ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం


ఇండియా

ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆర్.బి.ఐ గవర్నర్ సుబ్బారావు లు శపధాలు చేశారు. శపధాలు చేయడమే కాని దానికోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఆయిల్ కి డిమాండ్ ఇండియాలో పెరుగుతోంది.

ద్రవ్యోల్బణం కట్టడికోసం ఆర్.బి.ఐ ఎనిమిది సార్లు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. క్యాష్ రిజర్వ్ రేషియో (సి.ఆర్.ఆర్), రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచుతో పోయినా ద్రవ్యోల్బణం అనుకున్న స్ధాయికి దగ్గరగా కూడా రాలేకపోయారంటే, బ్యాంకు రేట్లు పెంచకపోతే ద్రవ్యోల్బణం పరిస్ధితి ఊహాతీతం. గత సంవత్సరం వరసగా మూడేళ్ళు వర్షాలు పడకపోవడం వలన డిమాండ్ సంబంధిత కారణాల వలన ఆహార ద్రవ్యోల్బణం పెరిగి అది ప్రధాన ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిందని పై ముగ్గురూ చెప్పారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. ఇదిగో తగ్గుతుంది, అదిగో తగ్గింది అంటూ వచ్చారు. డిసెంబరు వచ్చాక “అబ్బే, సరఫరా సంబంధిత కారణాలు ద్రవ్యోల్బణాన్ని పైకి నెడుతున్నాయి” అని వాదన లంకించుకున్నారు. అయితే డిమాండు, లేకుంటే సరఫరా కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయే కాని తగ్గించే కారణాలు ఎప్పుడొస్తాయో ఈ ఆర్ధిక పండితులకె తలియదు లాగుంది.

ఇంకా ఘోరం ఏంటంటే జనవరిలో ద్రవ్యోల్బణం 8.23 శాతం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని సవరించి వాస్తవానికి అప్పటి ద్రవ్యోల్బణం 9.35 శాతం అని ఇప్పుడు తేల్చారు. మాన్యుఫాక్చరింగ్ ధరలు, ఆయిల్ ధరలు పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా కారణమని చెప్పింది. ఆసియాలోని ఎమర్జింగ్ ఎకానమీల్లో ద్రవ్యోల్బణం మరీ ఎక్కువగా ఉందని కొద్ది రోజుల క్రితమ్ ఐ.ఎం.ఎఫ్ హెచ్చరించింది కూడా. మరోసారి బ్యాంకు వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ పెంచవచ్చని (50 బేసిస్ పాయింట్లు, లేదా 0.5 శాతం) పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆర్.బి.ఐ వడ్డీ రేటు ప్రస్తుతం 6.75 శాతం గా ఉంది. పరిశీలకుల అంచనా కరెక్టైతే అది 7.25 కి పెరుగుతుంది. అంటే బ్యాంకులు ఆర్.బి.ఐ దగ్గర డబ్బు అప్పు తీసుకుంటె అంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

చైనా

ఐ.ఎం.ఎఫ్ హెచ్చరించీన మరో దేశం చైనా. చైనాలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సందర్భంగా ఉద్దీపనా ప్యాకేజి కింద 500 బిలియన్ డాలర్లు పైగా మార్కెట్ లోకి విడుదల చేశారు. జనాలు కార్లు, ఫ్రిజ్ లు కొనుక్కోవడానికి అప్పులివ్వడంతో పాటు, కంపెనీలకు కూడ ఉదారంగా అప్పులిచ్చారు. దానితొ పాటు ఇళ్ళ నిర్మాణానికి కూడా ఉదారంగా అప్పులిచ్చారు. రోడ్లు, రైల్వేలు తదితర మౌలిక వసతులపై ఖర్చు చేసి తద్వారా ప్రజలకు వేతనాల రూపంలో డబ్బులు చేరేటట్లు చేశారు. ఈ చర్యలన్నీ చైనాలో ఇప్పుడు దెబ్బతీస్తున్నాయి. ప్రజల దగ్గర డబ్బు చేరి ద్రవ్యోల్బణానికి దారి తీసింది. సరుకుల రేట్లు పెరుగుతున్నాయి.

మరోవైపు ఆస్తుల రేట్లు పెరుగుతున్నాయి. ఇళ్ళు, స్ధలాల రేట్లు నియంత్రించ లేనంతగా పెరిగిపోయాయి. ఒక దశలో చైనాలో ప్రాపర్టీ బబుల్ బద్దలౌతుందేమోనన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ చైనా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు, రిజర్వ్ రేట్లు పెంచి తద్వారా బ్యాంకుల వద్ద ఉన్న సొమ్మును సేకరించే ప్రయత్నాలు చేసింది. బ్యాంకులు ప్రజలకు అప్పులివ్వకుండా కట్టడి చేసింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం 5.4 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉంది. 2008 తర్వాత ఇదే అత్యధికం. చైనా జిడిపి వృద్ధి రేటు జనవరి, మార్చి ల మద్య 9.7 శాతం ఉంటుందని అంచనా. ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ. ఆర్ధిక వృద్ధి రేటు కూడా ద్రవ్యోల్బణాన్ని పైకి నెడుతుంది. చైనాలో కూడా ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉంది.

