సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక


Pakistanis protests after Raymond Davis incident

రేమండ్ డేవిస్ ఘటన అనంతరం పాకిస్తాన్ లో అమెరికా వ్యతిరేక ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం , మిలట్రిలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ అణు రియాక్టర్లలొ నిల్వ ఉంచిన శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని దొంగిలించడానికి సి.ఐ.ఏ గూఢచారులు ప్రయత్నించి విఫలమైన సంగతిని వికీలీక్స్ వెల్లడించిన “డిప్లొమేటిక్ కేబుల్స్” ద్వారా బయటపడింది కూడా. దాదాపు 335 మంది సి.ఐ.ఏ గూఢచారులనూ, ప్రత్యేక బలగాలనూ, సి.ఐ.ఏ కాంట్రాక్టర్లను దేశంనుంచి పంపేయాలని పాకిస్తాన్ అమెరికాను డిమాండ్ చేసింది. సోమవారం ఈ విషయానికి సంబంధించి సి.ఐ.ఏ, ఐ.ఎస్.ఐ ల అధిపతుల మధ్య అమెరికాలో చర్చలు జరిగాయని బిబిసి, న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. సమావేశంలొ సి.ఐ.ఏ అధికారులను వెనక్కి తీసుకేళ్ళాలని ఐ.ఎస్.ఐ తమను అడగలేదని అమెరికా అధికారులు చెప్పినా వారే రహస్యంగా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు సమాచారం ఇచ్చారు.

“టెర్రరిస్టుపై ప్రపంచ వ్యాపిత యుద్ధం” పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై చేస్తున్న దురాక్రమణ యుద్ధం మొదలై దశాబ్దం దాటింది. అయినా యుద్ధంలో గెలిచే అవకాశం లేదని అమెరికాకు అర్ధమైయింది. తాలిబాన్, ఆల్-ఖైదా సంస్ధలు పాకిస్తాన్ లోని వాయవ్య రాష్ట్రంలో స్ధావరాలు ఏర్పరచుకుని అమెరికా సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వారికి పాకిస్ధాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ, మిలట్రీల రహస్య మద్దతు ఉన్న సంగతి అమెరికాకు కూడా తెలుసు. అయినప్పటికీ తాలిబన్, ఆల్-ఖైదా ల స్ధావరాలపై దాడులు చేయాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం సహకారం

Children killed in drone attack

అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన పాకిస్తానీ పసిపిల్లలు

తప్పనిసరి కావడంతో పాకిస్తాన్ పైన ఆధారపడక అమెరికాకు తప్పడం లేదు. “నార్త్ ఫ్రాంటియర్ రాష్ట్రం”, వజీరిస్ధాన్ లలొ స్ధావరాలు ఏర్పరచుకున్న టెర్రరిస్టు సంస్ధలపై దాడులకు అమెరికా డ్రోన్ విమానాలను అమెరికా అధికంగా వినియోగిస్తుంది. ఇవి మానవరహిత విమానాలు. వీటికి మారణాయుధాలను అమర్చి లక్ష్యాలపై పేల్చడం ద్వారా టెర్రరిస్టు సంస్ధల నాయకులను, క్యాడర్ ను చంపడంపైన అమెరికా ప్రధానంగా ఆధారపడుతోంది.

డ్రోన్ విమానాల దాడులు సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సి.ఐ.ఏ గూఢచారులు తమ గూఢచర్యం ద్వారా లక్ష్యాలను గుర్తించి సమాచారం ఇస్తే, ఆఫ్ఘనిస్తాన్ లోని తమ బేస్ క్యాంపులనుండి అమెరికా డ్రోన్ విమానాలను లక్ష్యాలపై దాడులకు పంపుతుంది. లక్ష్యంపై దాడులు జరిపాక డ్రోన్ విమానం తిరిగి రావచ్చు లేదా కూలిపోవచ్చు. కూలిపోయిన విమానాలను వెంటనే నాశనం చేస్తుంది అమెరికా. లేకపోతే వాటిని స్వాధీనం చేసుకుని తీవ్రవాదులు కానీ, పాకిస్తాన్ మిలట్రీ కానీ డ్రోన్ విమానాల టెక్నాలజీని దొంగిలిస్తాయని అమెరికా భయం. డ్రోన్ విమానాల ద్వారా అమెరికా టెర్రరిస్టు సంస్ధల నాయకుల్ని, వారి క్యాడర్ ను చాలా మందిని చంప గలిగింది. అయితే వారితో పాటు పాకిస్తాన్ పౌరులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్లా, పాకిస్తాన్ భూభాగంపై దాడులు చేయడానికి అనుమతించిన పాకిస్తాన్ ప్రభుత్వం పట్లా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, మిలట్రీ గానీ డ్రోన్ దాడి జరిగినప్పుడల్లా బహిరంగంగా ఖండనలు జారి చేస్తాయి. కాని ఆ దాడులకు రహస్యంగా పాకిస్తాన్ మద్దతు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.

