులతో నిండిపోయాయనీ బిబిసి తెలుపుతూ ఒక వీడియోను తన వెబ్ సైట్ లో ఉంచింది. కానీ ఆసుపత్రి సౌకర్యాలకు మించి పౌరులకు వైద్యం అందిస్తున్న దాఖలాలేవీ వీడియోలో కనిపించలేదు. వీడియోలో చూపిన రెండు గదుల్లొ మంచాల సంఖ్య మామూలుగానే ఉంది. ఆ రెండు గదులు చూపి ఆస్పత్రి మొత్తం కిటకిటలాడుతోందని నమ్మాలని బిబిసి కోరుతోంది.
గడ్డాఫీ బలగాల కాల్పుల్లో పౌరుల ఆవాసాలు ధ్వంసం అవుతున్నాయనీ, పౌరులు చనిపోతున్నారనీ, కనుక వారిని రక్షించడం కోసం వైమానిక దాడులు అనివార్యమనీ పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. కాని అవి ఇంతవరకూ గడ్డాఫీ కాల్పుల్లో చనిపోయిన వారి ఫోటోలను గానీ, నాశనమైన ఇళ్ళ ఫొటోలను గానీ పశ్చిమదేశాల వార్తా సంస్ధలు చూపలేక పోయాయి. మిస్రాటా పట్టణంలోని డాక్టర్లను ఉటంకిస్తూ పౌరులు చనిపోతున్నారని బిబిసి, రాయిటర్స్ లాంటి సంస్ధలు రాస్తున్నాయే తప్ప సంబంధిత సాక్ష్యాలను ఇప్పటివరకు బైటపెట్టలేదు. కానీ వారి దుష్ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. మరో వైపు బహ్రెయిన్ లోకి చొరబడిన సౌదీ అరేబియా బలగాలు అక్కడి ప్రజలను అమానుషంగా చంపుతున్నప్పటికీ ఆ విషయం గురించి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు కిక్కురుమనడం లేదు.
సౌదీ అరేబియా నాయకత్వంలోని అరబ్ దేశాలు లిబియా దాడుల తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా బహ్రెయిన్, యెమెన్ తదితర దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాల అణచివేతపై మాట్లాడకుందా ఉండే విధంగా అమెరికా, సౌదీ అరేబియాల మద్య రహస్య అనైతిక ఒప్పందం కుదరడంతో పశ్చిమ దేశాలు ద్వంద్వ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికాకు సౌదీ అరేబీయా మిత్ర దేశమే అయినప్పటికీ అక్కడి ధనికులే ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలకు ధన సహాయం చేస్తున్న సంగతిని వికీలీక్స్ ద్వారా వెల్లడయింది. సౌదీ అరేబియా, ఇరాన్ లమద్య ప్రచ్ఛన్న యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం పోస్తుండడంతో అరబ్ దేశాల మధ్య అపనమ్మకాలతో కూడిన ఘర్షణలు జరుగుతున్నాయి. ఇవి అంతిమంగా పశ్చిమ దేశాల ప్రయోజనాలకు దోహదపడుతున్నాయి. బహ్రెయిన్, యెమెన్ ప్రజలపై అక్కడి నియంతలు దారుణమైన నియంత్వాన్ని అమలు చేస్తున్నా అరబ్ లీగ్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లు అదేమని అడగడం లేదు.