అమెరికా

అమెరికాలో ద్రవ్యోల్బణం మార్చిలో 2.7 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరి లో ఇది 2.3 శాతంగా నమోదయ్యింది. పెరుగుతున్న ఆయిల్, ఆహారాల ధరలు ఇక్కడ కూడా ద్రవ్యోల్బణానికి కారణంగా నిలిచాయి. ఇండియా, చైనా లతో పోలిస్తే ఇది తక్కువగా కనపడుతున్నప్పటికీ అమెరికా ఆర్దిక వ్యవస్ధ సైజుతో పోలిస్తే ఇది ఎక్కువే. దానితో పాటు అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకుంటూనే ఉంది. రికవరీ దశలో ద్రవ్యోల్బణం పెరిగితే అమెరికా ప్రభుత్వం కానీ, ఫెడరల్ రిజర్వ్ కానీ రికవరీకి అందుబాటులో ఉండే చర్యలు తగ్గిపోతాయి. దాంతో రికవరీ కష్టంగా మారుతుంది. అమెరికాలో పెట్రోల్ ధరలు వరసగా తొమ్మిదో నెలలో కూడా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల వలన ఆయిల్ ధరలు పెరుతున్న విషయం తెలిసిందే.

జులై 2008 తర్వాత అత్యధికంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఆహార ధరలు మినహాయిస్తే అమెరికా ద్రవ్యోల్బణం కేవలం 1.2 శాతం మాత్రమేనని తెలిపింది. మామూలుగానే ఆహారాల ధరలు పెరుగుతుండగా ఆయిల్ ధరల వలన అవి మరింతగా పెరుగుతున్నాయి.

4 thoughts on “ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

 1. హల్లో మినర్వా, మీరడిగిన ప్రశ్నకు సమాధానం:
  ఇక్కడ బ్యాంకు వడ్డీ రేటు అంటే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు అని మీకు అర్ధం అయి ఉంటుంది. ద్రవ్యోల్బణం అంటే మార్కెట్ లో (ప్రజలు, పెట్టుబడి దారులు, వాణిజ్య బ్యాంకులు, కంపెనీలు మొదలైన వారు) అందుబాటులో ఉన్న సరుకుల విలువ కంటే ద్రవ్యం (డబ్బు) ఎక్కువగా చలామణీ లో ఉందని అర్ధం. అందుబాటులో ఉన్న సరుకుల విలువ లో ఎక్కువగా ఉన్న డబ్బు ఎంత శాతం ఉంటే అదే ద్రవ్యోల్బణం రేటు.

  ఉన్న సరుకుల విలువ కంటే మార్కెట్ లో డబ్బు ఎక్కువగా ఉంటే సరుకుల రేట్లు పెరుగుతాయి. సరుకుల కోసం పోటి తలెత్తడం వలన ఆటోమేటిక్ గా ఆ పరిస్ధితి తలెత్తుంది. సరుకుల విలువకీ, మార్కెట్లో ఉన్న డబ్బుకీ మధ్య తేడా ఏర్పడడానికి పైకారణం ప్రధాన కారణం. దానితో పాటు ఇంకా అనేక కారణాలుంటాయి. వాటిని రెండు విధాలుగా పేర్కొంటారు. ఒకటి డిమాండ్ సైడ్ కారణాలు, రెండోది సప్లై సైడ్ కారణాలు.

  స్ధూలంగా చూస్తే సరుకుల రేట్లు ఎక్కువగా ఉన్నపుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని అర్ధం చ్సుకోవచ్చు.

  బ్యాంకు (ఆర్.బి.ఐ) రేట్లు కింద మూడు రేట్లు ఉంటాయి
  సి.ఆర్.ఆర్: వాణిజ్య బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్.బి.ఐ దగ్గర రిజర్వ్ గా ఉంచాలి. ఖాతాదారుల భద్రత కోసం ఆర్.బి.ఐ ఈ చర్య తీసుకుంటుంది. బ్యాంకులు అడ్డగోలు వ్యాపారాలు చేసి డిపాజిట్ దారుల డబ్బులు పోగొట్టకుండా ఈ జాగ్రత్త. అలా ఆర్.బి.ఐ వద్ద రిజర్వ్ గా ఉంచవలసిన శాతాన్ని సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్ రేషియో) అంటారు. ప్రస్తుతం ఇది 6 శాతం. ఇది డబ్బు రూపంలో ఆర్.బి.ఐ ఆధీనంలో ఉంటుంది. సి.ఆర్.ఆర్ పెంచడం అంటే మార్కెట్ లో ఉన్న డబ్బును ఆర్.బి.ఐ వెనక్కి తీసుకుంటున్నట్లు అర్ధం. ఆ విధంగా మార్కెట్లో చలామణీలో డబ్బును ఆర్.బి.ఐ తగ్గిస్తుందన్నమాట.