డ్రోన్ విమానంతో దాడి చేసేటప్పుడు దాడి లక్ష్యం, దాడికి గురయ్యే ప్రాంతాల గురించి ముందుగా పాకిస్తాన్ ప్రభుత్వం, లేదా మిలట్రీ, లేదా ఐ.ఎస్.ఐ లకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్న రహస్య ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని అమెరికా గూఢచారి సంస్ధ సి.ఐ.ఏ గౌరవించడం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎట్టి సమాచారం లేకుండానే డ్రోన్ విమాన దాడులు జరుగుతున్నాయి. ఒబామా ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రోన్ విమానలపై అమెరికా సైన్యం ఆధారపడడం ఎక్కువయ్యింది. గత సంవత్సరంలొ వందకు పైగా డ్రోన్ విమాన దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోయారు. దానితో పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగానే డ్రోన్ దాడులకు అభ్యంతరం చెబుతూ హెచ్చరికలు జారి చేస్తోంది. గత జనవరి నెలలొ రేమండ్ డేవిస్ పేరుగల సి.ఐ.ఏ గూఢచారి ఇద్దరు పాకిస్తాన్ పౌరులను పట్టపగలే కాల్చి చంపడంతో అమెరికా, పాకిస్తాన్ లమధ్య కొనసాగుతున్న సహకారం పూర్తిగా క్షీణించాయి.

Drone

విధ్వంసకర డ్రోన్ విమానం

ఇద్దరు పాకిస్తానీయులను చంపిన రేమండ్ డేవిస్ ను పాకిస్తాన్ అరెస్టు చేసింది. అతనిని విడుదల చేయమని అమెరికా డిమండ్ చేసినా పాకిస్తాన్ వినలేదు. రేమండ్ దౌత్య ఉద్యోగి అని పత్రికలకు అమెరికా చెప్పినప్పటికీ అతను సి.ఐ.ఎ గూఢచారి అన్న విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. రేమండ్ డేవిస్ గూఢచర్య కార్యకలాపంలో ఉండగా పసిగట్టిన ఐ.ఎస్.ఐ గూఢచారులు వెంబడించడంతో అరెస్టును తప్పించుకోవడానికి రేమండ్ కాల్పులు జరిపి వాళ్ళను చంపేశాడు. పట్టపగలే తమ కళ్ళముందే తమ దేశస్ధుడిని చంపడం చూసిన పాకిస్తానీయులు రేమండ్ ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పారు. తమ గూఢచారులను చంపడం ఐ.ఎస్.ఐ, పాకిస్తాన్ ప్రభుత్వాలు జీర్ణించుకోలేక పోయాయి. అందుకే రేమండ్ ని విడుదల చేయాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేసినా ఇటీవలి వరకూ విడుదల చేయలేదు. తనను దోపిడీ చేయడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం చంపేశానని రేమండ్ చెప్పినా పాకిస్తాన్ కోర్టు బెయిలివ్వడానికి నిరాకరించి రిమాండ్ కి పంపింది.

