బ్రిక్స్ గా మారిన బ్రిక్ కూటమి, జి-7 తో పోటీకి ఉరకలు?


China, India meet in sidline of BRICS summit

బ్రిక్స్ సమావేశం సందర్బంగా చైనా, ఇండియాల ద్వైపాక్షిక సమావేశం

నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా మార్పు చెందింది. సౌతాఫ్రికా నూతనంగా ఈ కూటమిలో చేరడంతో BRIC కూటమి కాస్తా BRICS కూటమిగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లు కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇది రెండు సమావేశాలను జరుపుకుంది. మూడో సమావేశం సౌతాఫ్రికా తో కలిసి చైనా లోని సాన్యాలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా పేరు పొందిన దేశాలు కలిసి ఏర్పాటయిన జి-20 కూటమిలో ఈ ఐదు దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో ఏర్పాటయిన జి-7 గ్రూపు దేశాలు కూడా జి-20 కూటమిలో సభ్య దేశాలే.

జి-20 కూటమిలో ఉన్న జి-7 కూటమికి బ్రిక్స్ కూటమి పోటీగా ఎదగాలని ఈ ఐదు దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య చర్చలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకూ, అభివృద్ధి చెందిన దేశాలకూ మధ్య తలెత్తిన వైరుధ్యాలు బ్రిక్ కూటమికి ప్రాణం పోశాయి. తాజాగా సౌతాఫ్రికా చేరికతో బ్రిక్స్ మరింత శక్తివంతంగా మారిందని భావిస్తున్నారు. బ్రిక్స్ కూటమిలోని చైనా ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉంది. ఇండియా, ఆసీయాలో చైనా, జపాన్ ల తర్వాత మూడో ఆర్ధిక వ్యవస్ధగానూ, ప్రపంచంలో పదకొండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగానూ ఉంది. WTO సంస్ధలో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో ఒక కూటమిగా వ్యవహరించేందుకు బ్రిక్స్ కూటమి ఏర్పడిందని చెప్పవచ్చు.

చైనా, రష్యాల మధ్యా, అలాగే చైనా, బ్రెజిల్ దేశాలకు మధ్య జరిగే వాణిజ్యం డాలర్లలో కాకుండా వారి వారి కరెన్సీలలోనే జరగాలని ఆ దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంటే చైనా తన వద్ద రూబుల్స్, రియల్ కరెన్సీల నిల్వలను పెంచుకుంటుంది. అలాగే రష్యా, బ్రెజిల్ దేశాలు కూడా తమ వద్ద యువాన్ నిల్వలను పెంచుకుంటాయి. ఈ ఒప్పందాలు డాలరు ఆధిపత్యం తగ్గడానికీ, డాలరు కు ప్రత్యామ్నాయంగా ఇతర కరెన్సీలు అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. అయితే ఇండియా ఇంతవరకు ఇలాంటి ఒప్పందం చేసుకోలేక పోయింది. తద్వారా రూపాయి అంతర్జాతీయంగా ప్రభావవంతమైన కరెన్సీగా గుర్తింపు పొందే అవకాశాన్ని ఇండియా కోల్పొయింది. అమెరికా ప్రయోజనాలతో ఇండియా పాలకులు అంటకాగుతుండడం వలన ఇండియా స్ధానిక కరెన్సీలో వాణిజ్యం జరిపేందుకు ఒప్పందాలు చేయలేని స్ధితిలో ఉంది.