  రెపో రేటు (రీ పర్ఛేజ్ రేటు): వాణిజ్య బ్యాంకులకీ, ఇతర ఫైనాన్స్ సంస్ధలకీ ఆర్.బి.ఐ అప్పు ఇస్తుంది. అలా అప్పు ఇచ్చేటప్పుడు ఆర్.బి.ఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. దీన్నే బ్యాంకు రేటు గా పేర్కొంటారు. రెపో రేటు పెంచితే బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు ఆర్.బి.ఐ దగ్గర అదేపనిగా అప్పు తీసుకోడానికి వెనకాడతాయి. ఆ విధంగా కూడా ఆర్.బి.ఐ మార్కెట్లో డబ్బుని తగ్గిస్తుంది.

  రివర్స్ రెపో:వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకుంటే ఆర్.బి.ఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. అందుకు ఆర్.బి.ఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని రివర్స్ రెపో అంటారు. రివర్స్ రెపో రేటు పెంచడం అంటే వాణిజ్యబ్యాంకులకు ఎక్కువ లాభాన్ని ఆర్.బి.ఐ ఆవర్ ఇస్తున్నట్లు అర్ధం. మార్కెట్ లో పరిస్ధులు అనుకూలంగా లేనప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ దగ్గర డిపాజిట్ చేయడమే ఎక్కువ లాభకరం అనుకోవచ్చు. ఈ రేటు పెంచడం ద్వారా కూడా ఆర్.బి.ఐ డబ్బును మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

  ఆర్.బి.ఐ అదుపు చేసె ఈ మూడు రేట్లు పెంచడం ద్వారా (మూడూ పెంచవచ్చు, లేదా ఏదొ ఒకటి గానీ రెండుగానీ పెంచవచ్చు) మార్కెట్ లో ఉండే డబ్బును వెనక్కి తీసుకుంటే మార్కెట్లో డబ్బు చలామణి తగ్గించినట్లు అర్ధం. మార్కెట్లో సరుకుల విలువ కంటే డబ్బు ఎక్కువగా డబ్బు ఉండడం ద్రవ్యోల్బణం ఉన్నట్లని అర్ధం కదా! కనుక బ్యాంకు రేట్లు పెంచే కోద్దీ ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇది విలోమాను సంబంధం.

  మార్కెట్లో డబ్బు ఎంత ఉందో ఆర్.బి.ఐ పూర్తిగా లెక్కించలేదు. అది లీగల్ గా ఉండే డబ్బుని మాత్రమే లెక్కించగలదు తప్ప ధనికుల వద్ద ఉండే నల్లడబ్బు లెక్కించడం సాధ్యం కాదు. బ్లాక్ మార్కెటీర్లు, మాఫియా, అవినీతిపరులు మొదలైన వారి వలన ద్రవ్యోల్బణం అదుపు ప్రభుత్వాల చేతిల్లో లేకుండా పోతుంది. మళ్ళీ ఆ నల్లడబ్బుని చలామణీ చేసేది ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నాయకులూ, బ్యూరోక్రట్లూ తదితరులే. వాళ్ళ కార్యకలాపాల వలన రేట్లు పెరిగి అంతిమంగా సామాన్య ప్రజలకు సరుకులు అందకుండా పోతున్నాయి.

  ఇంకా అనుమానం ఉంటే అడగండి. నాకు తెలిస్తే చెబుతాను.

 2. నిజం చెప్పొద్దూ నేను వాటిని రిజర్వుబ్యాంకు రేట్లని కూడా అనుకోలేదు.

  మీరిచ్చిన సమాధానానికి, వివరించిన తీరుకీ చాలా ధాంక్సండీ. మరి ద్రవ్యోల్బణం విపరీతంగా తగ్గిపోయినా నష్టమేనంటారు? అది ఆయా వస్తూత్పత్తిరంగాలకు తగ్గిన ధరల వలన కలిగే నష్టాలనుద్దేస్యించా?

  ఈ ఆర్ధికశాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను (ప్రాధమిక విషయాలనుండి బోభించగల)కొన్ని మంచిపుస్తకాలు సూచించగలరా?

