ప్రపంచ బ్యాంకు తన నగ్న స్వరూపాన్ని సిగ్గు లేకుండా బైట పెట్టుకుంది. పేద దేశాలకు సహాయం పేరుతో అప్పులిచ్చే అభివృద్ధి చెందిన దేశాలు తాము కేంద్రీకరించే రంగాలను మార్చాలని కోరింది. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాయనీ, అలా కాకుండా న్యాయ వ్యవస్ధ, పోలీసు వ్యవస్ధలు అభివృద్ధి చెందటానికి సహాయం చేయడం ప్రారంభించాలని కోరింది. సోమవారం విడుదల చేసిన ఒక రిపోర్టులో “ఆయా దేశాల్లో స్ధిరమైన ప్రభుత్వాలను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఆరోగ్యం, విద్యా రంగాలకంటే న్యాయ, పోలీసు వ్యవస్ధల పటిష్టం చేసేవైపుగా ఆర్ధిక సహాయాలను మళ్ళించాలి” అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
ప్రభుత్వాలు స్ధిరంగా ఉండాలంటే న్యాయ, పోలీసు వ్యవస్ధలు పటిష్టంగా ఉండాలని ప్రపంచ బ్యాంకు భావిస్తుంది. తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అట్టుడికి పోతున్న దేశాల్లొనే మళ్ళీ మళ్ళీ సమస్యలు తలెత్తుతున్నాయనీ, దానితో ఆ దేశాల్లో ప్రభుత్వాలు దీర్ఘకాలం పాటు అస్ధిరత్వంలో కొనసాగుతున్నాయని ప్రపంచ బ్యాంకు బాధపడుతోంది. స్ధిరమైన ప్రభుత్వాలంటే ప్రపంచ బ్యాంకు దృష్టిలో ఆర్ధిక కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండడమే. ఆర్దిక కార్యకలాపాలు ప్రజలందరికీ అవసరమే గానీ ప్రపంచ బ్యాంకు దృష్టిలొ ప్రజల ఆర్ధిక కార్యకలాపాలకు వీసమెత్తు విలువ కూడా లేదు. దాని దృష్టిలో ఆర్ధిక కార్యకలాపాలంటే ఆ దేశాల్లొ ప్రవేటు కంపెనీల అభివృద్ధి, పశ్చిమ దేశాలకు చెందిన బహుళ జాతి సంస్ధలు స్వేచ్ఛగా చొరబడి అక్కడి వనరులను యధేచ్ఛగా కొల్లగొట్టడం.
బహుళజాతి సంస్ధలు చొరబడాలంటే ఆర్ధిక వ్యవస్ధలలో ప్రవేటీకరణ, సరళీకరణ విధానాలు చెలరేగుతూ ఉండాలి. అటువంటి విధానాలను ప్రవేశపెడుతున్నపుడు శ్రమ జీవులు ఉద్యోగాలు, హక్కులు, కాకరకాయ అంటూ గొడవ చేసే ప్రమాదం ఎల్లవేళలా ఉంటుంది. అటువంటి ప్రమాదం రాకుండా ఉండడానికీ, వచ్చినా సమర్ధవంతంగా అణచివేయడానికి ఆత్యాధునికమైన పోలీసు వ్యవస్ధ అవసరం. పోలీసు వ్యవస్ధ ఎంత పటిష్టంగా ఉంటే ప్రభుత్వాలు సమ్మెలు, ఉద్యమాల గొడవ లేకుండా అంత స్ధిరంగా ఉండగలుగుతాయి. ప్రభుత్వాలు స్ధిరంగా ఉన్నపుడు పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధలకు అనుకూలమైన ఆర్ధిక విధానాలను అమలు చేయవచ్చు. తద్వారా అక్కడి వనరులను కొల్లగొట్టవచ్చు. కనుక పోలీసు వ్యవస్ధలను పటిష్టపరచడానికి సహయాన్ని కేంద్రీకరించాలని ప్రపంచ బ్యాంకు నిస్సిగ్గుగా సిఫార్సు చేస్తోంది.