ప్రపంచ వాణిజ్య సంస్ధలో “ఉరుగ్వే రౌండ్” వాణిజ్య చర్చలు పూర్తయ్యాక “దోహా రౌండ్” వాణిజ్య సంస్ధలు మొదలయ్యాయి. ఇవి 2008 సంవత్సరంలో స్తంభించిపోయాయి. అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాలకు చెందిన వ్యవసాయ రంగ బహుళజాతి సంస్ధలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేయగా అవి ఒప్పుకోలేదు. ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ధనిక దేశాల బహుళజాతి సంస్ధలు తమ సరుకులు, సేవల మార్కెట్ లోకి స్వేఛ్ఛగా జొరబడడానికి అమెరికా, ఇతర ధనిక దేశాలు చేసిన డిమాండ్ ను ఇండియా నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు నిరాకరించాయి. దానితో చర్చలు నిలిచిపోయాయి, అప్పటినుండి దోహా రౌండ్ చర్చలను తిరిగి ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేదు.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలయ్యాక జి-20 గ్రూపుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి జి-77 నుండి వేరు చేయడానికి అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు ఎత్తు వేశాయి. జి-20 గ్రూపు సమావేశాలు కూడా జరగక పోవడంతో ఇప్పుడు బ్రిక్స్ కూటమి సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మళ్ళీ దోహా రౌండ్ చర్చలను ప్రారంబించడానికి అమెరికా ప్రయత్నించినా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పాత డిమాండ్లకు కట్టుబడి ఉండడంతో అమెరికా చిందులు తొక్కింది. అయితే దాని చిందులు ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇండియాతో “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” కుదుర్చుకుంది. దానిలో భాగంగా “పౌర అణు ఒప్పందాన్ని” కూడా కుదుర్చుకుంది.

తాజాగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి దేశాల సమావేశం దోహా రౌండ్ చర్చల పై ఒక నిర్ణయం తీసుకుంటాయని భావించారు. కాని దోహా రౌండ్ చర్చల కొనసాగింపుపై బ్రిక్స్ సమావేశం పెదవి విరిచింది. 2011 లో దోహా రౌండ్ చర్చలు ఫలవంతం అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని గత నవంబరు లో జరిగిని జి-20 కూటమి సమావేశం ప్రకటించింది. “అభివృద్ధి చెందుతున్న దేశాలు దోహా రౌండ్ చర్చలు ఫలవంతం కావడానికి తగిన రాజకీయ సాహసాన్ని సంపాదించుకోవాలని అమెరికా మార్చి నెలలో కోరింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్న విధంగా వ్యవసాయ రంగ బహుళ జాతి సంస్ధలకు పెద్ద మొత్తంలో ఇస్తున్న సబ్సిడీలను తగ్గించేందుకు తగిన రాజకీయ సాహసం అమెరికాకు గానీ, దాని మిత్ర దేశాలకు గానీ ఉన్నదో లేదో అమెరికా చెప్పలేదు.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ప్రపంచ దేశాల మధ్య ఆర్ధిక విధానాలు రూపొందించడంలో మరింత సహకారం పెంపొందాలని బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం కోరింది. ప్రపంచ ఆర్ధిక వ్యవష్దలో బ్రిక్స్ కూటమి 18 శాతం వాటా కలిగి ఉంది. అయితే బ్రిక్స్ కూటమి లోని మిగతా నాలుగు దేశాల మొత్తం జిడిపి కంటే చైనా జిడిపి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం సెప్టెంబరులో చైనా, జపాన్ ను అధిగమించి రెండో పెద్ద ఆర్ధిక వ్యవష్దగా అవతరించింది. అయితే చైనాలో తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ. అందువలన చైనా ఇంకా మూడో ప్రపంచ దేశంగానే ఉంది. అధిక జనాభా చైనా తలసరి ఆదాయం తక్కువగా ఉండడానికి కారణం. చైనా ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి చైనాలోని అశేష శ్రామిక జనానికి సహజంగానే అందుబాటులో లేదు. వాణిజ్య మిగులు కొండలా పెరిగిపోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని కుప్పలుగా పోగేసుకోవడమే గానీ ప్రజలకు అభివృద్ధి ఫలాలను పంచే ఆలోచనలను చైనాతో పాటు మరే ఎమర్జింగ్ ఎకానమీ దేశమూ చేయడం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s