 3. అవును. ద్రవ్యోల్బణం బాగా తగ్గినా సమస్యే. ద్రవ్యోల్బణం మైనస్ గా నమోదయితే అది ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్). అంటే అందుబాటులో ఉన్న సరుకుల విలువ కంటే మార్కెట్లో డబ్బు తక్కువగా ఉండడం. సరుకుల ధరలు తగ్గుతున్నపుడు ప్రజలు సరుకులు కొనడం తగ్గిస్తారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సరుకుల ధరలు ఇంకా తగ్గుతాయామో, ఇంకా తగ్గాక కొందాం అని భావించడం వలన కొనుగోలు తగ్గుతుంది. (సరుకుల ధరలు పెరుగుతున్నపుడు ఇంకా పెరుగుతాయేమో, ముందే కొనిపెట్టుకుందాం అనుకుంటూ ఎక్కువెక్కువ కొనేస్తుంటారు. తద్వారా రేట్లు ఇంకా పెరగడానికి దోహదం చేస్తారు.) దానితో తయారీదారుల సరుకులు అమ్ముడుపోకుండా అలమరల్లో అలానే ఉండిపోతాయి. ఆర్ధిక ప్రక్రియలు మందగిస్తాయి. సరుకులు అమ్ముడుపోకపోతే నిల్వలు పెరిగి ఉత్పత్తి తగ్గించాల్సి వస్తుంది.

  అది జాతీయ స్ధాయిలో దేశ ఉత్పత్తి (జిడిపి) తగ్గడానికి దారితీస్తుంది. అంటే ఆర్ధిక వృద్ధి రేటు తగ్గిపోయి, ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఆ దేశంపైన నమ్మకం తగ్గుతుంది. ఆ దేశంలో పెట్టుబడి పెడితే లాభాలు తగ్గుతాయనీ, అసలు లాభాలు వస్తాయో రావోననీ అనుమానాలు పెరిగి పెట్టుబడులు పెట్టడం మానేస్తారు. అప్పటికే పెట్టుబడులు పెట్టినవారు వెనక్కి తీసుకుంటారు. తద్వారా ఆ దేశ ప్రభుత్వానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది. అప్పు దొరకదు. అన్ని దేశాల్లో చాలావరకు మార్కెట్లో అప్పులు సేకరించడంపైనే బడ్జెట్లు ఆధారపడి ఉంటాయి. రెవిన్యూ రాబడులు, ఇతరత్రా రాబడులు పోను మిగిలిందంతా అప్పులపై ఆధారపడతారు (అప్పు అంటే బాండ్లు జారీ చేయడం).

  ప్రస్తుతం జపాన్ చాలాకాలంగా డిఫ్లేషన్ తో తీసుకుంటోంది. దానివలన జపాన్ ఆర్ధిక వృద్ధి (జిడిపి పెరుగుదల రేటు) మందగిస్తోంది. అయితే అది అభివృద్ధి చెందిన దేశం కావడం వలన తట్టుకుని నిలబడింది. ఇంకా దీర్ఘకాలం కొనసాగితే కష్టమౌతుంది. ఈలోపు భూకంపం, సునామీలు వచ్చాయి. ఈ వైపరీత్యాలు ప్రజలజు కష్టాల్లోకి నెట్టినా, పెట్టుబడిదారులకి సంతోషమే. ఎందుకంటే పునర్నిర్మాణం కోసం ఇప్పుడు అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశాలు దొరికాయి. జపాన్ ఇప్పటివరకు ఎదుర్కొన్న డిఫ్లేషన్ ఇప్పుడు అదృశ్యమై ఆర్ధిక కార్యకలాపాలు స్పీడందుకుంటాయి. నష్టపరిహారం చెల్లింపు, ఆ డబ్బుతో సరుకుల కొనుగోలు ఇలా ఆర్ధిక ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.

  పెట్టుబడీదారీ వ్యవస్ధలో ఉత్పత్తి, అమ్మకమం, కొనుగోలు, లాభాల మిగులు… ఆ లాభాలు మళ్ళీ పెట్టుబడి, ఉత్పత్తి… ఇలా ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ పెట్టుబడిదారులకు లాభాలు కొండల్లా పెరిగిపోవాలి. అలా జరిగితేనే సజావుగా జరిగినట్లు. ప్రజలు, సౌకర్యాలు, తిండి. బట్ట, గూడు ఇవన్నీ సమస్యలు కావు. ఉత్పత్తి జరగాలి, వాటిని అంతా ఎగబడి కొనాలి, లాభాలు దండిగా రావాలి. ప్రతిసారి ఇది జరగదు. ఫలితమే సంక్షోభాలు.

  తెలుగులో ఏ గ్రంధాలున్నాయో నాకు ఐడియా లేదు. చూసి చెబుతాను. సాంప్రదాయక ఆర్ధిక పుస్తకాల్లో ఈ విషయాలు ఈ పద్ధతిలో దొరకవనుకుంటా, ఇంగ్లీషులో కూడా. అయినా చూసి చెబుతాను. తెలుగైనా, ఇంగ్లీషైనా చూసి చెబుతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s