లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్


Qatar president Hamad_bin_Khalifa_Al-Thani

ఖతార్ ఎమిర్ హమద్ బిన్ ఖలీఫా అల్-తహాని

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం కోరింది. నాటో దాడులు తీవ్రం చేయాలని బ్రిటన్, ఫ్రాన్సులు డిమాండ్ చేసిన నేపధ్యంలొ బుధవారం ఖతార్ లొ లిబియా కాంటాక్ట్ గ్రూపు సమావేశం జరగనుంది. యూరోపియన్ దేశాలు, అమెరికా, అరబ్ దేశాల్లోని వారి మిత్రదేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్ధలు కాంటాక్టు గ్రూపుగా మార్చి 29 న జరిగిన లండన్ సమావేశంలో ఏర్పడింది. సమావేశంలో లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది.

అయితే నాటో దాడులు సమితి తీర్మానాన్ని దాటి పోయాయనీ, గడ్డాఫీ సైన్యంపైనా, అతని యుద్ధ పరికరాలపైనా దాడులు చేయడానికి అనుమతి లేదనీ చైనా, రష్యా, టర్కీ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.సమితి తీర్మానం మేరకు పౌరులను రక్షించడం వరకే మా బాధ్యత అని, ఆ భాద్యతను నాటో భేషుగ్గా నిర్వహిస్తోందనీ నాటో జనరల్ ఒకరు చెప్పారు. నాటో జరుపుతున్న వైమానిక దాడులు లిబియా తిరుగుబాటు సైన్యాలు నిర్ణయాత్మక విజయం సాధించడానికి దోహదం చేయడంలొ విఫలమైనాయి. లిబియా పౌరుల రక్షణ కోసం దాడులు అవసరమయ్యాయని పైకి చెబుతున్నా పశ్చిమ దేశాల అసలు లక్ష్యం గడ్డాఫీని గద్దె దించడమే. గడ్డాఫీ బలగాలు విచక్షణా రహితంగా పౌరులను కాల్చి చంపుతున్నాయనీ, నేరుగా పౌరుల ఆవాసాలపైనా, ఆసుపత్రులపైనా కాల్పులు జరుపుతునాయనీ పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తున్నా అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపలేక పోయాయి. ఒక్క ఫోటోనైనా ప్రచురించలేక పోయాయి. ఫలానా డాక్టరు చెప్పడంటాయి తప్ప అతని ఫొటో కానీ దాడికి గురైన పౌరులనూ, వారి ఇళ్ళనూ ఇంతవరకూ సాక్ష్యంగా చూపలేక పోయాయి. అదేమంటే గడ్డాఫీ మీడియాపై ఆంక్షలు విధించాయంటున్నాయి. కాని గడ్దాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల ఫోటోలు ఎలా సంపాదిస్తున్నాయో అంతుబట్టడం లేదు.

వాస్తవానికి లిబియా తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు కొంతమంది తిరుగుబాటు మొదలయ్యే వరకూ అమెరికాలో నివసించిన విషయం వెల్లడయ్యింది. వర్జీనియా రాష్ట్రంలోని లాంగ్లేలో ఉన్న అమెరికా గూఢచారి సంస్ధ సి.ఐ.ఏ కేంద్ర కార్యాలయానికి కేవలం పది కి.మీ దూరంలొ తిరుగుబాటుదారుల నాయకుడు ఖలీఫా హెఫ్తిర్ నివాసం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఖలీఫా హెఫ్తిర్ ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో కల్నల్ గా పని చేసిన వ్యక్తి. గడ్డాఫికి వ్యతిరేకిగా మారాక ఛాద్ దేశం నుండి గడ్దాఫీ వ్యతిరేక తిరుగుబాటు నడపడానికి ప్రయత్నాలు చేశాడు. ఛాద్ లో అమెరికా అనుకూల ప్రభుత్వం కూలిపోవడంతో అమెరికాకి పారిపోయి అక్కడ నివాసం ఉంటూనే లిబియన్ నేషనల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సైన్యంతో 1996లో లిబియా తూర్పు ప్రాంతంలో తిరుగుబాటు లేవదీయడానికి ప్రయత్నించి హెఫ్తిర్ విఫలమయ్యాడు. మళ్ళీ అరబ్ ప్రజా ఉద్యమాలు ప్రారంభం కావడంతో వాటి ముసుగులో లిబియా తూర్పు ప్రాంతంలోని ముఖ్యపట్టణం బెంఘాజీ నుండి కార్యకలాపాలు ప్రారంబించాడు. లిబియా తిరుగుబాటు ప్రారంభం వెనక అమెరికా పధకం ఉన్నట్లు దీన్నిబట్టి అర్ధమవుతోంది. లిబియా తూర్పు ప్రాంతంలో ఉండే గిరిజన తెగలు గడ్డాఫీ తెగకు సాంప్రదాయక వ్యతిరేకులు కావడం అమెరికాకి కలిసి వచ్చినట్లుగా స్పష్టమౌతోంది. వారితో గడ్డాఫీ పాలన పట్ల విసుగు చెందినవారు జత కూడినప్పటికీ పశ్చిమ దేశాల హస్తాన్ని వారు అంచనా వేయలేకపోయారు.