విద్య, ఆరోగ్య రంగాలకు ఎంత సాయం చేసినా ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది. వాటిపై పెట్టే ఖర్చు వృధా అని ప్రపంచబ్యాంకుకు తెలిసొచ్చింది. కాని తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలకు ప్రాణం పోసి, పెంచి పోషించేది పశ్చిమ దేశాలే అన్న విషయం ప్రపంచ బ్యాంకు సౌకర్యవంతంగా విస్మరిస్తోంది. తమకు నచ్చని ప్రభుత్వాలను అస్ధిర పరచడానికి టెర్రరిస్టు సంస్ధలను, తిరుగుబాట్లను పెంచి తిరిగి వాటిపైన యుద్ధం పేరుతో దేశాలను కబళించే కుతంత్రాలను పశ్చిమ దేశాలు మానుకున్నట్లయితే ఆయా దేశాలు స్ధిరంగా, ఆరోగ్యంగానే ఉంటాయి. సాయం అనీ, అప్పు అనీ వాటిజోలికి పోకుండా ఉంటే ఎంత బీద అనుకున్న దేశమైనా తమకు తగ్గ అభివృద్ధి మార్గాన్ని రూపొందించుకుంటాయి. అసలు సమస్యను పక్కకు పెట్టి సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాల కోసం పనికిమాలిన సిఫారసులు, సలహాలు ఇవ్వడం ప్రపంచ బ్యాంకు తక్షణం మానుకోవాలి.
Good Post
ధన్యవాదాలు.
కేవలం పోలీసుల్ని నమ్ముకోవడం నియంతల స్టైల్ కానీ అది ప్రజాస్వామిక పాలకులు అనుసరించాల్సిన పద్దతి కాదు.
ప్రవీణ్ గారూ, మీరన్నది నిజం. చిత్రమేమిటంటే ప్రపంచంలో అనేక ప్రజాస్వామిక ప్రభుత్వాలను అస్ధిరపరుస్తున్న అమెరికా అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెలామణి కావడం.
మొన్నటి వరకు ఏమనుకున్నానంటే ప్రజాస్వామిక ప్రభువులు కేవలం అబద్దాలు చెప్పుకోవడాన్ని నమ్ముకుంటారనీ, ముస్సోలినీ లాంటి నియంతలే పోలీసుల్ని నమ్ముకుంటారనీ.
ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్ధల్లో ధనికులకున్న స్వేఛ్ఛ ప్రజలకు లేదు. అందుకే దీన్ని ధనికుల నియంతృత్వం అనవచ్చేమో. అంటే ధనికులంతా కలిసి తమ ప్రయోజనాల కోసం మిగతా ప్రజలకు నామమాత్రపు స్వేఛ్ఛ ఇస్తూ, నియంతృత్వాన్ని అమలు చేయడం. ధనికులకు ప్రజాస్వామ్యం, మిగిలినవారికి నియంతృత్వం.
కల్లూరి భాస్కరం అనే జర్నలిస్ట్ అన్నారు “అబద్దాలు చెప్పాలంటే హిట్లర్ కంటే గొప్ప కళ తెలిసి ఉండాలి”. ప్రజాస్వామిక ప్రభువులకే తమ ప్రభుత్వాలని నిలబెట్టుకోవడానికి అబద్దాలు ఎక్కువ అవసరమవుతాయి. పోలీసుల్ని నమ్ముకుంటే అది నియంతృత్వమే అవుతుంది కానీ బూటకపు ప్రజాస్వామ్యం కూడా అవ్వదు.
బాగా చెప్పారు.
నేను మార్క్సిస్ట్ పుస్తకాలు కొనడానికి వైజాగ్ ప్రజాశక్తి బుక్ హౌస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఉ.సా. గారు సంపాదకత్వం వహించిన ఎదురీత వ్యాసాల సంపుటి దొరికింది. అందులో కల్లూరి భాస్కరం గారి ఇంట్రొడక్షన్ చదివాను.
వైద్య సౌకర్యాలు పెరిగితేనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యించుకునేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. జనాభా అనేది నీటి లభ్యత ఎక్కువగా ఉన్న చోట్ల వేగంగా పెరుగుతుంది. జనాభా పెతుగుదలని అదుపు చెయ్యడానికి వైద్య సౌకర్యాల అభివృద్ధి అవసరమే.