రేమండ్ ను రెండు వారాలపాటు ఐ.ఎస్.ఐ ప్రశ్నించిందని తెలిసి అమెరికా అధికారులు అగ్రహోదగ్రులయ్యారు. బహిరంగ హెచ్చరికలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై జారీ చేశారు. అయినా రేమండ్ నిర్బంధం కొనసాగింది. చివరికి అమెరికా బేరసారాలకు దిగింది. బేరసారాల అనంతరం చనిపోయినవారి కుటుంబాలకు 2.3 మిలియన్ల నష్టపరిహారం చెల్లించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. బాధింత కుటుంబాల వారు రేమండ్ డేవిస్ చేసిన నేరాన్ని క్షమించినట్లు కోర్టులో చెప్పడంతో కోర్టు అతనిని విడుదల చేసింది. అమెరికా తరపున పాకిస్తాన్ అధికారులే బాధింత కుటుంబాలతొ చర్చించి పరిష్కారాన్ని సాధించారు. రేమండ్ విడుదలయ్యాక పాకిస్తాన్ కోర్టు దౌత్యాధికారులకు ఉండే మినహాయింపు నిబంధనల ప్రకారం విడుదల చేసిందని అమెరికా అధికారులు పత్రికలకు చెప్పారు. తద్వారా బహిరంగంగా అమెరికా పరువు నిలుపుకోవాలని వారి ప్రయత్నం. కానీ పత్రికలు చాలాముందునుండే బేరసారాల సమాచారాన్ని వెల్లడిస్తు వచ్చాయి.

రేమండ్ డేవిస్ విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం మరో ముఖ్యమైన షరతు విధించింది. ప్రభుత్వం అనడం కంటే పాకిస్తాన్ మిలట్రీ అనడం సరైంది. పాకిస్తాన్ లో కార్యకలాపాలు సాగిస్తున్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 25 నుండి 40 శాతం వరకు వెనక్కి పిలవాలని పాకిస్తాన్ అమెరికాను కోరింది. పాకిస్తాన్ మిలట్రీ అధిపతి జనరల్ అఫ్షాక్ కయాని స్వయంగా ఈ షరతును విధించినట్లు పాకిస్తాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. సోమవారం జరిగిన చర్చల్లో అమెరికా సైనిక దళాల జాయింట్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ములెన్, సి.ఐ.ఏ డైరెక్టర్ లియోన్ పనెట్టా లు అమెరికా తరపున పాల్గొనగా పాకిస్తాన్ తరపున ఐ.ఎస్.ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా పాల్గొన్నాడని బిబిసి తెలిపింది. పాకిస్తాన్ డిమాండ్ చేసిన సంఖ్యలో సగం మందిని వెనక్కి పిలిచినా పాకిస్తాన్ సైనికులకు అమెరికా ఇస్తున్న ట్రైనింగ్ కార్యక్రమం మూలన పడుతుందని అభిజ్గ్న వర్గాల పేరుతో అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. టెర్రరిజం వ్యతిరేక యుద్ధం కోసం అమెరికా, పాకిస్తాన్ కి ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్లకు పైగా సాయం పేరున ఇస్తోంది. పాకిస్తాన్ సైనికులు సమర్ధవంతంగా టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి వారికి అత్యాధునికమైన శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ ఇచ్చేది సి.ఐ.ఏ అధికారులే కావడంతో వారిని ఉపసంహరించడం వలన అది కొనసాగక పోవడమే కాక అమెరికా, పాకిస్తాన్ లమధ్య ఉన్న సహకారం కూడా పూర్తిగా ముగిసిపోయినట్లేనని అమెరికా అధికార వర్గాలు చెప్పాయి.

సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ని పాకిస్తాన్ కోర్టు విడుదల చేసిన తర్వాత రోజే జరిగిన డ్రోన్ దాడిలో ఉత్తర వజీరిస్తాన్ రాష్టంలోని తాలిబాన్ ఉగ్రవాదులు చనిపోయారు. వారితో పాటు గిరిజన తెగల నాయకులు కూడా చనిపోయారు. చనిపోయిన గిరిజన తెగల నాయకులు పాకిస్తాన్ సైన్యానికి అత్యంత సన్నిహితులు కావడంతో సైన్యాధికారి కయాని ఎన్నడూ లేని విధంగా డ్రోన్ దాడులను తీవ్రంగా విమర్శిస్తూ ప్రకటన జారీ చేశాడు. డ్రోన్ దాడి తమ లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించిందని అమెరికా డ్రోన్ దాడిని సమర్ధించుకుంది. అంటే పౌరులు చనిపోయినా వారు చంపాలనుకున్న వారు చనిపోతే గనక పౌరుల మరణానికి అమెరికా పెద్దగా చింతించదు. పాకిస్తాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లకు గానీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి గానీ దాని వలన ఇబ్బంది లేదు. పాకిస్తాన్, అమెరికా లమధ్య డ్రోన్ ఒప్పందం డ్రోన్ దాడులను అనుమతిస్తుంది కూడా. కానీ డ్రోన్ దాడుల విషయంలో సమాచారం ఇవ్వడం అమెరికా పూర్తిగా మానేయడంతో తన మనుషుల్ని (గిరిజన తెగల నాయకులలాంటి వారు) డ్రోన్ దాడులకు గురికాకుండా తప్పించలేక పోతున్నది. తాము భావించిన దానికంటే అధిక సంఖ్యలో డ్రోన్ దాడులు జరగడం కూడా పాకిస్తాన్ గూఢచార, మిలట్రీ సంస్ధలకు అంగీకారయోగ్యంగా లేదు. వ్యూహాత్మక దాడులకు గాకుండా రెగ్యలర్ దాడులకు కూడా డ్రోన్ లు వినియోగించడం వారికి నచ్చలేదు. దానికంటే ముఖ్యమైన విషయం సి.ఐ.ఏ గూఢచారులు తమ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడంలొ పూర్తిగా నిమగ్నం కావడం పాకిస్తాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లకు అసలు నచ్చలేదు. అందుకే తామ అనుమానించిన సి.ఐ.ఏ గూఢచారులందర్నీ దేశంనుండి వెళ్ళి పోవాలని పాకిస్తాన్ మిలట్రీ అధికారి అమెరికాకు గట్టిగా చెబుతున్నాడు. కాని అమెరికా ఇంకా బేరసారాలడుతున్నట్లు కనపడుతోంది.

రేమండ్ డేవిస్ విడుదల తర్వాత సి.ఐ.ఏ గుట్టుచప్పుడు కాకుండా తమ కాంట్రాక్టర్లను పాకిస్తాన్ నుండి వెనక్కి పిలిపించుకుంది. ఇంకా గూఢచారులను కూడా పిలిపించుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. టెర్రరిజం పై యుద్ధం కోసం పాకెస్తాన్ కేటాయించిన 150,000 సైన్యానికి టెర్రరిస్టులను ఎదుర్కొనే నైపుణ్యం లేదని అమెరికా గట్టిగా భావిస్తోంది. అమెరికా కాంగ్రెస్ కు అధ్యక్ష భవనం సమర్పించిన ఒక రిపోర్టులో మిలిటెంట్స్ ను ఎదుర్కోవడంలొ పాకిస్తాన్ సైనికుల పనితనం నిరుత్సాహంగా ఉందని పేర్కొంది. బహిరంగంగా ఉండే నివేదికలొ మిత్ర దేశం పై అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం అరుదని అమెరికా పత్రికలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్న నేపధ్యంలొ రేమండ్ డేవిస్ వలన ఎదురైన ఆటంకాన్ని అమెరికా ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. నిజానికి రేమండ్ డేవిస్ ఘటన అమెరికా, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న విషయానికి ఒక సూచిక మాత్రమే. తమకు నష్టం కలిగే రీతిలో పాకిస్తాన్ అణ్వస్త్రాల పట్ల అమెరికా అనుసరిస్తున్న రహస్య వైఖరే పాకిస్తాన్ ఆగ్రహానికి అసలు కారణం. పాకిస్తాన్ అణ్వస్త్ర పితామహుడు ఎ.క్యూ. ఖాన్ ద్వారా మరికొన్ని ముస్లిం దేశాలు అణ్వస్త్ర పరిజ్గ్నాన్ని సంపాదించుకున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఖ్యాతిని తెచ్చి పెట్టిన అణ్వస్త్రాలను వదులుకునేందుకు పాకిస్తాన్ అంగీకరించే ప్రసక్తే లేదు. అదీ, తమను మూడు యుద్ధాల్లో ఓడించి, తమ భూభాగాన్ని విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పరచిన దాయాది ఇండియాకు అణ్వస్త్రాలున్న నేపధ్యంలో అది అస్సలు కుదరని విషయం.

One thought on “సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s