పశ్చిమ దేశాల దాడులకు మద్దతు ఇస్తున్న అరబ్ దేశాల్లో ఖతార్ ముఖ్యమైనది. ఇది ఆయిల్, గ్యాస్ వనరుల ఆధారపడ్డ చిన్న ధనిక దేశం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లపై అమెరికా చేసిన దురాక్రమణల దాడి సందర్బంగా యుద్ధ విమానాలకు ఆయిల్ నింపడానికి అనుమతినిచ్చిన దేశం. ఖతార్ ను పాలిస్తున్న ప్రస్తుత రాజ వంశీయుడు తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రం చేసి అధికారాన్ని సంపాదించాడు. ప్రపంచ వాణిజ్య సదస్సు సమావేశాలు జరిగిన చోటల్లా ప్రపంచం నలుమూలలనుండి పెద్ద ఎత్తున జనం వచ్చి ఆందోళనలు చేస్తుండడంతో ఎక్కడ జరపాలా అన్న మీమాంసంలో ఉండగా తమ రాజధాని దోహాలో జరపండని ముందుకు వచ్చిన దేశం ఇది. అప్పటినుండీ ప్రపంచ వాణిజ్య సంస్ధ ప్రారంబించిన రెండో విడత చర్చలను “దోహా రౌండ్ చర్చలు” గా వ్యవహరిస్తున్నారు. ఖతార్ లో ప్రజాస్వామిక హక్కులకు తావులేదు. దానితో ఆందోళనకారులు దోహా చర్చలు జరుగుతున్నపుడు అక్కడికి వెళ్ళలేకపోయారు.

అటువంటి ఖతార్, లిబియా దేశంపై దాడులను సమర్ధించడంలో ఆశ్చర్యంలేదు. లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని మొదట ఫ్రాన్సు గుర్తించగా ఆ తర్వాత ఖతార్ గుర్తించింది. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి అరబ్ లీగ్ తొలుత మద్దతిచ్చినప్పటికీ, పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైన్యం, ఆయుధ గిడ్డంగులపై దాడులు జరుపుతాయని అది ఊహించలేక పోయింది. తర్వాత నాలిక్కరుచుకుని పశ్చిమ దేశాలు లిబియా పౌరులను రక్షించే కార్యక్రమం వదిలి గడ్డాఫీ ఇంటిపైనా, అతని సైన్యం, ఆయుధ గిడ్డంగుల పైనా దాడులు చేయడాన్ని ఖండించినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని గద్దె దించడానికి దాడులు చేయడమే పశ్చిమ దేశాల లక్ష్యం. దానికి సమితి తీర్మానాలు కావాలి. సమితిచేత తీర్మానం చేయించడానికి గడ్దాఫీ బలగాలు లిబియా పౌరులను చంపుతున్నాయంటూ ఓ అబద్ధాన్ని పుట్టించి విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి. వీరి ప్రచారాన్ని అరబ్ లీగ్ నమ్మడం ఓ వింత. కానీ ఆఫ్రికన్ యూనియన్ లిబియాలో కాల్పుల విరమణను పాటింప జేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినా పశ్చిమ దేశాలు దాని ప్రయత్నాలను సాగనీయడం లేదు.

బుధవారం ఖతార్ లో జరగనున్న లిబియా కాంటాక్టు గ్రూపు సమావేశంలో లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధ సాయం చేయడానికి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో తిరుగుబాటుదారుల నాయకులు కూడా పాల్గొననున్నారు. లిబియాపై సమితి చేసిన మొదటి తీర్మానం ప్రకారం లిబియాకు ఆయుధ సరఫరాపై నిషేధం ఉంది. దానిప్రకారం లిబియాలో యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకూ ఆయుధాలు సరఫరా చేయకూడదు. ఈ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఆయుధాలను తిరుగుబాటుదారులకు అందించడం కుదరదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అడ్డంగా ఉల్లంఘించిన చరిత్ర పశ్చిమ దేశాల సొంతం. ఈసారి తాము చేసిన తీర్మానాన్నే అవి ఉల్లంఘిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా ఇప్పటికే తిరుగుబాటుదారులకు ఆయుధాలు రహస్యంగా అందిస్తోంది. సి.ఐ.ఏ, లిబియాలో ఇప్పుడు చురుకుగా పని చేస్తోంది. తాము ప్రాణం పోసిన లిబియన్ నేషనల్ ఆర్మీకి ఉన్నఆయుధాలన్ని అమెరికా అందజేసినవే ననడంలో సందేహం లేదు.

సద్ధాం హుస్సేన్ అధ్యక్షుడుగా ఉండగా ఇరాక్ పై నో-వ్లై జోన్ ను అమెరికా నాయకత్వంలోని నాటో అమలు చేసింది. నో-వ్లై జోన్ పేరుతో సద్దాం ఆయుధాలన్నింటినీ నాటో సైన్యాలు నాశనం చేశాయి. ఇంకా రహస్యంగా దాచాడన్న అనుమానంతో “సామూహిక విధ్వంసక ఆయుధాలను” సద్దాం దాచిపెట్టాడన్న వంకతో ఇరాక్ లో అణువణువూ గాలించాయి. ఇక ఆయుధాలేమీ లెవని నిర్ధారించుకున్నాక, ఉన్న ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించిన తర్వాత అమెరికా నాయకత్వంలొ ఇరాక్ పై దాడి చేసి ఒక స్వతంత్ర దేశానికి చెందిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి బూటకపు విచారణ సాగించి అమానుషంగా ఉరితీయించింది అమెరికా. ఇలాంటి చరిత్ర వలస వ్యవస్ధల్లో జరిగిన సంగతి ప్రజలు చదువుకున్నారు.  ఆధునిక కాలంలొ ప్రజాస్వామ్యం పేరుతో కూడా ఇతర దేశాల పాలకులను పట్టి బంధించి చంపొచ్చని అమెరికా దాని మిత్ర దేశాలు నిరూపించాయి. ఇరాక్ తర్వాత అదే ఎత్తుగడను సెర్బియా నాయకుడు స్లోబోడన్ మైలోసేవిక్ పైన కూడా పశ్చిమ దేశాలు అమలు చేశాయి. ఇప్పుడు లిబియాపైనా, లిబియా అధ్యక్షుడు గడ్డాఫీపైనా అమలు చేస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s