లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకూవాలని కోరింది.
రెండో తీర్మానం అమలుచేయడానికే మేము లిబియాపై వైమానిక దాడులు చేస్తున్నామని చెబుతున్న పశ్చిమ దేశాలు మొదటి తీర్మానం గురించి మాట్లాడడం మానేశారు. మొదటి తీర్మానం చేసినపుడు ఇరుపక్షాలకు ఇది వర్తిస్తుందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తెలిపాయి. అప్పట్లో గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చూస్తే చాలు, అతనిని తిరుగుబాటు బలగాలు ఓడిస్తాయి. లిబియా ఆయిలు తమకు దక్కుతుంది అని పశ్చిమ దేశాలు భావించాయి. కాని ఆ తర్వాత తిరుగుబాటు బలగాలు గడ్డాఫీ బలగాల ధాటికి తోక ముడుస్తుండడంతో, “నో-ఫ్లై జోన్” ని అడ్డం పెట్టుకుని గడ్డాఫీ బలగాలపై వైమానిక దాడులు చేశాయి. అయినా తిరుగుబాటు బలగాలు పశ్చిమ దేశాలు ఊహించినట్లుగా ముందుకు వెళ్ళలేక పోయాయి. ఇప్పుడు తెగించి సమితి తీర్మానాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాయి. నిజానికి సమితి తీర్మానాలనేవి ప్రపంచ ప్రజలకు నమ్మకమైన సాకు చూపడానికీ, తమను వ్యతిరేకించే దేశాల వాదనలు సకారణంగా తిప్పికొట్టడానికీ తప్ప సమితి తీర్మానాలపై పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు గౌరవం ఇవ్వవు.
బ్రిటన్ తాను లిబియా తిరుగుబాటుదారులకు 1000 శరీరధారణ ఆయుధాలు, 100 శాటిలైట్ ఫోన్లు ఇస్తామని ప్రకటించింది. అమెరికా ఇప్పటికె సి.ఐ.ఏ సిబ్బందిని దింపింది. అది చాలా రోజుల క్రితం నుండే ఆయుధాలు రహస్యంగా చేరవేస్తోంది. ఫ్రాన్సు ఆయుధాలు ఇచ్చే ఆలోచనల తనకు లేదనీ, దానర్ధం ఆయుధాలు ఇస్తున్నవారిని తాను వ్యతిరేకిస్తున్నట్లు కాదనీ చెప్పింది. బహుళా ఫ్రాన్సు కూడా రహస్యంగా ఆయుధ సరఫరా చెయ్యొచ్చు. లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని మొదట గుర్తించింది. ఫ్రాన్సు దేశమే. తర్వాత ఇటలీ, ఖతార్ లు గుర్తించాయి. తిరుగుబాటుదారులనుండి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఇటలీ ఖతార్ లు ప్రారంభించాయి. ఆయిల్ అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును అమెరికా, ఇంగ్లండ్ లు అందించే ఆయుధాలకు ఉపయోగించనున్నారు. అనడానికి ఆయుధ సాయం అన్నా, అది నిజానికి ఆయుధ అమ్మకమే.
లిబియాపై దాడుల్లో జర్మనీ లాంటి కీలక దేశం పాల్గొనకపోవడం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లకు నచ్చడం లేదు. లిబియాపై దాడులను నాటో సభ్య దేశాలైన జర్మనీ, టర్కీ లు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు జర్మనీ కూడా లాగడానికి బెర్లిన్ లో సమావేశం పెట్టారు. ఇటలీ తన భూభాగం నుండి యుద్ధ విమానాలు బయలు దేరి లిబియాపై దాడులు చేయడానికి అనుమతినిచ్చింది తప్ప అది కూడా లిబియా దాడుల్లో పాల్గొనడం లేదు. దానితో లిబియాపై దాడుల ఖర్చు భారం కొద్ది దేశాలే భరించాల్సి వస్తోంది. అమెరికా, ఫ్రాన్సు , ఇంగ్లండ్, ఖతార్, కెనడా, బెల్జియం, నార్వే, డెన్మార్క్ దేశాలే దాడులు చేస్తున్నాయి. స్పెయిన్ నో-ఫ్లై జోన్ అమలు చయడం వరకే ఉంటానని మళ్ళీ చెప్పింది. అమెరికా నాయకత్వాన్ని నాటో కి అప్పగిస్తున్నట్లు ప్రకటించినా దాడుల్లో చురుకుదనం తగ్గలేదు. నాయకత్వ భాధ్యతనుండి వెనక్కి తగ్గడం వ్యూహాత్మకమే తప్ప వాస్తవంగా కనిపించడం లేదు.
లిబియాపై ఆయిల్ దాడులకు నాటో అధ్వర్యంలో 195 యుద్ధ విమానాలు, 18 యుద్ధ నౌకలు ఉన్నట్లు బిబిసి తెలిపింది. 2038 సార్లు యుద్ధ విమానాలు బాంబు దాడులు చేశాయి. 28 దేశాల నాటో కూటమి నుండి 6 దేశాలు దాడుల్లో పాల్గొంటున్నాయి. అరబ్ లీగ్ నుండి ఖతార్ నో-ఫ్లై జోన్ పర్యవేక్షణలో పాల్గొంటున్నది.